Monday, September 21, 2009

అర్జున విషాద యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

ధృతరాష్ట్ర ఉవాచ |
ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సఞ్జయ ||1-1

ధృతరాష్ట్రుని వాక్యము|
కం.
శ్రీకరమగు కురుభూమిని
నా కుఱ్ఱలఁ దొడరి పాండునందనులు రణో
త్సేకమున నే మొనర్చిరొ
వాకొనుమా సంజయా ! కృపామతి నాకున్. ౧
ధృతరాష్ట్రుడు పలికెను -
"ఓ సంజయా ! నా వారలగు దుర్యోధనాదులును, పాండుపుత్రులగు ధర్మరాజాదులును యుద్ధము చేయు గుతూహలముతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున జేరి ఏమి చేసిరి?"

సఞ్జయ ఉవాచ |
దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య
రాజా వచనమబ్రవీత్ ||1-2

సంజయుని వాక్యము|
కం.
పోరగ వ్యూహాకృతిఁ బెం
పారఁగ జతురంగ పాండవానీకంబున్
రారాజు కాంచి భయమును
దేరి గురునిఁ జేరి యిటులఁ దెల్పె వినీతిన్. ౨
సంజయుడు పలికెను -
"అపుడు రాజైన దుర్యోధనుడు, వ్యూహాకారముగా రచియింపబడియున్న పాండవసేనను జూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను

దుర్యోధన ఉవాచ|
పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా ||1-3

దుర్యోధనుని వాక్యము|
చ.
ద్రుపద సుతుండు ధీయుతుఁ డురుప్రతిభా రణ కోవిదుండు క
య్యపుమొన నున్నవాఁడదె మహారథుడౌ భవదీయ శిష్యుఁడే
నిపుణత మీర వ్యూహమును నిల్పె రణస్థలి తేఱి చూడు మ
య్య ! పురుషసింహమా ! గుణమహాంబుధి చంద్రమ సద్గురూత్తమా ! ౩
దుర్యోధనుడు పలికెను-
"ఓ గురువర్యా ! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత వ్యూహాకారముగ రచియింపబడి యున్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును జూడుడు !

అత్ర శూరా మహేష్వాసా
భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః ||1-4
ధృష్టకేతుశ్చేకితానః
కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ
శైబ్యశ్చ నరపుంగవః ||1-5

యుధామన్యుశ్చ విక్రాన్త
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః ||1-6

సీ.
ఆ సేనగలరు మహామహితాత్ములు
      భీమార్జునుల్ మహా భీమబలులు
సాత్యకి మత్స్యదేశాధినాథుఁడు ద్రుప
      దావనీశుండు రణకోవిదుండు
దృష్టకేతుండు విశిష్ట ధనుర్దరుఁ
      డా చేకితాన మహారథికుఁడు
శైబ్యుండుఁ గుంతిభోజ నృపుండుఁ గాశికా
      ధిపుఁడును బురుజిత్తు ధీయుతుండు
గీ.
నుత్తమౌజుండు సౌభద్రుఁ డుద్ధతుండు
నా యుధామన్యుఁడును ద్రౌపదేయు లేవు
రంధఱును మహారథులు వీ రతిహత ప్ర
ధీరు లా రణసీమ నున్నారు గనుము. ౪
ఆ పాండవ సేనయందు గొప్పవిలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూరవీరులును పెక్కురు కలరు. వారెవరనిన- యుయుధానుడు, విరటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమ వంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కున్తిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందఱును మహారథులే అయియున్నారు..

అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ||1-7

కం
ఇప్పట్టున మనసేనల
జెప్పఁదగిన వీరవరుల స్థిరమతి వినగన్
జెప్పెదను ఆలకింపుము
తప్పొప్పుల నారయంగ ధనురాచార్యా !౫
ఓ బ్రాహ్మణోత్తమా ! ఇక మన సైన్యములో ప్రముఖులు సేనానాయకులు ఎవరుకలరో వారలను జ్ఞాపకముకొఱకు మీకు చెప్పుచున్నాను(వినుడు).

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ
సౌమదత్తిస్తథైవ చ ||1-8

అన్యే చ బహవ శ్శూరా
మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః
సర్వే యుద్ధవిశారదాః ||1-9

ఉ.
నీవు పితామహుండు గడు నెయ్యము గూర్చు సఖుండుగర్ణుడున్
జేవగలట్టి యా కృపుఁ డ జేయుఁడు యుద్ధములన్ వికర్ణుఁడున్
దావక పుత్రుఁ డయ్యెదిరి దర్పమడంచు వరప్రసాది నా
నా విశిఖ ప్రవీణుఁడు రణ ప్రవిదు డల సౌమదత్తియున్. ౬
ఉ.
ఆయువు గల్గునంతవర కాహవ రంగము నందు నిల్చి నా
కై యసువుల్ త్యజింపఁ దృణమట్టులె జూతురు వీరలెల్ల నా
నాయుధశస్త్రమార్గణ రణప్రతిభా సువిశారదుల్ కడున్
ధీయుతు లీ పదాతులు మదీయులు దాయలకున్ దురాసదుల్ ౭
మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొఱకు తమతమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందఱును యుద్ధసమర్థులై వివిధశస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు.

అపర్యాప్తం తదస్మాకం
బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం
బలం భీమాభిరక్షితమ్ ||1-10

కం.
భీమాభి రక్షిత మ్మా
స్తోమం బల్పంబె సర్వతోముఖ మయ్యెన్
ఈ మొన భీష్మ సురక్షిత
మై మురిపెము వాసి పల్చనై రూపించున్, ౮
అట్టి శూరులుకల మనసైన్యము భీష్మునిచే గాపాడబడుచు అపరిమితముగ నున్నది (అజేయమై యొప్పుచున్నది). పాడవులయొక్క ఈ సేనయో భీమునిచే రక్షించబడుచు పరిమితముగ నున్నది(జయింప శక్యమై యున్నది).

అయనేషు చ సర్వేషు
యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షన్తు
భవన్తః సర్వ ఏవ హి ||1-11

ఆ.వె.
కురుపితామహుండు కురుసేనకుం బ్రాణ
మాద మరవ కుండ నతని నెప్పు
డఱయ వలయు మీఱంద ఱీ యనిలోన
గంటిరెప్ప వోలె గాచి కొనుచు. ౯
మీ రందఱున్నూ వ్యూహమార్గములందు మీ మీ నియమితస్థానము లందుండి భీష్మునే సర్వవిధముల కాపాడుచుండవలయును.

తస్య సఞ్జనయన్హర్షం
కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః
శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ ||1-12

కం
గాంగేయుఁడు హర్షంబున
సింగంబటు గర్జనంబు జేయుచు శంఖం
బుంగొని రవించె జలధులు
భంగములై దిశలు భూనభమ్ము లవియగన్. ౧౦
పరాక్రమశాలియు, కురువృద్ధుడునగు భీష్మపితామహు డంతట దుర్యోధనున కుత్సాహము గలుగునటుల పెద్దగ సింహధ్వనిజేసి శంఖమును పూరించెను.

తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ
పణవానకగోముఖాః |
సహసైవాభ్య హన్యన్త
స శబ్ద స్తుములోऽభవత్ ||1-13

కం
భేరీ పణ వానక శం
ఖారవములు గోముఖ ప్రకాండ రవంబుల్
తారాపథమంటి శ్రవః
పూరమ్ములు వ్రయ్యలై నభోంగణ మవిసెన్. ౧౧
భీష్ముడు శంఖారావము చేసినపిమ్మట కౌరవ సైన్యమందలి తక్కిన వారున్నూ శంఖములను, భేరులును, తప్పెటలు మున్నగువానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్లెను.

తతః శ్వేతైర్హయైర్యుక్తే
మహతి స్యన్దనే స్థితౌ |
మాధవః పాణ్డవశ్చైవ
దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ||1-14

తే.
తెల్ల గుఱ్ఱముల్ బూన్చిన తేరు నొగల
హరియు రథికుఁడు నరుఁడై రణాంగణమ్ము
నందు వెలసి పూరించ శంఖముల బాంచ
జన్య దేవదత్తంబుల జగము లదురె ? ౧౨
పిమ్మట తెల్లని గుఱ్ఱములఁ బూన్చిన గొప్పరథమునందు గూర్చుండి యున్న కృష్ణార్జును లిరువురును తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగ ఊదిరి.

పాఞ్చజన్యం హృషీకేశో
దేవదత్తం ధనఞ్జయః |
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం
భీమకర్మా వృకోదరః ||1-15
అనన్తవిజయం రాజా
కున్తీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ
సుఘోషమణిపుష్పకౌ ||1-16

కాశ్యశ్చ పరమేష్వాసః
శిఖణ్డీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ
సాత్యకిశ్చాపరాజితః ||1-17
ద్రుపదో ద్రౌపదేయాశ్చ
సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః
శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18

ఉ.
ఊదెను పౌండ్రశంఖము వృకోదరుఁ డంతట ధర్మజుండు న
త్యాదరతన్ అనంతవిజయమ్మను శంఖమునూదె నా కవల్
మోదముతో సుఘోష మణిపుష్పక శంఖము లూదసాగి రా
నాదము దిక్కులన్ దుముల నాదము నుప్పతిలంగ జేయుచున్. ౧౩
ఉ.
తక్కిన యామహారథు లుదగ్రత నొత్తిరి శంఖరాజముల్
దిక్కులు మారుమ్రోగ ద్రుపదేశుఁడు సాత్యకి ద్రౌపదేయు లే
పెక్కు సుభద్రపట్టి విరటేశుఁడు కాశిపురాధి నాథుఁడున్
రక్కెస పేడియౌ ద్రుపదరాజ సుతుండు శిఖండి మొండియున్. ౧౪
శ్రీకృష్ణుడు పాంచజన్యమను శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యముల నొనర్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను.
కుంతీ సుతుడగు ధర్మరాజు అనంతవిజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణి పుష్పకమును ఊదిరి. అట్లే గొప్పధనుస్సుగల కాశీరాజున్నూ, మహా రథుడగు శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరటుడును, అపజయము నొందని వాడగు సాత్యకియు, ద్రుపదుడును, ద్రౌపదీ తనయులగు ఉపపాండవులును గొప్ప భుజబలము గల అభిమన్యుడును, సేనయందంతట వేఱు వేఱుగా తమ తమ శంఖములను ఊదిరి.

స ఘోషో ధార్తరాష్ట్రాణాం
హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ
తుములోऽభ్యనునాదయన్ ||1-19

కం.
ఆ నినదంబులు కురురా
ట్సూనుల హృదయముల జించు శూలము లయ్యెన్
భూనభముల దిశ లెల్లడ
నా నాదము మారుమ్రోగె నంతఁ దుములమై. ౧౫
పాండవ వీరుల శంఖములయొక్క ఆ సంకులధ్వని భూమ్యాకాశములను దద్దరిల్ల జేయుచు దుర్యోధనాదుల గుండెలను బ్రద్ధలు చేసెను.

అథ వ్యవస్థితాన్దృష్ట్వా
ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే
ధనురుద్యమ్య పాణ్డవః ||1-20

హృషీకేశం తదా వాక్య
మిదమాహ మహీపతే |||

ఆ,వె.
విల్లు నెక్కువెట్టి వివ్వచ్చుఁ డంతట
నెదిరి సేనఁ జూచినిట్టులనియె
"మన రథమ్ము ద్రోలి మాధవా యుభయ సై
న్యముల మధ్య నిలుపుమా బిరాన"౧౬.|
ఓ ధృతరాష్ట్ర మహారాజా ! అటుపిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోవుచుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధసన్నద్ధులై యున్న కౌరవులను జూచి, ధనుస్సును చేబూని శ్రీకృష్ణునితో నిట్లు పలికెను.

అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే
రథం స్థాపయ మేऽచ్యుత ||1-21

యావదేతాన్నిరీక్షేऽహం
యోద్ధుకామానవస్థితాన్|
కైర్మయా సహ యోద్ధవ్య
మస్మిన్ రణసముద్యమే ||1-22
యోత్స్యమానానవేక్షేऽహం
య ఏతేऽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే
ప్రియచికీర్షవః ||1-23

అర్జునుని వాక్యము|
ఆ.వె.
దుష్టబుద్ధులైన దుర్యోధనాదుల
కుం బ్రియమ్మొనర్చు కుమతు లెవరొ
యెవ్వ రెవరి తోడఁ జివ్వ కాయత్తమై
కలహ మాడవలెనొ కలయఁజూతు ౧౭ .|
అర్జునుడు పలికెను.
ఓ కృష్ణా ! ఈ యుద్ధారంభము నందు నేనెవరితో పోరుసల్ప వలయునో, అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచటినుండి నేను చక్కగ జూడ గల్గుదునో రెండు సేనల మధ్య అచ్చోట నా రథమును నిలబెట్టుము. దుష్టబుద్ధిగల దుర్యోధనునకు యుద్ధమున ప్రియమొన గూర్పనెంచి ఇచట చేరియున్నట్టి యోధులను నేను చూచెదను.

సఞ్జయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో
గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24
భీష్మద్రోణప్రముఖతః
సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ !॰ పశ్యైతాన్
సమవేతాన్ కురూనితి -25

సంజయవాక్యము|
కం.
హరి నరుని పల్కుల న్విని
యరదమ్ము బిరాన ద్రోలి యా రణసీమన్
గురు గాంగేయ కృపుల ముం
దర నిల్పన్ గలయఁ జూచి నరుఁ డిటు లనియెన్. ౧౮ |
సంజయుడు పలికెను.
ఓ ధృతరాష్ట్రమహారాజా ! అర్జును డిట్లు చెప్పగా నంతట శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులకును, ఎల్ల రాజులకును ఎదుట నిలిపి ' అర్జునా ! ఈ చేరియున్న కౌరవులను జూడుము ! ' అని చెప్పెను.

తత్రాపశ్యత్స్థితాన్పార్థః
పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్
పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ||1-26
శ్వశురాన్సుహృదశ్చైవ
సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌన్తేయః
సర్వాన్బన్ధూనవస్థితాన్ ||1-27
కృపయా పరయావిష్టో
విషీదన్నిదమబ్రవీత్ |

 అర్జున వాక్యము|
ఉ.
తాతలఁ దండ్రులన్ సఖుల దాయల భ్రాతల బుత్ర పౌత్రులన్
మాతులులన్ గురూత్తముల మాన్యుల బంధుల నెల్లరన్ రిపు
వ్రాతమునందు నిందులను బారులఁ దీర్చిన వీరి జూడ నా
చేతము చల్లనై మిగుల జిత్తము నొవ్వ దొడంగె మాధవా ! ౧౯
తదుపరి అర్జును డచట రెండు సేనల యందును నిల్చియున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను- అందఱిని బాగుగా పరికించి చూచి దయార్ద్రహృదయుడై, దుఃఖించుచు నిట్లు పలికెను.

అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ
యుయుత్సుం సముపస్థితమ్ ||1-28
సీదన్తి మమ గాత్రాణి
ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే
రోమహర్షశ్చ జాయతే ||1-29
గాణ్డీవం స్రంసతే హస్తాత్
త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం
భ్రమతీవ చ మే మనః ||1-30

అర్జున వాక్యము |
కం.
ఒడలుడికి వడకు చున్నది
తడి యారుచు నోటి మాట తడబడి తను వె
ల్లెడల గగుర్పా టొదవెడుఁ
దడబడు కరయుగము శరము ధనువు ధరింపన్౨౦ |
అర్జునుడు పలికెను.
ఓ కృష్ణమూర్తీ ! యుద్ధము చేయుటకై ఇచట సమకూడిన ఈ బంధుజనులను జూచి నా అవయవములు పట్టుదప్పుచున్నవి ; నోరెండుకొని పోవుచున్నది ; శరీరమందు వణకు పుట్టుచున్నది ; గగుర్పాటు కలుగుచున్నది ; గాండీవము చేతినుండి జారి పోవు చున్నది ; చర్మము మండుచున్నది ; నిలబడుటకునైనను నాకు శక్తి లేకున్నది ; మనస్సు గిఱ్ఱున తిరుగు చున్నది.

నిమిత్తాని చ పశ్యామి
విపరీతాని కేశవ |
న చ శ్రేయోऽనుపశ్యామి
హత్వా స్వజనమాహవే ||1-31

చ.
అపశకునమ్ములే గనఁగ నయ్యెను బంధుల నాజిలో జయిం
చి పిదప మూటగట్టుకొను శ్రేయము సుంతయు గానరాదు హే
యపు సుఖభోగ సంపదలకై కురురాజ్యము స్వీకరింపగా
నిపుడు మనంబు వోదు బ్రతుకేమి ఫలంబని తోచు గేశవా !౨౧||
ఓ కృష్ణా !(పెక్కు) అపశకునములను సహితము చూచుచున్నాను. యుద్ధములందు బంధువులను చంపిన వెనుక పొందబోవు లాభమెద్దియో నాకు గనుపించుట లేదు.

న కాఙ్క్షే విజయం కృష్ణ
న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద
కిం భోగైర్జీవితేన వా ||1-32
యేషామర్థే కాఙ్క్షితం నో
రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమేऽవస్థితా యుద్ధే
ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||1-33
ఆచార్యాః పితరః పుత్రా
స్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః
శ్యాలాః సమ్బన్ధినస్తథా ||1-34
ఏతాన్న హన్తుమిచ్ఛామి
ఘ్నతోऽపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య
హేతోః కిం ను మహీకృతే ||1-35

ఉ.
ఎవ్వరి కోసమై యని జయింపగ నెంతునొ రాజ్యకాంక్ష నా
కెవ్వరు సౌఖ్యమొంద జనియించిరొ యట్టి యనుంగు బంధు లీ
చివ్వను జావ సిద్ధమయి జీవములన్ ధనముల్ త్యజింపగా
నెవ్వరి కోసమై పెనగు దెవ్వరి జూచి సుఖింతు మాధవా !౨౨

ఉ.
చంపినఁ జత్తుగాని గురుసత్తముఁ దాతను బుత్ర పౌత్రులన్
జంపగఁ జేతులాడవు నిజంబు వచింతు ద్రిలోక రాజ్యపుం
సంపద లబ్బినన్ విడతు సంగర రంగమందు వీరలన్
జంపిన పాపమున్ గుడువఁ జాల నికేటికి రాజ్య సంపదల్. ౨౩|
కృష్ణా ! నేను విజయమునుగాని, రాజ్యమునుగాని, సుఖములనుగాని, కోరను. రాజ్యముతో గాని, భోగములతో గాని, జీవితముతో గాని మనకేమి ప్రయోజనము ? ఎవరి నిమిత్త మీరాజ్యమును, భోగములను, సుఖములను మనము కోరుదుమో, అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమఱఁదులు, సంబంధులు- ఎల్లరును ప్రాణములమీద, ధనములమీద ఆశ వదలుకొని ఈ రణరంగముమీద వచ్చి నిలబడి యున్నారు. ఓ కృష్ణా ! నన్ను చంపువారలైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొఱకైనను నేను చంప నిచ్చగింపను. ఇక భూలోక రాజ్యముకొఱకు వేఱుగ జెప్పవలెనా ?

నిహత్య ధార్తరాష్ట్రాన్నః
కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్
హత్వైతానాతతాయినః ||1-36
తస్మాన్నార్హా వయం హన్తుం
ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా
సుఖినః స్యామ మాధవ ||1-37

ఉ.
పాపుల నాతతాయుల విపత్కరులన్ ధృత రాష్ట్ర పుత్రులన్
ఏపడగించి నేను వధియించిన లోకమునందు ధర్మ సం
స్థాపన పుణ్యమబ్బుట నిజంబయినన్ గురులున్ బితామహుల్
దాపురమైరి వీరల వధం బతిపాపము గాదె మాధవా !౨౪
ఓ కృష్ణా ! దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషము కలుగును ? దుర్మార్గులై నను వీరిని చంపుటవలన మనకు పాపమే కలుగును. ఓ కృష్ణా ! కావున మన బంధువులగు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మన వారిని చంపి మన మెట్లు సుఖపడగలము ?

యద్యప్యేతే న పశ్యన్తి
లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం
మిత్రద్రోహే చ పాతకమ్ ||1-38
కథం న జ్ఞేయమస్మాభిః
పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం
ప్రపశ్యద్భిర్జనార్దన ||1-39

ఉ.
క్రించుదనమ్ము లుబ్ధత నొకించుకఁ బాపభయమ్ము లేక ద
ర్పించి కులక్షయంబు నొనరింపఁ దలంచిరి మిత్రకోటి వం
చించిరి ధార్త రాష్ట్రు లిక సేయని దేమి కులక్షయమ్ముఁ ద
ప్పించు నుపాయమేమి వినిపింతువొ నేఁదరియింప మాధవా ! ౨౫
ఓ కృష్ణా ! రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనము వలన గలుగు దోషమును, మిత్రద్రోహము వలన గలుగు పాపమును ఒకవేళ యెఱుఁగకున్నను, ఆ రెండింటిని బాగుగ తెలిసినట్టి మన మేల యీ పాపకృత్యము నుండి విరమింపగూడదో అర్థము కాకున్నది.

కులక్షయే ప్రణశ్యన్తి
కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్న
మధర్మోऽభిభవత్యుత ||1-40
అధర్మాభిభవాత్కృష్ణ
ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ
జాయతే వర్ణసఙ్కరః ||1-41

తే.
కులము నశియింప కులధర్మములు నశించు
ధర్మ మడగి యధర్మమ్ము దాపురించు
శీలము నశించు నిజకుల స్త్రీలయందు
కలుషితమ్మయి వర్ణ సంకరముఁ గలుగు.౨౬
ఓ కృష్ణా ! కులము నశించుటచే అనాదిగ వచ్చు కులధర్మములు అంతరించి పోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధినొందుటచే కులస్త్రీలు చాల చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణ సంకరమేర్పడును.

సఙ్కరో నరకాయైవ
కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం
లుప్తపిణ్డోదకక్రియాః ||1-42
దోషైరేతైః కులఘ్నానాం
వర్ణసఙ్కరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః
కులధర్మాశ్చ శాశ్వతాః ||1-43
ఉత్సన్నకులధర్మాణాం
మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో
భవతీత్యనుశుశ్రుమ ||1-44

ఆ.వె.
వర్ణ సంకరమున వచ్చు ధర్మగ్లాని
నరక కూపమందు నరులు దొరలఁ
బితలఁ జేరఁ బోవు పిండోదకంబులు
జాతి ధర్మ మడగు నీతి దొరగి. ౨౭
అట్టి వర్ణ సంకరము వలన సంకరము చేసినవారికి, సంకరమునొందిన కులమునకు గూడ నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు, తర్పణములు లేనివారై యధోగతిని బొందుదురు. ఓ కృష్ణా ! కులనాశకులయొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషములచేత శాశ్వతములగు జాతిధర్మములు, కులధర్మములు నశించిపోవు చున్నవి. కులధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరకనివాసము కలుగునని మనము విని యున్నాము.

అహో బత మహత్పాపం
కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన
హన్తుం స్వజనముద్యతాః ||1-45
యది మామప్రతీకార
మశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యు
స్తన్మే క్షేమతరం భవేత్ ||1-46

 కం.
ఇట్టి యవినీతి కాస్పద
మెట్టుల నీ రణ మొనర్చి యీ యఘమెల్లన్
జుట్టి తల నే ధరింతును నే
గిట్టినఁ బోగాదె వీరి కేలన్ గృష్ణా ! ౨౮
కటకటా ! రాజ్యసుఖమందలి యాశచే మనము బంధువులను చంపుట కుద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి కదా ! ఆయుధములు ధరింపకయు, ఎదిరించకయునున్న నన్ను ఆయుధములు చేబూనిన దుర్యోధనాదు లీ యుద్ధమున జంపుదురేని, అది నాకు మఱింత క్షేమమైనదియే యగును.

సఞ్జయ ఉవాచ |
ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే
రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం
శోకసంవిగ్నమానసః ||1-47

సంజయు వాక్యము|
కం.
భరమగు దుఃఖమ్మున సు
స్థిరత గనన్ లేక మిగుల దీనత శోకిం
చి రథమ్మున నరుఁడంతట
శర చాపము చేయిజారఁ జతికిల బడియెన్.౨౯
సంజయుడు పలికెను.
(ఓ ధృతరాష్ట్రమహారాజా !) యుద్ధభూమి యందర్జును డీప్రకారముగ జెప్పి శోకముచే కలతనొందిన చిత్తము గలవాడై, బాణముతో గూడిన వింటిని పారవైచి రథముపై చతికిలబడెను.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా
సూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అర్జునవిషాదయోగో నామ
ప్రథమోऽధ్యాయః ||1||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథశాస్త్రిచే అనువదింపబడిన
శ్రీగీతామృత తరంగిణి యందు శ్రీ అర్జున విషాదయోగమను
ప్రథమ తరంగము సంపూర్ణం.
శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు అర్జున విషాద యోగమను మొదటి అధ్యాయము.

8 comments:

  1. శుభమస్తు, అవిఘ్నమస్తు. అద్భుతమైన పని చేస్తున్నారండీ. నెనరులు.

    ReplyDelete
  2. మంచి ప్రయత్నం. కొనసాగించండి.నెనర్లు.

    ReplyDelete
  3. రాఘవ గారికీ, ఆది లక్ష్మి గారికి,
    సంతోషమండీ. మీ బోటి వారి శుభకామనలే మాకు ఈ కార్యాన్ని పూర్తిచేయ గలగటానికి కావలసిన బలాన్నందిస్తాయి. మన కర్తవ్యం కర్మ నాచరించటం వఱకే. ఈ క్రింది శ్లోకాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి.

    కర్మణ్యేవాధి కారస్తే మా ఫలేషు కదాచన
    మా కర్మఫల హేతుర్భూర్మాతే సజ్ఞ్గో2స్త్వకర్మణి.

    నీకు కర్మను చేయుటయందే అధికారము కలదు. కర్మఫలముల నాశించుటయం దేనాడును నీ కధికారము లేదు. కర్మఫలములకు నీవు కారణభూతుడవు కాకుము, మఱియు కర్మలు మానుటయందును నీ కాసక్తి కలుగకుండుగాక! సాంఙ్ఖ్య యోగము 47వశ్లోకము.
    మన దైనందిన జీవితాల్లోని ప్రతి విషయానికి గీత లోని ఏదో ఒక శ్లోకానికి అన్వయం కుదురుతుందనుకుంటాను.

    ReplyDelete
  4. మంచి ప్రయత్నం.
    రాకేశ్వరా, పద్యాలు పెట్టిన కాలమ్ ని మరీ అంత కుదించకుండా వైశాల్యం పెంచవచ్చు కదా?

    ReplyDelete
  5. శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథశాస్త్రి గారి పద్యాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి - సులభంగా తెల్లమవుతూ తాత్పర్యం తఱచి చూసే అవసరం రానీయడం లేదు. మిగతా భాగాలు త్వరలోనే ప్రచురించండి, ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.

    ReplyDelete
  6. గిరి గారికి ధన్యవాదములు.
    కొన్ని కొన్ని మానిటర్లు చిన్న సైజులోనివయినప్పుడు పద్యాలు ఒకో పాదం రెండు లైన్లలోకి వస్తున్నాయి. 17 అంగుళాలు ఆ పైసైజు మానిటర్లలో చదవటానికి బాగానే ఉంటున్నాయి. గమనించగలరు. రెండో అధ్యాయం సాంఖ్యయోగం కూడా పోస్టు చేయటం జరిగింది.

    ReplyDelete
  7. బాగు బాగు, ఇప్పుడు పద్యాలు మహ బాగా కనిపిస్తున్నాయి..సూచనని అమలుచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  8. ఒక ఆలోచన.
    ఇంతందమైన మఱియు సులభమైన శైలిలో రచించబడిన శ్రీ పూడిపెద్ది వారి పద్యాలలో కొన్నిటిని మన స్కూలు పిల్లల తెలుగు పాఠ్యభాగంలోని పద్యఫ్రణాళికలో భాగంగా చేరిస్తే బాగుంటున్నదన్నది ఆ ఆలోచన.
    గీత అంతా పోస్టు అయినతరువాత చూసినవారందరూ నా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారని నా నమ్మకం. అందరూ ఈ విషయమై వారి వారి అభిప్రాయాలను తెలియజేయ ప్రార్థితులు.

    ReplyDelete