Showing posts with label శ్రద్ధాత్రయవిభాగ యోగము. Show all posts
Showing posts with label శ్రద్ధాత్రయవిభాగ యోగము. Show all posts

Saturday, December 19, 2009

శ్రద్ధాత్రయవిభాగ యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

అర్జున ఉవాచ|
అనుష్టుప్ .
యే శాస్త్రవిధిముత్సృజ్య
యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేషాం నిష్ఠా తు కా కృష్ణ !
సత్త్వమాహో రజస్తమః|| 17-1

అర్జును వాక్యము .
తేటగీతి .
శాస్త్రము నెఱుఁగఁ జాలక , శ్రద్ధ గలిగి ,
ఇష్ట దేవతలను భజియించు వాని
శ్రద్ధ యెట్టిదొ చెప్పుమా , సారసాక్ష !
సత్త్వము , రజంబొ , తమమొ విస్పష్టముగను . ౧
అర్జును డడిగెను .
ఓ కృష్ణా ! ఎవరు శాస్త్రోక్తవిధానమును విడిచిపెట్టి శ్రద్ధతో గూడుకొని పూజాదుల నొనర్తురో వారియొక్క స్థితి సాత్త్వికమా , లేక రాజసమా , లేక తామసమా ? ఏదియై యున్నది ?

శ్రీభగవానువాచ|
అనుష్టుప్ .
త్రివిధా భవతి శ్రద్ధా
దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ
తామసీ చేతి తాం శృణు|| 17-2

శ్రీ భగవానుల వాక్యము .
తేటగీతి .
త్రివిధమగు శ్రద్ధ బరగు శరీరధారు
లైన వారికి నైజమై కానుపించు ,
సత్త్వము , రజమ్ము , తమ మన , సవ్యసాచి !
వినుము త్రివిధము లుగ్గడింతును , కిరీటి ! ౨
శ్రీ భగవంతుడు చెప్పెను .
ప్రాణులయొక్క స్వభావముచే ( పూర్వజన్మ సంస్కారముచే ) గలిగిన ఆ శ్రద్ధ సాత్త్వికమనియు , రాజసమనియు , తామసమనియు మూడు విధములుగా నగుచున్నది . దానిని గూర్చి వినుము .

అ.
సత్త్వానురూపా సర్వస్య
శ్రద్ధా భవతి భారత|
శ్రద్ధామయోऽయం పురుషో
యో యచ్ఛ్రద్ధః స ఏవ సః|| 17-3

తేటగీతి .
ఎవనికెట్టి హృదంతరం బెసగుచున్న
దట్టి శ్రద్ధయె వానికి బుట్టుచుండు ;
నరుఁడు శ్రద్ధామయుండయి బరగుచుండు
నెట్టి శ్రద్ధాన్వితున కట్టి వృత్తి యెసగు . ౩
ఓ అర్జునా ! సమస్త జీవులకును వారి వారి ( పూర్వజన్మ సంస్కారముతో గూడిన ) యంతఃకరణము ననుసరించి శ్రద్ధ ( గుణము , సంస్కారము ) కలుగుచున్నది . ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగ కలిగియున్నాడు . ఎవడెట్టి శ్రద్ధ గలిగియుండునో అత డట్టి శ్రద్ధయే యగుచున్నాడు . ( అట్టి శ్రద్ధనే గ్రహించును ) ; తద్రూపుడే అయి యుండునని భావము .

అ.
యజన్తే సాత్త్వికా దేవాన్
యక్షరక్షాంసి రాజసాః|
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే
యజన్తే తామసా జనాః|| 17-4

తేటగీతి .
సాత్త్వికులు దేవతల పూజ సలుపుచుంద్రు ;
రాజసులు యక్ష రాక్షసులను భజింత్రు ;
తామస గుణప్రధానులు దయ్యములను ,
ప్రేత గణముల బూజింత్రు ప్రీతి తోడ . ౪
సత్త్వగుణముగలవారు దేవతలను , రజోగుణము గలవారు యక్షులను , రాక్షసులను , తమోగుణముగలవారు భూతప్రేతగణములను పూజించుచున్నారు .

అ.
అశాస్త్రవిహితం ఘోరం
తప్యన్తే యే తపో జనాః|
దమ్భాహంకారసంయుక్తాః
కామరాగబలాన్వితాః|| 17-5
అ.
కర్షయన్తః శరీరస్థం
భూతగ్రామమచేతసః|
మాం చైవాన్తఃశరీరస్థం
తాన్విద్ధ్యాసురనిశ్చయాన్|| 17-6

ఉత్పలమాల .
కామితముల్ గనంగ నధికమ్మగు కాంక్ష వివేక హీనులై
నీమములన్ శరీరముల నిర్దయతన్ గృశియింపఁ జేసి , కు
గ్రామపిశాచ దేవతలకై పశుమారణ మాచరించు నీ
తామస మూఢ మానవులు , తథ్యము , రక్కసులం చెఱుంగుమా ! ౫
ఆటవెలది.
పశుల సంహరించు పాపాత్ము లౌ వారు ,
ప్రాణి పీడ పాప ఫలమె గాక ,
లోగలట్టి యీశ్వరున్ ననుగూడ హిం
సించుచున్న వారటం చెరుంగు . ౬
ఏ జనులు శరీరమందుననున్నట్టి పంచభూతసముదాయమును లేక ఇంద్రియసమూహమును( ఉపవాసాదులచే ) శుష్కింపజేయువారును , శరీరమం దంతర్యామిగనున్న నన్నును కష్టపెట్టువారును , దంభాహంకారములతో గూడినవారును , కామము , రాగము , ( ఆసక్తి ) , పశుబలము కలవారును ( లేక కామబలము , రాగబలము గలవారును ) అవివేకులును అయి శాస్త్రమునందు విధింపబడనిదియు , తమకును ఇతరులకునుగూడ బాధాకరమైనదియునగు తపస్సును జేయుచున్నారో , అట్టివారిని అసుర స్వభావము గలవారినిగ తెలిసికొనుము .

అ.
ఆహారస్త్వపి సర్వస్య
త్రివిధో భవతి ప్రియః|
యజ్ఞస్తపస్తథా దానం
తేషాం భేదమిమం శృణు|| 17-7

కందము.
దానము, తపస్సు, యజ్ఞము
ప్రాణులకున్ ద్రివిధ ముద్భవం బగు భేదం
బౌ ; నాహారం బట్టులె
న్యూనాధికములనుఁ దెలియనొప్పగు బార్థా ! ౭
ఆహారముకూడ సర్వులకును ( సత్త్వాది గుణములనుబట్టి ) మూడు విధములుగ ఇష్టమగుచున్నది . అలాగుననే యజ్ఞము , తపస్సు , దానముకూడ జనులకు మూడువిధములుగ ప్రియమై యుండుచున్నది . ఆ యాహారాదుల ఈ భేదమునుగూర్చి ( చెప్పెదను ) వినుము .

అ.
ఆయుఃసత్త్వబలారోగ్య
సుఖప్రీతివివర్ధనాః|
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా
ఆహారాః సాత్త్వికప్రియాః|| 17-8

కందము.
ఆరోగ్యాయుర , బలముల్
దోరంబై సుఖదముల్ , మధుర , రుచిర , రస
స్ఫారిత సుస్నిగ్ధపు నా
హారము లే ప్రీతిఁ గుడుతు , రాసత్త్వ గుణుల్ . ౮
ఆయుస్సును , మనోబలమును , దేహబలమును , ఆరోగ్యమును , సౌఖ్యమును , ప్రీతిని బాగుగ వృద్ధినొందించునవియు , రసము గలవియు , చమురుగలవియు , దేహమందు చాలకాలముండునవియు , మనోహరములైనవియునగు ఆహారములు సత్త్వగుణముగలవారికి ఇష్టములై యుండును .

అ.కట్వమ్లలవణాత్యుష్ణ
తీక్ష్ణరూక్షవిదాహినః|
ఆహారా రాజసస్యేష్టా
దుఃఖశోకామయప్రదాః|| 17-9

కందము .
కారమ్ము , లుప్పు , పులుసులు
తోరంబై శోక రోగ దురితము లౌ , నా
హారమ్ములె గారవమగు ,
నా రాజస గుణులు గుడువఁగా ననిశమ్మున్ . ౯
చేదుగాను , పులుపుగాను , ఉప్పగాను , మిక్కిలి వేడిగాను , కారముగాను , చమురులేనివిగాను , మిగుల దాహము గలుగజేయునవిగాను ఉండునవియు , ( శరీరమునకు ) దుఃఖమును , ( మనస్సునకు ) వ్యాకులత్వమును గలుగజేయునవియునగు ఆహారపదార్థములు రజోగుణముగలవానికి ఇష్టములై యుండును .

అ.
యాతయామం గతరసం
పూతి పర్యుషితం చ యత్|
ఉచ్ఛిష్టమపి చామేధ్యం
భోజనం తామసప్రియమ్|| 17-10

కందము.
రస హీన , మపక్వములును ,
నిశలందున నిల్వయుండి , నీచపు దుర్గం
ధ సమన్విత , యుచ్ఛిష్టపు
నశనము లే గుడువఁ దామసాహ్లాదములౌ . ౧౦
వండిన పిమ్మట ఒక జాము దాటినదియు ( లేక బాగుగ ఉడకనిదియు ) , సారము నశించినదియు , దుర్ఘంధము గలదియు , పాచిపోయినదియు , ( వండిన పిదప ఒక రాత్రి గడచినదియు ) , ఒకరు తినగా మిగిలినది ( ఎంగిలి చేసినది ) యు , అశుద్ధముగా నున్నదియు ( భగవంతునకు నివేదింపబడనిదియు ) అగు ఆహారము తమోగుణము గలవారి కిష్టమైనది యగును .

అ.
అఫలాఙ్క్షిభిర్యజ్ఞో
విధిదృష్టో య ఇజ్యతే|
యష్టవ్యమేవేతి మనః
సమాధాయ స సాత్త్వికః|| 17-11

కందము .
ఫల రహిత యజ్ఞకర్మం
బుల నిండు మనమ్ముతోడ , బుష్కలరీతిన్
జలిపినవె , సాత్త్విక ప్రద
విలస ద్యజ్ఞము లటంచు విదితమ్ములగున్ . ౧౧
' ఇది చేదగినదియే ' యని మనస్సును సమాధానపఱచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్ష లేనివారిచేత చేయబడుచున్నదో అది సాత్త్వక యజ్ఞ మనబడును.

అ.
అభిసన్ధాయ తు ఫలం
దమ్భార్థమపి చైవ యత్|
ఇజ్యతే భరతశ్రేష్ఠ !
తం యజ్ఞం విద్ధి రాజసమ్|| 17-12

అడియాస దవిలి , ఫలముల్
గుడువఁగ దంబార్థ మెపుడుఁ గోలాహల సం
దడినిన్ నెఱపెడు కర్మలు
నుడువఁగ నగు , రాజస మ్మనుచుఁ గౌంతేయా ! ౧౨
భరతవంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఫలమును గోరియు , డంబము కొఱకును గావింపబడు యజ్ఞమును రాజసమైన దానినిగా నీవు తెలిసికొనుము .

అ.
విధిహీనమసృష్టాన్నం
మన్త్రహీనమదక్షిణమ్|
శ్రద్ధావిరహితం యజ్ఞం
తామసం పరిచక్షతే|| 17-13

కందము .
విధి హీన , మసృష్టాన్నము ,
విధి రహితము , మంత్రహీన వితరణ హీన
గ్రధిత శ్రద్ధా రహిత
మ్మధమాధమ యజ్ఞ నిరతి , యది తామసమౌ . ౧౩
విధ్యుక్తము కానిదియు , అన్నదానము లేనిదియు , మంత్ర రహితమైనదియు , దక్షిణ లేనిదియు , శ్రద్ధ బొత్తిగ లేనిదియునగు యజ్ఞము తామసయజ్ఞమని చెప్పబడును .

అ.
దేవద్విజగురుప్రాజ్ఞ
పూజనం శౌచమార్జవమ్|
బ్రహ్మచర్యమహింసా చ
శారీరం తప ఉచ్యతే|| 17-14

కందము .
దేవ , ద్విజ , గురు , బుధ , సం
భావనమున్ , బ్రహ్మచర్య , మకుటిలము , నహిం
సావ్రత నిరతి , శుచిత్వం
బీ విధులు శరీర తపము లెన్నగఁ బార్థా ! ౧౪
దేవతలను , బ్రహ్మనిష్ఠులను , గురువులను , జ్ఞానులను ( మహాత్ములను బ్రహ్మజ్ఞానముగలపెద్దలను ) పూజించుట , బాహ్యాభ్యంతరశుద్ధి గలిగియుండుట , ఋజుత్వముతో గూడియుండుట ( కుటిలత్వము లేకుండుట , మనోవాక్కాయములతో ఏకరీతిగ వర్తించుట ) , బ్రహ్మచర్యవ్రతమును పాలించుట , ఏప్రాణిని హింసింపకుండుట , శారీరక ( శరీర సంబంధమైన ) తపస్సని చెప్పబడుచున్నది .

అ.
అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ
వాఙ్మయం తప ఉచ్యతే|| 17-15

కందము .
పరుషముల నాడకుండుట ,
నిరతము సత్యవ్రతంబు , నిగమముల నిరం
తర పఠనము , హిత వచనము
లరయగ వాగ్రూప తపము లందురు పార్థా ! ౧౫
ఇతరుల మనస్సునకు బాధగలిగింపనిదియు , సత్యమైనదియు , ప్రియమైనదియు , మేలు గలిగించునదియునగు వాక్యమును , వేదాదులయొక్క అధ్యయనమును అభ్యసించుట, ( వేదము , ఉపనిషత్తులు , భగవద్గీత , భారత భాగవత రామాయణాదులు మున్నగువానిని అధ్యయనము చేయుట , ప్రణవాది మంత్రములను జపించుట ) వాచిక తపస్సని చెప్పబడుచున్నది .

అ.
మనః ప్రసాదః సౌమ్యత్వం
మౌనమాత్మవినిగ్రహః|
భావసంశుద్ధిరిత్యేత
త్తపో మానసముచ్యతే|| 17-16

కందము .
మౌనము , జితేంద్రియత్వము ,
సూనసదృశ మృదుల భావ శుద్ధ మనమ్మున్ ,
మానసిక తపము లందురు ,
మానస వాక్కాయ త్రివిధ మహిత తపములౌ . ౧౬
మనస్సును నిర్మలముగా నుంచుట ( కలత నొందనీయక స్వచ్ఛముగా నుంచుట ) , ముఖప్రసన్నత్వము ( క్రూరభావము లేకుండుట ) , పరమాత్మను గూర్చిన మననము ( దైవధ్యానము ) గలిగియుండుట { లేక , దృశ్యసంకల్పము లెవ్వియు లేక ఆత్మయందే స్థితిగలిగియుండుట అను ( వాఙ్మౌనసహిత ) మనోమౌనము } , మనస్సును బాగుగ నిగ్రహించుట , పరిశుద్ధమగు భావము గలిగియుండుట ( మోసము మున్నగునవి లేకుండుట ) అను నివి మానసిక తపస్సని చెప్పబడుచున్నది .

అ.
శ్రద్ధయా పరయా తప్తం
తపస్తత్త్రివిధం నరైః|
అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః
సాత్త్వికం పరిచక్షతే|| 17-17

తేటగీతి .
త్రివిధ తపములు శ్రద్ధతో దివురుచుండు ,
నింద్రియ వినిగ్రహంబున నెసగి యెవఁడు
ఫల రహిత నిష్ఠతో తపం బాచరించు
నట్టి తపమును సాత్త్విక మందు రయ్య ! ౧౭
ఫలాపేక్ష లేనివారును , నిశ్చలచిత్తులును , ( లేక , దైవభావనాయుక్తులును ) అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ ( పైన దెలిపిన శారీరక , వాచిక , మానసికములను ) మూడు విధములైన తపస్సును సాత్త్వికమని ( సాత్త్వికతపస్సని ) ( పెద్దలు ) చెప్పుదురు .

అ.
సత్కారమానపూజార్థం
తపో దమ్భేన చైవ యత్|
క్రియతే తదిహ ప్రోక్తం
రాజసం చలమధ్రువమ్|| 17-18


కందము .
పరులను నాడంబరమగు
తెరఁజునఁ బూజించి , యాతిథేయం బిడ , న
స్థిర మదృఢ మగును , కిరీటీ !
అరయగ రాజస తపంబు లందురు వానిన్ . ౧౮
ఇతరులచే తాను సత్కరింపబడవలెనని , గౌరవింపబడవలెనని , పూజింపబడవలెనని డంబముతో మాత్రమే జేయబడు తపస్సు అస్థిరమై , అనిశ్చితమైనట్టి ఫలము గలదై ( లేక చపలమైనట్టి రూపముగలదై ) ఈ ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది .

అ.
మూఢగ్రాహేణాత్మనో య
త్పీడయా క్రియతే తపః|
పరస్యోత్సాదనార్థం వా
తత్తామసముదాహృతమ్|| 17-19

తేటగీతి .
మూఢ మానస నిశ్చయమ్మున స్వకీయ
పీడను సహించి , పరులకు కీడు సేయఁ
దలచి , యొనరించు , తామస ప్ర
ధానము లటంచుఁ బలుకంగ నౌను , పార్థ ! ౧౯
మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును ( శుష్కోపవాసాదులచే ) బాధించుకొనుటద్వారాగాని , లేక ఇతరులను నాశనము చేయవలెనను ఉద్దేశ్యముతో గాని చేయబడు తపస్సు తామసిక తపస్సని చెప్పబడినది .


అ.
దాతవ్యమితి యద్దానం
దీయతేऽనుపకారిణే|
దేశే కాలే చ పాత్రే చ
తద్దానం సాత్త్వికం స్మృతమ్|| 17-20

తేటగీతి .
దానములు కూడ త్రివిధమ్ముఁ దనరుచుండు ,
దేశకాల పాత్రమ్ములఁ దెలిసి , యనుప
కార భావమ్మునన్ జేయఁగలుగు దాన
తతులు సాత్త్వికమని యెన్నఁ దగును , పార్థ ! ౨౦
ఈయవలసినదేయను నిశ్చయముతో ఏదానము పుణ్యప్రదేశమందును , యోగ్యుడగువానికి మఱియు ప్రత్యుపకారముచేయ శక్తి లేని వానికొఱకు ఈయబడుచున్నదో అది సాత్త్వికదానమని చెప్పబడుచున్నది .

అ.
యత్తు ప్రత్యుపకారార్థం
ఫలముద్దిశ్య వా పునః|
దీయతే చ పరిక్లిష్టం
తద్దానం రాజసం స్మృతమ్|| 17-21

ఆటవెలది .
ఇచ్చి పుచ్చుకొనఁగ నెంచియో , వెఱచియో ,
తిరిగి ప్రత్యుపకృతి నఱయు కొఱకొ ,
లౌకికమున నెఱపు లంచపు దానముల్
రాజసములు , పాండు రాజ తనయ ! ౨౧
ప్రత్యుపకారముకొఱకుగాని , లేక ఫలము నుద్దేశించిగాని , లేక మనఃక్లేశముతో ( అతికష్టముతో ) గాని ఈయబడు దానము రాజసదానమని చెప్పబడుచున్నది .

అ.అదేశకాలే యద్దాన
మపాత్రేభ్యశ్చ దీయతే|
అసత్కృతమవజ్ఞాతం
తత్తామసముదాహృతమ్|| 17-22

తేటగీతి .
దేశకాల పాత్రమ్ములఁ దెలియకుండ ,
మూర్ఖుల క యోగ్యులకు దుష్టబుద్ధులకును ,
నింద్యమౌ రీతి దానముల్ నెఱపు టెన్నఁ ,
దామస ప్రధానములు పృథాతనూజ ! ౨౨
దానమునకు తగని ( అపవిత్రములగు ) దేశకాలములందును , పాత్రులు ( అర్హులు ) కానివానికొఱకును , సత్కారశూన్యముగను , అమర్యాదతోను ఈయబడిన దానము తామస దానమని చెప్పబడుచున్నది .

అ.
ఓంతత్సదితి నిర్దేశో
బ్రహ్మణస్త్రివిధః స్మృతః|
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ
యజ్ఞాశ్చ విహితాః పురా|| 17-23

కందము .
ఓమ్మని , త త్తని , స త్తని ,
బమ్మనుఁ బిలిచెదరు బుధులు బహు విధముల ; వే
దమ్ముల , బ్రాహ్మణముల , య
జ్ఞమ్ముల , త్రివిధముల నుడువ నగును , కిరీటీ ! ౨౩
పరబ్రహ్మమునకు ' ఓమ్ ' అనియు , ' తత్ ' అనియు , ' సత్ ' అనియు మూడువిధములగు పేర్లు చెప్పబడినవి . ఈ నామత్రయమువలననే ( దాని యుచ్ఛారణచేతనే ) పూర్వము బ్రాహ్మణులు ( బ్రహ్మజ్ఞానులు ) , వేదములు, యజ్ఞములు, నిర్మింపబడినవి .

అ.
తస్మాదోమిత్యుదాహృత్య
యజ్ఞదానతపఃక్రియాః|
ప్రవర్తన్తే విధానోక్తాః
సతతం బ్రహ్మవాదినామ్|| 17-24

తేటగీతి .
దాన , తపముల , యజ్ఞ విధానమందు ,
ఓమ్మటంచు వచించెదరో , కిరీటి !
సర్వ యజ్ఞ తపః క్రియా సరణి యందుఁ ,
దొలుత తచ్ఛబ్దమును ముముక్షులు వచింత్రు . ౨౪
అందువలన , వేదములను బాగుగ నెఱిఁగినవారియొక్క శాస్త్రోక్తములగు యజ్ఞ దాన తపః క్రియలన్నియు ఎల్లప్పుడును ' ఓమ్ ' అని చెప్పిన పిమ్మటనే అనుష్ఠింపబడుచున్నవి .

అ.
తదిత్యనభిసన్ధాయ
ఫలం యజ్ఞతపఃక్రియాః|
దానక్రియాశ్చ వివిధాః
క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః|| 17-25

తేటగీతి .
అభిలషించిన కార్య ఫలాప్తి యందు ,
దిష్ట శీలుఁడు సాధు వై తోచినపుడు ,
ప్రీతి శుభకార్యముల నాచరించి నపుడ
దెల్ల సచ్ఛబ్దమును వచియింత్రు బుధులు . ౨౫
అట్లే ' తత్ ' అను పదమును ఉచ్చరించియే ముముక్షువులు ఫలాపేక్షలేక పలువిధములైన యజ్ఞ , దాన , తపః కర్మలను చేయుచున్నారు .

అ.
సద్భావే సాధుభావే చ
సదిత్యేతత్ప్రయుజ్యతే|
ప్రశస్తే కర్మణి తథా
సచ్ఛబ్దః పార్థ యుజ్యతే|| 17-26
అ.
యజ్ఞే తపసి దానే చ
స్థితిః సదితి చోచ్యతే|
కర్మ చైవ తదర్థీయం
సదిత్యేవాభిధీయతే|| 17-27

తేటగీతి .
తపములను , యజ్ఞముల , దానతతుల యందు ,
నునికి వచియించు నప్పుడు నుడువుచుంద్రు ,
స త్తను పదంబుఁ బండితుల్ , సవ్యసాచి !
సర్వసత్కార్యములను , సచ్ఛబ్ద నియతి . ౨౬
ఓ అర్జునా ! ' కలదు ' అనెడి అర్థమందును, ' మంచిది ' అనెడి అర్థమందును ' సత్ ' అను పరబ్రహ్మ నామము ప్రయోగింపబడుచున్నది . అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ ' సత్ ' అను పదము వాడబడుచున్నది . యజ్ఞమునందును , తపస్సునందును , దానమునందుగల నిష్ఠ ( ఉనికి ) కూడ ' సత్ ' అని చెప్పబడుచున్నది .

అ.
అశ్రద్ధయా హుతం దత్తం
తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్యతే పార్థ !
న చ తత్ప్రేత్య నో ఇహ|| 17-28

తేటగీతి .
శ్రద్ధ లేనట్టి దాన , యజ్ఞ , తప , హుతము
లన్నియును నిష్ఫలంబులై యసదులగుచు ,
నిహపరంబుల రెంటిని నెందుఁగనక
వ్యర్థము లనర్థములగు , పార్థ ! నిజము . ౨౭
ఓ అర్జునా  ! అశ్రద్ధతో చేయబడిన హోమముగాని , దానముగాని , తపస్సుగాని , ఇతర కర్మలుగాని ' అసత్తని ' చెప్పబడును . అవి ఇహలోకఫలమును ( సుఖమును ) గాని , పరలోక ఫలమును ( సుఖమును ) గాని కలుగజేయవు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః|| 17 ||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథశాస్త్రిచే అనువదింపఁ బడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి శ్రీ శద్ధాత్రయ విభాగ యోగమను
సప్తాదశ తరంగము సంపూర్ణం . శ్రీ కృష్ణ బ్రహ్మార్పణమస్తు .
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును ,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రద్ధాత్రయవిభాగ యోగమను పదునేడవ అధ్యాయము . ఓమ్ తత్ సత్ .