స్వ విషయం
కం.
భౌతిక దేహంబిడి , నా
జాతమునకుఁ గారణమ్ము జననీ జనకుల్ ,
సీతారాములఁ బోలెడి
పూతుల , వేంకాంబ , నన్నపూర్ణులఁ గొలుతున్. 1
సీ.
మా పితామహుఁడు బ్రహ్మపురీ నివాసుండు ,
సూర్యనారాయణుం డార్యవరుఁడు ;
అన్నపూర్ణేశ్వర , సార్థక నాముండు ,
తాపసోత్తముఁడు మా తండ్రిగారు ;
మాతా మహుండు , రాంభట్ల జగన్నాథ
శాస్త్రి వదాన్యుండు , సచ్చరితుఁడు ;
మాతులుల్ , లోక విఖ్యాతులు , న్యాయ శా
స్త్ర విశారదులు , కడు సత్త్వగుణులు ;
గీ.
పాలవెల్లియె , మా కుటుంబాల సరణి ;
ధన మధాందులుగారు , నిర్ధనులుగారు ;
కుడుచుటయు , బెట్టుటయు నేర్చుకొనినవారు ;
ద్రావిడాన్వయ జనిత ధరామరులము .2
శా.
భారద్వాజ సగోత్ర సంభవుఁడ , నాపస్తంబసూత్రుండ , జం
డీ రాజేశ్వరి పాదపద్మ మద భృంగేశుండ , శ్రీ విక్రమో
ర్వీ రాజన్య కటాక్ష వీక్షణ సిత శ్రీమంతుఁడన్ , భూసుర
క్షీరాంభోనిధి పూడిపెద్దికుల , కాశీవిశ్వనాథాఖ్యుడన్ .3
సీ.
అష్టావధాన , శతావధాన , విధాన
ఘనతర చతుర ప్రజ్ఞాధురీణుఁ ,
గామేశ్వరీ పాద కంజాత మకరంద
మధుర రసాస్వాద మధుకరీంద్రు ,
నుభయ భాషా కవితోల్లాసు గాంగని
ర్ఝర సదృగ్ధార వాచా గరిష్టు ,
భారతాంబా పాద పంకేరుహ ధ్యాన
దీక్షానురక్తు సద్దేశ భక్తు ,
గీ.
కావ్య తీర్థాది బిరుదాంకు , భవ్యచరితు ,
వరపురాణాబ్ధి సోము , సంపల్లలాము ,
పండితారాధ్యు , భూసుర ప్రవరు , సతము
సూర్యనారాయణుం , గురువర్యుఁ దలతు .4
సీ.
ఆడుచో నొకచోటఁ , బాడుచో నొకచోటఁ ,
గుడుచుచో నొకచోటఁ , గూడినాము ;
సత్యాగ్రహోద్యమ , సమయ దీక్షాబద్ధ
కంకణమ్మొక చోటఁ కట్టినాము ;
దేశనాయకుల , సందేశమ్ము వెదజల్ల ,
దేశదేశాలను తిరిగినాము ;
నిదురలోనైన , జాగ్రదవస్థలో నైన ,
దల పొక్కటే గాగ , మెలగినాము ;
గీ.
సమవయస్కులమై , చెల్మి సలిపి నార ,
మతఁడు , వడ్డాది వారాశి సిత కరుండు ,
సీత రామాంజనేయుండు , చిన్ననాటి
సఖుఁడు , కవనాకు , కవన ప్రసంగములను .5
సీ.
గాంధీ మహాత్ము శంఖరవంబునన్ బ్రీతి
జెంది , విద్యకు , స్వస్తి జెప్పినాము ;
' బ్రిటిషు బ్యురాక్రసీ ' కుటిల తంత్ర విధాన
మరికట్టునాడు చేయందినాము ;
సత్యాగ్రహోద్యమ సవన దీప్తులలోని
ఆజ్య భాగమునఁ బాలందినాము ;
మద్యపాన నిషేధ మంత్రావళిం బాడి ,
లాటీల ధాటీల నందినాము ;
తే.
అల్లినాము " స్వరాజ్య గీతామతమ్ము "
తెల్లవారి దొరతనమ్ము డుల్లువార ;
కందశతకమ్ము " ఆత్మశిక్ష "ను రచించి ,
భువి దివమ్ములు ముడివేసి , మురిసినాము .6
కం.
మా కబ్బంబుల రెండును
మోకట్టిరి దొరతనమ్ము మూడవనాడే
మా క జ్ఞాతా వాసము
చేకురె నీ నాడు , తెనుఁగు సీమల యందున్ . 7
చ.
అతనికి , నాకుఁ బ్రాయమున నంతగ భేదము లేదు ; కాని , వా
డతులిత పాండితీ గరిమ యందన ముందడుగై , స్వకీయ కా
వ్య తతి నమేయ వాగమృత వార్నిధియయ్యు ; మదీయ శైలికిన్
గుతుకముఁ జూపి , నా కవిత గొప్పగఁ బల్కు , సుహృద్గరిష్ఠతన్. 8
చ.
ఉదరము కోసమై యెదియొ యూడిగముంగొన కొండలెక్కినా ;
నిది , కడురమ్యమౌ జయపురీశుని దేశము , నాదు వాసమై
న దిపుడు ; లోటు లే కెటులొ , దినాలు గమించెడు ; సంతు గాంచితిన్ ;
గొదమల మువ్వురన్ సుతుల , గూతుల , నల్వుర సాధుశీలురన్ . 9
కం.
తమ్ముఁడొకఁడు రామాహ్వయు ,
డమ్మారుతి రీతి నాజ్ఞ నౌదల దాల్చున్ ;
సమ్ముదిత లక్క సెల్లెం
డ్రిమ్ముల ఘటియింత్రు , మెట్టి నింటికి నెపుడున్ . 10
ఉ.
నా సహధర్మ చారిణియనన్ , నవపల్లవ కోమలాంగి , సో
ల్లాస జగీషహాస రుచిరప్లుత పద్మ ముఖీలలామ , నా
గీసిన గీటు దాటని ప్రకీర్తిని గాంచిన గేస్తురా ; ల్మనో
ల్లాసిని , ప్రేమరాశినిఁ , దలంతు సతంబు , మదీయ లక్ష్మినిన్ .11
కం.
పలుదోము పుడక మొదలు స
కలముం గరువైన కరువు కాలమ్మున , నీ
బలువైన బండి నీడ్వగ ,
బల మొదవెడు విక్రమేశు , బాహుచ్ఛాయన్ . 12
సీ.
చిన్నారి , పొన్నారి చిఱుత కుఱ్ఱలె గాని ,
కడు ధీవిశాలురు గాఁ గలారు ;
విద్యా విలోలురై , సద్యశంబునుఁ గాంచి
కడు నమ్ర శీలురుగాఁ గలారు ;
పిన్న , పెద్దల యందు బ్రేమ మన్ననఁ జూపి ,
కడు బుద్ధిమంతులుగాఁ గలారు ;
ధనలోప మొకడడ్డు దగిలి యున్నది , గాని
భవితవ్యమున బాగుపడ గలారు ;
గీ.
మువురు సుతులు , చిరంజీవులవుదు రిటుల ,
సుతుల భవితవ్యమునకు నే వెతయు లేదు ;
నలువు రవివాహితలు సుతల్ గలరు ; వారి
కయల నెమకంగ గుండియ లవియు నాకు . 13
చ.
ఇరువదియైదు వత్సరము లేగె , భవత్పరి పోషితుండనై
తిరిగితి దావకీనమగు దిజ్ఞ గ రాట్పరి రక్షకుండనై ,
నెఱపితి రాచకార్యములు నీదు హితంబునుఁ గోరె యెప్డు . భూ
వరు కరుణా కటాక్షమున వర్ధిలుచుంటిని , విక్రమేశ్వరా ! 14
శా.
గీతాగాన సుధాస్రవంతి మురళిం గీల్కొల్పి మ్రోయింపగాఁ
బూతం బయ్యెను భారతావని ; జగత్పూజ్యుల్ మహాధీరు లీ
గీతాసారము భిన్న భిన్న గతులన్ గీర్తించియుండన్ , ననుం
సీతారాముఁడు తెన్గు సేయుమనియెన్ శీఘ్రమ్ము పద్యాళిలోన్ . 15
ఉ.
" గీతను గీతపద్యముల గేయములందు రచించినట్టి వి
ఖ్యాత కవీంద్రు లెందఱొ జగన్నుతి గన్న మనీషులుండ , నా
వ్రాతలె మిన్నలౌనె సరివచ్చు నటన్న నభస్సుమమ్మె యౌ ,
నా తరమా " యనంగ విని , నాదగు మిత్రుఁడు వల్కె నిట్టులన్. 16
తే.
కృష్ణ కర్ణా మృతముగఁ గవీంద్రు లెంద
రెందరో గీతలను మున్ రచించి నార ,
లైన నేమాయె యెవ్వరి దైన సొమ్ము ,
లెమ్ము , వ్రాయుము , కృష్ణార్పణమ్ము గాఁగ , 17
చ.
అని కడు ప్రోత్సహించిన వయస్యుని పల్కుల నాదరించి , నా
మనము ప్రయత్మ మూను నసమర్థతచే వెనుకంజ వేయు , నీ
యనువున గొన్ని వత్సరములయ్యె ; హఠాత్తుగ నా శరీరమం
దెనసె న్యుమోనియా జ్వరము , మృత్యు భవంబుల మధ్య నూపుచున్ . 18
కం.
మంచాన మూడు మాసము
లుంచి , శరీరమున నెముకలుంచి , యడంచన్
మించు వలె మనము శాంతిన్
గాంచె , హృషీకేశు పాద కంజాతములన్ ! 19
కం.
గీతాను వాదమును నా
చేతను సాగింప నెంచి , శ్రీకృష్ణుఁడె నా
కీ తనువు బెంచె కొంచెము ,
వ్రాత కనుజ్ఞాతునై , వరమ్ము వడసితిన్ ! 20
ఉ.
పండిత హృద్యమై , సొబగు పట్టులు నాదు కవిత్వమందు లే
కుండిన నేమి , గీతను రసోచితరీతి నెఱుంగఁ బల్కినన్ ,
బండెను నాదు భాగ్యము , భవంబు కృతార్థతనందె ; గావునన్ ,
బండిత పామరాది ప్రజపై భరముంతు ననుగ్రహింపు డీ . 21
Subscribe to:
Post Comments (Atom)
ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
ReplyDeleteఅందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
hey,nice site,if u r interested view my blog als,it's.........fordevotees.blogspot.com........;n if u don't mind als a suggestion,y don't u choose somewat larger and different font,so that it makes viewers to read d post with much interest
ReplyDeleteThis post is worth everyone’s attention. Good work.Read vastu tips and suggestions from our vastu people
ReplyDelete