Saturday, October 3, 2009

కర్మ యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు)
శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)
అర్జున ఉవాచ|
అనుష్టుప్.
జ్యాయసీ చేత్కర్మణస్తే
మతా బుద్ధిర్జనార్దన! |
తత్కిం కర్మణి ఘోరే మాం
నియోజయసి కేశవ|| 3-1
అర్జును వాక్యము.
ఉత్పలమాల.
జ్ఞానమె కర్మకంటె నధికమ్మని నీవు తలంచి చెప్పగాఁ
బూనితి వింత దూరమున బుద్ధుల; నట్టులె యైనచో, మఱీ
న్యూనపు గర్మ జేయగ ననుం బురికొల్పెద వేల ఘోర దుః
ఖానకుఁ బాలుగానటులఁ గాచి; వచింపుము నాకుఁ గేశవా! ౧
అర్జునుడు చెప్పెను. ఓ కృష్ణా! జ్ఞానము కర్మముకంటె శ్రేష్ఠమైనదని నీ యభిమతమగుచో, మఱి యీ భయంకరమైన ( యుద్ధ ) కర్మమునందు నన్నేల ప్రవర్తింప జేయుచున్నావు ?
అనుష్టుప్.
వ్యామిశ్రేణేవ వాక్యేన
బుద్ధిం మోహయసీవ మే|
తదేకం వద నిశ్చిత్య యేన
శ్రేయోऽహమాప్నుయామ్|| 3-2
తేటగీతి.
నీదువాక్కుల నాకు సందిగ్ధ మొదవి,
మనసు చలియించి, నాకేది మంచి చెడు గ
దేదొ తెలియకున్నది; కాన, నెదియొ యొకటి
నిశ్చిత శ్రేయమునుఁ దెల్పు నీరజాక్ష! ౨
( ఓ కృష్ణా! ) మిశ్రమమైనదానివలెనున్న వాక్యముచేత నా బుద్ధిని కలవరపెట్టువానివలె నున్నావు. కావున నేను దేనిచే శ్రేయమును పొందగలనో అట్టి యొకదానిని ( కర్మ, జ్ఞానములలో ) నిశ్చయించి నాకు చెప్పుము.
శ్రీభగవానువాచ|
అ.
లోకేऽస్మిన్ ద్వివిధా నిష్ఠా
పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం
కర్మయోగేన యోగినామ్|| 3-3
శ్రీ భగవానుల వాక్యము|
తేటగీతి.
ఇఱు తెఱంగుల నిష్ఠ నేర్పెఱుగఁ జెపితి
మునుపె సృష్ట్యాది; మఱల దానినె వచింతు,
జ్ఞానయోగమ్ము సాంఖ్యులౌ సంయములకుఁ,
గర్మయోగమ్ము గేస్తుల కర్హ మగును. ౩
శ్రీ భగవానుడు పలికెను. పాపరహితుడవగు ఓ అర్జునా! పూర్వ మీలోకమున సాంఖ్యులకు ( తత్త్వవిచారణాపరులకు ) జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను రెండు విధములగు అనుష్ఠానము నాచే జెప్పబడియుండెను.
అ.
న కర్మణామనారమ్భా
న్నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే|
న చ సంన్యసనాదేవ
సిద్ధిం సమధిగచ్ఛతి|| 3-4
తేటగీతి.
కర్మ లారంభ విముఖ మకర్మ కాదు;
కర్మ త్యజియించు మాత్రాన జ్ఞాన నిష్ఠఁ
గాంచుచున్నాఁ డటంచని యెంచరాదు;
జ్ఞాన కర్మల కృషికి బీజమ్ము మనసు. ౪
మనుజుడు కర్మల నారంభింపకపోవుటవలన నిష్క్రియమగు అత్మస్వరూపస్థితిని పొందజాలడు. కర్మత్యాగమాత్రముచే మోక్షసిద్ధిని ఎవడును పొందనేరడు.
అ.
న హి కశ్చిత్క్షణమపి
జాతు తిష్ఠత్యకర్మకృత్|
కార్యతే హ్యవశః కర్మ
సర్వః ప్రకృతిజైర్గుణైః|| 3-5
కందము.
క్షణమైనఁ గర్మ జేయక
మనలేడు నరుండు, ప్రకృతమై జనియించున్;
గుణకర్మలు త్రివిధములై
యనయము జనుచుండు వెంట నంటి కిరీటీ! ౫
( ప్రపంచమున ) ఎవడును ఒక్కక్షణకాలమైనను కర్మముచేయక ఉండనేరడు. ప్రకృతివలన బుట్టిన గుణములచే ప్రతివాడును బలత్కారముగ కర్మలను చేయుచునే యున్నాడు. ౫
అ.
కర్మేన్ద్రియాణి సంయమ్య
య ఆస్తే మనసా స్మరన్|
ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా
మిథ్యాచారః స ఉచ్యతే|| 3-6
తేటగీతి.
ఇంద్రియమ్ముల బిగువు బిగించి, మనసు
వివిధ విషయమ్ములను బరువెత్తుచున్న
నరుని, నెఱుగుము దొంగసన్న్యాసి గాగ,
వట్టి ధంబాల రాయఁడౌ వాని గాగ. ౬
ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణచిపెట్టి మనస్సుచేత ఇంద్రియములయొక్క శబ్దాదివిషయములను చింతించుచుండునో మూఢచిత్తుడగు అట్టి మనుజుడు కపటమైన ఆచరణగలవాడని చెప్పబడుచున్నాడు.
అ.
యస్త్విన్ద్రియాణి మనసా
నియమ్యారభతేऽర్జున! |
కర్మేన్ద్రియైః కర్మయోగ
మసక్తః స విశిష్యతే|| 3-7
తేటగీతి.
ఎవని జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియ.ముల
యుద్ధతి నడంచునో, కర్మయోగి యతఁడె;
బూటకాచార్య మృషల వాచాలుఁ డగుట
కన్న యెటులైన మిన్న యీ కర్మయోగి. ౭
ఓ అర్జునా! ఎవడు ఇంద్రియములన్నిటిని మనస్సుచే నియమించి, వానిచే కర్మయోగమును సంగములేనివాడై ఆచరించునో, అత డుత్తముడు.
అ.
నియతం కురు కర్మత్వం
కర్మ జ్యాయో హ్యకర్మణః|
శరీరయాత్రాపి చ తే
న ప్రసిద్ధ్యేదకర్మణః|| 3-8
ఆటవెలది.
నియతమైన కర్మ నిష్ఠతో నుండుము;
కర్మ లుడుగఁ జేతకాదు నీకు;
నిత్యకర్మ కృతము నీరసమ్మైన, శ
రీర యాత్రయు నెరవేరఁ బోదు. ౮
( ఓ అర్జునా! ) నీవు ( శాస్త్రములచే ) నియమితమైన కర్మను జేయుము. కర్మనుచేయకుండుటకంటె చేయుటయే శ్రేష్ఠము. మఱియు కర్మ చేయకపోవుటవలన నీకు దేహయాత్రకూడ సిద్ధింపనేరదు.
అ.
యజ్ఞార్థాత్కర్మణోऽన్యత్ర
లోకోऽయం కర్మబన్ధనః|
తదర్థం కర్మ కౌన్తేయ
ముక్తసఙ్గః సమాచర|| 3-9
అ.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా
పురోవాచ ప్రజాపతిః|
అనేన ప్రసవిష్యధ్వ
మేష వోऽస్త్విష్టకామధుక్|| 3-10
అ.
దేవాన్భావయతానేన
తే దేవా భావయన్తు వః|
పరస్పరం భావయన్తః
శ్రేయః పరమవాప్స్యథ|| 3-11
కందము.
భగవత్ప్రీతి కరంబుగ
నిగమార్థము లయిన కర్మ నియతిం గనుమా!
వగఁ గూర్చు మిగులు కర్మలు,
నిగనిగలౌ కర్మబంధ నిగళ యుగళముల్. ౯
తేటగీతి.
మును ప్రజాపతి ద్విజుల సృష్ఠిని యొనర్చి,
యజ్ఞములు జేసి, శుభమందు డనుచు సెప్పె;
దేవతలు వృద్ధి నొందెద రీవిధాన
మొంది, ప్రజలుందు రిట్టు లన్యోన్యముగను. ౧౦
ఓ అర్జునా! యజ్ఞము కొఱకైన ( భగవత్ప్రీతికరమైన, లేక లోకహితార్థమైన ) కర్మముకంటె ఇతరమగు కర్మముచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞముకొఱకైన కర్మమునే సంగరహితుడవై ( ఫలాసక్తి లేక ) యాచరింపుము. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో గూడ ప్రజలను సృష్ఠించి " ఈ యజ్ఞములచే మీరభివృద్ధిని బొందుడు. ఇవి మీ యభీష్టములను నెరవేర్చుగాక! " అని వారితో బలికెను. యజ్ఞములచే దేవతలను దృప్తి పఱచుడు. ఆ దేవతలున్ను మిమ్ములను ( వర్షాదులచే ) తృప్తి నొందించుదురు గాక! ఈ ప్రకారముగ పరస్పరము తృప్తి నొందించు కొనుటవలన ఉత్తమ శ్రేయమును బొందగలరు.
అ.
ఇష్టాన్భోగాన్హి వో దేవా
దాస్యన్తే యజ్ఞభావితాః! |
తైర్దత్తానప్రదాయైభ్యో
యో భుఙ్క్తే స్తేన ఏవ సః|| 3-12
అ.
యజ్ఞశిష్టాశినః సన్తో
ముచ్యన్తే సర్వకిల్బిషైః|
భుఞ్జతే తే త్వఘం పాపా
యే పచన్త్యాత్మకారణాత్|| 3-13
తేటగీతి.
యజ్ఞభోక్తలు దేవతలనుచుఁ దెలియు,
మీ సిరులు సంపద లిచ్చువారు;
దేవతల ప్రీతికై నివేదింప కుండ,
వండుకొని తిన్నవాఁడు చోరుండు సుమ్ము! ౧౧
మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగముల నిత్తురు. అట్లు వారిచే నీయబడిన యా భోగ్యవస్తువులను తిరిగి వారికి సమర్పింపకయే ఎవ డనుభవించునో అతడు దొంగయే యగును. యజ్ఞమునందు ( భగవదర్పణముచేసి ) మిగిలిన పదార్థమునుతిను సజ్జనులు సమస్త పాపములనుండియు విడువ బడుచున్నారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో, అట్టివారు పాపమును తినువారే యగుదురు.
అ.
అన్నాద్భవన్తి భూతాని
పర్జన్యాదన్నసమ్భవః|
యజ్ఞాద్భవతి పర్జన్యో
యజ్ఞః కర్మసముద్భవః|| 3-14
అ.
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి
బ్రహ్మాక్షరసముద్భవమ్|
తస్మాత్సర్వగతం బ్రహ్మ
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్|| 3-15
ఉత్పలమాల.
అన్నమునన్ శరీర నిచయమ్ములు పుట్టుచు వృద్ధినొందు; నా
యన్నము వృష్టి చే జననమందును; జన్నములందుఁ బుట్టు నా
పున్నెపు వృష్టి : జన్నములు పుట్టును కర్మ సముద్భవమ్ములై;
యి న్నియమమ్ముఁ దప్పదొక యించుకఁ జర్విత చర్వణమ్ముగా. ౧౨
తేటగీతి.
కర్మ వేదోద్భవంబని కనుము; బ్రహ్మ
అక్షరంబగు పరమాత్మయందుఁ గలుగు;
నట్టి పరమాత్మ సర్వత్ర వ్యాప్తి నొంది,
యజ్ఞముల యందు లీనమై యధివసించు. ౧౩
ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి. అన్నము మేఘము వలన కలుగుచున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది. యజ్ఞము సత్కర్మవలన కలుగు చున్నది. సత్కర్మ వేదముల వలన కలుగుచున్నది. వేదము అక్షరపరబ్రహ్మమువలన కలుగుచున్నది. కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడినదిగ నెఱుఁగుము.
అ.
ఏవం ప్రవర్తితం చక్రం
నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో
మోఘం పార్థ ! స జీవతి|| 3-16
ఉత్పలమాల.
మూలము కర్మయై తిరుగు భూవలయంబిటు నీశ్వరేచ్ఛ, నీ
కాలగతి క్రమంబుల ప్రకారము; పావన వేదకర్మలన్
దూలిన యాద్విజాధములు, దోగుదు రావిషయ ప్రకీర్ణ పం
కాలనుఁ బాప జీవులయి కామ్య పరాయణ దుష్టశీలురై. ౧౪
ఓ అర్జునా! ఈ ప్రకారముగ ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవ డనుసరించి వర్తింపడో, అతడు పాపజీవితమును గడుపువాడును ఇంద్రియలోలుడును అయి వ్యర్థముగా బ్రతుకుచున్నాడు.
అ.
యస్త్వాత్మరతిరేవ స్యా
దాత్మతృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సన్తుష్ట
స్తస్య కార్యం న విద్యతే|| 3-17
తేటగీతి.
నియత కర్మఁ జేయుట కన్న నీతి లేదు;
కర్మయుం బరమాత్మ యేకమ్ము సుమ్ము;
కర్మ లేకుండుటయుఁ జేత కాదు నీకు;
కర్మయోగమ్ము గేస్తుల కర్హ మగును. ౧౫
ఎవడు కేవలము ఆత్మయందే, క్రీడించుచు, ఆత్మయందే తృప్తిని బొందుచు, ఆత్మయందే సంతోషపడునో, అట్టి ఆత్మజ్ఞాని కిక చేయదగినపని ( విధి ) యేదియును లేదు.
అ.
నైవ తస్య కృతేనార్థో
నాకృతేనేహ కశ్చన|
న చాస్య సర్వభూతేషు
కశ్చిదర్థవ్యపాశ్రయః|| 3-18
ఆటవెలది.
ఆత్మయందె ప్రీతి, ఆత్మయందే తృప్తి,
ఆత్మయందె తుష్టి నందు జ్ఞాని;
విషయ కర్మ కాని, వేద కర్మల గాని
జోలిబోవ వానికేల ? పార్థ!
అట్టి ఆత్మజ్ఞాని కీ ప్రపంచమున కర్మచేయుటచే ప్రయోజనముగాని చేయకుండుటచే దోషముగాని ఏదియును లేదు. మఱియు నాతనికి సమస్తభూతములయందును ఎట్టి ప్రయోజనముకొఱకై నను ఆశ్రయింపదగినది యేమియును లేదు.
అ.
తస్మాదసక్తః సతతం
కార్యం కర్మ సమాచర! |
అసక్తో హ్యాచరన్కర్మ
పరమాప్నోతి పూరుషః|| 3-19
ఆటవెలది.
జ్ఞాన నిష్ఠ నుండు వాని కీ ముల్లోక
ములఁ బ్రయోజనములు కలుగఁ బోవు;
కీటకాది జీవకోటుల నాశ్రయం
బంది తొలగ వలయు నార్తి లేదు. ౧౭
కాబట్టి నీవు సంగము ( ఫలాపేక్ష ) లేనివాడవై, చేయదగిన కర్మను ఎల్లప్పుడును చక్కగ చేయుచుండుము. అసక్తుడై కర్మనాచరించు మనుజుడు ( క్రమముగ ) మోక్షము నొందుచున్నాడు.
అ.
కర్మణైవ హి సంసిద్ధి
మాస్థితా జనకాదయః|
లోకసంగ్రహమేవాపి
సమ్పశ్యన్కర్తుమర్హసి|| 3-20
చంపకమాల.
నిరతము కామ్యనిస్పృహత నిర్మల కర్మలఁ జేయు మీమహ
త్తర పురుషార్థమున్ గన పృథాసుత! యా జనకాధిపాది రా
డ్వరుల తెఱంగునన్ జని, ప్రపంచ సముద్ధరణంబు సల్పగా,
నెఱపుము; దాన నీయశము నిల్చుఁ జిర స్మరణీయ రమ్యమై. ౧౮
జనకుడు మున్నగువారు నిష్కామ కర్మముచేతనే మోక్షమును బొందిరి. జనులను సన్మార్గమున ప్రవర్తింప జేయు నుద్దేశ్యము చేనైనను నీవు కర్మలను చేయుటకే తగియున్నావు.
అ.
యద్యదాచరతి శ్రేష్ఠ
స్తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే|| 3-21
ఉత్పలమాల.
పెద్దలు పోవు మార్గమునఁ బిన్నల పోకలు సాజమౌట, నా
పెద్దలె మార్గ దర్శకులు పిన్నలకున్, జన సంతతుల్ మహా
పద్దశ లందకుండఁ దగు పద్ధతి నీ జగ ముద్ధరింపగాఁ
గద్దు; ప్రమాణముల్ సరణిఁ గాంచి చరింతురు లోకులెప్పుడున్. ౧౯
గొప్పవా డేకర్మను చేయునో దానినే తక్కినవారున్ను చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగ గైకొనునో, తక్కినవారును దానినే అనుసరించుదురు.
అ.
న మే పార్థాస్తి కర్తవ్యం
త్రిషు లోకేషు కిఞ్చన|
నానవాప్తమవాప్తవ్యం
వర్త ఏవ చ కర్మణి|| 3-22
ఉత్పలమాల.
నాకు జగమ్ములన్ సలుపనౌ తగు కార్యము లేవి లేవు; నా
కే కరణిన్ లభింపఁ దగు నీషణముల్ గనరావు సుంతయున్;
వ్యాకులమేమి లే, దయిన వర్తిలుచుంటి ననారతంబుగా;
లోకులకోసమై యిటుల లోబడు చుంటిని కర్మఁ జేయగన్. ౨౦
అర్జునా! నా కీ మూడులోకములందును చేయదగినకార్య మేదియును లేదు. మఱియు పొందబడనిదియు, పొందదగినదియు నగు వస్తువున్ను ఏదియు లేదు. నేను కర్మమందు ప్రవర్తించుచునేయున్నాను.
అ.
యది హ్యహం న వర్తేయం
జాతు కర్మణ్యతన్ద్రితః|
మమ వర్త్మానువర్తన్తే
మనుష్యాః పార్థ ! సర్వశః|| 3-23
ఆటవెలది.
నేనె కర్మ యుడిగితేని, యీలోకముల్
వారు మడిసి పోవు వారె సుమ్ము,
వర్ణ సంకరము వచ్చి; భూప్రజలెల్లఁ
బాడు చేయునట్టి వాఁడ నగుదు. ౨౧
అర్జునా! ఏలయనగా, నేనెల్లప్పుడును జాగరూకుడునై కర్మమందు ప్రవర్తింపకపోయినచో, మనుష్యులు సర్వవిధముల నాయొక్క ఆ మార్గమునే అనుసరించి వర్తించుదురు.
అ.
ఉత్సీదేయురిమే లోకా
న కుర్యాం కర్మ చేదహమ్|
సఙ్కరస్య చ కర్తా స్యా
ముపహన్యామిమాః ప్రజాః|| 3-24
అ.
సక్తాః కర్మణ్యవిద్వాంసో
యథా కుర్వన్తి భారత! |
కుర్యాద్విద్వాంస్తథాసక్త
శ్చికీర్షుర్లోకసంగ్రహమ్|| 3-25
తేటగీతి.
కాములగు వార లెటు దీక్షఁ గనుదు, రటుల
పరుల హితలోక కల్యాణ ఫలితములకు
దీక్ష వహియించి, బుధులు, తదేక బుద్ధిఁ
గార్య సరళికిఁ జొత్తురు కాదె పార్థ! ౨౨
మఱియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు.అత్తఱి సంఘములం దేర్పడు సంకరమునకు నేనే కర్త నగుదును. కావున జనులను నేనే చెడగొట్టిన వాడనగుదును. అజ్ఞానులు కర్మలందు తగుల్కొని ఫలాపేక్షతో నేప్రకారము చేయుచున్నారో, ఆ ప్రకారమే జ్ఞానులు వానియందు తగుల్కొనక ఫలాసక్తిరహితులై లోకకల్యాణము నిమిత్తము కార్యముల నాచరింపవలెను.
అ.
న బుద్ధిభేదం జనయే
దజ్ఞానాం కర్మసఙ్గినామ్|
జోషయేత్సర్వకర్మాణి
విద్వాన్యుక్తః సమాచరన్|| 3-26
చంపకమాల.
ఫల రహితమ్ము లే యను నెపమ్మునఁ జేయకు మెట్టు లెట్టులో;
సిలుగయి, యజ్ఞులన్ జపల చిత్తులఁ జేయును; గాన, ని
శ్చలత, విచక్షణల్ సలిపి సన్నుత కార్య విధాన మారయన్
జలుపుమ! దీధితుల్ నెఱపి సద్రమణీయ మనః ప్రదీపివై. ౨౩
జ్ఞానియగువాడు కర్మఫలాసక్తులగు అజ్ఞానులయొక్క బుద్ధిని కదలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మల నాచరించుచు, తన యాచరణనుజూచి వారున్ను ఆ ప్రకార మనుష్టించునట్లు చేయవలెను.
అ.
ప్రకృతేః క్రియమాణాని
గుణైః కర్మాణి సర్వశః|
అహఙ్కారవిమూఢాత్మా
కర్తాహమితి మన్యతే|| 3-27
కందము.
ప్రకృతి గుణాధీనంబై
సకలేంద్రియ కర్మవిషయ సంగతి బోవన్,
సకలమునకుఁ దా గర్తగఁ
బ్రకాశ మొనరించు గుమతి ప్రముదితుఁ డగుచున్. ౨౪
ప్రకృతివలనబుట్టిన సత్త్వరజస్తమోగుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా, అహంకారముచే వివేకశూన్యమైన మనస్సుగలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు.
అ.
తత్త్వవిత్తు మహాబాహో!
గుణకర్మవిభాగయోః|
గుణా గుణేషు వర్తన్త
ఇతి మత్వా న సజ్జతే|| 3-28
కందము.
గుణకర్మల నై జమ్ములు
గణియింపఁ గలారు బుధులు, కర్మేంద్రియముల్
గుణకర్మల భోగించుటఁ
గనుచుండెద రాత్మభిన్నగతియై మెలగన్. ౨౫
గొప్ప బాహువులు గల ఓ అర్జునా! గుణములయొక్కయు, కర్మల యొక్కయు విభజననుగూర్చిన యథార్థమెఱిఁగిన జ్ఞాని గుణములు ( ఇంద్రియాదులు ) గుణములందు ( శబ్దాదివిషయములందు ) ప్రవర్తించుచున్నవని, ( ఆత్మస్వరూపుడగు తనకు వాస్తవముగ వానితో ఏ సంబంధమున్ను లేదని ) తలంచి కర్మలందు సంగము (అభిమానము ) లేకుండును.
అ.
ప్రకృతేర్గుణసమ్మూఢాః
సజ్జన్తే గుణకర్మసు|
తానకృత్స్నవిదో మన్దాన్
కృత్స్నవిన్న విచాలయేత్|| 3-29
ఆటవెలది.
కామియైన వాఁడు కామ్యకర్మలఁ జేయు,
నాత్మ తత్త్వ మతని నంటబోదు;
ఆత్మ వేత్తయైన, నజుఁడైన నాతని
బుద్ధి గఱపి దిద్దఁ బోడు పార్థ! ౨౬
ప్రకృతియొక్క రాజసాదిగుణములచే మోహపెట్టబడినవారై దేహేంద్రియాదులయొక్క క్రియలందు ఆసక్తులై వర్తించు కర్మసంగులగు అల్పజ్ఞులను, మందమతులను ఆత్మజ్ఞుడగు జ్ఞాని చలింపజేయగూడదు. ( కర్మలు మానునట్లు చేయరాదు ).
అ.
మయి సర్వాణి కర్మాణి
సంన్యస్యాధ్యాత్మచేతసా|
నిరాశీర్నిర్మమో భూత్వా
యుధ్యస్వ విగతజ్వరః|| 3-30
అ.
యే మే మతమిదం నిత్య
మనుతిష్ఠన్తి మానవాః|
శ్రద్ధావన్తోऽనసూయన్తో
ముచ్యన్తే తేऽపి కర్మభిః|| 3-31
అ.
యే త్వేతదభ్యసూయన్తో
నానుతిష్ఠన్తి మే మతమ్|
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్
విద్ధి నష్టానచేతసః|| 3-32
కందము.
ఉత్తమమగు కర్మల కా
యత్తుఁడవై, ఫలము నాకె యర్పించి, సదా
చిత్తము నిర్మమతం గను
ము త్తల పడకుండ లెమ్ము యుద్ధమ్మునకున్. ౨౭
చంపకమాల.
ఇటులన్ గార్యముల్ సలుప నేవగ నొందకఁ, బుణ్యపాప లం
పటములు లేకఁ, గర్మల ప్రపన్నతలేక, విముక్తిఁ గాంతు; రీ
పటుతర నీతినిన్ దొలగు పాపులు జ్ఞానవిహీనులై, దురో
త్కట విషయాంధ కూపముల కర్మ మర్దనమై నశింపరే. ౨౮
సమస్త కర్మములను నాయందు అధ్యాత్మచిత్తముతో సమర్పించి, అశ గాని, మమకారముగాని లేనివాడవై, నిశ్చింతగ యుద్ధమును జేయుము. ఏ మనుజులు శ్రద్ధావంతులై, అసూయ లేనివారై ఈ నా అభిప్రాయముల నెల్లప్పుడును ఆచరణయందుంచుచున్నారో, వారున్ను కర్మబంధమునుండి విడివడుచున్నారు. ఎవరు నా యీ అభిప్రాయమును ( అధ్యాత్మమార్గమును, నిష్కామకర్మయోగపద్ధతిని )ద్వేషించువారై యనుసరింపకయుందురో, అట్టివారిని బుద్ధిహీనులుగను, బొత్తిగా జ్ఞానములేని వారలుగను, చెడిపోయిన వారలుగను నెఱుఁగుము.
అ.
సదృశం చేష్టతే స్వస్యాః
ప్రకృతేర్జ్ఞానవానపి|
ప్రకృతిం యాన్తి భూతాని
నిగ్రహః కిం కరిష్యతి|| 3-33
కందము.
కోవిదులపుడు బ్రమా
దావస్థలఁ జెంద గలరు, ప్రకృతి కధీనుల్
గా విహరించిన నిగ్రహ
మే విధిఁ దప్పింపఁ గలుగు నియ్యెడ వారిన్. ౨౯
జ్ఞానవంతుడైనను ( శాస్త్రపాండిత్యము, లేక, లౌకిక జ్ఞానము కలవాడైనను ) ప్రకృతికి ( జన్మాంతర సంస్కారమువలన గలిగిన స్వభావమునకు ) అనుగుణముగనే ప్రవర్తించుచున్నాడు. ప్రాణులు తమ ప్రకృతి ననునరించియే నడచుచున్నవి. కావున ఇక నిగ్రహమేమి చేయగలదు ?
అ.
ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే
రాగద్వేషౌ వ్యవస్థితౌ|
తయోర్న వశమాగచ్ఛే
త్తౌ హ్యస్య పరిపన్థినౌ|| 3-34
కందము.
రాగద్వేషము విషయో
ద్వేగమ్మున జననమొంది, తివురుచు నుండున్;
రాగద్వేషములె రిపుల్
గాగ నెఱుంగవలె వశముగాక కిరీటీ! ౩౦
ప్రతి ఇంద్రియమునకును దాని దాని విషయమందు (శబ్దాదులందు ) రాగద్వేషములు ( ఇష్టానిష్టములు ) ఏర్పడియున్నవి. ఆ రాగద్వేషములకు ఎవరును లోబడగూడదు. అవి మనుజునకు ప్రబల శత్రువులు గదా!
అ.
శ్రేయాన్స్వధర్మో విగుణః
పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః|| 3-35
చంపకమాల.
నియమిత ధర్మ మార్గ సరణిం జన శ్రేయ, మదెట్టిదైనఁ జా
వయిననుఁ గాని; యన్యమగు నాశ్రమ ధర్మము వర్ణధర్మమున్
గయి కొనరాదు; తొల్తను సుఖప్రదమై కనిపించినన్ దుదిన్
భయద దురంత సంకరము వాటిలి సంఘమె తారుమారెయౌ. ౩౧
చక్కగ నాచరింపబడిన ఇతరుల ధర్మముకంటె గుణములేనిదైనను తన ధర్మమే శ్రేష్ఠమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే యగును. ఇతరుల ధర్మములు భయదాయకములైనవి.
అ.
అర్జున ఉవాచ|
అథ కేన ప్రయుక్తోऽయం
పాపం చరతి పూరుషః|
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ !
బలాదివ నియోజితః|| 3-36
అర్జును వాక్యము:
తేటగీతి.
ఇచ్ఛ లేకుండగనె, బలోత్సేకముగను
బాప కర్మల నొనరించు బాట నడచు;
నేది ప్రేరించు మనుజు ననిష్టగతుల
దుష్ట కర్మల నొనరింప దురితదూర! ౩౨
అర్జునుడు పలికెను. ఓ కృష్ణా! అయితే మనుజుడు పాపముచేయవలెనని కోరనప్పటికిని, దేనిచే ప్రేరేపింపబడి బలత్కారముగ పాపము చేయుచున్నాడు ?
అ.
శ్రీభగవానువాచ|
కామ ఏష క్రోధ ఏష
రజోగుణసముద్భవః|
మహాశనో మహాపాప్మా
విద్ధ్యేనమిహ వైరిణమ్|| 3-37
చంపకమాల.
కవలలు క్రోధ కామములుఁ గాగ నెఱుంగు, రజో గుణోద్భవుల్;
వివశత నింద్రియమ్ములను వేదురు వెట్టుచు, బానసీండ్రుగా
శివమొనరింపఁ జేయుదు, ర శేష బలాన్వితులై న యీరిపుల్;
స్వవశత నొందు మీ కవ పిశాచుల చేతలకున్ దొలంగుచున్. ౩౩
శ్రీ భగవానుడు చెప్పెను; ఓ అర్జునా! నీ వడిగిన యీ హేతువు రజోగుణమువలన పుట్టిన కామము. ఇదియే క్రోధముగ పరిమణించుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికిని తృప్తినిబొందనిదియు, మహాపాపములకు కారణభూతమైనదియు అయియున్నది. కావున దీనిని ఈ మోక్షమార్గమున శత్రువుగా నెఱుఁగుము.
అ.
ధూమేనావ్రియతే వహ్ని
ర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భ
స్తథా తేనేదమావృతమ్|| 3-38
అ.
ఆవృతం జ్ఞానమేతేన
జ్ఞానినో నిత్యవైరిణా|
కామరూపేణ కౌన్తేయ
దుష్పూరేణానలేన చ|| 3-39
అ.
ఇన్ద్రియాణి మనో బుద్ధి
రస్యాధిష్ఠానముచ్యతే|
ఏతైర్విమోహయత్యేష
జ్ఞానమావృత్య దేహినమ్|| 3-40
ఉత్పలమాల.
ధూమములోని యగ్నియును, ధూళినడంగిన యద్దమున్, శిశున్
బ్రామిన మావి భంగి, యెటులావృతమౌచు నడంగి యుండునో,
కామపరీతమై యటులె జ్ఞానము కప్పు వడున్; దురంత తృ
ష్ణామిత దుర్వ్యధన్ నిధనమై నశియించును కాదె ఫల్గునా! ౩౪
తేటగీతి.
బుద్ధి మనముల నింద్రియంబులకుఁ దావు
కామ మాలిన్యమే యని కనుము పార్థ!
జ్ఞానమును గప్పి శివమెత్తగా నొనర్చు
మోహజాలమ్ములన్ దించి దేహి నెపుడు. ౩౫
పొగచేత అగ్నియు. మురికిచేత అద్దమున్ను, మావిచేత గర్భమందలి శిశువున్ను కప్పబడియుండులాగున ఆ కామముచేత ఈఆత్మజ్ఞానమున్ను కప్పబడియుండును. ఓ అర్జునా! నిండింప శక్యము కానిదియు, అగ్నివలె తృప్తిని జెందనిదియు, ఆశారూపమైనదియు, జ్ఞానికి నిరంతర శత్రువునగు ఈ కామముచేత ( ఆత్మ ) జ్ఞానము కప్పబడియున్నది. ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆశ్రయములని చెప్పబడుచున్నది. ఆ యింద్రియాదులచేత కామము ఆత్మజ్ఞానమును గప్పివైచి మనుజుని మిగుల మోహపెట్టుచున్నది.
అ.
తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ
నియమ్య భరతర్షభ! |
పాప్మానం ప్రజహి హ్యేనం
జ్ఞానవిజ్ఞాననాశనమ్|| 3-41
కందము.
క్రమముగ నింద్రియముల ప
గ్గములనుం బట్టంగ వలయుఁ గడితేఱిన గు
ఱ్ఱము పగిది; మనంబును స
క్రమ శిక్షను నెఱపవలె పరంతప! యెపుడున్. ౩౬
భరతవంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞానవిజ్ఞానములను ( శాస్త్రజ్ఞాన, అనుభవజ్ఞానములను ) రెండింటిని నాశనము చేయునదియు, పాపస్వరూపమైనదియు నగు ఈ కామమును తప్పకుండ సంపూర్ణముగ విడిచివేయుము ( నశింపజేయుము ).
అ.
ఇన్ద్రియాణి పరాణ్యాహు
రిన్ద్రియేభ్యః పరం మనః|
మనసస్తు పరా బుద్ధి
ర్యో బుద్ధేః పరతస్తు సః|| 3-42
కందము.
ఘనమందు రింద్రియంబులు;
మన మధికము; మనసుకంటె మంజులబుద్ధిన్
గనుటధికము; బుద్ధికి మిం
చిన యదె పరమాత్మయౌ, ప్రసిద్ధి కిరీటీ! ౩౭
( దేహాదులకంటె ) ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియములకంటె మనస్సు గొప్పది. మనస్సుకంటె బుద్ధి గొప్పది. బుద్ధికంటె గొప్పవా డెవడో ఆతడే ఆత్మ - అని యిట్లు పెద్దలు చెప్పుదురు.
అ.
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా
సంస్తభ్యాత్మానమాత్మనా|
జహి శత్రుం మహాబాహో!
కామరూపం దురాసదమ్|| 3-43
కందము.
ప్రబలులగు శత్రులియ్యవి;
కబళింతురు జ్ఞాన గరిమ గర్మేంద్రియముల్;
స్వవశంబున నరికట్టుము,
స్వబలాన్విత ధీయుతుండవై, కౌంతేయా! ౩౮
గొప్ప బాహువులు కల ఓ అర్జునా! ఈప్రకారముగ బుద్ధికంటె అతీతమైన దానినిగా ఆత్మనెఱిఁగి, ( వివేకముతో గూడిన ) బుద్ధిచేత మనస్సును బాగుగ నరికట్టి జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామ మను శత్రువును నశింపజేయుము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః|| 3 ||
ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే
అనువదింపబడిన శ్రీ గీతామృత తరంగిణి యందు
శ్రీ కర్మ యోగమను తృతీయ తరంగము
సంపూర్ణం.
శ్రీ కృష్ణపరబ్రహ్మార్పణమస్తు.
ఇది ఉపనిష్ప్రతిపాదితమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు కర్మయోగమను మూడవ అధ్యాయము సంపూర్ణము. ఓమ్ తత్ సత్.

2 comments:

  1. ఒక ఆలోచన.
    ఇంతందమైన మఱియు సులభమైన శైలిలో రచించబడిన శ్రీ పూడిపెద్ది వారి పద్యాలలో కొన్నిటిని మన స్కూలు పిల్లల తెలుగు పాఠ్యభాగంలోని పద్యఫ్రణాళికలో భాగంగా చేరిస్తే బాగుంటున్నదన్నది ఆ ఆలోచన.
    గీత అంతా పోస్టు అయినతరువాత చూసినవారందరూ నా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారని నా నమ్మకం. అందరూ ఈ విషయమై వారి వారి అభిప్రాయాలను తెలియజేయ ప్రార్థితులు.

    ReplyDelete
  2. ఒక ఆలోచన.
    ఇంతందమైన మఱియు సులభమైన శైలిలో రచించబడిన శ్రీ పూడిపెద్ది వారి పద్యాలలో కొన్నిటిని మన స్కూలు పిల్లల తెలుగు పాఠ్యభాగంలోని పద్యఫ్రణాళికలో భాగంగా చేరిస్తే బాగుంటున్నదన్నది ఆ ఆలోచన.
    గీత అంతా పోస్టు అయినతరువాత చూసినవారందరూ నా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారని నా నమ్మకం. అందరూ ఈ విషయమై వారి వారి అభిప్రాయాలను తెలియజేయ ప్రార్థితులు.

    ReplyDelete