Thursday, October 29, 2009

శ్రీ విభూతి యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)
శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
భూయ ఏవ మహాబాహో !
శృణు మే పరమం వచః|
యత్తేऽహం ప్రీయమాణాయ
వక్ష్యామి హితకామ్యయా|| 10-1
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
నా పలుకుల నాలించి , సంతసము నొందు
నీకుఁ జెప్పెద మఱల , దానినె కిరీటి !
నీ హితంబునుఁ గోరుచు , నే వచింతు
సావధానుండవై విను , సవ్యసాచి ! ౧
గొప్ప భుజములుగల ఓ అర్జునా ! ( నా మాటలు విని ) సంతసించుచున్న నీకు హితమును కలుగజేయు నుద్దేశముతో మఱల ఏ శ్రేష్ఠమగు వాక్యమును నేను చెప్పబోవు చున్నానో , దానిని వినుము .
అ.
న మే విదుః సురగణాః
ప్రభవం న మహర్షయః|
అహమాదిర్హి దేవానాం
మహర్షీణాం చ సర్వశః|| 10-2
తేటగీతి.
నాదు శక్తి యుత్పత్తి బ్రహ్మాదులకును
నల మహర్షుల కేనియుఁ దెలియరాదు ,
సర్వదేవులు భృగ్వాది సంయములకు ;
నాది దేవుండ మూలమంతటికి నేనె . ౨
నా యొక్క ఉత్పత్తిని ( అవతార రహస్యమును , లేక , ప్రభావమును ) దేవగణము లెఱుఁగవు . మహర్షులున్ను ఎఱుఁగరు . ( ఏలయనిన ) నేను ఆ దేవతలకును , మహర్షులకును సర్వవిధముల మొదటివాడను ( కారణభూతుడను ) గదా !
అ.
యో మామజమనాదిం చ
వేత్తి లోకమహేశ్వరమ్|
అసమ్మూఢః స మర్త్యేషు
సర్వపాపైః ప్రముచ్యతే|| 10-3
చంపకమాల.
ఎవఁడు సనాతనుం డజుఁడ నే నెయటంచుఁ దలంచుచుండునో ,
యెవఁడు జగత్ప్రభుండనని యెంచి ననున్ భజియించుచుండునో ,
తవులడు పాపకర్మల పథంబుల నెప్డు ; విముక్తుఁ డైన బ్ర
హ్మవిదుఁ డతండె జుమ్ము ; పరమార్థము దీని వినంగఁ జెప్పితిన్ . ౩
ఎవడు నన్ను పుట్టుకలేనివానిగను , అనాదిరూపునిగను , సమస్తలోకములకు నియామకునిగను తెలుసుకొనుచున్నాడో , అతడు అజ్ఞానము లేనివాడై సర్వపాపములనుండి లెస్సగ విడువబడుచున్నాడు .
అ.
బుద్ధిర్జ్ఞానమసమ్మోహః
క్షమా సత్యం దమః శమః|
సుఖం దుఃఖం భవోऽభావో
భయం చాభయమేవ చ|| 10-4
అ.
అహింసా సమతా తుష్టి
స్తపో దానం యశోऽయశః|
భవన్తి భావా భూతానాం
మత్త ఏవ పృథగ్విధాః|| 10-5
తేటగీతి.
బుద్ధి , జ్ఞానము , సమ్మోహములును మఱియు
శమ , దమ , క్షమాదులును , సత్యమును , సుఖము ,
దుఃఖమునుఁ , జావు , పుట్టుకల్ , దురితభయము ,
నభయము , నహింస , సమచిత్త మలరుటయును . ౪
తేటగీతి.
తుష్టిఁ గనుచుండుటయు , తపో నిష్ఠ నుంట ,
యీవి , కీర్తి , యకీర్తియు , జీవులకును
వివిధ భావోద్భవంబులు విశ్రుతముగ
నా వలనె కల్గు పార్థ ! యనారతంబు. ౫
బుద్ధి , జ్ఞానము , మోహరాహిత్యము , ఓర్పు , సత్యము , బాహ్యేంద్రియ నిగ్రహము , అంతరింద్రియ నిగ్రహము , సుఖము , దుఃఖము , పుట్టుక ( ఉత్పత్తి ) , నాశము , భయము , భయములేకుండుట , అహింస , సమత్వము , సంతుష్టి , తపస్సు , దానము , కీర్తి , అపకీర్తి , ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానావిధములగు గుణములు నా వలననే కలుగుచున్నవి .
అ.
మహర్షయః సప్త పూర్వే
చత్వారో మనవస్తథా|
మద్భావా మానసా జాతా
యేషాం లోక ఇమాః ప్రజాః|| 10-6
కందము.
నలువురు మనువులు సప్త
ర్షులు మద్భావమ్మునన్ ప్రచోదితులై భూ
స్థలిఁ గల ప్రజల సృజించిరి ,
కలిగిరి మద్భావ కలన కలిమిని పార్థా ! ౬
లోకమునం దీ ప్రజలు యెవరియొక్క సంతతియై యున్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులున్ను , సనకాదులైన నలుగురు దేవర్షులున్ను , మనువులు పదునలుగురున్ను , నా యొక్క భావము ( దైవ భావము ) గలవారై నా యొక్క మనస్సంకల్పము వలననే పుట్టిరి .
అ.
ఏతాం విభూతిం యోగం చ
మమ యో వేత్తి తత్త్వతః|
సోऽవికమ్పేన యోగేన
యుజ్యతే నాత్ర సంశయః|| 10-7
కందము.
స్థితిలయముల సృష్టి జగ
త్పతినౌ నావలనె జగము వర్తిలు నంచున్ ,
మతి నెంచు బుధులు నన్నే
స్తుతియించి , భజించుచుంద్రు , శుద్ధమనమునన్. ౭
నా యొక్క విభూతిని ( ఐశ్వర్యమును , విస్తారమును ) , యోగమును ( అలౌకిక శక్తిని ) , ఎవడు యథార్థముగ తెలిసికొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు . ఇవ్విషయమున సందేహము లేదు .
అ.
అహం సర్వస్య ప్రభవో
మత్తః సర్వం ప్రవర్తతే|
ఇతి మత్వా భజన్తే మాం
బుధా భావసమన్వితాః|| 10-8
అ.
మచ్చిత్తా మద్గతప్రాణా
బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం
తుష్యన్తి చ రమన్తి చ|| 10-9
ఉత్పలమాల.
నాయెడఁ జిత్తమున్ నిలిపి , నాకయి కర్మల నాచరించు , నా
ధీయుతులైన వారలు నుతింత్రు పరస్పర బోధనా రతిన్ ,
వాయికొలంది వే విధుల బ్రస్తుతిఁ జేయుచు , సంతసింపుచున్
రేయిఁబవల్ నిరంతరము క్రీడలొనర్తురు , నన్ దలంచుచున్ . ౮
' నేను సమస్తజగత్తునకుఉత్పత్తికారణమైనవాడను , నా వలననే ఈ సమస్తము నడచుచున్నది ' అని వివేకవంతులు తెలిసికొని పరిపూర్ణ భక్తిభావముతో గూడినవారై నన్ను భజించుచున్నారు . ( వారు ) నా యందు మనస్సుగలవారును , నన్ను బొందిన ప్రాణములు ( ఇంద్రియములు ) కలవారును , ( లేక నా యెడల ప్రాణము నర్పించిన వారును ) అయి నన్నుగూర్చి పరస్పరము బోధించుకొనుచు , ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడును సంతృప్తిని , ఆనందమును బొందుచున్నారు .
అ.
తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకమ్|
దదామి బుద్ధియోగం తం
యేన మాముపయాన్తి తే|| 10-10
అ.
తేషామేవానుకమ్పార్థ
మహమజ్ఞానజం తమః|
నాశయామ్యాత్మభావస్థో
జ్ఞానదీపేన భాస్వతా|| 10-11
ఉత్పలమాల.
జ్ఞాన సముద్భవంబగును నాకృపచే సుగుణాళికిన్ , ననున్
బూని తరింపగాఁ గలుగు బుద్ధి విశేషములెల్ల నిచ్చెదన్ ;
నేను వసింతు వారి కమనీయ సుహృత్కమలంబులందుఁ , జే
నూనెద జ్ఞానదీపిక మహోత్కట దుస్థితిఁ బాఱద్రోలగన్. ౯
ఎల్లప్పుడు నాయందు మనస్సుగలవారై , ప్రీతితో నన్ను భజించునట్టివారికి -- దేనిచో వారు నన్ను పొందగలరో -- అట్టి జ్ఞానయోగమును ( ఆత్మానాత్మ వివేచనాశక్తిని ) ప్రసాదించుచున్నాను . వారలకు ( అట్టి భక్తులకు ) దయజూపుట కొఱకు నేనే వారి యంతః కరణమునందు నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపముచేత , అజ్ఞానజన్యమగు అందకారమును నశింపజేయుచున్నాను .
అర్జున ఉవాచ|
అ.
పరం బ్రహ్మ పరంధామ
పవిత్రం పరమం భవాన్|
పురుషం శాశ్వతం దివ్య
మాదిదేవమజం విభుమ్|| 10-12
అ.
ఆహుస్త్వామృషయః సర్వే
దేవర్షిర్నారదస్తథా|
అసితో దేవలో వ్యాసః
స్వయం చైవ బ్రవీషి మే|| 10-13
అర్జును వాక్యము.
కందము.
పర మోత్కృష్టంబగు గతి ,
పరమాత్మయు , దివ్యధాముఁ బరమపురుషు గా ,
నిరుపమ శాశ్వతుఁ , డజుఁడని ,
యెఱిగించిరి నిన్ను మునులు , ఋషులు ముకుందా ! ౧౦
తేటగీతి.
ఆది దేవుండ వీవని , యజుఁడ వనియు ,
విభుఁడవంచు , మహత్తర విశ్వరూపుఁ
డనుచుఁ , జెప్పిరి మును నారదాది ఋషులు ,
అసితుఁడును , దేవలుండును , వ్యాసకవియు . ౧౧
అర్జునుడు చెప్పెను. నీవు పరబ్రహ్మమవు , పరంధాముడవు ( పరమపదమవు లేక గొప్ప తేజస్స్వరూపుడవు ) , పరమపావనుడవు . నిన్ను నిత్యునిగను , ప్రకాశరూపునిగను , పరమ పురుషునిగను , ఆదిదేవునిగను , జన్మరహితునిగను , సర్వవ్యాపకునిగను , ఋషులందఱున్ను , దేవర్షి యగు నారదుడున్ను , అసితుడున్ను , దేవలుడున్ను , వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు . స్వయముగ నీవున్ను ఆ ప్రకారమే ( నిన్ను గూర్చి ) నాకు చెప్పుచున్నావు .
అ.
సర్వమేతదృతం మన్యే
యన్మాం వదసి కేశవ|
న హి తే భగవన్వ్యక్తిం
విదుర్దేవా న దానవాః|| 10-14
తేటగీతి.
నీవుఁ గూడను నటు వచియింతు , విపుడు
చెప్పినది సత్యమని విశ్వసింతు నేను ;
దివ్యమగు నీ ప్రభావమ్ముఁ దెలియలేరు ,
దేవదానవులైనను , దేవ దేవ ! ౧౨
ఓ కృష్ణా 1 దేనిని నీవు నాకు చెప్పుచున్నావో అదియంతయు సత్యమని నేను తలంచుచున్నాను . ఓ భగవంతుడా ! నీయొక్క ( నిజ ) స్వరూపమును దేవతలుగాని , అసురులుగాని ఎఱుంగజాలరు కదా !
అ.
స్వయమేవాత్మనాత్మానం
వేత్థ త్వం పురుషోత్తమ|
భూతభావన భూతేశ !
దేవదేవ జగత్పతే|| 10-15
తేటగీతి.
దేవ దేవ ! జగత్పతే ! నీ విభూతి
భువనముల యందెటుల్ వ్యాప్తిఁ బొందు చుండు ;
నీ వెఱుంగఁగ వలయుఁ గా , కేరికైన
వశముఁ గాదు ; నీవే చెప్పవలయు గృష్ణ ! ౧౩
ఓ పురుషశ్రేష్ఠుడా , సమస్తప్రాణులను సృష్టించువాడా , సకల జీవులకు నియామకుడగువాడా , దేవతలకును దేవుడైనవాడా , జగన్నాథుడా , నిన్ను నీవే యెఱుఁగుదువు ( నీ స్వరూప మితరులకు దుర్గ్రాహ్యమని భావము ) .
వక్తుమర్హస్యశేషేణ
దివ్యా హ్యాత్మవిభూతయః|
యాభిర్విభూతిభిర్లోకా
నిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి|| 10-16
అ.
కథం విద్యామహం యోగిం
స్త్వాం సదా పరిచిన్తయన్|
కేషు కేషు చ భావేషు
చిన్త్యోऽసి భగవన్మయా|| 10-17
అ.
విస్తరేణాత్మనో యోగం
విభూతిం చ జనార్దన|
భూయః కథయ తృప్తిర్హి
శృణ్వతో నాస్తి మేऽమృతమ్|| 10-18
ఉత్పలమాల.
నీ విభవ ప్రభావమును నే నెఱుగంగ ; వచింపు సర్వమున్
నీ వెటులే పదార్థముల నెక్కుడుగాఁ గనుపించుచుందు , వే
భావనతో భజింపగ నుపాస్యుఁడవో , విపులీకరింపు ; నా
నా విధి విన్ననుం దనివి నందదు , నీ యమృతంపు సూక్తులన్ . ౧౪
కావున ఏ విభూతులచే ( మాహాత్మ్య విస్తారములచే ) నీ వీ లోకములన్నింటిని వ్యాపించియున్నావో అట్టి దివ్యములగు నీ విభూతులను సంపూర్ణముగ చెప్పుటకు నీవే తగుదువు . యోగేశ్వరా ! నే నెల్లప్పుడును ఏ ప్రకారముగ ధ్యానించుచు నిన్ను తెలిసికొనగలను ? భగవంతుడా ! ఏయే వస్తువులందు నిన్ను నేను ధ్యానింపవలెను ? ఓ కృష్ణా ! నీ యొక్క యోగమహిమను , జగల్లీలావిభూతులను , ( ధ్యానింపదగిన వస్తువులను ) సవిస్తరముగ తెలియజేయుము . ఏలయనగా నీ యొక్క అమృత వాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుట లేదు . ఇంకను వినవలయునని కుతూహలము కలుగుచున్నది .
శ్రీభగవానువాచ|
అ.
హన్త తే కథయిష్యామి
దివ్యా హ్యాత్మవిభూతయః|
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ !
నాస్త్యన్తో విస్తరస్య మే|| 10-19
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
అటులె కౌంతేయ ! చెప్పెద నాలకింపు
మా ! విభూతుల ప్రాముఖ్యమైన వాని ;
సకలమునుఁ జెప్ప సావకాశమ్ము లేదు ,
సాంతమున్ లేదు సర్వమ్ము సంస్మరింప . ౧౫
శ్రీ భగవానుడు చెప్పెను. కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఇప్పుడు దివ్యములైన నాయొక్క విభూతులను ( ప్రాధాన్యత ననుసరించి ముఖ్యములైన వానిని ) నీకు చెప్పెదను . ఏలయనగా - నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు .
అ.
అహమాత్మా గుడాకేశ !
సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ
భూతానామన్త ఏవ చ|| 10-20
తేటగీతి.
ప్రాణికోటుల హృదయ నివాసి నగుచు ,
నధివసింతు గుడాకేశ ! యనిశమేనె ;
కర్త , సంరక్షకుఁడను , సంహర్తనగుచు ,
నన్నిటను నాది మధ్యాంతమగుదు , నేనె . ౧౬
ఓ అర్జునా ! సమస్త ప్రాణులయొక్క హృదయమునందున్న ప్రత్యగాత్మను నేనే అయియున్నాను .మఱియు ప్రాణులయొక్క ఆదిమధ్యాంతములున్ను( సృష్టిస్థితిలయములున్ను ) నేనే అయియున్నాను.
అ.
ఆదిత్యానామహం విష్ణు
ర్జ్యోతిషాం రవిరంశుమాన్|
మరీచిర్మరుతామస్మి
నక్షత్రాణామహం శశీ|| 10-21
తేటగీతి.
ద్వాదశాదిత్యులను విష్ణువౌదు నేనె ,
తేజములయందు రవి నేనె , దివిని వెలుఁగు
తారలందు శశాంకునై తనరు దేనె ,
యల మరీచి మరుత్తుల నగుదు నేనె . ౧౭
నేను ఆదిత్యులలో విష్ణువనువాడను , ప్రకాశింపజేయువానిలో కిరణములు గల సూర్యుడను. మరుత్తులను దేవతలలో మరీచియనువాడను , నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను .
అ.
వేదానాం సామవేదోऽస్మి
దేవానామస్మి వాసవః|
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా|| 10-22
తేటగీతి.
వేదముల సామవేదంబు నౌదు నేనె ,
సర్వ దేవతలందు వాసవుఁడ నేనె ;
యింద్రియ వితానమున మనసేనె పార్థ !
భూతచయముల నేనౌదు , చేతనమ్ము ! ౧౮
నేను వేదములలో సామవేదమును , దేవతలలో ఇంద్రుడను , ఇంద్రియములలో మనస్సును , ప్రాణులలో చైతన్యమున్ను ( తెలివి ) అయియున్నాను .
అ.
రుద్రాణాం శఙ్కరశ్చాస్మి
విత్తేశో యక్షరక్షసామ్|
వసూనాం పావకశ్చాస్మి
మేరుః శిఖరిణామహమ్|| 10-23
అ.
పురోధసాం చ ముఖ్యం మాం
విద్ధి పార్థ ! బృహస్పతిమ్|
సేనానీనామహం స్కన్దః
సరసామస్మి సాగరః|| 10-24
తేటగీతి.
రుద్రగణముల నే శంకరుండ పార్థ !
యక్షరాక్షసులం దలకాధిపతిని ;
అష్ట వసువుల పావకుం డగుదు నేనె ;
శిఖరములయందు నే మేరు శిఖర మగుదు . ౧౯
తేటగీతి.
వరపురోహితులన్ బృహస్పతిని నేనె ;
నేనె స్కందుండ వాహినీ నేతలందు ;
నప్పులందున సాగరుండగుదు నంచు ,
దెలిసి కొను మీవు మదినిఁ గుంతీ తనూజ ! ౨౦
నేను రుద్రులలో శంకరుడనువాడను , యక్షులలోను , రాక్షసులలోను కుబేరుడను , వసువులలో అగ్నియు, పర్వతములలో మేరువును అయియున్నాను . ఓ అర్జునా ! పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతిగా నన్నెఱుఁగుము. మఱియు నేను సేనాపతులలో కుమారస్వామియు , సరస్సులలో సముద్రమును అయియున్నాను .
అ.
మహర్షీణాం భృగురహం
గిరామస్మ్యేకమక్షరమ్|
యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి
స్థావరాణాం హిమాలయః|| 10-25
తేటగీతి.
మహిత ఋషులందు నే భృగు నౌదు పార్థ !
అక్షరంబుల నోం కార మౌదు నేను
యజ్ఞముల నేను జపయజ్ఞమని తెలియుము
అచలములలోన హిమవంతు నౌదు సుమ్ము ! ౨౧
నేను మహర్షులలో భృగుమహర్షిని , వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమమను ( ఓంకారమును ) , యజ్ఞములలో జపయజ్ఞమును , స్థిరపదార్థములలో హిమాలయపర్వతమును అయియున్నాను .
అ.
అశ్వత్థః సర్వవృక్షాణాం
దేవర్షీణాం చ నారదః|
గన్ధర్వాణాం చిత్రరథః
సిద్ధానాం కపిలో మునిః|| 10-26
తేటగీతి.
భూజములయందు నశ్వథ్థ భూజమగుదు ;
ప్రథిత దేవర్షులందు నారదుఁడ నేనె ;
రామ గంధర్వులన్ జిత్రరథుఁడ నేనె ;
సిద్ధమునులఁ గపిలుఁడన్ ప్రసిద్ధి నేనె . ౨౨
నేను చెట్లన్నిటియందును రావిచెట్టును , దేవర్షులలో నారదుడను , గంధర్వులలో చిత్రరథుడను , సిద్ధులలో కపిలమునీంద్రుడను అయియున్నాను .
అ.
ఉచ్చైఃశ్రవసమశ్వానాం
విద్ధి మామమృతోద్భవమ్|
ఐరావతం గజేన్ద్రాణాం
నరాణాం చ నరాధిపమ్|| 10-27
తేటగీతి.
అమృత మథనంబునం దది యవతరించె
అశ్వములను నుచ్చైశ్రవ మగుదు నేనె ;
గజములందు నైరావత గజము నేనె ;
నరులను నరేశ్వరుండ శంతను ప్రపౌత్ర ! ౨౩
గుఱ్ఱములలో అమృతముతోపాటు పుట్టిన ఉచ్చైశ్రవమను గుఱ్ఱమునుగను , గొప్ప యేనుగులలో ఐరావతమను గొప్ప యేనుగునుగను , మనుష్యులలో రాజునుగను నన్ను తెలిసికొనుము .
అ.
ఆయుధానామహం వజ్రం
ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః
సర్పాణామస్మి వాసుకిః|| 10-28
తేటగీతి.
ఆయుధముల వజ్రాయుధ మగుదు నేనె ;
ధేనులన్ గామధేనువు నేనె పార్థ !
సృష్టి మూలంబు కందర్పుఁ డేనె విజయ !
సర్పములయందు వాసుకిన్ సవ్యసాచి ! ౨౪
నేను ఆయుధములలో వజ్రాయుధమును , పాడియావులలో కామధేనువును , ప్రజల ( ధర్మబద్ధమగు ) యుత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను , సర్పములలో వాసుకియు అయియున్నాను .
అ.
అనన్తశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి
యమః సంయమతామహమ్|| 10-29
తేటగీతి.
నాగములయందు నేనె యనంతు నగుదు ;
సలిల దేవుల వరుణుఁడన్ దెలియుమయ్య ;
పితరులను నర్యముండని పిలువఁబడుదు ;
నిగ్రహంబున జముఁడన నేనె పార్థ ! ౨౫
నేను నాగులలో అనంతుడను , జలదేవతలలో వరుణుడను , పితృదేవతలలో అర్యమయు , నియమించువారిలో యముడను అయియున్నాను .
అ.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోऽహం
వైనతేయశ్చ పక్షిణామ్|| 10-30
తేటగీతి.
అతుల ప్రహ్లాదుఁడన్ దితి సుతులలోన ;
నాయువు గణించు వారల నౌదుఁ గాలు ;
మృగ గణంబుల సింహేంద్ర మేనె పార్థ !
పక్షులన్ గరుత్మంతునై పరగు దేనె . ౨౬
నేను అసురులలో ప్రహ్లాదుడను , లెక్కపెట్టువారిలో కాలమును , మృగములలో మృగరాజగు సింహమును , పక్షులలో గరుత్మంతుడను అయియున్నాను .
అ.
పవనః పవతామస్మి
రామః శస్త్రభృతామహమ్|
ఝషాణాం మకరశ్చాస్మి
స్రోతసామస్మి జాహ్నవీ|| 10-31
తేటగీతి.
పావన మొనర్చు వారలఁ బవను నేనె ;
శస్త్రధరులందు శ్రీరామచంద్రు నేనె ;
జంతువుల మకరంబు నంచెంతురు నను ;
నదులయందు నే జాహ్నవీ నదిని పార్థ ! ౨౭
నేను పవిత్ర మొనర్చువానిలో ( లేక వేగవంతులలో ) వాయువును , ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను , చేపలలో మొసలిని , నదులలో గంగానదిని అయియున్నాను .
అ.
సర్గాణామాదిరన్తశ్చ
మధ్యం చైవాహమర్జున|
అధ్యాత్మవిద్యా విద్యానాం
వాదః ప్రవదతామహమ్|| 10-32
తేటగీతి.
ఆది మధ్యాంతములు సృష్టియందు నేనె ;
విద్యలన్నిట నే బ్రహ్మ విద్య నగుదు ;
విషయ నిర్ణయమం దుద్భవించు వాద
కలన మెల్లను నే , నంచుఁ దెలియుమయ్య ! ౨౮
ఓ అర్జునా ! సృష్టులయొక్క ఆదిమధ్యాంతములు ( ఉత్పత్తి , స్థితి , లయములు ) నేనే అయియున్నాను . మఱియు విద్యలలో అధ్యాత్మవిద్యయు , వాదించువారిలో ( రాగద్వేషరహితముగ , తత్త్వనిశ్చయము కొఱకు చేయబడు ) వాదమును నేనై యున్నాను .
అ.
అక్షరాణామకారోऽస్మి
ద్వన్ద్వః సామాసికస్య చ|
అహమేవాక్షయః కాలో
ధాతాహం విశ్వతోముఖః|| 10-33
తేటగీతి.
అల ' అ ' కారంబు నే వర్ణములను పార్థ !
ద్వంద్వమౌదు సమాసంబులందు నేను ;
అక్షయంబగు కాలంబు నగుదు నేను ;
చేతనంబులకున్ సర్వధాత నేనె . ౨౯
నేను అక్షరములలో ' అ ' కారమును , సమాసములలో ద్వంద్వ సమాసమును అయియున్నాను . మఱియు నాశము లేని కాలమును ( కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడను ) , సర్వత్ర ముఖములుగల కర్మఫలప్రదాతయును , ( లేక విరాట్స్వరూపుడగు బ్రహ్మదేవుడను ) నేనే అయియున్నాను .
అ.
మృత్యుః సర్వహరశ్చాహ
ముద్భవశ్చ భవిష్యతామ్|
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం
స్మృతిర్మేధా ధృతిః క్షమా|| 10-34
తేటగీతి.
జీవకోటుల మృత్యువై చెలఁగు దేనె ;
భవితముల కెల్ల హేతువు నగుదు నేనె ;
స్త్రీజనంబుల యందుఁ గీర్తి యును ధృతియు
శ్రీ , స్మృతియు , వాక్కు మేధలై చెలఁగు దేనె . ౩౦
సమస్తమును సంహరించునట్టి మృత్యువును , ఇకముందు ఉత్పత్తి కాగల సమస్తముయొక్క పుట్టుకయు నేనే అయియున్నాను . మఱియు స్త్రీలలోగల కీర్తి , సంపద , వాక్కు , స్మృతిజ్ఞానము , ధారణాశక్తిగల బుద్ధి , ధైర్యము , ఓర్పు , అను ఈ ఏడుగుణములున్ను నేనే అయియున్నాను .
అ.
బృహత్సామ తథా సామ్నాం
గాయత్రీ ఛన్దసామహమ్|
మాసానాం మార్గశీర్షోऽహ
మృతూనాం కుసుమాకరః|| 10-35
తేటగీతి.
సామముల యందు నే బృహత్సామ మౌదు ;
ఛందముల యందు గాయత్రి ఛంద మేనె ;
మాసముల యందు మృగశిర మాస మేను ;
ఋతువులందు వసంత మేనే కిరీటి ! ౩౧
సామవేదగానములలో బృహత్సామమును , ఛందస్సులలో గాయత్రియు , మాసములలో మార్గశిరమాసమును , ఋతువులలో వసంతఋతువును నేనై యున్నాను .
అ.
ద్యూతం ఛలయతామస్మి
తేజస్తేజస్వినామహమ్|
జయోऽస్మి వ్యవసాయోऽస్మి
సత్త్వం సత్త్వవతామహమ్|| 10-36
తేటగీతి.
జూదరులయందు జూదంబు నౌదు నేనె ;
తేజమూర్తులయం దుండు తేజ మేనె ;
జయము నందెడి వారల జయము నేనె ;
బలుల బలమౌదు నే కృషీవలుల కృషియు . ౩౨
వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను . మఱియు నేను తేజోవంతులయొక్క తేజస్సును ( ప్రభావము ) , ( జయించువారలయొక్క ) జయమును , ( ప్రయత్నశీలురయొక్క ) ప్రయత్నమును , ( సాత్త్వికులయొక్క ) సత్త్వగుణమును అయియున్నాను .
అ.
వృష్ణీనాం వాసుదేవోऽస్మి
పాణ్డవానాం ధనఞ్జయః|
మునీనామప్యహం వ్యాసః
కవీనాముశనా కవిః|| 10-37
తేటగీతి.
యాదవుల వాసుదేవుండ నౌదు నేనె ;
పాండు నందనుల ధనంజయుండ నేనె ;
మునుల వ్యాసుండ నేనౌదు వినుము పార్థ !
కవులలో నుశనాకవి నవుదు పార్థ ! ౩౩
నేను వృష్ణివంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను ( శ్రీకృష్ణుడను ) , పాండవులలో అర్జునుడను , మునులలో వేదవ్యాస మునీంద్రుడను , కవులలో శుక్రాచార్యుడను అయియున్నాను .
అ.
దణ్డో దమయతామస్మి
నీతిరస్మి జిగీషతామ్|
మౌనం చైవాస్మి గుహ్యానాం
జ్ఞానం జ్ఞానవతామహమ్|| 10-38
తేటగీతి.
నర పతు లొనర్చు దమన దండంబు నేనె ;
యల జిగీషుల నీతియు నగుదు నేనె ;
గోప్యములయందు మౌన నిగూఢ మేనె ;
జ్ఞానవంతుల జ్ఞానంబు నేనె పార్థ ! ౩౪
నేను దండించువారియొక్క దండనమును ( శిక్షయు ) , జయింప నిచ్చగలవారియొక్క ( జయోపాయమగు ) నీతియు , అయియున్నాను . మఱియు రహస్యములలో మౌనమును , జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై యున్నాను .
అ.
యచ్చాపి సర్వభూతానాం
బీజం తదహమర్జున ! |
న తదస్తి వినా యత్స్యా
న్మయా భూతం చరాచరమ్|| 10-39
తేటగీతి.
ఈ జగత్తునకున్ సర్వబీజమేనె ;
నేను లేని పదార్థ మెందైన లేదు ;
నా విభూతికి యవధి యంతములు లేవు ;
కౢప్తముగఁ జెప్పితిని నీకుఁ గొంత గొంత . ౩౫
ఓ అర్జునా ! సమస్త ప్రాణికోట్లకు ఏదిమూలకారణమైయున్నదో అదియు నేనే అయియున్నాను . ( వెయ్యేల ) స్థావరజంగమాత్మకమైన వస్తువేదియు నన్ను వినాగా లేనేలేదు ( నాకంటె వేఱుగ లేదు ) .
అ.
నాన్తోऽస్తి మమ దివ్యానాం
విభూతీనాం పరన్తప|
ఏష తూద్దేశతః ప్రోక్తో
విభూతేర్విస్తరో మయా|| 10-40
అ.
యద్యద్విభూతిమత్సత్త్వం
శ్రీమదూర్జితమేవ వా|
తత్తదేవావగచ్ఛ త్వం
మమ తేజోంऽశసమ్భవమ్|| 10-41
కందము.
ఎచ్చట శ్రీయు , విభూతియు ,
ముచ్చట నుత్సాహ గరిమ , మురిపెము గ నెదో
యచ్చట మదీయ తేజము
హెచ్చుగఁ గానంగఁ గలుగు దీవు కిరీటీ ! ౩౬
ఓ అర్జునా ! నా యొక్క దివ్యములైన విభూతులకు అంతము లేదు . అయినను కొన్నిటిని సంక్షేపముగ నిట వివరించి చెప్పితిని . ( ఈ ప్రపంచమున ) ఐశ్వర్యయుక్త మైనదియు , కాంతివంతమైనదియు ( నిర్మలమైనదియు ) , ఉత్సాహముతో గూడినదియు ( శక్తివంతమైనదియు ) నగు వస్తువు లేక ప్రాణి ఏది యేది కలదో అది యది నా తేజస్సుయొక్క అంశమువలన కలిగినదానినిగనే నీ వెఱుఁగుము .
అ.
అథవా బహునైతేన
కిం జ్ఞాతేన తవార్జున|
విష్టభ్యాహమిదం కృత్స్న
మేకాంశేన స్థితో జగత్|| 10-42
కందము.
అకలంక విభూతినిఁ గనఁ
దికమకపడి వినఁగ నేలఁ , ద్రిదివంబులు నే
సకల చరాచర జగములు
నొకకళచే సంగ్రహించి యుంటిఁ గిరీటీ ! ౩౭
అర్జునా ! లేక విస్తారమైన ఈ ( విభూతి ) జ్ఞానముచే నీ కేమి ప్రయోజనము ? నేనీ జగత్తునంతను ఒక్క అంశముచేతనే వ్యాపించియున్నాను ( అని తెలిసికొనుము ) .
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విభూతియోగో నామ దశమోऽధ్యాయః|| 10 ||
ఓం తత్ సత్
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి చే యనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి శ్రీ విభూతి యోగము అను దశమ తరంగము
సంపూర్ణం. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణ మస్తు.
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మనిద్యయు , యోగ శాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విభూతి యోగమను పదియవ అధ్యాయము సంపూర్ణము. ఓమ్ తత్ సత్

Monday, October 26, 2009

రాజవిద్యా రాజగుహ్య యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)
శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
ఇదం తు తే గుహ్యతమం
ప్రవక్ష్యామ్యనసూయవే|
జ్ఞానం విజ్ఞానసహితం
యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్|| 9-1
శ్రీ భగవానుల వాక్యము.
కందము.
పరమ రహస్య మ్మిది
యెరిగింతును నీకు , పార్థ ! యిది తెలిసినచో,
పరిపూర్ణ శుభములందుచుఁ ,
దిరిగిక జన్మంబు లేని తెన్ను గనఁగనౌ . ౧
శ్రీ భగవంతుడు చెప్పెను.
( ఓ అర్జునా ! ) దేనిని తెలిసికొనినచో అశుభ రూపమగు ఈ సంసారబంధమునుండి నీవు విడివడుదువో అట్టి అతిరహస్యమైన , అనుభవజ్ఞానసహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయలేనివాడవగు నీకు లెస్సగా జెప్పుచున్నాను ( వినుము ) .
అనుష్టుప్.
రాజవిద్యా రాజగుహ్యం
పవిత్రమిదముత్తమమ్|
ప్రత్యక్షావగమం ధర్మ్యం
సుసుఖం కర్తుమవ్యయమ్|| 9-2
తేటగీతి.
అనుసరింపఁగ సులభమైనను రహస్య
రాజమియ్యది ; విద్యల రాజమౌచు ,
నవ్యయంబును , విహిత ధర్మార్థదమ్ముఁ
గాంచ నగును , ముంజేతి కంకణము భంగి . ౨
ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్ల శ్రేష్ఠమైనదియు , రహస్యములలోకెల్ల అతిరహస్యమైనదియు , ధర్మయుక్తమైనదియు , ప్రత్యక్షముగ తెలియదగినదియు , అనుష్ఠించుటకు మిగుల సులభమైనదియు , నాశరహితమైనదియు అయియున్నది .
అ.
అశ్రద్దధానాః పురుషా
ధర్మస్యాస్య పరన్తప|
అప్రాప్య మాం నివర్తన్తే
మృత్యుసంసారవర్త్మని|| 9-3
తేటగీతి.
ఇట్టి విజ్ఞాననమును మూఢుఁ డెఱుగ లేక ,
నన్నుఁ గన నేఱఁ డెన్ని జన్మములనైనఁ ;
గుమ్మరావమ్ము సారెపై దిమ్మఁ దిరిగి ,
చచ్చి పుట్టును , చర్విత చర్వణముగ . ౩
ఓ అర్జునా ! ఈ ( ఆత్మజ్ఞానమను ) ధర్మమునందు శ్రద్ధలేనట్టి మనుజులు నన్ను పొందనివారై మృత్యురూపమైన సంసారమార్గమునందే మఱలుచున్నారు ( తిరుగు చున్నారు లేక నిక్కముగ వర్తించుచున్నారు ) .
అ.
మయా తతమిదం సర్వం
జగదవ్యక్తమూర్తినా|
మత్స్థాని సర్వభూతాని
న చాహం తేష్వవస్థితః|| 9-4
చంపకమాల.
సకల చరాచరంబులఁ బ్రసారితమై , నిబిడీకృతంబు మా
మకమగు సత్త్వమంచెఱుఁగుమా ! సకలంబును నా స్వరూపమే ,
ప్రకృతి వశంబు నాకగు పరంతప ! నేను రవంతయేని దా
నికి వశమై మెలంగ , నిది నిక్కము, నీవు గ్రహింప జెప్పితిన్. ౪
ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపింపబడి యున్నది . సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి . నేను వానియందుండుట లేదు . ( నాకవి ఆధారములు కావు . )
అ.
న చ మత్స్థాని భూతాని
పశ్య మే యోగమైశ్వరమ్|
భూతభృన్న చ భూతస్థో
మమాత్మా భూతభావనః|| 9-5
కందము.
నా దివ్య సత్త్వ సంపద
లాధారముఁ గాదు , మఱియు నాధేయముగా
లేదీ భూతచయము లా
పాదించెడు కితవ భావ బలిమియె సుమ్మా ! ౫
ప్రాణికోట్లు నాయందుండునవియు కావు . ఈశ్వర సంబంధమగు నా యీ యోగమహిమను జూడుము . నా యాత్మ ( స్వరూపము ) ప్రాణికోట్ల నుత్పన్నమొనర్చునదియు , భరించునదియు నైనను ఆ ప్రాణులయం దుండుట లేదు . ( వాని నాధారముగ జేసికొని యుండునది కాదు ) .
అ.
యథాకాశస్థితో నిత్యం
వాయుః సర్వత్రగో మహాన్|
తథా సర్వాణి భూతాని
మత్స్థానీత్యుపధారయ|| 9-6
అ.
సర్వభూతాని కౌన్తేయ
ప్రకృతిం యాన్తి మామికామ్|
కల్పక్షయే పునస్తాని
కల్పాదౌ విసృజామ్యహమ్|| 9-7
|ఉత్పలమాల.
వ్యోమమునందు గాలి యెటులుండి దిగంతము లెల్ల నిండునో ,
యేమియు నంటకుండు నటు , లీమహి నేను ధరింతు సృష్టినిన్ ,
బ్రామి , నశింపఁ జేసి , మఱలన్ సృజియింతు , ననారతంబు ; క
ల్పామిత సంఖ్య నిట్టు లనయంబునుఁ జర్విత చర్వణమ్ము గా. ౬
ఏ ప్రకారముగ అంతటను సంచరించునదియు , గొప్పదియు నగువాయు వెల్లప్పుడును ఆకాశమునందున్నదో , ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లున్ను నాయందున్నవని తెలిసికొనుము . అర్జునా ! సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నాప్రకృతిని ( మాయను ) జేరి అందు అణగియుండును . తిరిగి సృష్టికాలమున వానిని నేను సృజించుచుందును .
అ.
ప్రకృతిం స్వామవష్టభ్య
విసృజామి పునః పునః|
భూతగ్రామమిమం కృత్స్న
మవశం ప్రకృతేర్వశాత్|| 9-8
కందము.
ప్రకృతికి వశమై , భూత
ప్రకరంబులు జననమంది , లయ మొందెడు ; మా
మక మాయా ప్రకృతి బలం
బకలంకము ; భూత తతి తదాధీనమ్మౌ. ౭
ప్రకృతికి ( మాయకు లేక స్వకీయకర్మకు ) అధీనమై యుండుటవలన అస్వతంత్రమైనట్టి ఈ సమస్త ప్రాణిసముదాయమును నేను స్వకీయప్రకృతిని అవలంబించి మఱల మఱల సృష్టించుచున్నాను .
అ.
న చ మాం తాని కర్మాణి
నిబధ్నన్తి ధనఞ్జయ|
ఉదాసీనవదాసీన
మసక్తం తేషు కర్మసు|| 9-9
కందము.
ఈ మూడు కర్మలం దెటు
నేమాత్రము నాకు స్పృహ జనింపక నుందున్ ;
ఈ మాయ కర్మ లెవ్వియుఁ
జే ముట్టఁగ లేవు దరినిఁ జేరి కిరీటీ ! ౮
ఓ అర్జునా ! ( ఆ ప్రకారము జీవులను సృష్టించిన వాడనైనను ) ఆ సృష్ట్యాది కర్మలయందు తగులుకొననివాడనై సాక్షీభూతుడుగ నుండునట్టి నన్ను ఆ కర్మలెవ్వియు బంధింప నేరవు .
అ.
మయాధ్యక్షేణ ప్రకృతిః
సూయతే సచరాచరమ్|
హేతునానేన కౌన్తేయ !
జగద్విపరివర్తతే|| 9-10
తేటగీతి.
నిర్వికారుడనయ్యు , నా సర్వసాక్షి
తత్త్వమే హేతువై జగద్వలయ మెల్ల
మోహితంబయి యజ్ఞానమున మునుంగు ,
ప్రకృతి వశమౌచు నిట్లు నిరంతరంబు . ౯
ఓ అర్జునా ! అధ్యక్షుడనై ( సాక్షిమాత్రుడనై ) యున్న నాచేత ప్రకృతి చరాచర ప్రపంచము నంతను సృజించుచున్నది . ఈకారణముచేతనే జగత్తు ప్రవర్తించుచున్నది .
అ.
అవజానన్తి మాం మూఢా
మానుషీం తనుమాశ్రితమ్|
పరం భావమజానన్తో
మమ భూతమహేశ్వరమ్|| 9-11
కందము.
నా దివ్య తత్త్వ మెఱుఁగఁగ
రా , దీమూఢాళి కింత ప్రల్లదులై , యా
పాదింత్రు నాకుఁ దనువుల్ ,
వాదించుచు , బుద్ధి జాడ్య వశవర్తనులై . ౧౦
నాయొక్క పరమతత్త్వమునుఎఱుగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను , ( లోకసంరక్షణార్థము ) మనుష్యదేహమును ఆశ్రయించినవాడనునగు నన్ను అవమానించుచున్నారు ( అలక్ష్యము చేయుచున్నారు ) .
అ.
మోఘాశా మోఘకర్మాణో
మోఘజ్ఞానా విచేతసః|
రాక్షసీమాసురీం చైవ
ప్రకృతిం మోహినీం శ్రితాః|| 9-12
తేటగీతి.
దైవ సంబంధమైన స్వభావ మంది ,
నాశరహితుని భూతాధి నాథు నన్నుఁ ,
జిత్త మేకాగ్రముగను భజింత్రు సతము ,
నా మపాత్ములె ప్రియతము లవుదు రయ్య ! ౧౧
( అట్టివారు ) వ్యర్థములైన ఆశలుగలవారును , వ్యర్థములైన కర్మలు గలవారును , వ్యర్థమైన జ్ఞానముగలవారును , బుద్ధిహీనులును ( అగుచు ) రాక్షస సంబంధమైనదియు , అసురసంబంధమైనదియునగు స్వభావమునే ఆశ్రయించుచున్నారు .
అ.
మహాత్మానస్తు మాం పార్థ !
దైవీం ప్రకృతిమాశ్రితాః|
భజన్త్యనన్యమనసో
జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్|| 9-13
అ.
సతతం కీర్తయన్తో మాం
యతన్తశ్చ దృఢవ్రతాః|
నమస్యన్తశ్చ మాం భక్త్యా
నిత్యయుక్తా ఉపాసతే|| 9-14
చంపకమాల.
నిరతముఁ గీర్తనల్ సలిపి , నృత్య మొనర్చి , మృదంగ తాళ సం
భరితలయల్ సెలంగ , నియమాది యుపాసనలన్ దరించి , కొం
దఱు భజియింతు రెప్పుడు నితః పరమెందు గనంగలేక ; న
న్నరసి ముదంబుఁ గాంతురు మనమ్మున , భక్తి ప్రభావ యుక్తులై . ౧౨
ఓ అర్జునా ! మహాత్ములైతే దైవీప్రకృతిని ( దేవసంబంధమైన స్వభావమును ) ఆశ్రయించినవారలై , నన్ను సమస్తప్రాణులకును ఆదికారణునిగను , నాశరహితునిగను ఎఱిఁగి వేఱొకదానియందు మనస్సునుంచనివారలై నన్నే సేవించుచున్నారు . వారు ( పైనదెల్పిన దైవీప్రకృతి గలవారు ) ఎల్లప్పుడు నన్ను గూర్చి కీర్తించుచు , దృఢవ్రతనిష్ఠులై ప్రయత్నించుచు , భక్తితో నమస్కరించుచు , సదా నాయందు చిత్తముంచినవారలై నన్ను సేవించుచున్నారు .
అ.
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే
యజన్తో మాముపాసతే|
ఏకత్వేన పృథక్త్వేన
బహుధా విశ్వతోముఖమ్|| 9-15
ఉత్పలమాల.
కొందఱు జ్ఞానయజ్ఞమునఁ గొల్తురు పార్థ ! సతమ్ము నన్ను ; సం
క్రందన దేవతాళికిని నాకును భేద మెఱుంగకుండఁ గా
కొందఱు పూజసల్పుదురు ; కొందఱు నన్ను ననంత రూపునిన్
గందురు , సర్వ దేవతలఁ గా భజియింపుచు వ్యష్టి దృష్టితోన్ . ౧౩
మఱికొందఱు జ్ఞానయజ్ఞముచే పూజించుచున్నవారై ( తానే బ్రహ్మమను ) అద్వైతభావముతోను , ఇంక కొందఱు ( బ్రహ్మమే వివిధ దేవతాది రూపమున నున్నది . ఆ దేవతలలో నే నొకదానిని సేవించు చున్నానను ) ద్వైతభావముతోను , ఇట్లనేక విధములుగ ( లేక వివిధరూపముల ) నన్ను ఉపాసించుచున్నారు .
అ.
అహం క్రతురహం యజ్ఞః
స్వధాహమహమౌషధమ్|
మన్త్రోऽహమహమేవాజ్య
మహమగ్నిరహం హుతమ్|| 9-16
తేటగీతి.
యజ్ఞ సత్కృతులేనె , స్వధాన్న మేనె ,
ప్రాణులు భుజించు నన్న రూపమ్ము నేనె ,
పితరులకు దేవతలకు సంప్రీతి నొసఁగు
మంత్రములు నేనె యజ్ఞకర్మలఁ , గిరీటి ! ౧౪
( అగ్ని ష్టోమాది రూప ) క్రతువు నేనే , యజ్ఞము నేనే , పితృదేవతల కిచ్చు అన్నము నేనే , ఔషధము నేనే , మంత్రము నేనే , హవిస్సు నేనే , అగ్ని నేనే , హోమకర్మమున్ను నేనే అయియున్నాను .

అ.
పితాహమస్య జగతో
మాతా ధాతా పితామహః|
వేద్యం పవిత్రమోంకార
ఋక్సామ యజురేవ చ|| 9-17
తేటగీతి.
యజనములయందు నాజ్యంబు నగుదు నేనె ,
అనలమును నేనె , హుతచర్య నగుదు నేనె ,
జగతిఁ దలిదండ్రి దాతను నగుదు నేనె ,
ఋగ్యజుస్సామ మోంకార మేనె , పార్థ ! ౧౫
ఈ జగత్తునకు నేనే తండ్రిని , తల్లిని , సంరక్షకుడను , ( లేక , కర్మఫలప్రదాతను ) , తాతను ; మఱియు తెలిసికొనదగిన వస్తువును , పావన పదార్థమును , ఓం కారమును , ఋగ్వేద , యజుర్వేద , సామవేదములను అయియున్నాను .
అ.
గతిర్భర్తా ప్రభుః సాక్షీ
నివాసః శరణం సుహృత్|
ప్రభవః ప్రలయః స్థానం
నిధానం బీజమవ్యయమ్|| 9-18
తేటగీతి.
కర్మఫలమును , భర్త , జగత్తునకును
ఫ్రభుఁడనై , సర్వసాక్షినై , పరగు దేనె ;
సర్వజీవులకున్ నివాసంబు నేనె ,
ఆర్త జనముల రక్షకుఁడగుదు నేనె . ౧౬
తేటగీతి.
ఫల రహిత సుహృన్మిత్రునై నిలుతు నేనె ,
ప్రభ వలయములు , సృష్టి మూలమును నేనె ;
నిధియు నిక్షేప బీజమన్నిటికి నేనె ;
నాశరహితంబు సత్త్వ మెన్నంగ నేనె . ౧౭
పరమ లక్ష్యమును , భరించువాడును , ప్రభువును , ప్రాణుల నివాసమును , శరణమందదగినవాడును , హితమొనర్చువాడును , సృష్టిస్థితిలయకర్తయు , నిక్షేపమును , నాశరహితమైనబీజమును , ( మూలకారణమును ) నేనే అయియున్నాను .
అ.
తపామ్యహమహం వర్షం
నిగృహ్ణామ్యుత్సృజామి చ|
అమృతం చైవ మృత్యుశ్చ
సదసచ్చాహమర్జున  ! || 9-19
తేటగీతి.
ఇలను నినురూపమునఁ దపియింతు నేనె ,
సలిలము గ్రహించి విడతు వర్షముల గూర్తు ;
నమృతమును నేనె , మృత్యువు నగుదు నేనె ;
ధరణి సత్తు నసత్తు నై తనరు దేనె . ౧౮
ఓ అర్జునా ! నేను ( సూర్యకిరణములచే ) తపింపజేయుచున్నాను . మఱియు వర్షమును కురిపించుచున్నాను . వర్షమును నిలుపుదల చేయుచున్నాను . మరణరాహిత్యమున్ను ( మోక్షమున్ను ) , మరణమును నేనే . అట్లే సద్వస్తువున్ను అసద్వస్తువున్ను నేనే ( అయి యున్నాను ) .
ఇంద్రవజ్ర.
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే|
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక-
మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్|| 9-20
ఉపజాతి.
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి|
ఏవం త్రయీధర్మమను ప్రపన్నా
గతాగతం కామకామా లభన్తే|| 9-21
ఉత్పలమాల.
వేదవిదుల్ మఖంబులను విశ్రుత సోమరసామృతంబు నా
స్వాద మొనర్చి , పూతులయి , స్వర్గమునన్ నివసించి , పుణ్య సం
పాదన లేశముల్ దరుగ వత్తురు , చర్విత తర్వణంబు లౌ
గాదె , యనారతం బిటులఁ గాముకులౌ సుజనాళి కెప్పుడున్ . ౧౯
మూడు వేదముల నధ్యయనము చేసినవారును , కర్మకాండను సకామభావముతో నాచరించువారును , సోమపానము గావించినవారును , పాపకల్మషము తొలగినవారునగు మనుజులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గము కొఱకై ప్రార్ధించుచున్నారు . వారు ( మరణానంతరము ) పుణ్యఫలమగు దేవేంద్రలోకమును బొంది , అట్టి స్వర్గమందు దివ్యములగు దేవభోగముల ననుభవించుచున్నారు . వారు ( అట్టి స్వర్గాభిలాషులు ) విశాలమగు స్వర్గలోకము ననుభవించి పుణ్యము క్షయింప తిరిగి మనుష్యలోకమున జన్మించుచున్నారు . ఈ ప్రకారముగ ( సకామముగ ) వేదోక్తకర్మమును అనుష్ఠించునట్టి ఆ భోగాభిలాషులు రాకపోకడలను ( జననమరణములను ) పొందుచున్నారు .
అ.
అనన్యాశ్చిన్తయన్తో మాం
యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్|| 9-22
ఉత్పలమాల.
నన్నె యనన్య చింత మననం బొనరించు , మదీయ భక్తులన్
గన్నుల రెప్పలై యెపుడుఁ గాచుచు నుందును , చెంతనుండి , య
భ్యున్నతిఁ గూర్చుచున్ , నిరతమున్ సకలార్థము లేనె యిత్తు నం
చెన్నుము ; నా ప్రతిజ్ఞ యిది సిద్ధము , నీ వెఱుగంగఁ జెప్పితిన్. ౨౦
ఎవరు ఇతరభావములు లేనివారై నన్నుగూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో , ఎల్లప్పుడు నాయందే నిష్ఠగల్గియుండు అట్టివారియొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను .
అ.
యేऽప్యన్యదేవతా భక్తా
యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేऽపి మామేవ కౌన్తేయ
యజన్త్యవిధిపూర్వకమ్|| 9-23
ఆటవెలది.
అన్య దేవతలను నారాధన మొనర్చు
భక్తి యుక్తులైన వారుఁ గూడ ,
నన్నెఁ జుమ్ము కొలుచు చున్నార , లజ్ఞాన
భావమంది నిక్కువమ్ము పార్థ ! ౨౧
ఓ అర్జునా ! ఎవరు ఇతరదేవతల యెడల భక్తి గలవారై శ్రద్ధతో గూడి వారి నారాధించుచున్నారో , వారున్ను నన్నే అవిధిపూర్వకముగ ( క్రమముతప్పి ) ఆరాధించుచున్న వారగుదురు .
అ.
అహం హి సర్వయజ్ఞానాం
భోక్తా చ ప్రభురేవ చ|
న తు మామభిజానన్తి
తత్త్వేనాతశ్చ్యవన్తి తే|| 9-24
తేటగీతి.
సర్వ యజ్ఞ భోక్తను నేనె , స్వామి నేనె ;
నన్ను నీ రీతిఁ దెలియకున్నారు వీరు ;
నన్నెఱుంగని కారణాంతరము వలన ,
సుగతి నెఱుంగని ప్రచ్యుతి స్రుక్కువారు . ౨౨
ఏలయనగా , సమస్త యజ్ఞములకు భోక్తను , ప్రభువు ( యజమానుడు )ను నేనే అయియున్నాను . అట్టి నన్ను వారు యథార్థముగ తెలిసికొనుట లేదు . ఇందువలన జారిపోవుచున్నారు ( పునర్జన్మను బొందుచున్నారు ) .
అ.
యాన్తి దేవవ్రతా దేవాన్
పితౄన్యాన్తి పితృవ్రతాః|
భూతాని యాన్తి భూతేజ్యా
యాన్తి మద్యాజినోऽపి మామ్|| 9-25
చంపకమాల.
పితరుల , క్షుద్రదేవతలఁ , బీన్గు పిశాచ గణంబు లన్య దే
వతల భజించు వారలకు , వారె కనంబడి , ప్రీతి గూర్తు ; ర
చ్యుతు ననుఁ బూజఁ జేసెడి మహోదయు లెన్నగ నన్నె పొంది , శా
శ్వత పథమందు నుందు రనిశంబు , పరంతప ! చింత గానకన్. ౨౩
దేవతల నారాధించువారు దేవతలను , పితృదేవతల నారాధించువారు పితృదేవతలను , భూతముల నారాధించువారు భూతములను , నన్నారాధించువారు నన్నును పొందుచున్నారు .
అ.
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృత
మశ్నామి ప్రయతాత్మనః|| 9-26
కందము.
పత్ర ఫల పుష్ప తోయము
లాత్రముతో భక్త తతి సమర్పించిన , యా
పత్ర ఫల పుష్ప తోయము
లాత్రముతో స్వీకరింతు , నర్జున ! ప్రీతిన్ . ౨౪
ఎవడు నాకు భక్తితో ఆకునుగాని , పువ్వునుగాని , పండునుగాని , జలమునుగాని సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతఃకరణునియొక్క ఆ పత్రపుష్పాదులను నేను
( ప్రీతితో ) ఆరగించుచున్నాను ( అనుభవించుచున్నాను ) .
అ.
యత్కరోషి యదశ్నాసి
యజ్జుహోషి దదాసి యత్|
యత్తపస్యసి కౌన్తేయ !
తత్కురుష్వ మదర్పణమ్|| 9-27
కందము.
ఎది సలిపిన , నెది తిన్నను ,
నెది విన్నను , మరియు దాన మెది చేసినఁ , గ
న్నది విన్నది తిన్నది నె
మ్మదిలో నన్నెన్నుచున్ సమర్పింపవలెన్ . ౨౫
ఓ అర్జునా ! నీ వేదిచేసినను , తినినను , హోమమొనర్చినను , దానము చేసినను , తపస్సు చేసినను , దానిని నా కర్పింపుము .
అ.
శుభాశుభఫలైరేవం
మోక్ష్యసే కర్మబన్ధనైః|
సంన్యాసయోగయుక్తాత్మా
విముక్తో మాముపైష్యసి|| 9-28
తేటగీతి.
శుభము నశుభము లేని యీ చొప్పు నఱసి ,
కర్మ లొనరింప నంటవు కర్మ బంధ
ములు , పరంతప ! నిష్కామముననుఁ గర్మఁ
జేయు మెప్పుడు నీవు , నన్ జేరగలవు . ౨౬
ఈ ప్రకారముగ ' కర్మసమర్పణ ' యోగముతో గూడినవాడవై పుణ్యపాపములు ఫలములుగాగల కర్మబంధములనుండి నీవు విడువబడగలవు . అట్లు విడువబడినవాడవై నన్ను పొందగలవు .
అ.
సమోऽహం సర్వభూతేషు
న మే ద్వేష్యోऽస్తి న ప్రియః|
యే భజన్తి తు మాం భక్త్యా
మయి తే తేషు చాప్యహమ్|| 9-29
ఉత్పలమాల.
నాకు సమానదృష్టినిఁ గనంబడు భూత చయమ్ము లెల్ల , ద్వే
షైక సరాగ భావముల చందము లేదు , మదీయ రూపమే
లోకము లెల్లఁ గావున ; విలోలత నన్ భజియించు వానికిన్
నాకును భేదమేమియుఁ గనంబడకుండెద , మొక్క రూపునన్. ౨౭
నేను సమస్త ప్రాణులందును సమముగా నుండువాడను . నాకొకడు ద్వేషింపదగినవాడుగాని , మఱియొకడు ఇష్టుడుగాని ఎవడును లేడు . ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నాయందును , నేను వారియందును ఉందుము .
అ.
అపి చేత్సుదురాచారో
భజతే మామనన్యభాక్|
సాధురేవ స మన్తవ్యః
సమ్యగ్వ్యవసితో హి సః|| 9-30
అ.
క్షిప్రం భవతి ధర్మాత్మా
శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి|
కౌన్తేయ ! ప్రతిజానీహి
న మే భక్తః ప్రణశ్యతి|| 9-31
ఉత్పలమాల.
పాపము లాచరించి , పిదపన్ దెలివొంది , గతంబునందు సం
తాపమునొంది , నన్నె సతతంబు భజించి , యనన్యభక్తి నా
ప్రాపునుఁ గోరు భక్తతతి పావనులంచు నుతించి , చాటు ; మే
సై పను నాదు భక్తుల విషాదమటంచు ప్రతిజ్ఞ సేయుమా ! ౨౮
మిక్కిలి దురాచారముగలవాడైనప్పటికిని అనన్యభక్తిగలవాడై ఇతరమగు దేనియందును భక్తినుంచక ( ఆశ్రయింపక ) , నన్ను భజించునేని , అతడు సత్పురుషుడనియే ( శ్రేష్ఠుడనియే ) తలంపబడదగినవాడు . ఏలయనగా అతడు స్థిరమైన ( ఉత్తమ ) మనోనిశ్చయము గలవాడు . అతడు ( నన్నాశ్రయించిన పాపాత్ముడు ) శీఘ్రముగ ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు . మఱియు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు . ఓ అర్జునా ! ' నా భక్తుడు చెడడు ' అని ప్రతిజ్ఞ చేయుము .
అ.
మాం హి పార్థ వ్యపాశ్రిత్య
యేऽపి స్యుః పాపయోనయః|
స్త్రియో వైశ్యాస్తథా శూద్రా
స్తేऽపి యాన్తి పరాం గతిమ్|| 9-32
అ.
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా
భక్తా రాజర్షయస్తథా|||
తేటగీతి.
స్త్రీలు వైశ్య శూద్రులు నీచ జీవులయిన
నన్న నన్య భక్తినిఁ గొల్వ నన్నుఁ గందు ;
రన్నచో , బ్రహ్మవేత్తల నెన్నవలెనె ,
సద్గతిన్ గూర్చి వేరేల సన్నుతింప ? ౨౯||
ఓ అర్జునా ! ఎవరు పాపజన్మము ( నీచజన్మము ) గలవారై యుందురో , వారును , స్త్రీలును , వైశ్యులును , అట్లే శూద్రులును నన్నాశ్రయించి సర్వోత్తమపదవిని ( మోక్షమును ) నిశ్చయముగ పొందుచున్నారు . ఇక పుణ్యాత్ములగు బ్రాహ్మణుల విషయమునను , భక్తులగు రాజర్షుల విషయమునను మఱల చెప్పనేల ? ( భగవదాశ్రయముచే వారున్ను తప్పక ముక్తినొందుదురని భావము ) .
అనిత్యమసుఖం లోక
మిమం ప్రాప్య భజస్వ మామ్|| 9-33
కందము.
క్షణ భంగురమును , దుఃఖద
మును నగు సంసారమందు మునుఁగుచుఁ దేలన్
దనువుల నొందగ నేలా ?
అనయమ్ము ననున్ భజింప నారట ముడుగున్ . ౩౦
కావున అశాశ్వతమై , సుఖరహితమైనట్టి ఈ లోకమును పొందియున్న నీవు నన్ను భజింపుము .
అ.
మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవ
మాత్మానం మత్పరాయణః|| 9-34
ఉత్పలమాల.
నన్ను మనంబునందు మననం బొనరింపుము , భక్తి యుక్తులన్
నన్నె సతంబు గొల్చి , యజనంబులు సల్పుము , నీ నమస్కృతుల్
నన్నె తలంచి చేయుము , కనంబడు భూతచయమ్ములెల్ల నే
నున్న స్వరూపమే యని , మహోద్గతి నేనె యటంచు నెంచుమా ! ౩౧
నా యందే మనస్సు కలవాడవును , నాభక్తుడవును , నన్నే పూజించువాడవును అగుము . నన్నే నమస్కరింపుము . ఈ ప్రకారముగ చిత్తము నాయందే నిలిపి నన్నే పరమగతిగ నెన్నుకొన్నవాడవై తుదకు నన్నే పొందగలవు .
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః|| 9 ||
ఓమ్ తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రిచే అనువదింపఁబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందు
శ్రీ రాజ విద్యా రాజగుహ్య యోగమను నవమ తరంగము
సంపూర్ణము. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును ,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు రాజవిద్యా రాజగుహ్యయోగమను తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము. ఓమ్ తత్ సత్.

Tuesday, October 20, 2009

అక్షర పరబ్రహ్మ యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

అర్జున ఉవాచ|
అ.
కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం
కిం కర్మ పురుషోత్తమ|
అధిభూతం చ కిం ప్రోక్త
మధిదైవం కిముచ్యతే|| 8-1
అనుష్టుప్
అధియజ్ఞః కథం కోऽత్ర
దేహేऽస్మిన్మధుసూదన|
ప్రయాణకాలే చ కథం
జ్ఞేయోऽసి నియతాత్మభిః|| 8-2

అర్జును వాక్యము.
తేటగీతి.
మాధవా ! బ్రహ్మ మధ్యాత్మమౌ న దేమి ?
కర్మయన నేమి ? యధి భూత మర్మమేమి ?
దేహమున నధియజ్ఞ మదేమొ , దేహ
పాతమున నిన్నెటులఁ గనువాఁడొ , తెలియఁ
బలుకు మధిదైవ మననేమొ , సలలితముగ .౧
అర్జును డడిగెను.
పురుష శ్రేష్ఠుడవగు ఓ కృష్ణా ! ఆ బ్రహ్మ మేది ? అధ్యాత్మ మెయ్యది ? కర్మమనగా నేమి ? అధిభూతమని ఏది చెప్పబడినది ? అధిదైవమని దేనిని చెప్పుదురు  ? ఈ దేహమందు అధియజ్ఞు డెవడు ? అతనిని తెలుసుకొనుట ఎట్లు ? ప్రాణప్రయాణ సమయమందు నియమితచిత్తులచే నీ వెట్లు తెలిసికొనబడగలవు ?

శ్రీభగవానువాచ|
అ.
అక్షరం బ్రహ్మ పరమం
స్వభావోऽధ్యాత్మముచ్యతే|
భూతభావోద్భవకరో
విసర్గః కర్మసంజ్ఞితః|| 8-3

శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
బ్రహ్మ మన నాత్మ యక్షర భావమౌను ,
జీవభావమ్ము నధ్యాత్మగా వచింత్రు ,
భూతకోటుల సృష్టికి హేతువైన
యల విసర్గయే కర్మ యంచనగఁ బరగు . ౨
శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు.
సర్వోత్తమమైన ( నిరతిశయమైన ) నాశరహితమైనదే బ్రహ్మమనబడును . ప్రత్యగాత్మ భావము అధ్యాత్మమని చెప్పబడును . ప్రాణికోట్లకు ఉత్పత్తిని గలుగజేయు ( యజ్ఞాదిరూపమగు ) త్యాగపూర్వకమైన క్రియ కర్మమను పేరు కలిగియున్నది .

అనుష్టుప్.
అధిభూతం క్షరో భావః
పురుషశ్చాధిదైవతమ్|
అధియజ్ఞోऽహమేవాత్ర
దేహే దేహభృతాం వర|| 8-4

తేటగీతి.
తెలియు మధిభూతమనఁ బుట్టుకలును , నాశ
నమ్ముఁ గల వస్తుతతి యంచు నమ్ముమయ్య ;
పురుషుఁడది దైవమని , దేహములను సకల
యజ్ఞములఁ బ్రీతినొందు వాఁడగుదు నేను . ౩
దేహధారులలో శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! నశించు పదార్థము అధిభూత మనబడును. విరాట్పురుషుడు లేక హిరణ్యగర్భుడే అధిదైవతమనబడును . ఈ దేహమందు నేనే ( పరమాత్మయే ) అధియజ్ఞుడనబడును.

అ.
అన్తకాలే చ మామేవ
స్మరన్ముక్త్వా కలేవరమ్|
యః ప్రయాతి స మద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః|| 8-5

తేటగీతి.
మరణ కాలమ్మునన్ గూడ మఱువకుండ
నన్ను స్మరియించు నెవ్వాడొ నన్నెఁ జేరు ,
శాశ్వతానంద సుస్థిర స్వాంత మంది ;
సందియము లేదు , నిక్కమ్ము సవ్యసాచి ! ౪
ఎవడు మరణకాలమందుకూడ నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో , అతడు నాస్వరూపమును పొందుచున్నాడు . ఇట సంశయమేమియును లేదు .

అ.
యం యం వాపి స్మరన్భావం
త్యజత్యన్తే కలేవరమ్|
తం తమేవైతి కౌన్తేయ
సదా తద్భావభావితః|| 8-6

మత్తేభము.
తను వున్నప్పుడుఁ , బోవునప్పుడెటులన్ ధ్యానించు భావంబు నం
దనువౌ జన్మలఁ గాంచుచుందు రెపుడున్ స్వాంతమ్ములన్ గామ్యముల్
గనునందాక , పునః పునాగమముగా కర్మాను బంధమ్ములై ,
వెనువెంటన్ జను నీచయోనుల గతిన్ వెన్నాడుచున్ ఫల్గునా ! ౫
అర్జునా ! ఎవడు మరణకాలమున ఏయే భావమును ( లేక రూపమును ) చింతించుచు దేహము వీడునో వాడట్టి భావముయొక్క స్మరణచే గలిగిన సంస్కారము గలిగియుండుట వలన ఆ యా రూపమునే పొందుచున్నాడు .

అ.
తస్మాత్సర్వేషు కాలేషు
మామనుస్మర యుధ్య చ|
మయ్యర్పితమనోబుద్ధి
ర్మామేవైష్యస్యసంశయః|| 8-7

తేటగీతి.
పార్థ ! నీ మనోబుద్ధు లర్పణముఁ జేసి ,
సర్వ కాలమ్ములన్ నన్నె సంస్మరించి ,
ధర్మ యుద్ధమ్ముఁ జేయు , మాదటను వాసు
దేవున నె పొందెదవు , సందియము లేదు. ౬
కాబట్టి ఎల్లకాలములందును నన్ను స్మరించుచు ( నీ స్వధర్మమగు ) యుద్ధమునుగూడ చేయుము . ఈ ప్రకారముగ నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడవైనచో నీవు నన్నే పొందగలవు . ఇట సంశయము లేదు .

అ.
అభ్యాసయోగయుక్తేన
చేతసా నాన్యగామినా|
పరమం పురుషం దివ్యం
యాతి పార్థానుచిన్తయన్|| 8-8

తేటగీతి.
ఇతర విషయమ్ములకు మనం బేగకుండ ,
ధ్యాననిష్ఠా గరిష్ఠుఁడౌ మౌనివరుఁడు ,
పరమ పురుషు పరంజ్యోతి నిరుపమాన
మైన జ్ఞాన సంపూర్ణుఁడౌ వాని గనును . ౭
ఓ అర్జునా ! అభ్యాసమను యోగముతో గూడినదియు , ఇతర విషయములపైకి పోనిదియునగు మనస్సుచేత , అప్రాకృతుడైన ( లేక స్వయంప్రకాశ స్వరూపుడైన ) సర్వోత్తముడగు పరమపురుషుని మరల మరల స్మరించుచు మనుజుడు అతనినే పొందుచున్నాడు .

ఉపజాతి.
కవిం పురాణమనుశాసితార-
మణోరణీయంసమనుస్మరేద్యః|
సర్వస్య ధాతారమచిన్త్యరూప-
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్|| 8-9
ఉపజాతి.
ప్రయాణకాలే మనసాऽచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
సతం పరం పురుషముపైతి దివ్యమ్|| 8-10

ఉత్పలమాల.
నన్ను జగన్నియంతను , సనాతను , సత్కవి , నింద్రియాళికిన్
గన్నులకున్ మనంబునకుఁ గానగరాని యచింత్యరూపునిన్ ,
సన్నుత సర్వదాతను , నిశాపర దివ్య రవి ఫ్రభాసు , భ
క్తి న్ని రతాశ్రయుండయి , గతించిన యప్డు స్మరింపనయ్యెడున్. ౮
తేటగీతి.
మరణ కాలమ్మునందు సమాధి యోగ
యుక్తుఁడై , భక్తి ప్రాణవాయువుల నెల్ల
భ్రూసమమ్మున నిలిపి , సంపూర్ణమనము
నం దలంచెడువాఁడు , నన్నొందు , నిజము . ౯
ఎవడు భక్తితో గూడుకొనినవాడై అంత్యకాలమునందు యోగబలముచే ( ధ్యానాభ్యాస సంస్కారబలముచే ) ప్రాణవాయువును భ్రూమధ్యమున ( కనుబొమ్మలనడుమ ) బాగుగ నిలిపి , ఆ పిదప సర్వజ్ఞుడును , పురాణపురుషుడును , జగన్నియామకుడును , అణువుకంటెను మిగుల సూక్ష్మమైనవాడును , సకలప్రపంచమునకు ఆధారభూతుడును ( సంరక్షకుడును ) , చింతింప నలవికాని స్వరూపము గలవాడును , సూర్యుని కాంతి వంటి కాంతిగలవాడును ( స్వయంప్రకాశ స్వరూపుడును ) , అజ్ఞానాంధకారమునకు ఆవలనుండువాడు నగు పరమాత్మను నిశ్చలమనస్సుచే ఎడతెగక చింతించునో అతడు దివ్యరూపుడైన సర్వోత్తముడగు ఆ పరమాత్మనే పొందుచున్నాడు .,

ఉపజాతి.
యదక్షరం వేదవిదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగాః|
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే|| 8-11

తేటగీతి.
వేదవిదు లక్షరంబని వినుతిఁ జేయు
దురు , జితేంద్రియు లెద్ది పొందుదురు , బ్రహ్మ
చారు లెదియొంద జతనమ్ము సలుపుచుందు ,
రా పథంబునుఁ దెలిపెద , నాలకింపు . ౧౦
వేదవేత్తలు దేనిని నాశరహితమైనదానినిగ జెప్పుచున్నారో , రాగరహితుడగు ( కోరికలు నశించిన ) యత్మశీలురు ( జితేంద్రియులు ) ఎద్దానియందు ప్రవేశించుచున్నారో , దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యము ననుష్ఠించుచున్నరో , అట్టి ( పరమాత్మ ) పదమునుగూర్చి నీకు సంక్షేపముగ జెప్పెదను .

అ.
సర్వద్వారాణి సంయమ్య
మనో హృది నిరుధ్య చ|
మూధ్న్యా|ర్ధాయాత్మనః ప్రాణ
మాస్థితో యోగధారణామ్|| 8-12
అ.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్మామనుస్మరన్|
యః ప్రయాతి త్యజన్దేహం
స యాతి పరమాం గతిమ్|| 8-13||

కందము.
విజితేంద్రియుఁడై హృదయాం
బుజమందునె మనసు నిలిపి , మూర్ధమునందున్
నిజప్రాణానిలమును న
క్కజముగ బంధించి , యోగగతికిఁ జరించున్. ౧౧
కందము.
ఓ మిత్యే కాక్షరమును
నీమమున ననున్ స్మరించి , నిర్గమ మొందన్ ,
మామకమౌ సుస్థిరమగు
ధామమ్మునుఁ జేరునతఁడు , తథ్యము పార్థా ! ౧౨
ఎవడు ఇంద్రియద్వారము లన్నిటిని బాగుగ అరికట్టి , మనస్సును హృదయమందు ( ఆత్మయందు ) లెస్సగా స్థాపించి , శిరస్సునందు ( బ్రహ్మరంధ్రమందు ) ప్రాణవాయువును ఉంచి , ఆత్మనుగూర్చిన ఏకాగ్రచింతనము ( యోగధారణ ) గలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ' ఓమ్ ' అను అక్షరమును ఉచ్ఛరించుచు నన్ను ఎడతెగక చింతించుచు శరీరమును వదలునో అతడు సర్వోత్తమస్థానమును ( మోక్షమును ) బొందుచున్నాడు .

అ.
అనన్యచేతాః సతతం
యో మాం స్మరతి నిత్యశః|
తస్యాహం సులభః పార్థ !
నిత్యయుక్తస్య యోగినః|| 8-14

కందము.
ఏకాగ్ర చిత్తగతుఁడై
యే కాలమునందు నన్ స్మరింపుచునుండున్ ,
ఏకైక నిరత భక్తున
కే , కైవస మొందుచుందు , నిటు సులభుఁడనై. ౧౩
ఓ అర్జునా ! ఎవడు అనన్యచిత్తుడై నన్నుగూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండునో అట్టి నిరంతరధ్యానపరులకు నేను సులభముగ పొందబడువాడనై యున్నాను.

అ.
మాముపేత్య పునర్జన్మ
దుఃఖాలయమశాశ్వతమ్|
నాప్నువన్తి మహాత్మానః
సంసిద్ధిం పరమాం గతాః|| 8-15

తేటగీతి.
నను భజించుచు , నా పథమ్మును గమించు
నా మహాత్ములు దుఃఖమెందైనఁ గనరు ;
చావు పుట్టుక నొందు సంసార వార్ధి
నుత్తరింతురు , తిరిగి రాకుందు రెపుడు . ౧౪
సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందినవారై మరల - దుఃఖనిలయమై అనిత్యమైనట్టి - జన్మను ఎన్నటికిని పొందనేరరు .

అ.
ఆబ్రహ్మభువనాల్లోకాః
పునరావర్తినోऽర్జున|
మాముపేత్య తు కౌన్తేయ !
పునర్జన్మ న విద్యతే|| 8-16

తేటగీతి.
బ్రహ్మలోకమ్ము మొదలు స్వర్గమ్ము వరకు
సకలముల్ పుట్టి మఱల నాశమ్ములగును ;
దివ్యమౌ నా పథంబు నొందిన నరుండు ,
తిరిగి పుట్టుకఁ జావులఁ దెలియఁ బోడు . ౧౫
ఓ అర్జునా ! బ్రహ్మలోకమువఱకుగల లోకములన్నియు తిరిగివచ్చెడి స్వభావము కలవి ( అనగా వానిని పొందినవారు మరల జన్మ మెత్తవలసియే వచ్చుదురు ) . నన్ను పొందినవారికో మరల జన్మయే లేదు .

అ.
సహస్రయుగపర్యన్త
మహర్యద్ బ్రహ్మణో విదుః|
రాత్రిం యుగసహస్రాన్తాం
తేऽహోరాత్రవిదో జనాః|| 8-17

తేటగీతి.
వేయి యుగములు పగలును , రేయియటులె
వేయి యుగములు ; బ్రహ్మకు రేయి , పగలు ;
పగట ప్రభవించి , రాత్రి యా ప్రకృతి యడగుఁ
జర్వితము సృష్టి యిట్టుల సంచరించు . ౧౬
ఏ జనులు బ్రహ్మదేవునియొక్క పగటిని వేయి యగముల పరిమితిగలదానిగను , అట్లే రాత్రిని వేయియుగముల పరిమితిగలదానిగను ఎఱుగుదురో , అట్టివారు రాత్రింబగళ్ళయొక్క తత్త్వమును బాగుగ నెఱింగిన వారగుదురు .

అ.
అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః
ప్రభవన్త్యహరాగమే|
రాత్ర్యాగమే ప్రలీయన్తే
తత్రైవావ్యక్తసంజ్ఞకే|| 8-18
అ.
భూతగ్రామః స ఏవాయం
భూత్వా భూత్వా ప్రలీయతే|
రాత్ర్యాగమేऽవశః పార్థ !
ప్రభవత్యహరాగమే|| 8-19

తేటగీతి.
పూర్వకల్పమ్ము నందున్న భూతచయము
బ్రహ్మదేవు సుషుప్తి కాలమ్మునందు
లయము నొందుచు , మఱలను ప్రభవమొందు
బ్రహ్మదేవు ప్రబోధ కాలమ్మునందు . ౧౭
బ్రహ్మ దేవుని పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తము ( ప్రకృతి ) నుండి సమస్త చరాచరవస్తువులు పుట్టుచున్నవి . మరల రాత్రి ప్రారంభమగునపుడు ఆ అవ్యక్తమునందే లీనమగుచున్నవి. ఓ అర్జునా ! ఆ యీ ( పూర్వకల్ప మందలి ) ప్రాణి సమూహమే కర్మపరాధీనమై పుట్టిపుట్టి ( బ్రహ్మదేవుని ) రాత్రియొక్క ప్రారంభమున ( మరల ) విలయమొందుచున్నది . తిరిగి ( బ్రహ్మదేవుని ) పగటియొక్క ప్రారంభమున పుట్టుచున్నది .

అ.పరస్తస్మాత్తు భావోऽన్యోऽ
వ్యక్తోऽవ్యక్తాత్సనాతనః|
యః స సర్వేషు భూతేషు
నశ్యత్సు న వినశ్యతి|| 8-20
అ.
అవ్యక్తోऽక్షర ఇత్యుక్త
స్తమాహుః పరమాం గతిమ్|
యం ప్రాప్య న నివర్తన్తే
తద్ధామ పరమం మమ|| 8-21
అ.
పురుషః స పరః పార్థ !
భక్త్యా లభ్యస్త్వనన్యయా|
యస్యాన్తఃస్థాని భూతాని
యేన సర్వమిదం తతమ్|| 8-22||

చంపకమాల.
ఎది సతతమ్మున న్నిలుచు , నెయ్యది యేప్రళయంబు లందునన్
అదియె సనాతనమ్మయిన యవ్యయ భావ మటంచెఱుంగుమా !
సదమల మక్షరంబగుచు , శాశ్వతమైన , మదీయ ధామ మ
య్యది , లభియింప రారు , తిరుగాడగఁ బుట్టుక చావు లందగన్ . ౧౮
సీ.
ఎవ్వాని సంకల్పమే జగంబులకెల్ల ,
      ప్రభవ కారణమౌచుఁ బరగుచుండు ;
నెవ్వాని కనుచూపు నెల్ల లోకములఁ గ
     ల్యాణమై , సంపద లలము కొనును ;
యెవ్వాడు కనుమూసి పవ్వళించిన తోడ ,
      ప్రళయంబులై జగంబులు నశించు ;
నెవ్వాని క్రీడకై యీ రేడు జగములు ,
    పూచెండుల విధానఁ దోచుచుండు ;
ఆటవెలది.
నా మహాత్మునిఁ గన నలవికా దెవ్వరి ;
కితర సాధనముల నెన్నియైనఁ ,
ద్రికరణముల నెపుడు , స్థిరమైన యేకాంత
భక్తివలనె , పట్టు వడును , పార్థ ! ౧౯
ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము ( ప్రకృతి ) కంటె వేరైనదియు , ఉత్తమమైనదియు , ఇంద్రియములకు వ్యక్తము కానిదియు , పురాతనమైనదియునగునో , అయ్యది సమస్త ప్రాణికోట్లు నశించినను నశించకయే యుండును . ఏ పరమాత్మ ( ఇంద్రియములకు ) అగోచరుడనియు , నాశరహితుడనియు చెప్పబడెనో , అతనినే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా వేదవేత్తలు చెప్పుచున్నారు . దేనిని పొందినచో మరల ( వెనుకకు తిరిగి ఈ సంసారమున ) జన్మింపరో , అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థానము ( స్వరూపము ) అయియున్నది . ఓ అర్జునా ! ఎవనియం దీప్రాణికోట్లన్నియు నివసించుచున్నవో , ఎవనిచే ఈ సమస్త జగత్తున్ను వ్యాపింపబడియున్నదో , అట్టి పరమపురుషుడు ( పరమాత్మ ) అనన్యమగు ( అచంచలమగు ) భక్తి చేతనే పొందబడగలడు .

అ.
యత్ర కాలే త్వనావృత్తి
మావృత్తిం చైవ యోగినః|
ప్రయాతా యాన్తి తం కాలం
వక్ష్యామి భరతర్షభ|| 8-23

ఆటవెలది.
మరణించు పిదప నెవ రే
స్థిర చరమగు లోకములనుఁ జేరి కొనెదరో ,
యెఱిగింతు ధనంజయ ! విను
పరమ రహస్యమ్ము కాలపరిమితి నెల్లన్ . ౨0
భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఏ కాలమందు ( లేక , ఏ మార్గమందు ) ( శరీరమును విడిచి ) వెడలిన యోగులు మరల తిరిగిరారో ( జన్మము నొందరో ) , ఏ కాలమందు వెడలిన యోగులు మరల తిరిగి వచ్చుదురో ( జన్మించుదురో ) , ఆ యా కాల విశేషములను చెప్పుచున్నాను .

అ.
అగ్నిర్జోతిరహః శుక్లః
షణ్మాసా ఉత్తరాయణమ్|
తత్ర ప్రయాతా గచ్ఛన్తి
బ్రహ్మ బ్రహ్మవిదో జనాః|| 8-24

తేటగీతి.
ఆరుమాసమ్ము లౌ నుత్త రాయణమ్ము ,
శుక్ల పక్ష మగ్నిర్జ్యోతి చొప్పుగనుచు ,
మరణ మొందిన జ్ఞానులు తిరిగిరారు ,
బ్రహ్మ కల్పాంతమున బ్రహ్మ భావమంది . ౨౧
అగ్ని , ప్రకాశము , పగలు , శుక్లపక్షము , ఆఱు నెలలుగల ఉత్తరాయణము , ఏ మార్గమందుగలవో , ఆ మార్గమున వెడలిన బ్రహ్మవేత్తలగు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు .

అ.
ధూమో రాత్రిస్తథా కృష్ణః
షణ్మాసా దక్షిణాయనమ్|
తత్ర చాన్ద్రమసం జ్యోతి
ర్యోగీ ప్రాప్య నివర్తతే|| 8-25

తేటగీతి.
ఆరు మాసమ్ము లౌ దక్షిణాయనమ్ము
కృష్ణ పక్షమ్ము ; ధూమ రాత్రిని గతించు
యోగివర్యులు , చంద్రలోకోన్నతిఁ గని
తిరిగి వత్తురు , పుణ్యమ్ము తరుగఁ గానె . ౨౨
పొగ , రాత్రి , కృష్ణపక్షము , ఆఱునెలలుగల ధక్షిణాయనము ఏ మార్గమునగలవో ఆ మార్గమున ( వెడలిన ) సకామకర్మయోగి చంద్రసంబంధమైన ప్రకాశమునుబొంది మఱల వెనుకకు వచ్చుచున్నాడు ( తిరిగి జన్మించుచున్నాడు ) .

అ.
శుక్లకృష్ణే గతీ హ్యేతే
జగతః శాశ్వతే మతే|
ఏకయా యాత్యనావృత్తి
మన్యయావర్తతే పునః|| 8-26
అ.
నైతే సృతీ పార్థ జాన
న్యోగీ ముహ్యతి కశ్చన|
తస్మాత్సర్వేషు కాలేషు
యోగయుక్తో భవార్జున|| 8-27

ఉత్పలమాల.
దారులు రెండిటిన్ దెలియు ధన్యులు మోహము నందకుండ , సం
సార పరీత దుఃఖపు సానువులన్ జరియింపఁ బోవ , రా
ధీరులు జ్ఞానభాస్కర సదృక్తపనీయులు గాన , పార్థ ! యా
తీరునె , నీవు యోగ నిరతిం గనుచుండుము , సర్వకాలమున్ . ౨౩
ఈ శుక్ల కృష్ణమార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగ నుండునవిగ తలంపబడుచున్నవి . అందు మొదటిదానిచే జన్మరాహిత్యమును , రెండవ దానిచే మరల జన్మమును యోగి పొందుచున్నాడు . ఓ అర్జునా ! ఈ రెండుమార్గములను ఎఱుఁగునట్టియోగి యెవడును ఇక మోహమును బొందడు . కాబట్టి నీ వెల్లకాలమందును ( దైవ ) యోగయుక్తుడవు కమ్ము .

ఇంద్రవజ్ర.
వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్|| 8-28

ఉత్పలమాల.
వేదములన్ పఠించిన , వివేకము యజ్ఞతపంబులంది , సం
పాదితమైన సత్ఫలముఁ , బావన తీర్థములందు దాన ధ
ర్మాది ప్రపూత కర్మల ఫలంబుల పుణ్యమతిక్రమించి , య
య్యాది కవీంద్రు బ్రహ్మ పథమందెడు యోగివరుండు , ఫల్గునా ! ౨౪
యోగియైనవాడు దీనిని ( ఈ అధ్యాయమున చెప్పబడిన అక్షరపరబ్రహ్మతత్త్వము మున్నగువానిని ) ఎఱిఁగి వేదములందును , యజ్ఞములందును , దానములందును , తపస్సులందును ఏపుణ్యఫలము చెప్పబడియున్నదో , దానినంతను అతిక్రమించుచున్నాడు . ( దానిని మించిన పుణ్యఫలమును పొందుచున్నాడు ) . మఱియు అనాదియగు సర్వోత్తమ ( బ్రహ్మ ) స్థానమును బొందుచున్నాడు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అక్షరబ్రహ్మయోగో నామాష్టమోऽధ్యాయః|| 8 ||

ఓం తత్ సత్
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి
శ్రీ అక్షర పరబ్రహ్మ యోగము అను అష్టమ తరంగము
సంపూర్ణం .
శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు ,
యోగ శాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు అక్షర పరబ్రహ్మ యోగమను ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము . ఓమ్ తత్ సత్.

Monday, October 19, 2009

జ్ఞానవిజ్ఞాన యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

శ్రీభగవానువాచ|
అ.
మయ్యాసక్తమనాః పార్థ !
యోగం యుఞ్జన్మదాశ్రయః|
అసంశయం సమగ్రం మాం
యథా జ్ఞాస్యసి తచ్ఛృణు|| 7-1

శ్రీభగవానుల వాక్యము.
ఉత్పలమాల.
నన్ను సతంబు నీ మనమునన్ భజియించెడు నీకు , సందియం
బెన్నఁగ లేని చందము , మదీయ విభూతి మహత్త్వ సత్త్వ సం
పన్న బలోద్ధితమ్ముల ప్రభావము , నిండు మనంబుతో వినన్ ,
నన్ను సమగ్రమున్ దెలియు నట్టులఁ జెప్పెద , నాలకింపవే. ౧
శ్రీ భగవంతుడు చెప్పెను.
ఓ అర్జునా ! నాయందాసక్తి గల మనస్సు గలిగి నన్నే ఆశ్రయించి యోగము నాచరించుచు నిస్సందేహముగ సంపూర్ణముగ నన్నెట్లు తెలిసికొనగలవో దానిని ( ఆ పద్ధతిని ) చెప్పెదను వినుము.

అనుష్టుప్.
జ్ఞానం తేऽహం సవిజ్ఞాన
మిదం వక్ష్యామ్యశేషతః|
యజ్జ్ఞాత్వా నేహ భూయోऽన్యద్
జ్జ్ఞాతవ్యమవశిష్యతే|| 7-2

కందము.
ఇది తెలియ , నిహము నందిక
నెది తెలియఁగఁ దగిన జ్ఞాన మేదియుఁ గనరా ;
దిది , స్వానుభవ జ్ఞానము
విదిత మ్మొనరింతుఁ బార్థ ! విజ్ఞానంబున్. ౨
దేనిని తెలిసికొనినచో మరల యీ ప్రపంచమున తెలిసికొనదగినది మరియొకటి మిగిలియుండదో అట్టి అనుభవసహితమగు జ్ఞానమును సంపూర్ణముగ నీకు జెప్పెదను.

అనుష్టుప్.
మనుష్యాణాం సహస్రేషు
కశ్చిద్యతతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తి తత్త్వతః|| 7-3

ఉత్పలమాల.
వేనకు వేల నొక్కఁడు గవేషణసేయఁ బ్రయత్న మూను ; వి
జ్ఞానము నొందువారల నొకండగు వేల సమగ్రమైన సు
జ్ఞానమునన్ ననున్ దెలియు , సాంద్రమనంబున సత్త్వశుద్ధి సం
ధానముఁ జేసి ; వాఁడె , కడుధన్యుఁడగున్ జగమందు నందఱన్. ౩
అనేకవేలమంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేకమందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగ తెలిసికొనగల్గుచున్నాడు.

అ.
భూమిరాపోऽనలో వాయుః
ఖం మనో బుద్ధిరేవ చ|
అహంకార ఇతీయం మే
భిన్నా ప్రకృతిరష్టధా|| 7-4

తేటగీతి.
పంచభూత మాత్రమ్ము లంచితముగ ,
మనసు , బుద్ధి , యహంకార మను నెనిమిది ;
ప్రకృతి విధములు నామాయ పాండవేయ !
బంధహేతు లివియె , ప్రపంచ మందు ౪
భూమి , జలము , అగ్ని , వాయువు , ఆకాశము , మనస్సు , బుద్ధి , అహంకారము - అని ఈ ప్రకారముగ ఎనిమిది విధములుగ నా యీ ప్రకృతి ( మాయ ) విభజింపబడినది.

అ.
అపరేయమితస్త్వన్యాం
ప్రకృతిం విద్ధి మే పరామ్|
జీవభూతాం మహాబాహో !
యయేదం ధార్యతే జగత్|| 7-5

కందము.
ఇవి గాక జీవభూతం
బవు పరమోత్కృష్టమైన ప్రకృతిఁ దెలియుమా !
భువనము లెల్ల ధరించుచు ,
నవగతమై భూతచయములందుఁ జరించున్ . ౫
గొప్పబాహువులుగల ఓ అర్జునా ! ఈ ( అపరా ) ప్రకృతి చాల అల్పమైనది . దీనికంటె వేఱైనదియు , ఈజగత్తునంతను ధరించునదియు , జీవరూపమైనదియు నగు మఱియొక ప్రకృతిని ( పరాప్రకృతిని ) శ్రేష్ఠమైనదిగా నెఱుంగుము .

అ.
ఏతద్యోనీని భూతాని
సర్వాణీత్యుపధారయ|
అహం కృత్స్నస్య జగతః
ప్రభవః ప్రలయస్తథా|| 7-6

తేటగీతి.
ఈ పరాపర ప్రకృతులే యెల్ల భూత
తతి సముద్భవ కారణాంతములగును ;
నా యధీనములివి , జగన్నాథుఁడ నయి ,
ప్రభవ లయముల కారణ ప్రదుఁడ నౌదు. ౬
( జడ , చేతనములగు ) సమస్త భూతములున్ను యీ రెండు విధములగు ( పరాపర ) ప్రకృతుల వలననే కలుగునవియని తెలిసికొనుము. ( ఆ రెండు ప్రకృతుల ద్వారా ) నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క ఉత్పత్తికి , వినాశమునకు కారణభూతుడనై యున్నాను.

అ.
మత్తః పరతరం నాన్య
త్కిఞ్చిదస్తి ధనఞ్జయ|
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ|| 7-7

కందము.
నా కంటె జగంబుల నిక
నే కారణమున్ గనంగ నెఱుఁగవు , పార్థా !
సాకల్యము మణిగణములఁ
జే కూర్చెడు సూత్రమౌచు , సృష్ఠి ధరింతున్. ౭
ఓ అర్జునా ! నాకంటె వేఱుగ మఱియొకటి ఏదియు లేనే లేదు . దారమందు మణులవలె నాయందీ సమస్త ప్రపంచము కూర్చబడినది.

అ.
రసోऽహమప్సు కౌన్తేయ !
ప్రభాస్మి శశిసూర్యయోః|
ప్రణవః సర్వవేదేషు
శబ్దః ఖే పౌరుషం నృషు|| 7-8

తేటగీతి.
ఉదకములయందు రసమేనె ; వ్యోమమందు
శబ్దమును ; శశి సూర్య భాసములు నేనె ;
వేదములయందు ప్రణవమ్మున్ , నీరవరుల
పౌరుషమ్మును నేనౌదు పార్థ ! నిజము. ౮
అర్జునా ! నేను జలమందు రుచియు , చంద్రసూర్యులందు కాంతియు , సమస్తవేదములందు ఓంకారమును , ఆకాశమందు శబ్దమును , మనుజులందు పరాక్రమమును అయియున్నాను.

అ.
పుణ్యో గన్ధః పృథివ్యాం చ
తేజశ్చాస్మి విభావసౌ|
జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు|| 7-9

తేటగీతి.
ధర గుబాళించు దివ్య గంధమ్ము నేనె ;
యనలమునుఁ గూర్చు తేజమ్ము నౌదు నేనె ;
సర్వజీవస్థితిన్ గూర్చు సత్త్వ మేనె ;
తాపసుల యందుఁ దపమునై తనరు దేనె. ౯
( మఱియు నేను ) భూమియందు సుగంధమును , అగ్నియందు ప్రకాశమును , సమస్తప్రాణులయందు ప్రాణమును ( లేక ఆయువును ) , తాపసులయందు తపస్సును అయియున్నాను.

అ.
బీజం మాం సర్వభూతానాం
విద్ధి పార్థ సనాతనమ్|
బుద్ధిర్బుద్ధిమతామస్మి
తేజస్తేజస్వినామహమ్|| 7-10

తేటగీతి.
సర్వ భూతమ్ములకును బీజమ్ము నేనె ;
బుద్ధిమంతుల బుద్ధి , సంపూర్ణమేనె ;
కడు సమర్థుల యందు ప్రాగల్భ్య మేనె ;
బలయుతులయందు సద్బలంబ నగు దేనె. ౧౦
ఓ అర్జునా ! నన్ను సమస్త ప్రాణులయొక్క శాశ్వతమైన బీజముగ నెఱుంగుము . మఱియు , బుద్ధిమంతులయొక్క బుద్ధియు , ధీరులయొక్క ధైర్యమును నేనే అయియున్నాను .

అ.
బలం బలవతాం చాహం
కామరాగవివర్జితమ్|
ధర్మావిరుద్ధో భూతేషు
కామోऽస్మి భరతర్షభ|| 7-11

తేటగీతి.
ధర్మ బద్ధమ్ములైన విధాన మొంది ,
జీవకోటుల మనమందుఁ జెలగుచున్న ,
యిచ్ఛలెల్లను నేనె యంచెఱుగు మయ్య ,
భూత తతి యెల్ల సద్వృద్ధిఁ బొందుటకును. ౧౧
భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! నేను బలవంతునియొక్క ఆశ, అనురాగము లేని బలమును , ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకముకాని కోరికయు అయియున్నాను.

అ.
యే చైవ సాత్త్వికా భావా
రాజసాస్తామసాశ్చ యే|
మత్త ఏవేతి తాన్విద్ధి
న త్వహం తేషు తే మయి|| 7-12

తేటగీతి.
సత్త్వము , రజంబు , తమముల సంచితమగు
భావములు పుట్టుచుండు నా వలనె , పార్ఝ !
ఆశ్రయం బొందు నన్ను నే నాశ్రయింప
వాని , మచ్చోదితంబు లే గాని పార్థ ! ౧౨
సత్త్వరజస్తమోగుణములచే గలిగిన పదార్థములు ( లేక స్వభావములు ) ఎవ్వి కలవో అవి నా వలననే కలిగినవని నీ వెఱుంగుము. అయితే నేను వానియందు లేను . అవి నాయందున్నవి . ( నేను వానికి వశుడనుగాను , అవి నాకు వశవర్తులై యున్నవని భావము ).

అ.
త్రిభిర్గుణమయైర్భావై
రేభిః సర్వమిదం జగత్|
మోహితం నాభిజానాతి
మామేభ్యః పరమవ్యయమ్|| 7-13

చంపకమాల.
త్రివిధగుణైక భావసమితింగొని , యుద్భవమైన యీ జగం
బవశతనొందు మోహమున ; నవ్యయమైన విభిన్న లక్షణం
బెవఁడు మదీయ సత్త్వ మదియేయని సుంత దలంపఁబోడు, ర
జ్జువుఁగని సర్పమంచనెడి చొప్పున నెల్లెడలన్ భ్రమించుచున్. ౧౩
ఈ చెప్పబడిన మూడు విధములగు సత్త్వరజస్తమోగుణములయొక్క వికారములగు స్వభావములచేత ఈ ప్రపంచమంతయు మోహమును ( అవివేకమును ) బొందింపబడినదై , ఆ గుణముకంటె వేఱై ( అతీతుడనై ) నాశరహితుడనైనట్టి నన్ను తెలిసికొనజాలకున్నది .

అ.
దైవీ హ్యేషా గుణమయీ
మమ మాయా దురత్యయా|
మామేవ యే ప్రపద్యన్తే
మాయామేతాం తరన్తి తే|| 7-14

కందము.
మామకమౌ నీ మాయను
నే మనుజుఁడు దాట లే డి కే గతినై నన్ ;
ధీమంతుఁ డగుచు నన్నే
స్తోమమ్మునఁ గాంచు వాఁడె తొలగునుమాయన్. ౧౪
ఏలయనగా , దైవసంబంధమైనదియు ( అలౌకిక సామర్థ్యముకలదియు ) , త్రిగుణాత్మకమైనదియునగు ఈ నాయొక్క మాయ ( ప్రకృతి ) దాటుటకు కష్టసాధ్యమైనది . ( అయినను ) ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారీమాయను దాటివేయగలరు .

అ.
న మాం దుష్కృతినో మూఢాః
ప్రపద్యన్తే నరాధమాః|
మాయయాపహృతజ్ఞానా
ఆసురం భావమాశ్రితాః|| 7-15

తేటగీతి.
నీచ కృత్యమ్ములే సదా యాచరించి ,
యసుర భావమ్మునందు నరాధముండు ,
నన్ను గననేఱఁ డెన్ని జన్మములనైన ,
నపహృత జ్ఞాని యగుచు మాయను మునుంగు. ౧౫
పాపము చేయువారును , మూఢులును , మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారును , రాక్షస స్వభావమును ( అసుర గుణములను ) ఆశ్రయించువారునగు మనుజాధములు నన్ను బొందుటలేదు ( ఆశ్రయించుట లేదు ) .

అ.
చతుర్విధా భజన్తే మాం
జనాః సుకృతినోऽర్జున ! |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ
జ్ఞానీ చ భరతర్షభ|| 7-16

తేటగీతి.
నలు విధంబుల భక్తులు నను భజింత్రు
సుకృతములుఁ జేసి , యార్తిని సృక్కువార ,
లర్థి జనులు , జిజ్ఞాసుల య్యతి మునీంద్రు ;
లందుఁ బ్రియతముండగు నాకు నయ్యతివరుండె. ౧౬
భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఆపత్తునందున్నవాడు , ( భగవంతుని ) తెలిసికొనగోరువాడు , ధనము ( సంపత్తు ) నభిలషించువాడు , ( ఆత్మ ) జ్ఞానముకలవాడు , అను నీ నాలుగువిధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు ( భజించుచున్నారు ) .

అ.
తేషాం జ్ఞానీ నిత్యయుక్త
ఏకభక్తిర్విశిష్యతే|
ప్రియో హి జ్ఞానినోऽత్యర్థ
మహం స చ మమ ప్రియః|| 7-17

తేటగీతి.
జ్ఞానికి న్నాకు భేద మే మేని లేదు ,
స్వీయ రూపమ్మునందు నన్నే యెఱింగి ,
నన్నె భజియించి , నా పొందె యున్నతి గతి
యని తలంచును ; భక్తులం దధికుఁ డతఁడు. ౧౭
వారి ( నలుగురి ) లో నిత్యము పరమాత్మతో గూడియుండు వాడును , ఒక్క పరమాత్మయందే భక్తి గలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు . అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనవాడను ; అతడున్ను నాకు మిగుల ఇష్టుడే .

అ.
ఉదారాః సర్వ ఏవైతే
జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్|
ఆస్థితః స హి యుక్తాత్మా
మామేవానుత్తమాం గతిమ్|| 7-18
అ.
బహూనాం జన్మనామన్తే
జ్ఞానవాన్మాం ప్రపద్యతే|
వాసుదేవః సర్వమితి
స మహాత్మా సుదుర్లభః|| 7-19

చంపకమాల.
తనువులనేక మెత్తి , సుకృతంబు లొనర్చి , క్రమక్రమంబుగాఁ
గనెడు వివేకమున్ బడసి , జ్ఞాని యగున్ ; నను వాసుదేవుగాఁ
గనుచు సమస్త మే నె యని గాంచుఁ జరాచరమౌ జగంబు నె
ల్లను గడుధన్యుఁ డాతఁడె తలంప , మహాత్ముఁడు దుర్లభుండె యౌ. ౧౮
వీరందఱున్ను ( పైన దెలిపిన నలుగురు భక్తులు ) మంచివారే . కాని అందు జ్ఞానియో సాక్షాత్ నేనేయని నా అభిప్రాయము . ఏలయనగా అతడు నాయందే చిత్తమును స్థిరముగ నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగ నిశ్చయించి ఆశ్రయించుకొనియున్నాడు .అనేక జన్మలయొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే ( భగవంతుడే ) యను సద్బుద్ధిగల్గి నన్ను పొందుచున్నాడు - అట్టి మహాత్ముడు లోకములో చాల అరుదు .

అ.
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః
ప్రపద్యన్తేऽన్యదేవతాః|
తం తం నియమమాస్థాయ
ప్రకృత్యా నియతాః స్వయా|| 7-20

తేటగీతి.
అనుగతంబైన పూర్వవాసనల బలిమిఁ
గాంచి , కామితంబుల నొందగా వ్రతంబు
లన్య దేవతారాధన మాచరింతు ,
రపహృత జ్ఞానులై కొంద ఱల్పమతులు. ౧౯
( కొందఱు ) తమయొక్క ప్రకృతి ( జన్మాంతరసంస్కారము ) చే ప్రేరేపింపబడినవారై విషయాదులందలి కోరికలచే వివేకమును గోల్పోయి , దేవతారాధనాసంబంధమైన ఆ యా నియమముల నవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు .

అ.
యో యో యాం యాం తనుం భక్తః
శ్రద్ధయార్చితుమిచ్ఛతి|
తస్య తస్యాచలాం శ్రద్ధాం
తామేవ విదధామ్యహమ్|| 7-21

ఉత్పలమాల.
ఎట్టి స్వరూప దేవతల నెవ్విధిఁ గొల్తురొ , యట్టి శ్రద్ధ తో
బుట్టుక లిత్తు ; నెట్టి తనువు ల్గన నెంచి భజింతు రట్లుఁ జే
పట్టిన దేవతాళిడు నెపంబున ; మామకమైన మాయ లో
గుట్టు నెఱుంగుమా ! ప్రకృతి కోటి గణంబులు దేవతల్ జుమా ! ౨౦
ఏయే భక్తుడు ఏయే ( దేవతా ) రూపమును శ్రద్ధతో పూజింపదలంచుచున్నాడో , దానిదానికి తగిన శ్రద్ధనే వానివానికి నేను స్థిరముగ గలుగ జేయుచున్నాను .

అ.
స తయా శ్రద్ధయా యుక్త
స్తస్యారాధనమీహతే|
లభతే చ తతః కామా
న్మయైవ విహితాన్హి తాన్|| 7-22
అ.
అన్తవత్తు ఫలం తేషాం
తద్భవత్యల్పమేధసామ్|
దేవాన్దేవయజో యాన్తి
మద్భక్తా యాన్తి మామపి|| 7-23
అ.
అవ్యక్తం వ్యక్తిమాపన్నం
మన్యన్తే మామబుద్ధయః|
పరం భావమజానన్తో
మమావ్యయమనుత్తమమ్|| 7-24

చంపకమాల.
క్షణికములౌ ఫలంబులకుఁ గాంక్షవహించి , నికృష్ట దేవతల్
దనువుల నాశ్రయింతురు ; తలంపరు అవ్యయుఁ డంచు నన్ను , నీ
కనులకు వ్యక్తి రూపమునఁ గాంచఁ దలంతురు బుద్ధి హీనతన్ ;
ననుఁగన నేర రింద్రియ మనంబుల ; జ్ఞానుల కే లభించెదన్. ౨౧
అతడు ( పైన తెలుపబడిన కామ్యభక్తుడు ) అట్టి శ్రద్ధతోగూడుకొనినవాడై ఆ యా దేవతలయొక్క ఆరాధనను గావించుచున్నాడు . మఱియు నాచే విధింపబడిన ఆ యా యిష్టఫలములను ఆ యా దేవతలద్వారా పొందుచున్నాడు . అల్పబుద్ధి కలిగినవారియొక్క ఆ ఫలము నాశవంతమై యున్నది . ( ఏలయనగా ) దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు . నా భక్తులు ( నన్ను పూజించువారు ) నన్నే పొందుచున్నారు . నాశరహితమైనట్టియు , సర్వోత్తమమైనట్టియు , నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడనగు ( ప్రపంచాతీతుడనగు ) నన్ను పాంచభౌతికదేహమును పొందినవానినిగా తలంచుచున్నారు .

అ.
నాహం ప్రకాశః సర్వస్య
యోగమాయాసమావృతః|
మూఢోऽయం నాభిజానాతి
లోకో మామజమవ్యయమ్|| 7-25

తేటగీతి.
యోగ మాయావృతుండనై యోగివరుల
కే లభించెదఁ గాని నేనించు కైన
ప్రాణి కోటులకున్ గాన రాను , పార్థ !
అవ్యయుండ నజుండ నంచఱయ లేరు. ౨౨
యోగమాయచే బాగుగా కప్పబడియుండుటచే నేను అందఱికిని కనుపించువాడనుగాను .అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేనివానినిగను , నాశరహితునిగను ఎఱుఁగరు !

అ.
వేదాహం సమతీతాని
వర్తమానాని చార్జున|
భవిష్యాణి చ భూతాని
మాం తు వేద న కశ్చన|| 7-26

తేటగీతి.
భూతవర్త మాన భవితముల ప్రపత్తి
నెల్ల నెఱిగిన నన్నొక , యించు కైనఁ
దెలియఁ జాలక నున్నారు , తెలివి మాలి
మోహ కలనమ్మునను , మానవులు కిరీటి ! ౨౩
ఓ అర్జునా ! నేను భూతభవిష్యద్వర్తమానమందలి ప్రాణులందఱిని ఎఱుఁగుదును . నన్ను మాత్ర మెవడును ఎఱుఁగడు .

అ.
ఇచ్ఛాద్వేషసముత్థేన
ద్వన్ద్వమోహేన భారత|
సర్వభూతాని సమ్మోహం
సర్గే యాన్తి పరన్తప ! || 7-27
అ.
యేషాం త్వన్తగతం పాపం
జనానాం పుణ్యకర్మణామ్|
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా
భజన్తే మాం దృఢవ్రతాః|| 7-28

తేటగీతి.
సర్వభూతమ్ములకుఁ బూర్వసంచితమగు
మూఢ భావమ్ము పుష్కలంబుగఁ జనించి ,
ద్వేష రాగమ్ము లందుద్భవించు ద్వంద్వ
ములకు , మోహితులై పుట్టుకలు ధరింత్రు. ౨౪
శత్రువులను తపింపజేయు ఓ అర్జునా ! సమస్త ప్రాణులును పుట్టుకతోడనే రాగద్వేషజనితమగు సుఖదుఃఖాది ద్వంద్వరూపమైన వ్యామోహము వలన మిక్కిలి అజ్ఞానమును బొందుచున్నవి .పుణ్యకార్యతత్పరులగు ఏజనులయొక్క పాపము నశించిపోయినదో , అట్టివారు ( సుఖదుఃఖాది ) ద్వంద్వరూపమగు అజ్ఞానమునుండి విడువబడినవారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు .

అ.
జరామరణమోక్షాయ
మామాశ్రిత్య యతన్తి యే|
తే బ్రహ్మ తద్విదుః కృత్స్న
మధ్యాత్మం కర్మ చాఖిలమ్|| 7-29

కందము.
పుట్టుకఁ జావుల నెఱుఁగని
గుట్టుఁ దెలిసికొన్న వాఁడు కోవిదుఁడై , నా
జట్టున మెలగి సదా జగ
జెట్టి యగుచు సర్వకర్మ సిద్ధి నెఱుంగున్. ౨౫
ఎవరు వార్ధక్యమును , మరణమును ( సంసారదుఃఖమును ) పోగొట్టుకొనుట కొఱకు నన్నాశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో , వారు సమస్త ప్రత్యగాత్మ స్వరూపమున్ను , సకల కర్మమున్ను ఆ బ్రహ్మమే యని తెలిసికొందురు .

అ.
సాధిభూతాధిదైవం మాం
సాధియజ్ఞం చ యే విదుః|
ప్రయాణకాలేऽపి చ మాం
తే విదుర్యుక్తచేతసః|| 7-30

తేటగీతి.
సాధి భూతాధి నాథుని , సాధియజ్ఞ
యుతునిగా నన్ను దెలిసిన యతఁడె పార్థ !
మరణ కాలమ్మునం గూడ మఱువ కుండ ,
న న్నెఱుంగుచు ధ్యానించు చున్నవాఁడు. ౨౬
అదిభూత , అధిదైవ , అధియజ్ఞములతో గూడియున్న నన్నెవరు తెలిసికొందురో వారు దేహవియోగకాలమందును ( దైవమందు ) నిలుకడ గల మనస్సుగలవారై ( మనోనిగ్రహముగలవారై ) నన్నెఱుఁగగలరు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః|| 7 ||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి చే అనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణియందు
శ్రీ జ్ఞాన విజ్ఞాన యోగమను సప్తమ తరంగము
సంపూర్ణం. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.
ఓమ్
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విజ్ఞానయోగమను ఏడవ అధ్యాయము సంపూర్ణం. ఓమ్ తత్ సత్.

Friday, October 16, 2009

ఆత్మసంయమయోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు)
శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)
శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
అనాశ్రితః కర్మఫలం
కార్యం కర్మ కరోతి యః|
స సంన్యాసీ చ యోగీ చ
న నిరగ్నిర్న చాక్రియః|| 6-1
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
నిత్య నైమిత్తికంబుల నియతిఁ జనుచు,
కర్మ రాహిత్య నిష్కామ కర్మయోగి,
కర్మసంన్యాస ఫలమును గాంచుచుండు,
నగ్ని హోత్రాది కర్మల నాచరించి. ౧
ఎవడు చేయవలసినకర్మములను ఫలాపేక్ష లేకుండ చేయునో అతడే సన్న్యాసియు, యోగియు నగును. అంతియేకాని అగ్నిహోత్రమును వదలినవాడుకాని , కర్మలను విడిచినవాడు కాని సన్న్యాసియు, యోగియు ఎన్నటికిని కానేరడు.
అనుష్టుప్.
యం సంన్యాసమితి ప్రాహు
ర్యోగం తం విద్ధి పాణ్డవ|
న హ్యసంన్యస్తసఙ్కల్పో
యోగీ భవతి కశ్చన|| 6-2
కందము.
ఫలమాశింపకఁ గర్మల
సలుపఁ గలుగునట్టి యోగి సంన్యాసియె గాఁ
గలఁడు ఫలత్యాగమున నె
యలవడు యోగమ్ము చిత్తమాత్మ వశమ్మై. ౨
ఓ అర్జునా ! దేనిని సన్న్యాసమని చెప్పుదురో, దానినే యోగమని నెఱుఁగుము. ఏలయనగా, ( కామాది ) సంకల్పమును వదలనివాడు ( సంకల్పరహితుడు కానివాడు ) ఎవడును యోగి కానేరడు.
అ.
ఆరురుక్షోర్మునేర్యోగం
కర్మ కారణముచ్యతే|
యోగారూఢస్య తస్యైవ
శమః కారణముచ్యతే|| 6-3
తేటగీతి.
ధ్యానయోగమ్ము సాధించు మౌని వరుఁడు
తొలుత నిష్కామ కర్మయందునఁ జరించు ;
నది యెఱుంగని వానికి నెదియు లేదు,
కర్మ సంన్యాసి కాఁడు, నిష్కామి కాఁడు. ౩
యోగమును ( జ్ఞానయోగమును, లేక, ధ్యానయోగమును ) ఎక్క దలంచిన (పొందగోరిన ) మునికి ( మననశీలునకు ) కర్మ సాధనమనియు, దానిని బాగుగు ఎక్కినట్టి మునికి ఉపరతి ( కర్మ నివృత్తి ) సాధనమనియు చెప్పబడినది.
అ.
యదా హి నేన్ద్రియార్థేషు
న కర్మస్వనుషజ్జతే|
సర్వసఙ్కల్పసంన్యాసీ
యోగారూఢస్తదోచ్యతే|| 6-4
చంపకమాల.
ఎపుడు జితేంద్రియుండు విషయేచ్ఛలనెల్ల హరింపఁ గల్గునొ ,
యెపుడు నిమిత్త కర్మలకు నేవ జనించునొ , సంన్యసింపగా
నపుడదైన హృద్గతము నంది, చెలంగును , ధ్యాననిష్ఠ ; క
య్యపుడె తపోధనుండగుట , యప్పుడె ధ్యానగరిష్ఠుడౌటయున్. ౪
ఎపుడు శబ్దాదివిషయములందును, కర్మలందును, ఆసక్తి నుంచడో, సమస్త సంకల్పములను విడిచిపెట్టునో అపుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును.
అ.
ఉద్ధరేదాత్మనాత్మానం
నాత్మానమవసాదయేత్|
ఆత్మైవ హ్యాత్మనో బన్ధు
రాత్మైవ రిపురాత్మనః|| 6-5
కందము.
తన యాత్మఁ దానె యున్నతి
నొనరింపగఁ జేయఁగలుగు ; నొరునకు వశమా ?
తన యాత్మ తనకు మిత్రము,
తన యాత్మయె తనకు రిపుడు, తథ్యము పార్థా ! ౫
తన్ను తానే యుద్ధరించుకొనవలెను. తన్ను అథోగతినిబొందించుకొనగూడదు. ఏలయనగా ( ఇంద్రియమనంబులను జయించినచో ) తనకు తానే బంధువున్ను, ( జయింపనిచో ) తనకు తానే శత్రువున్ను అగును.
అ.
బన్ధురాత్మాత్మనస్తస్య
యేనాత్మైవాత్మనా జితః|
అనాత్మనస్తు శత్రుత్వే
వర్తేతాత్మైవ శత్రువత్|| 6-6
చంపకమాల.
తన వశమైన యింద్రియ నితానెమె తన్నుఁ దరించు మిత్రముల్ ;
దన కవశమ్ములై యవియె తన్ను గ్రసించెడు దుష్టశాత్రవుల్ ;
వినయ జితేంద్రియుం డెపుడు వేరుగనం డవమాన మాన్యతల్,
క్షణికములైన దుఃఖ సుఖ, సాంద్రపు నుష్ణము శీతలంబులున్. ౬
ఎవడు ( వివేక వైరాగ్యాదులచే ) తన మనస్సును తాను జయించుకొనునో , అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువు పగిది నుండును ( ఉపకారము చేయును ) . జయింపనిచో , అదియే శత్రువుపగిది నుండును ( అపకారము చేయును ) .
జితాత్మనః ప్రశాన్తస్య
పరమాత్మా సమాహితః|
శీతోష్ణసుఖదుఃఖేషు
తథా మానాపమానయోః|| 6-7
అ.
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా
కూటస్థో విజితేన్ద్రియః|
యుక్త ఇత్యుచ్యతే యోగీ
సమలోష్టాశ్మకాఞ్చనః|| 6-8
ఉత్పలమాల.
జ్ఞాన సమగ్ర తృప్తుఁడగు సంయమి, నిర్మమతన్ సమస్తమున్
గానెడుఁ దుల్య భావమునఁ, గాంచనముల్ , శిలమృత్తి కాదులన్ ,
మానిత పుణ్యశీలుర , నమానుష దుర్నయ దుష్టశీలురన్ ,
ధేనుల మధ్యవర్తులను, స్నేహితులన్ , రిపులన్ , తటస్థులన్. ౭
మనస్సును జయించినవాడును , పరమశాంతితో గూడినవాడు నగు మనుజునకు శీతోష్ణ , సుఖదుఃఖాదులందును , అట్లే మావవమానాదులందును పరమాత్మానుభవము చెక్కు చెదరకనే యుండును . ( లేక , అట్టి వానికి శీతోష్ణాదులందును మనస్సు లెస్సగ ఆత్మానుభవమందే యుండును ) . శాస్త్రజ్ఞాన, అనుభవజ్ఞానములచే తృప్తినొందిన మనస్సుగలవాడును , నిర్వికారుడును , ఇంద్రియములను లెస్సగ జయించినవాడును , మట్టిగడ్డ , ఱాయి , బంగారము అను మూడిటిని సమముగ జూచువాడునగు యోగి యోగారూఢుడని (ఆత్మానుభవయుక్తుడని ) చెప్పబడును.
అ.
సుహృన్మిత్రార్యుదాసీన
మధ్యస్థద్వేష్యబన్ధుషు|
సాధుష్వపి చ పాపేషు
సమబుద్ధిర్విశిష్యతే|| 6-9
అ.
యోగీ యుఞ్జీత సతత
మాత్మానం రహసి స్థితః|
ఏకాకీ యతచిత్తాత్మా
నిరాశీరపరిగ్రహః|| 6-10
ఆటవెలది.
జ్ఞాననిష్ఠనుండు మౌని యేకాంతమ్ముఁ
గోరి , యింద్రియములఁ గుదియఁ గట్టి ,
సర్వకర్మలందు సక్తిని విడనాడి ,
యాత్మ లక్ష్యమందె యధివసించు. ౮
ప్రత్యుపకారమును గోరకయే మేలొనర్చువారియందు , ప్రతిఫలమును గోరి మేలుచేయువారియందు , శత్రువులందు , తటస్థులందు , మధ్యవర్తులందు , ద్వేషింపబడదగని వారియందు( విరోధులందు ) , బంధువులందు , సజ్జనులందు , పాపులందు సమభావము గల్గియుండువాడే శ్రేష్టుడు . ( ధ్యానయోగము నభ్యసించు ) యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగనున్నవాడై మనస్సును , దేహేంద్రియములను స్వాధీనమొనర్చుకొని , ఆశ లేనివాడై , ఒరులనుండి యేమియు స్వీకరింపక ఎల్లప్పుడును మనస్సును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను ( లయ మొనర్పుచుండవలెను ) .
అ.
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య
స్థిరమాసనమాత్మనః|
నాత్యుచ్ఛ్రితం నాతినీచం
చేలాజినకుశోత్తరమ్|| 6-11
అ.
తత్రైకాగ్రం మనః కృత్వా
యతచిత్తేన్ద్రియక్రియః|
ఉపవిశ్యాసనే యుఞ్జ్యా
ద్యోగమాత్మవిశుద్ధయే|| 6-12
చంపకమాల.
సమతలమౌ శుచిస్థలిఁ గుశాజిన చేలము లాసనంబుగా
నమర, మనంబు నిశ్చలతనంది , జితేంద్రియ చిత్తబుద్ధులన్
గ్రమముగ నిల్పి , యాత్మ శుచికై గయి కొందురు జ్ఞాన నిష్ఠ సం
యములగువారు, సంతత నిరామయ సుస్థిర ధామమందగన్. ౯
పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి యెత్తుగా నుండనిదియు , మిక్కిలి పొట్టిగా నుండనిదియు , క్రింద దర్భాసనము , దానిపై చర్మము ( జింకచర్మము లేక పులిచర్మము ) , దానిపైన వస్త్రము గలదియు , కదలక యుండునదియు నగు ఆసనము ( పీఠము ) ను వేసికొని , దానిపై గూర్చుండి , మనస్సును ఏకాగ్రపఱచి , ఇంద్రియమనో వ్యాపారములను అరికట్టి ( స్వాధీనపఱచుకొని ) అంతఃకరణశుద్ధికొఱకు ( పరమాత్మ ) ధ్యానము నభ్యసింపవలయును .
అ.
సమం కాయశిరోగ్రీవం
ధారయన్నచలం స్థిరః|
సమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వం
దిశశ్చానవలోకయన్|| 6-13
అ.
ప్రశాన్తాత్మా విగతభీ
ర్బ్రహ్మచారివ్రతే స్థితః|
మనః సంయమ్య మచ్చిత్తో
యుక్త ఆసీత మత్పరః|| 6-14
అ.
యుఞ్జన్నేవం సదాత్మానం
యోగీ నియతమానసః|
శాన్తిం నిర్వాణపరమాం
మత్సంస్థామధిగచ్ఛతి|| 6-15
కందము.
కాయ శిరోగ్రీవమ్ముల
నే యెడకుఁ జలింప నీక , నితర విషయముల్
డాయక , నాసాగ్రము నే
కాయత వీక్షింపు , దిక్కులరయకఁ బార్థా ! ౧౦
కందము.
విగత భయ క్రోధుండయి ,
స్వగతమ్మగు నాత్మఁ దెలిసి , సంయమి మచ్చి
త్తగతుండయి , సుస్థిర శాం
తి గనున్ , మత్సంస్థ నంది , ధీయుతుఁడగుచున్. ౧౧
( ధ్యానముచేయువాడు ) శరీరము, శిరస్సు, కంఠము, సమముగ( తిన్నగ )నిలిపి, కదలక, స్థిరముగనున్నవాడై, దిక్కులను చూడక, నాసికాగ్రమును వీక్షించుచు, ప్రశాంత హృదయుడై, నిర్భయ చేతస్కుడై, బ్రహ్మచర్యవ్రతనిష్ఠకలిగి, మనస్సును బాగుగ నిగ్రహించి, నాయందు చిత్తముగలవాడై, నన్నే పరమగతిగనమ్మి సమాధి (ధ్యాన ) యుక్తుడై యుండవలెను. మనోనిగ్రహముగల యోగి ఈ ప్రకారముగ ఎల్లప్పుడును మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి నాయందున్నట్టిదియు ( నా స్వరూపమైనదియు ), ఉత్కృష్టమోక్ష రూపమైనదియు ( పరమానందరూపమైనదియు ) నగు శాంతిని బొందుచున్నాడు.
అ.
నాత్యశ్నతస్తు యోగోऽస్తి
న చైకాన్తమనశ్నతః|
న చాతిస్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున|| 6-16
ఆటవెలది.
తిండి మెండుఁగాక , మండు నాకటిఁ గాక ,
నిద్రమోపుఁగా కనిద్రఁగాక ,
క్రమముఁ గన్నవాడె , సమముగా నిష్ఠను
ననుసరింపఁ గలుగు , నతడె పార్థా ! ౧౨
అర్జునా ! ఈ ధ్యానయోగము అధికముగ భుజించువానికిని, బొత్తిగా భుజింపనివానికిని, అట్లే అధికముగ నిద్రించువానికిని, ( బొత్తిగానిద్రించక ) ఎల్లప్పుడు మేలుకొనియుండు వానికిని కలుగనే కలుగదు.
అ.
యుక్తాహారవిహారస్య
యుక్తచేష్టస్య కర్మసు|
యుక్తస్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖహా|| 6-17
ఆటవెలది.
రోగి కెపుడు నిత్యమౌ కదా పథ్యమ్ము ,
బాగుపడఁగ లేచి ప్రాకులాడ ;
యోగి కటులె నిత్యమౌ కదా నిష్ఠయు ,
సాధనాంతరములు, సవ్యసాచి ! ౧౩
మితమైన ఆహారము, నడత గలవాడును, కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్ర, జాగరణము గలవాడునగు మనుజునకు యోగము ( జనన మరణాది సంసార ) దుఃఖములను బోగొట్టునదిగ అగుచున్నది.
అ.
యదా వినియతం చిత్త
మాత్మన్యేవావతిష్ఠతే|
నిఃస్పృహః సర్వకామేభ్యో
యుక్త ఇత్యుచ్యతే తదా|| 6-18
తేటగీతి.
చిత్తమేకాగ్రతం గాంచి , చిన్మయాత్త్మ
లో లమ్మయి , బాహ్య విలోలముడుగు ;
నా యవస్థయె సుస్థిరమైన యదను,
ధ్యాననిష్ఠా ఫలప్రాప్తి నందఁ బార్థ ! ౧౪
ఎపుడు మనస్సు బాగుగ నిగ్రహింపబడినదై ఆత్మయందే స్థిరముగ నిలుచునో, మఱియు ఎపుడు యోగి సమస్తములైన కోరికలనుండి నివృత్తుడగునో అపుడే యాతడు యోగసిద్ధిని బొందినవాడని ( సమాధియుక్తుడని ) చెప్పబడును.
అ.
యథా దీపో నివాతస్థో
నేఙ్గతే సోపమా స్మృతా|
యోగినో యతచిత్తస్య
యుఞ్జతో యోగమాత్మనః|| 6-19
కందము.
గాలినిఁ బెట్టిన దీపము
పోలికఁ గాకుండ , విషయ పోక లుడుపగం
జాలు యతీంద్రుని మన , మా
తూలని దీపమ్ము పగిదిఁ దోచు , గిరీటీ ! ౧౫
గాలి వీచని చోటనున్న దీప మేప్రకారము కదలక నిశ్చలముగ నుండునో, ఆప్రకారమే ఆత్మధ్యానమును శీలించుచున్న యోగియొక్క స్వాధీనపడిన చిత్తమున్ను నిశ్చలముగ నుండును. కనుకనే యోగియొక్క నిశ్చలమనస్సునకు అట్టి గాలివీచనిచోట గల దీపము దృష్టాంతముగ చెప్పబడినది.
అ.
యత్రోపరమతే చిత్తం
నిరుద్ధం యోగసేవయా|
యత్ర చైవాత్మనాత్మానం
పశ్యన్నాత్మని తుష్యతి|| 6-20
అ.
సుఖమాత్యన్తికం యత్త
ద్బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్|
వేత్తి యత్ర న చైవాయం
స్థితశ్చలతి తత్త్వతః|| 6-21
అ.
యం లబ్ధ్వా చాపరం లాభం
మన్యతే నాధికం తతః|
యస్మిన్స్థితో న దుఃఖేన
గురుణాపి విచాల్యతే|| 6-22
అ.
తం విద్యాద్ దుఃఖసంయోగ
వియోగం యోగసంజ్ఞితమ్|
స నిశ్చయేన యోక్తవ్యో
యోగోऽనిర్విణ్ణచేతసా|| 6-23
తేటగీతి.
చిత్తముపశముంగాంచి , చిన్మయాత్మ
స్వస్వరూపమ్మునన్ గాంచు సంయమీంద్రుఁ
డాత్మ నాత్మనె కని, తుష్టి నందుచుండు ;
ధ్యాన నిష్ఠా గరిష్ఠు విధాన మిద్ది ! ౧౬
తేటగీతి.
ఇంద్రియమ్ములచే గ్రహియింప రాని ,
బుద్ధి మాత్రాన నొందెడి పూర్ణ సుఖము
ననుభవించెడు ; నప్పు డాతని నిజ స్వ
రూప మందునె , పరమాత్మ రూపముఁ గను. ౧౭
చంపకమాల.
ఎది లభియించు వెన్క , నిక నే పరమార్థముఁ గాన రాదటం
చుఁ దెలిసి , దేనికిన్ మదినిఁ జొన్పడొ , తత్సుఖమంది , దుఃఖదం
బెదియు గనంగ లేడు తనువెట్టి శరాసి శతఘ్ని ఘాతమై ,
హృది చలియింపకన్ నిలువరించు , హిమాచల ధీయుతుండు నై. ౧౮
కందము.
సకలేంద్రియ విషయము లో
పికతో వర్జించి , సద్వివేకతను మనో
త్సుకమెల్ల నిలువరించును ,
నకలంక వినిశ్చలమ్ము నందుము పార్థా ! ౧౯
యోగాభ్యాసముచేత నిగ్రహింపబడిన మనస్సు ఎచట పరమశాంతిని బొందుచుండునో , ఎచట ( పరిశుద్ధమైన ) మనస్సుచే ఆత్మను సందర్శించుచు ( అనుభవించుచు ) యోగి తనయందే ఆనందమును బడయుచుండునో , ఎచటనున్నవాడై , యోగి ఇంద్రియములకు గోచరముకానిదియు, ( నిర్మల ) బుద్ధిచే గ్రహింపబడదగినదియు, అంతము లేనిదియునగు సుఖమును అనుభవించుచుండునో , మఱియు స్వానుభవమునుండి ఏ మాత్రము చలింపకుండునో దేనిని పొందిన పిదప ఇతరమగు ఏలాభమును అంతకంటె గొప్పదానినిగ తలంపకుండునో, దేనియందున్నవాడై మహత్తర దుఃఖముచేగూడ చలింపకుండునో , దుఃఖసంబంధము లేశమైనను లేని అట్టి స్థితినే యోగము ( ఆత్మైక్యము, ఆత్మసాక్షాత్కారము ) అని యెఱుఁగవలయును . అట్టి ఆత్మసాక్షాత్కారరూపయోగము దుఃఖముచే కలతనొందని ధీరమనస్సుచే పట్టుదలతో సాధింపదగియున్నది.
అ.
సఙ్కల్పప్రభవాన్కామాం
స్త్యక్త్వా సర్వానశేషతః|
మనసైవేన్ద్రియగ్రామం
వినియమ్య సమన్తతః|| 6-24
అ.
శనైః శనైరుపరమే
ద్బుద్ధ్యా ధృతిగృహీతయా|
ఆత్మసంస్థం మనః కృత్వా
న కిఞ్చిదపి చిన్తయేత్|| 6-25
 అ.
యతో యతో నిశ్చరతి
మనశ్చఞ్చలమస్థిరమ్|
తతస్తతో నియమ్యైత
దాత్మన్యేవ వశం నయేత్|| 6-26
కందము.
ధృతి నిబిడమైన బుద్ధిని
నితరమ్మగు విషయచింత వేగ , కుపరతిన్
గతియింపఁ జేసి , తన యా
కృతిలో మన మెప్పుడున్ లయింపగ వలయున్. ౨౦
కందము.
చంచలమగు నీ మన మదొ
కించుక సుస్థిరత లేక యేగతి లం
ఘించునొ , దాన మరల్పుచు
నించుము , నీ రూపమందె నిశ్చలమనమున్. ౨౧
సంకల్పమువలన గలిగెడు కోరికలన్నిటిని సంపూర్తిగా విడిచిపెట్టి, మనస్సుచే ఇంద్రియములను నలుప్రక్కలనుండి బాగుగ నిగ్రహించి ధైర్యముతోగూడిన బుద్ధిచే మెల్ల మెల్లగా బాహ్యప్రపంచమునుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతినొందవలెను. ( ఉపరతిని బడయవలెను ). మఱియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనినిగూడ చింతింపకయుండవలయును. చపల స్వభావము గలదియు, నిలుకడలేనిదియు నగు మనస్సు ఎచటెచట ( ఏయేవిషయములయందు ) సంచరించునో అచటచటనుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలెను. ఆత్మ కధీనముగ నొనర్పవలెను.
అ.
ప్రశాన్తమనసం హ్యేనం
యోగినం సుఖముత్తమమ్|
ఉపైతి శాన్తరజసం
బ్రహ్మభూతమకల్మషమ్|| 6-27
అ.
యుఞ్జన్నేవం సదాత్మానం
యోగీ విగతకల్మషః|
సుఖేన బ్రహ్మసంస్పర్శ
మత్యన్తం సుఖమశ్నుతే|| 6-28
కందము.
నిరుపమ్మగు సుఖమందుచు ,
నిరతి శ యానంద మంది , నిస్తులమన ; మీ
నిరవధి క మ్మగు బ్రహ్మము
నఱయు స్వరూపమ్మునన్ నిరాయాసమునన్. ౨౨
ప్రశాంతచిత్తుండును, ( కామక్రోధాది ) రజోగుణవికారములు లేనివాడును, బ్రహ్మరూపమును బొందినవాడును, దోషరహితుడునగు ఈ ధ్యానయోగిని సర్వోత్తమమగు సుఖము ( ఆత్మానందము ) పొందుచున్నది కదా ! ( అట్లు పొందుట శాస్త్రప్రసిద్ధమని భావము ). ఈ ప్రకారముగ మనస్సు నెల్లప్పుడును ఆత్మయందే నిలుపుచు దోషరహితుడగు యోగి బ్రహ్మానుభవరూపమైన పరమసుఖమును సులభముగ పొందుచున్నాడు.
అ.
సర్వభూతస్థమాత్మానం
సర్వభూతాని చాత్మని|
ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శనః|| 6-29
ఉత్పలమాల.
తన్నె సమస్త భూత సముదాయములందును గాంచుచుండు , దా
నున్న స్వరూప మందె కనుచుండుఁ జరాచర భూతసంతతిన్ ,
ఖిన్నుఁడు గాక నెల్లెడ నొకే గతిగాఁ జరియించి . చూచు ; నీ
సన్నియమేంద్రియుండయిన సంయమి దివ్యప్రభావ మిట్టిదౌ. ౨౩
యోగముతో గూడుకొనిన మనస్సుగలవాడు ( ఆత్మైక్యము నొందినయోగి ) సమస్త చరాచర ప్రాణికోట్లయందును సమదృష్టిగలవాడై తన్ను సర్నభూములందున్న వానిగను, సర్వభూతములు తనయందున్నవిగను చూచుచున్నాడు.
అ.
యో మాం పశ్యతి సర్వత్ర
సర్వం చ మయి పశ్యతి|
తస్యాహం న ప్రణశ్యామి
స చ మే న ప్రణశ్యతి|| 6-30
ఉత్పలమాల.
ఎవ్వఁడు సర్వభూత తతి నెల్లెడలన్ ననె చూచుచుండునో ,
యెవ్వఁడు చూచు నా యొడలి నెల్లఁ జరాచర భూతకోటులన్ ,
దవ్వునుఁ గాడు , నా కతఁడు దగ్గర నుండును ; నేను వానికిన్
దవ్వును గాక , దగ్గరనె దర్పణమై , కనుపించు నెప్పుడున్. ౨౪
ఎవడు సమస్తభూతములందును నన్ను చూచుచున్నాడో , మఱియు నాయందు సమస్తభూతములను గాంచుచున్నాడో అట్టివానికి నేను కనబడకపోను, నా కతడు కనబడకపోడు.
అ.
సర్వభూతస్థితం యో మాం
భజత్యేకత్వమాస్థితః|
సర్వథా వర్తమానోऽపి
స యోగీ మయి వర్తతే|| 6-31
కందము.
ఏకైక భావమందుచు ,
నీ కరణి ననున్ భజింపు , మేతృటి యందే
యే కర్మఁ జేయుచున్నను ,
నాకయి నాయందె వర్తనంబగు చుండున్. ౨౫
ఎవడు సమస్తభూతములయందున్న నన్ను అభేదబుద్ధి ( సర్వత్ర ఒకే పరమాత్మయను భావము ) గలిగి సేవించుచున్నాడో , అట్టి యోగి ఏ విధముగ ప్రవర్తించుచున్నవాడైనను , ( సమాధినిష్ఠయందున్నను, లేక వ్యవహారము సల్పుచున్నను ) నా యందే ( ఆత్మయందే ) ఉండువాడగుచున్నాడు.
అ.
ఆత్మౌపమ్యేన సర్వత్ర
సమం పశ్యతి యోऽర్జున|
సుఖం వా యది వా దుఃఖం
స యోగీ పరమో మతః|| 6-32
కందము.
పర సుఖమె తన సుఖమ్మని ,
పర దుఃఖమె స్వీయ దుఃఖ భాజనమనుచున్ ,
నిరతముఁ దలంచు వాఁడే ,
నిరతిశయానంద మొంది , నెగడును , పార్థా ! ౨౬
ఓ అర్జునా ! సమస్త ప్రాణులందును సుఖమునుగాని, దుఃఖమునుగాని తనతోడ పోల్చుకొనుచు ( తన ఆత్మవంటిదే తక్కినవారి ఆత్మయనెడు భావముతో ) , తనవలె సమానముగ ఎవడు చూచునో , అట్టి యోగి శ్రేష్ఠుడని తలచుచున్నాను.
అర్జున ఉవాచ
|అ.
యోऽయం యోగస్త్వయా ప్రోక్తః
సామ్యేన మధుసూదన|
ఏతస్యాహం న పశ్యామి
చఞ్చలత్వాత్స్థితిం స్థిరామ్|| 6-33
అర్జును వాక్యము.
కందము.
స్థిర చిత్తము లే కెటులను
నఱయఁగ రాకున్న , దీ మహా యోగము ; దు
ష్కరమౌచుఁ గానుపించును ,
తెరు వెద్దియుఁ గాన రాక , దీనిఁ దెలియగన్. ౨౭
ఓ కృష్ణా ! మనోనిశ్చలత్వముచే సిద్ధింపదగిన ఏ యోగమును వీవుపదేశించితివో దానియొక్క .స్థిరమైన నిలుకడను మనస్సుయొక్క చపలత్వమువలన నేను తెలిసికొనజాలకున్నాను.
అ.
చఞ్చలం హి మనః కృష్ణ
ప్రమాథి బలవద్ దృఢమ్|
తస్యాహం నిగ్రహం మన్యే
వాయోరివ సుదుష్కరమ్|| 6-34
ఉత్పలమాల.
చంచలమై , మనంబు వివశంబొనరించు , శరీరమెల్లఁ గా
శించి , యడంచు , నింద్రియ వశీకృతుఁ జేసి , బలోద్ధితంబు ; ఛే
దించ నసాధ్యమౌ , నెటుల దీని గుదించుట , గాలి కేల బం
ధించ దరమ్మె ? దుస్తర విధిం దలపోసిన చందమయ్యెడున్. ౨౮
కృష్ణా ! మనస్సు చంచలమైనదియు, విక్షోభమును గలుగజేయునదియు, బలవంతమైనదియు, దృఢమైనదియును గదా ! కావున అద్దానిని నిగ్రహించుట, గాలిని అణచిపెట్టుటవలె మిగుల కష్టసాధ్యమైనదని నేను తలంచుచున్నాను.
శ్రీభగవానువాచ|
అ.
అసంశయం మహాబాహో
మనో దుర్నిగ్రహం చలమ్|
అభ్యాసేన తు కౌన్తేయ
వైరాగ్యేణ చ గృహ్యతే|| 6-35
శ్రీ భగవానుల వాక్యము.
ఉత్పలమాల.
సందియమేల , నిశ్చయము , చంచలమే యగు నిగ్రహింపగా ,
దుందుడుకౌ మనంబును నెదుర్కొనఁ , గష్ట తరమ్మె ; కాని , దా
నిం దన చాతురిన్ మెఱయ , నిత్యగత క్రమశిక్షనైన , రో
తంది , సదా విరాగమునఁ , దాలిమితో , గ్రహియింప సాధ్యమౌ. ౨౯
శ్రీ భగవానుడు పలికెను. గొప్పబాహువులుగల ఓ యర్జునా ! మనస్సును నిగ్రహించుట కష్టమే. మఱియు అది చంచలమైనదే. ఇట ఏలాంటి సంశయమున్ను లేగు. అయినను అభ్యాసము చేతను, వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు.
అ.
అసంయతాత్మనా యోగో
దుష్ప్రాప ఇతి మే మతిః|
వశ్యాత్మనా తు యతతా
శక్యోऽవాప్తుముపాయతః|| 6-36
కందము.
ఈ విధములఁ గా కితర మి
కే విధములనైన నిఘ్రహింపఁగ రా , దీ
పావనమౌ యోగముఁ గనఁ ,
దావల మీ రెండు విధుల తాలిమి తోడన్. ౩౦
నిగ్రహింపబడని మనస్సుగలవానిచేత యోగము ( బ్రహ్మైక్యము )పొంద శక్యముకానిది అని నా అభిప్రాయము. స్వాధీనమైన మనస్సు గల్గి ప్రయత్నించువానిచేతనో , ఉపాయముచేతనో అది పొంద శక్యమైయున్నది.
అర్జున ఉవాచ|
అ.
అయతిః శ్రద్ధయోపేతో
యోగాచ్చలితమానసః|
అప్రాప్య యోగసంసిద్ధిం
కాం గతిం కృష్ణ గచ్ఛతి|| 6-37
అర్జును వాక్యము.
కందము.
కత్తి మొన నడచు నీ గతి
నుత్తలమందియును , నడువ నోపనిచో , వాఁ
డె త్తరికిఁ బోవు గృష్ణా !
ఇ త్తనువునుఁ బాసి , యోగ మేమియు లేకన్. ౩౧
అర్జునుడు పలికెను. కృష్ణా ! శ్రద్ధతో గూడియున్నవాడును, కాని నిగ్రహశక్తి లేనివాడగుటచే యోగమునుండి జాఱిన మనస్సుగలవాడునగు సాధకుడు యోగసిద్ధిని ( ఆత్మసాక్షాత్కారమును ) బొందజాలక మఱియేగతిని బొందుచున్నాడు ?
అ.
కచ్చిన్నోభయవిభ్రష్ట
శ్ఛిన్నాభ్రమివ నశ్యతి|
అప్రతిష్ఠో మహాబాహో
విమూఢో బ్రహ్మణః పథి|| 6-38
అ.
ఏతన్మే సంశయం కృష్ణ
ఛేత్తుమర్హస్యశేషతః|
త్వదన్యః సంశయస్యాస్య
ఛేత్తా న హ్యుపపద్యతే|| 6-39
ఉత్పలమాల.
అందగఁ జూచు బ్రహ్మపథమందఁగ నేరక , గర్మయోగపున్
జందముఁ గాక , నెందుల పసం దెనయంగను లేక , మేఘముల్
చిందర వందరౌ గతి నశింపడె , రెంట నిరాశ్రయుండు ; నా
సందియ మిందుఁ బాపు నరసారథి ! నీవె గురుండ వియ్యెడన్. ౩౨
గొప్పబాహువులుకల ఓ శ్రీకృష్ణా ! బ్రహ్మమార్గమున ( యోగమున ) స్థిరత్వములేనివాడగు మూఢుడు ఇహపరముల రెండంటికిని చెడినవాడై చెదిరిన మేఘమువలె నశించిపోడా యేమి ? కృష్ణా ! ఈ నా సందేహమును పూర్తిగా తొలగించుటకు నీవే తగుదువు ( సమర్థుడవు ) . నీవుతప్ప ఇతరులెవ్వరును దీనిని తొలగింపజాలరు .
అ.
శ్రీభగవానువాచ|
పార్థ నైవేహ నాముత్ర
వినాశస్తస్య విద్యతే|
న హి కల్యాణకృత్కశ్చిద్
దుర్గతిం తాత గచ్ఛతి|| 6-40
శ్రీ భగవానుల వాక్యము.
ఆటవెలది.
అట్టి భ్రంశ మొందు నట్టి వారికి , సేగి ,
నిహపరముల రెంట నెనయఁ బోరు ;
పుణ్యకృతముఁ జేయు బుధులిందు నందునుఁ ,
బరితపింపఁ బోరు పార్థ నిజము. ౩౩
శ్రీ భగవానుడు పలికెను.
ఓ అర్జునా ! అట్టి యోగభ్రష్టున కీ లోకమందుగాని, పరలోకమందుగాని వినాశము కలుగనే కలుగదు. నాయనా ! మంచి కార్యములు చేయువాడెవడును దుర్గతిని పొందడు గదా !
అ.
ప్రాప్య పుణ్యకృతాం లోకా
నుషిత్వా శాశ్వతీః సమాః|
శుచీనాం శ్రీమతాం గేహే
యోగభ్రష్టోऽభిజాయతే|| 6-41
ఆటవెలది.
బ్రహ్మ నిష్ఠయందు భ్రంశమ్ముఁ గనువారు ,
పుణ్య పురుషలోకములకుఁ బోదు ;
రచటఁ గొంతకాల మావాస మొనరించి ,
భువిని ధనికులిండ్లఁ బుట్టుచుంద్రు. ౩౪
యోగభ్రష్టుడు ( మరణానంతరము ) పుణ్యాత్ముల లోకములను పొంది , అట అనేక వత్సరములు నివసించి, తదుపరి పరిశుద్ధులైనట్టి ( సదాచారవంతులైన ) శ్రీమంతులయొక్క గృహమందు పుట్టుచున్నాడు.
అ.
అథవా యోగినామేవ
కులే భవతి ధీమతామ్|
ఏతద్ధి దుర్లభతరం
లోకే జన్మ యదీదృశమ్|| 6-42
అ.
తత్ర తం బుద్ధిసంయోగం
లభతే పౌర్వదేహికమ్|
యతతే చ తతో భూయః
సంసిద్ధౌ కురునన్దన|| 6-43
అ.
పూర్వాభ్యాసేన తేనైవ
హ్రియతే హ్యవశోऽపి సః|
జిజ్ఞాసురపి యోగస్య
శబ్దబ్రహ్మాతివర్తతే|| 6-44
అ.
ప్రయత్నాద్యతమానస్తు
యోగీ సంశుద్ధకిల్బిషః|
అనేకజన్మసంసిద్ధ
స్తతో యాతి పరాం గతిమ్|| 6-45
చంపకమాల.
మఱియుఁ గులీనులౌ , బుధుల , మాన్యుల యిండ్లను బుట్టుచుందు ; ర
బ్బురముగఁ బూర్వ జన్మ ఫలముల్ గొని , బుద్ధివిశేష సంపదన్ ,
దిరుగ పునః ప్రయత్నమును ధీయుతులై యొనరించి , వేదక
ర్మరయక జ్ఞాన నిష్ఠ ఫలమంది , తరింతురు జుమ్ము , ఫల్గునా ! ౩౫
లేక, ( ఉత్తమతరగతి యోగియైనచో ) జ్ఞానవంతులగు యోగులయొక్క వంశమందే జన్మించుచున్నాడు. ఈ ప్రకారమగు జన్మము లోకమున మహా దుర్లభమైనది. ఓ అర్జునా ! అట్లాతడు యోగులవంశమున జన్మించి పూర్వదేహసంబంధమైన ( యోగవిషయిక ) బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు. అట్టి ( యోగ ) సంస్కారమువలన నాతడు సంపూర్ణయోగసిద్ధి ( మోక్షము ) కొఱకై మరల తీవ్రతరప్రయత్నమును సల్పుచున్నాడు. అతడు ( యోగభ్రష్టుడు ) యోగాభ్యాసమునకు తానుగా ( మొదట ) నిశ్చయింపకున్నను పూర్వజన్మమందలి అభ్యాసబలముచే యోగమువైపునకే ఈడ్వబడుచున్నాడు. యోగము నెఱుఁగ దలంపుగలవాడైనంతమాత్రముచేతనే ( యోగాభ్యాసముచేయ నిచ్చగించనంతమాత్రముచేతనే ) వేదములందు జెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు. పట్టుదలతో ప్రయత్నించునట్టి యోగి పాపరహితుడై, ఆ పిదప సర్వోత్తమమగు (మోక్ష ) గతిని బడయుచున్నాడు.
అ.
తపస్విభ్యోऽధికో యోగీ
జ్ఞానిభ్యోऽపి మతోऽధికః|
కర్మిభ్యశ్చాధికో యోగీ
తస్మాద్యోగీ భవార్జున|| 6-46
ఆటవెలది.
తపసి కంటె , శాస్త్ర ధర్మవిదుని కంటె ,
వేదవిదుని కంటె , వేయిరెట్లు
జ్ఞాన నిష్ఠగరిమ నూను వాఁడధికుఁడౌ ;
యోగ నిష్ఠనుండు మోయి , పార్థ ! ౩౬
ఓ అర్జునా ! యోగియగువాడు ( కృచ్ఛ్రచాంద్రాయణాది ) తపస్సులుచేయువారికంటెను, ( అగ్నిహోత్రాది ) కర్మలుచేయువారికంటెనుగూడ శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. కాబట్టి నీవు యోగివి కమ్ము.
అ.
యోగినామపి సర్వేషాం
మద్గతేనాన్తరాత్మనా|
శ్రద్ధావాన్భజతే యో మాం
స మే యుక్తతమో మతః|| 6-47
ఉత్పలమాల.
నన్నె సమస్తమంచు మననం మొనరించి , భజించి , సర్వదా
యన్నిట నన్నెఁ జూచు , నిసుమంతయు భేదమెఱుంగరాక , యెం
దున్న నికే క్రియన్ సలుపుచున్న సతంబును , జ్ఞాననిష్ఠుఁడే ,
యెన్నఁగ నందఱందధికుఁ డీతఁడె యంచుఁ దలంతు , నర్జునా ! ౩౭
యోగులందఱిలోను ఎవడు నాయందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా యభిప్రాయము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయః|| 6 ||
ఓం తత్ సత్
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి
శ్రీ ఆత్మసంయమయోగము ( ధ్యాన యోగము ) అను
షష్ఠమ తరంగము సంపూర్ణం. శ్రీ కృష్ణపరబ్రహ్మార్పణమస్తు.
ఓం ఇది ఉపనిష్త్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు ఆత్మసంయమయోగమను ఆఱవ అధ్యాయము. సంపూర్ణము. ఓమ్ తత్ సత్.

Wednesday, October 7, 2009

కర్మసన్న్యాస యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)
అర్జున ఉవాచ|
అనుష్టుప్.
సంన్యాసం కర్మణాం కృష్ణ !
పునర్యోగం చ శంససి ! |
యచ్ఛ్రేయ ఏతయోరేకం
తన్మే బ్రూహి సునిశ్చితమ్|| 5-1
అర్జును వాక్యము.
తేటగీతి.
కర్మ సన్న్యాసమే యధికమ్మటంచు ,
నొక్కపరి కర్మయోగమే యెక్కుడనుచుఁ ,
జిక్కు వాక్యములను జెప్పఁ జిత్త మెరియు ;
నిశ్చితి శ్రేయమేది మన్నించి చెపుమ. ౧
అర్జునుడు పలికెను
ఓ కృష్ణమూర్తీ ! నీవొకప్పుడు కర్మలయొక్క త్యాగమును ( కర్మ త్యాగ పూర్వకమగు జ్ఞానమును ) , మఱియొకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నావు . కావున ఈ రెండిటిలో నేది శ్రేష్ఠమైనదో బాగుగ నిశ్చయించి ఆ ఒక్కదానిని నాకు చెప్పుము .
శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
సంన్యాసః కర్మయోగశ్చ
నిఃశ్రేయసకరావుభౌ|
తయోస్తు కర్మసంన్యాసా
త్కర్మయోగో విశిష్యతే|| 5-2
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
కర్మ సంన్యాస , కర్మయోగ , ద్వయమ్ము
జ్ఞాన సాధనములె యంచుఁ గనుము పార్థ !
జ్ఞాన రహిత సంన్యాసంబు కంటె , కర్మ
యోగమే శ్రేష్ఠమౌ మార్గమో , కిరీటి ! ౨
కర్మత్యాగము ( కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానయోగము ) , కర్మయోగము అను రెండును మోక్షమును గలుగజేయును . అయితే , ఆ రెండిటిలోను ( ప్రారంభమున ) కర్మత్యాగమున కంటె కర్మయోగమే శ్రేష్ఠమైనది .
అ.
జ్ఞేయః స నిత్యసంన్యాసీ
యో న ద్వేష్టి న కాఙ్క్షతి|
నిర్ద్వన్ద్వో హి మహాబాహో !
సుఖం బన్ధాత్ప్రముచ్యతే|| 5-3
తేటగీతి.
ఎవఁడు సుఖదుఃఖముల రెంటి కవశుఁ డగునొ ,
ద్వంద్వముల యందు సమభావ మంద గనునొ ,
కర్మఁ జేసియు వాఁడె నిష్కర్మి యగుచుఁ
గర్మ సంన్న్యాసి తుల్యుఁడౌ కర్మయోగి. ౩
గొప్ప బాహువులు కల ఓ అర్జునా ! ఎవడు ( ఏ కర్మయోగి ) దేనినిగూడ ద్వేషింపడో , దేనినిగూడ కోరడో అట్టివాడు ఎల్లప్పుడును సన్న్యాసి ( త్యాగి ) యేయని తెలియదగినది. ఏలయనగా ( రాగద్వేషాది ) ద్వంద్వములు లేనివాడు సులభముగ సంసారబంధమునుండి విముక్తుడు కాగలడు.
అ.
సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః
ప్రవదన్తి న పణ్డితాః|
ఏకమప్యాస్థితః సమ్య
గుభయోర్విన్దతే ఫలమ్|| 5-4
ఆటవెలది.
జ్ఞాన కర్మలం దసంబద్ధ భావమ్ము
పండితుం డెవండు పలుకఁ బోడు ;
జ్ఞానకర్మ యుగపు స్థానమ్ము లేకమ్ము,
సాధనాంతరములె , సవ్యసాచి ! ౪
( కర్మసన్న్యాసపూర్వకమగు ) జ్ఞానయోగము , కర్మయోగము వేఱు వేఱని ( వేఱు వేఱు ఫలములు కలవని ) అవివేకులు పలుకుదురే కాని వివేకవంతులు కాదు. ఆ రెండిటిలో ఏ ఒక్కదానినైనను బాగుగ అనుష్ఠించినచో రెండిటి యొక్క ఫలమును ( మోక్షమును ) మనుజుడు పొందుచున్నాడు.
అ.
యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం
తద్యోగైరపి గమ్యతే|
ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ
యః పశ్యతి స పశ్యతి|| 5-5
తేటగీతి.
సాంఖ్య యోగులు చెందెడి సత్ఫలంబు ,
కర్మయోగులు సాధింపగలరు సుమ్ము !
జ్ఞాన కర్మల యుగళమేకమ్మటంచుఁ
దెలిసికొనువాఁడె , బాగుగాఁ దెలియువాఁడు. ౫
జ్ఞానయోగులచే ఏ స్థానము ( మోక్షము ) పొందబడుచున్నదో, అది కర్మయోగులచేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును, కర్మయోగమును ఒక్కటిగ ( ఒకే ఫలము గలుగజేయునదిగ ) చూచువాడే నిజముగ చూచువాడగును.( తెలిసిన వాడగును ).
అ.
సంన్యాసస్తు మహాబాహో !
దుఃఖమాప్తుమయోగతః|
యోగయుక్తో మునిర్బ్రహ్మ
నచిరేణాధిగచ్ఛతి|| 5-6
తేటగీతి.
కర్మ సంన్యాస సాధన కష్టమగును ,
యోగయుక్తుండుఁ గాకుండనే గమింపఁ ;
గాన , నిష్కామ కర్మ యోగమ్ము నెఱప ,
నచిర కాలమ్మునన్ బ్రహ్మమంద నవును. ౬
గొప్పబాహువులుకల ఓ అర్జునా ! ( కర్మ సన్న్యాస రూపమగు ) జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండ పొందుటకు కష్టతరమైనది . కర్మయోగముతో గూడిన ( దైవ ) మననశీలుడు శీఘ్రముగ ( లక్ష్యమగు ) బ్రహ్మమును పొందుచున్నాడు.
అ.
యోగయుక్తో విశుద్ధాత్మా
విజితాత్మా జితేన్ద్రియః|
సర్వభూతాత్మభూతాత్మా
కుర్వన్నపి న లిప్యతే|| 5-7
కందము.
తనయందు సర్వభూతము
లనుఁ గనుచును , భూతచయములన్ దన యాత్మన్
గనియెడి , విజితాత్మను బం
ధన మంటదు , కర్మఁ జేసినను , గౌంతేయా !
( నిష్కామ ) కర్మయోగము నాచరించువాడును, పరిశుద్ధమైన హృదయము గలవాడును, లెస్సగ జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించినవాడును, సమస్త ప్రాణులయందుండు ఆత్మయు, తన ఆత్మయు నొకటేయని తెలిసికొనినవాడు నగు మనుజుడు కర్మలను జేసినను వానిచే నంటబడడు.
అ.
నైవ కిఞ్చిత్కరోమీతి
యుక్తో మన్యేత తత్త్వవిత్|
పశ్యఞ్శృణ్వన్స్పృశఞ్జిఘ్ర
న్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్|| 5-8
అ.
ప్రలపన్విసృజన్గృహ్ణ
న్నున్మిషన్నిమిషన్నపి|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు
వర్తన్త ఇతి ధారయన్|| 5-9
ఉత్పలమాల.
చూచియుఁ , దాకి వాసనల సోకి, భుజించి, గమించి, నిద్రమేన్
జాచియు, యూపిరిన్ విడిచి, శ్వాసమొనర్చియు, మాటలాడి, చే
సాచి, గ్రహించియున్, విడిచి, చక్షుల విచ్చియు, మూసి, యింద్రియా
ళీ చలనమ్ము నొందు, విషయేచ్ఛల నంచుఁ దలంచు, భిన్నుఁడై. ౮
పరమార్థతత్త్వము నెఱిఁగిన యోగయుక్తుడు ( ఆత్మయందు నెలకొనిన చిత్తముగలవాడు ) చూచుచున్నను, తాకుచున్నను, వాసన జూచుచున్నను, తినుచున్నను, నడచుచున్నను, నిదురించుచున్నను, ఊపిరివిడుచుచున్నను, మాట్లాడుచున్నను, విడుచుచున్నను, గ్రహించుచున్నను, కండ్లను తెఱచుచున్నను, మూయుచున్నను, ఇంద్రియములు ( వాని వాని ) విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించినవాడై నే నొకింతయైన ఏమియు చేయుటలేదు - అనియే తలంచును ( ఆ యా కార్యములందు కర్తృత్వబుద్ధి లేకుండును ).
అ.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి
సఙ్గం త్యక్త్వా కరోతి యః|
లిప్యతే న స పాపేన
పద్మపత్రమివామ్భసా|| 5-10
కందము.
జలజాతాసను కర్పిత
ములొనర్చి, ముముక్ష కామమును లేని నరున్
జల మంట కుండ, నీరజ
దళ మట్టులె, పాపతతులు దవులవు పార్థా ! ౯
ఎవడు తాను జేయు కర్మలను పరమాత్మ కర్పించి సంగమును ( ఆసక్తిని ) విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు, పాపముచే నంటబడకుండును.
అ.
కాయేన మనసా బుద్ధ్యా
కేవలైరిన్ద్రియైరపి|
యోగినః కర్మ కుర్వన్తి
సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే|| 5-11
కందము.
త్రికరణముల నింద్రియములు
నకలంకత విహిత కర్మలందుఁ జరింపన్ ,
సుకరమయి చిత్తశుద్ధిని
వికసిల్లెడు , కర్మయోగ విదుఁ డిటు పార్థా !
( నిష్కామ కర్మ ) యోగులు చిత్తశుద్ధికొఱకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, అభిమానములేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలను జేయుచున్నారు.
అ.
యుక్తః కర్మఫలం త్యక్త్వా
శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్|
అయుక్తః కామకారేణ
ఫలే సక్తో నిబధ్యతే|| 5-12
చంపకమాల.
ఫలముల కాసఁ జెందకయె, బ్రహ్మ సమర్పణ మాచరించి, క
ర్మల నొనరించు జ్ఞానికి, నిరంతర శాంతి ఘటిల్లుఁ; గామ్య క
ర్మలఁ జరియించు మూఢుఁడు, నిరంతర దుర్భరమౌ మనో వ్యథల్
జెలగి, యశాంతినిన్ దొరలుఁ జిత్త పరిభ్రమణానిపాతమై. ౧౧
యోగయుక్తుడు ( నిష్కామ కర్మయోగి ) కర్మలయొక్క ఫలమును విడిచిపెట్టి ( చిత్తశుద్ధి వలన ) ఆత్మనిష్ఠాసంబంధమైన శాశ్వతమగు శాంతిని బొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ( ఫలాపేక్షతో కర్మలను జేయువాడు ) ఆశచే ప్రేరితుడై కర్మఫలమందాసక్తిగల్గి బద్ధుడగుచున్నాడు
అ.
సర్వకర్మాణి మనసా
సంన్యస్యాస్తే సుఖం వశీ|
నవద్వారే పురే దేహీ
నైవ కుర్వన్న కారయన్|| 5-13
తేటగీతి.
సర్వకర్మల వీడి, నిస్సంగుఁడగుచు,
మనసు పరిపక్వమంది, కర్మను నకర్మ
మఱి యకర్మలో గర్మను నఱయు దేహి,
దేహమునఁ జిన్మయుండయి తేజరిల్లు. ౧౨
ఇంద్రియనిగ్రహముగల దేహధారి మనస్సుచే సమస్త కర్మలను ( కర్మ ఫలములను ) పరిత్యజించి, ఏమియు చేయనివాడై, చేయింపనివాడై, తొమ్మిది ద్వారములుగల పట్టణమగు శరీరమందు హాయిగా నుండుచున్నాడు.
అ.
న కర్తృత్వం న కర్మాణి
లోకస్య సృజతి ప్రభుః|
న కర్మఫలసంయోగం
స్వభావస్తు ప్రవర్తతే|| 5-14
తేటగీతి.
నిఖిల జగముల నిండిన యఖిల సత్తు
తానెయంచని తెలిసిన జ్ఞాని, యాత్మ
ధృతినిఁ గనఁబోడు కర్తృభోక్తృతలు ప్రాణి
తతుల యందు నజ్ఞాన చోదితము లగుట. ౧౩
భగవంతుడు ( ఆత్మ ) జీవులకు కర్తృత్వమునుగాని, కర్మములనుగాని, కర్మఫలములతోటి సంబంధముగాని కలుగజేయుటలేదు . మఱేమనిన, ప్రకృతియే ( ప్రకృతిసంబంధమువలన గలిగిన జన్మాంతర సంస్కారమే ) ఆయా కర్తృత్వాదులను గలుగ జేయుచున్నది .
అ.
నాదత్తే కస్యచిత్పాపం
న చైవ సుకృతం విభుః|
అజ్ఞానేనావృతం జ్ఞానం
తేన ముహ్యన్తి జన్తవః|| 5-15
అ.
జ్ఞానేన తు తదజ్ఞానం
యేషాం నాశితమాత్మనః|
తేషామాదిత్యవజ్జ్ఞానం
ప్రకాశయతి తత్పరమ్|| 5-16
ఉత్పలమాల.
వ్యక్తుల పాపపుణ్యములఁ బాలుఁ గొనం డిసుమంతయైన ; నీ
వ్యక్తిగత ప్రభేదముల వక్తృత కార్య కలాపమెల్ల న
వ్యక్త మవిద్య, జ్ఞానమును సాంతముగాఁ గబళింపగల్గు ధీ
రిక్తత యే కతంబని, యెఱుంగెడు ధీయుతుఁ డీ రహస్యమున్. ౧౪
పరమాత్మ యెవనియొక్కయు పాపమునుగాని, పుణ్యమునుగాని స్వీకరింపడు . అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడియున్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు. ఆత్మజ్ఞానముచే యెవరియొక్క అజ్ఞానము నశింపజేయబడినదో , అట్టివారి జ్ఞానము సూర్యునివలె ఆ పరబ్రహ్మస్వరూపమును ప్రకాశింపజేయుచున్నది (స్వస్వరూపానుభవమును గలుగ జేయుచున్నది ) .
అ.
తద్బుద్ధయస్తదాత్మాన
స్తన్నిష్ఠాస్తత్పరాయణాః|
గచ్ఛన్త్యపునరావృత్తిం
జ్ఞాననిర్ధూతకల్మషాః|| 5-17
కందము.
జ్ఞానాసిని నజ్ఞానపు
న్యూనావృతమెల్లఁ దొలగ నుక్కడగింపన్ ,
భానూజ్వల దీప్తి నిభం
బై నెగడును జ్ఞానమున్ దనంతటఁ దానై. ౧౫
ఆ పరమాత్మయందే బుద్ధిగలవారును, ఆపరమాత్మయందే మనస్సును నెలకొల్పినవారును, ఆ పరమాత్మయందే నిష్ఠగలవారును , ఆ పరమాత్మనే పరమగతిగ నెంచువారును జ్ఞానముచే నెగురగొట్టబడిన పాపముగలవారై పునరావృత్తిరహితమగు (పునర్జన్మవర్జితమగు ) శాశ్వత మోక్షపదవిని బొందుచున్నారు .
అ.
విద్యావినయసమ్పన్నే
బ్రాహ్మణే గవి హస్తిని|
శుని చైవ శ్వపాకే చ
పణ్డితాః సమదర్శినః|| 5-18
ఉత్పలమాల.
కోవిదుఁడైన బ్రాహ్మణుని, గోవును, హస్తిని, జాగిలంబులన్ ,
జీవ కళేబరంబుల భుజించెడి మాలల , హీన జాతి దు
ర్జీవుల నెల్లవారి సమదృష్టిఁ గనుం గొనఁ గల్గు సత్త్వ సం
భావ సమన్వితుండెవఁడొ , పండితుఁడందురు వాని ఫల్గునా ! ౧౬
విద్య, వినయము కలిగియున్న బ్రాహ్మణునియందును , గోవునందును , ఏనుగునందును , కుక్కయందును , కుక్కమాంసము వండుకొని తిను చండాలునియందును సమదృష్టిగలవారే ( వారిని సమముగ జూచువారే ) జ్ఞానులు ( ఆత్మానుభవముగలవారు ) అని చెప్పబడుదురు .
అ.
ఇహైవ తైర్జితః సర్గో
యేషాం సామ్యే స్థితం మనః|
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః|| 5-19
కందము.
సమ భావమె నిర్దోషము,
సమతయె బ్రహ్మమ్ము సుమ్ము, సమభావమునన్
గమియించెడు బ్రహ్మ విదుం
డమరుఁడు, జీవించి యీ యిహమ్ము నె పార్థా ! ౧౭
ఎవరియొక్క మనస్సు సమభావమందు ( నిశ్చల సమస్థితియందు, లేక సర్మప్రాణులందును ఆత్మను సమముగ జూచుటలో ) స్థిరముగనున్నదో, అట్టివారీజన్మమునందే జననమరణరూప సంసారమును జయించినవారగుదురు . ఏలయనిన, బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున ( సమత్వమందు స్థితిగల ) వారు బ్రహ్మమునందున్నవారే యగుదురు .
అ.
న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య
నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్|
స్థిరబుద్ధిరసమ్మూఢో
బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః|| 5-20
చంపకమాల.
సమతను నొందు ధీయుతుఁడు సంతసమొందడు, కుందకుండు, నీ
నిమిష ప్రియా ప్రియమ్ములకు నిస్తులమౌ సమభావ మంది, బ్ర
హ్మముఁ గని, కార్య శూన్యుఁడగు; మానిత కర్మ కృతార్థుఁడైన సం
యమి సుమవాఁడు, బ్రహ్మపథ మందుఁ జిర స్థిరమైన సద్గతిన్. ౧౮
స్థిరమగుబుద్ధిగలవాడును, మోహరహితుడును, బ్రహ్మమందు నిలుకడ కలవాడునగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినపుడు సంతోషమునుగాని, అనిష్టమైనదానిని పొందినపుడు దుఃఖమునుగాని పొందకుండును .
అ.
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా
విన్దత్యాత్మని యత్సుఖమ్|
స బ్రహ్మయోగయుక్తాత్మా
సుఖమక్షయమశ్నుతే|| 5-21
తేటగీతి.
స్పర్శ శబ్దాది విషయ వాంఛల విరక్తి
నంది, హృదయమ్ము తన యాత్మయందు నిలిచి,
బ్రహ్మ నిష్ఠాగరిష్ఠుఁడౌ వాని యాత్మ
శాశ్వతానంద మొంది, నిశ్చలతఁ గాంచు. ౧౯
బాహ్యమునగల శబ్దాది విషయములం దాసక్తి లేనివాడు ఆత్మయందెట్టి ( నిరతిశయ ) సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు . అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో గూడుకొనినవాడై ( బ్రహ్మానుసంధానపరుడై ) అక్షయమగు సుఖమును బడయుచున్నాడు .
అ.
యే హి సంస్పర్శజా భోగా
దుఃఖయోనయ ఏవ తే|
ఆద్యన్తవన్తః కౌన్తేయ !
న తేషు రమతే బుధః|| 5-22
కందము.
భోగ సుఖమ్ములు క్షణిక
మ్మౌగద, కౌంతేయ ! దుఃఖమగుఁ దుదికెల్లన్ ;
రాగిలఁడు బుధుఁడెవండును,
భోగములకు, వచ్చిపోవు బుద్బుదములకున్. ౨౦
అర్జునా ! ( ఇంద్రియ ) విషయసంయోగమువలన కలుగు భోగములు దుఃఖహేతువులును, అల్పకాలముండునవియు, నయియున్నవి. కావున విజ్ఞుడగువాడు వానియందు క్రీడింపడు ( ఆసక్తి గొనడు ).
అ.
శక్నోతీహైవ యః సోఢుం
ప్రాక్శరీరవిమోక్షణాత్|
కామక్రోధోద్భవం వేగం
స యుక్తః స సుఖీ నరః|| 5-23
కందము.
కామక్రోధో ద్వేగం
బే మనుజుఁడు నిగ్రహించి, యెసగు సుఖమునన్,
ఈ మనికినె ముక్తుండగు
ధీమంతుఁడతండె, పో, జితేంద్రియుఁ డగుటన్. ౨౧
ఎవ డీశరీరమును విడుచుటకు పూర్వమే యిచ్చోటనే ( ఈజన్మయందే ) కామక్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడో, అతడే యోగియు ( చిత్తోపరతి కలవాడును ) , సుఖవంతుడు నగును .
అ.
యోऽన్తఃసుఖోऽన్తరారామ
స్తథాన్తర్జ్యోతిరేవ యః|
స యోగీ బ్రహ్మనిర్వాణం
బ్రహ్మభూతోऽధిగచ్ఛతి|| 5-24
ఆటవెలది.
ఆత్మ యందె సుఖము, నాత్మయందే క్రీడ,
ఆత్మయందె దీప్తి, నఱయు వాఁడు,
సర్వసాక్షి బ్రహ్మ నిర్వాణ మిచ్చటే
కనుచు, ముక్తినందుఁ దనువు నందె. ౨౨
ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు, ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము గలవాడై యుండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మసాక్షాత్కారమును ( మోక్షమును ) బొందును
అ.
లభన్తే బ్రహ్మనిర్వాణ
మృషయః క్షీణకల్మషాః|
ఛిన్నద్వైధా యతాత్మానః
సర్వభూతహితే రతాః|| 5-25
కందము.
భూత హిత ప్రియుఁ డింద్రియ
చేతమ్ముల నిగ్రహించు ; స్థిత ధీరవరుం
డీతనువు నందె గను, జల
జాతాసను భావపథము ; సంశయమేలా ? ౨౩
పాప రహితులును, సంశయవర్జితులును, ఇంద్రియమనంబులను స్వాధీనపఱచుకొనినవారును, సమస్త ప్రాణులయొక్క క్షేమమందాసక్తిగలవారునగు ఋషులు ( అతీంద్రియ జ్ఞానులు ) బ్రహ్మసాక్షాత్కారమును (మోక్షమును ) బొందుచున్నారు .
అ.
కామక్రోధవియుక్తానాం
యతీనాం యతచేతసామ్|
అభితో బ్రహ్మనిర్వాణం
వర్తతే విదితాత్మనామ్|| 5-26
అ.
స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాం
శ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః|
ప్రాణాపానౌ సమౌ కృత్వా
నాసాభ్యన్తరచారిణౌ|| 5-27
 అ.
యతేన్ద్రియమనోబుద్ధి
ర్మునిర్మోక్షపరాయణః|
విగతేచ్ఛాభయక్రోధో
యః సదా ముక్త ఏవ సః|| 5-28
తేటగీతి.
బాహ్యవిషయముల్ మనమునఁ బట్టనీక,
తనదు చూపులు భ్రూమధ్యమున గుదించి,
శ్వాస నిశ్వాసములు రెండు సమముఁ జేసి,
యతి జితేంద్రియుఁ డిటు మోక్ష మధిగమించు. ౨౪తేటగీతి.
బుద్ధి కర్మేంద్రియంబుల పోకలుడిపి,
క్రోధ కామాది వేగముల్ గుదియఁ గట్టి,
ధ్యాననిష్ఠా గరిష్ఠుడౌ , మౌనివరుఁడు
కాలము గ్రసించు, ముక్తి సంగతినిఁ గాంచు. ౨౫
కామక్రోధాదులు లేనివారును, మనోనిగ్రహము గలవారును, ఆత్మతత్త్వము నెఱిగినవారునగు యత్నశీలురకు బ్రహ్మసాయుజ్యము ( మోక్షము, బ్రహ్మానందము ) అంతటను ( శరీరమున్నప్పుడును, లేనపుడును సర్వత్ర ) వెలయుచునే యున్నది . ఎవడు వెలుపలనున్న శబ్దస్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివైచి ( లోన ప్రవేశింపనీయక ), చూపును భ్రూమధ్యమందు నిలిపి, నాసికాపుటములందు సంచరించు ప్రాణాపానవాయువులను సమముగ జేసి, ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయ క్రోధములు లేనివాడై, మోక్షాసక్తుడై ( ఆత్మ ) మననశీలుడై యుండునో అట్టివా డెల్లప్పుడును ముక్తుడే యగును .
అ.
భోక్తారం యజ్ఞతపసాం
సర్వలోకమహేశ్వరమ్|
సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి|| 5-29
ఉత్పలమాల.
కర్తను భోక్తగా యజనకర్మ తపంబుల యందు, నే జగ
ద్భర్తను, సర్వభూత హిత దాత, యటంచు నెఱుంగు ధీర స
ద్వర్తనులైనవారు, నిరతంబును శాంతి పథంబునన్ నిరా
వర్తన సుస్థితిన్ గని ప్రభాసితులై వసియింతు రెప్పుడున్. ౨౬
యజ్ఞములయొక్కయు, తపస్సులయొక్కయు భోక్త ( ఫలములనుభవించువాడు ) గను , సమస్తలోకములయొక్క ఈశ్వరుడు ( ప్రభువు, శాసకుడు )గను, సమస్తప్రాణులయొక్క హితకారిగను, నన్నెఱిఁగి మనుజుడు శాంతిని బొందుచున్నాడు .
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సంన్యాసయోగో నామ పఞ్చమోऽధ్యాయః|| 5 ||
ఓం తత్ సత్.
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే అనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందు
శ్రీ కర్మసంన్యాస యోగమను పంచమ తరంగము
సంపూర్ణం.
శ్రీ కృష్ణపరబ్రహ్మార్పణమస్తు.
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును, బ్రహ్మవిద్యయు,
యోగశాస్త్రమును, శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు కర్మసన్న్యాసయోగమను ఐదవ అధ్యాయము. ఓమ్ తత్ సత్.