Monday, November 30, 2009

పురుషోత్తమ ప్రాప్తియోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
ఊర్ధ్వమూలమధఃశాఖ
మశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్య పర్ణాని
యస్తం వేద స వేదవిత్|| 15-1

శ్రీ భగవానుల వాక్యము .
తేటగీతి .
ఊర్ధ్వ మూలము , తరుశాఖ లుండుఁ గ్రింద ,
వేదములె యాకులౌచు , ననాదియైన
యీ జగంబను నశ్వత్థ భూజ మలరు ,
నిది యెఱింగిన వాఁడె కోవిదుఁడు పార్థ ! ౧
దేనికి వేదములు ఆకులుగ నున్నవో , అట్టి సంసారమును అశ్వత్థ వృక్షము ( రావిచెట్టు )ను పైన వేళ్ళు గలదిగను ,క్రింద కొమ్మలు గలదిగను , ( జ్ఞానప్రాప్తి పర్యంతము ) నాశములేనిదిగను ( పెద్దలు ) చెప్పుదురు . దాని నెవడు తెలిసికొనుచున్నాడో , ఆతడు వేదార్థము నెఱిగిన వాడు ( అగుచున్నాడు ) .

ఉపజాతి.
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః|
అధశ్చ మూలాన్యనుసన్తతాని
కర్మానుబన్ధీని మనుష్యలోకే|| 15-2

ఉత్పలమాల .
కొమ్మలు క్రిందుమీఁదఁ బెనఁగొంచు బలిష్ఠగుణ ప్రవృద్ధమై
గ్రమ్ముకొనున్ , జిగుళ్ళు చిగురందుఁ గడున్ విషయాను రక్తి మన్ ,
యిమ్మహి కర్మబంధముల నీడ్చి బిగించును మానవాళి , మూ
లమ్మను రాగ తాపముల లంపటులైన కతంబు ఫల్గునా ! ౨
ఆ ( సంసార ) వృక్షముయొక్క కొమ్మలు ( సత్త్వరజస్తమోగుణములచే ) వృద్ధి బొందింపబడినవియు , ( శబ్దాది విషయములనెడు చిగుళ్ళుగలవియునై ), క్రిందికిని ( స్థావరము మొదలుకొని ) మీదికిని ( బ్రహ్మలోకము వఱకు ) వ్యాపించియున్నవి . మనుష్యలోకమునందు కర్మసంబంధమును ( కర్మవాసనలను ) గలుగజేయునవియగు దాని వేళ్ళు క్రిందను ( మీదనుగూడ ) బాగుగ విస్తరించి( దృఢముగ ) నాటుకొని యున్నవి .

ఉపజాతి .
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా|
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా|| 15-3
ఉపజాతి .

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్గతా న నివర్తన్తి భూయః|
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే|
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ|| 15-4

చంపకమాల .
తుది మొదలే కనంబడవు , తోచు మనోగత రూప భావనన్
బదిలము వ్రేళ్ళు తన్ని గరువంపు మహీజముఁగాగ బొల్చె , బె

ట్టిదపు నసంగ శస్త్రపు పటిష్ఠతతో గురువేరులన్ దెగం
జిదుపవలెన్ , గిరీటి ! ధృడచిత్తము తోడ , సమూల వృక్షమున్ . ౩
తేటగీతి .
ఎవఁడు సకలమ్మునకు మూలమవుచు నుండు ,
నెవని కడనుండి సకల ప్రవృత్తి యెసగు ,
నట్టి నాదగు సత్పథం బఱయ వలయు ,
నది గమించినఁ దిరిగి రానట్టి చోటు . ౪
ఆ సంసారవృక్షముయొక్క స్వరూపము ఆలాగున ( ఇపుడు వర్ణింపబడిన రీతిగ ) ఈ ప్రపంచమున ( సంసారాసక్తి గలవారిచేత ) తెలియబడకున్నది . దాని ఆదిగాని , అంతముగాని , మధ్యము ( స్థితి ) గాని కనబడకున్నది . గట్టిగ వేళ్ళు పాఱిన ఈ సంసారమను అశ్వత్థవృక్షమును అసంగమను బలమైన ఆయుధముచే నఱకి వైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించినవారు మఱల వెనుకకు ( సంసారమునకు ) రారో , ఎవనినుండి అనాదియైన ఈ సంసారవృక్షముయొక్క ప్రవృత్తి వ్యాపించెనో , ( అట్టి ) ఆదిపురుషుడగు పరమాత్మనే శరణు బొందుచున్నాను - అను నిట్టి ( భక్తి ) భావముతో ఆ పరమాత్మ పదమును వెదకవలయును .

ఇంద్రవజ్ర .
నిర్మానమోహా జితసఙ్గదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః|
ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్-
గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్|| 15-5

తేటగీతి .
ద్వంద్వముల యందు సమభావ మందు వారి ,
మోహ ముడిపిన వారల ముక్త సంగు
లాత్మ తత్త్వమ్ముఁ దెలిసిన యట్టివారి ,
కామ వర్జితులౌ వారి ధామ మద్ది . ౫
అభిమానము ( లేక , అహంకారము ) అవివేకము లేనివారును , సంగము ( దృశ్యపదార్థములం దాసక్తి ) అను దోషమును జయించినవారును , నిరంతరము ఆత్మజ్ఞానము ( బ్రహ్మనిష్ఠ ) గలవారును , కోరికలన్నియు లెస్సగ ( వాసనారహితముగ ) తొలగినవారును , సుఖదుఃఖములను ద్వంద్వములనుండి బాగుగ విడువబడినవారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును ( మోక్షమును ) బొందుచున్నారు .

అనుష్టుప్ .
న తద్భాసయతే సూర్యో
న శశాఙ్కో న పావకః|
యద్గత్వా న నివర్తన్తే
తద్ధామ పరమం మమ|| 15-6

కందము .
దివిటీల కరణిఁ దోచును ,
ప్రవిమల మగు నాపథంబు భాసిలఁ జేయన్ ,
రవిచంద్ర పావక ద్యుతి
నివృత్తిఁ గనరాని చోటు నిస్తుల పథమున్ . ౬
ఆ ( పరమాత్మ ) స్థానమును సూర్యుడుగాని , చంద్రుడుగాని , అగ్నిగాని ప్రకాశింపజేయజాలరు . దేనిని పొందినచో ( జనులు ) మఱల ( ఈ సంసారమునకు ) తిరిగిరారో అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థానము ( అయియున్నది ) .

అ.
మమైవాంశో జీవలోకే
జీవభూతః సనాతనః|
మనఃషష్ఠానీన్ద్రియాణి
ప్రకృతిస్థాని కర్షతి|| 15-7

తేటగీతి .

ప్రాణికోటి మదీయాంశ భవమెయైన ,
మనసు కర్మేంద్రియము లారు గొని చరింతు ,
రీ శరీరమ్ములను నాశ్రయించు కొనుచు ,
ప్రకృతి వశులౌదు రిట్లు నిరంతరంబు . ౭
నాయొక్కయే అనాదియగు ( నిత్యమగు ) అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్ చక్షు శ్శ్రోత్ర జిహ్వా ఘ్రాణ మనంబు లను ఆఱు ఇంద్రియములను ఆకర్షించుచున్నది .

అ.

శరీరం యదవాప్నోతి
యచ్చాప్యుత్క్రామతీశ్వరః|
గృహీత్వైతాని సంయాతి
వాయుర్గన్ధానివాశయాత్|| 15-8

చంపకమాల .
తనువుల దాల్చినప్పుడు , విదిల్చిన యప్పుడు జీవి నిత్యమున్
దన వెనువెంట నింద్రియ వితానము లారిటి గొంచు నేగు , నా

యనిలుఁడు సూన వాసనక్రియన్ వెనుకాడుచునుండుఁ , గర్మ వా
సనల పరంపరాగమము జన్మల చావుల కారణమ్ము లై . ౮
( దేహేంద్రియాది సంఘాతమునకు ) ప్రభువగు జీవుడు శరీరమును విడుచునప్పుడును , నూతన శరీరమును పొందునపుడును - పుష్పాది స్థానములనుండి గాలి వాసనలను గ్రహించిపోవు చందమున - పంచేంద్రియములు , మనస్సు అను ఆఱింటిని గ్రహించి వెడలుచున్నాడు .

అ.
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ
రసనం ఘ్రాణమేవ చ|

అధిష్ఠాయ మనశ్చాయం
విషయానుపసేవతే|| 15-9

తేటగీతి .
చెవులు , గన్నులు , జర్మమ్ము , చవులవాయి
నాసికయుఁ గూడి యారు మనంబు తోడ
దేహములయందు జీవి వర్తించి , విషయ
భోగలాలసుఁడై యుండు , మోహితుఁడయి . ౯
ఈ జీవుడు ( జీవాత్మ ) చెవిని , కంటిని , చర్మమును , ( త్వగింద్రియమును ) నాలుకను , ముక్కును , మనస్సును ఆశ్రయించి ( శబ్దాది ) విషయములను అనుభవించుచున్నాడు .

అ.
ఉత్క్రామన్తం స్థితం వాపి
భుఞ్జానం వా గుణాన్వితమ్|
విమూఢా నానుపశ్యన్తి
పశ్యన్తి జ్ఞానచక్షుషః|| 15-10

ఆటవెలది .
ఉండి యనుభవమ్ము నొందుచున్నది యేది ,
పోవునపుడుఁ దరలి పోవు నేది ,
యెఱుగలేరు మూఢ నరులీ రహస్యమ్ము ;
జ్ఞానులైన వారు కానఁ గలరు . ౧౦
( ఒక శరీరమునుండి మఱియొక శరీరమునకు ) బయలుదేఱుచున్నవాడును , శరీరమునందున్నవాడును , లేక విషయముల ననుభవించుచున్నవాడును , ( సత్త్వాది ) గుణములతో గూడినవాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు ( తెలిసికొన జాలరు ) . జ్ఞానదృష్టిగలవారు మాత్రము చూచుచున్నారు ( తెలిసికొనుచున్నారు ) . ( అనగా ఆ యా క్రియలు జరుపుచున్నపు డాతనిని అజ్ఞులెఱుగజాలరనియు , జ్ఞానులుమాత్ర మెఱుగగలరనియు భావము ) .

అ.
యతన్తో యోగినశ్చైనం
పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|
యతన్తోऽప్యకృతాత్మానో
నైనం పశ్యన్త్యచేతసః|| 15-11

ఆటవెలది .
జ్ఞానులైనవారు స్వస్వరూపము నందె
ఆత్మ నరసి ముదము నందు చుంద్రు ;
వికృత మార్గగామి యకృ తాత్ముఁ డగువాఁడు
లోఁ గలట్టి యాత్మ నీగలేడు . ౧౧
( ఆత్మ సాక్షాత్కారమునకై ) ప్రయత్నము చేయుచున్న యోగులు ( తమయందున్నట్టి ) ఈ ఆత్మను చూచుచున్నారు ( అనుభూతమొనర్చుకొనుచున్నారు ) . అట్లు ప్రయత్నముచేయు చున్న వారైనను చిత్త శుద్ధిలేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు .

అ.
యదాదిత్యగతం తేజో
జగద్భాసయతేऽఖిలమ్|
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ
తత్తేజో విద్ధి మామకమ్|| 15-12

తేటగీతి .
అర్క తేజము , శశి తేజ , మగ్ని తేజ
మీ విభాసము లెల్లయు నావె కావె ;
సకలము ప్రకాశము నొనరింతు , జగతి నెల్ల
తేజముల భాసిలం జేయు తేజ మేనె . ౧౨
సూర్యునియం దే తేజస్సు ( ప్రకాశము , చైతన్యము ) ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో , అట్లే చంద్రునియందును , అగ్ని యందును ఏ తేజస్సు గలదో , అదియంతయు నాదిగా నెఱుఁగుము .

అ.
గామావిశ్య చ భూతాని
ధారయామ్యహమోజసా|
పుష్ణామి చౌషధీః సర్వాః
సోమో భూత్వా రసాత్మకః|| 15-13


తేటగీతి .
ధర ప్రవేశించి , నే భూతతతి ధరింతు ,
దివ్యమగు నా బలంబున , సవ్యసాచి !
సోమ రూపుండనై , రసం బోమి , సకల
యోషధుల పుష్టి గూర్చెదనో కిరీటి ! ౧౩
మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను ( నిలుపుచున్నాను ) . రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నింటిని పోషించుచున్నాను .

అ.
అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్|| 15-14


తేటగీతి .
ప్రాణికోటుల దేహంబులందు నుండు
నల్ల వైశ్వానరుండ , జఠరాగ్ని నేనె ;
ప్రాణము నపానవాయువుల్ పదిలపఱచి ,
నలువిధంబుల యన్నముల్ బచనపఱతు . ౧౪
నేను ' వైశ్వానరుడ ' ను జఠరాగ్నిగానయి ప్రాణులయొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపానవాయువులతో గూడుకొని నాలుగు విధములగు అన్నమును పచనము చేయుచున్నాను .

ఇంద్రవజ్ర .
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనఞ్చ|
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్|| 15-15

తేటగీతి .

ప్రాణికోటుల హృదయాంతరముల నుండి ,
స్మృతియు , విస్మృతి , జ్ఞాన మిచ్చెదను నేనె ;
వేదములు నేనె , వేదాంత వేద్యుఁ డేనె ,
సకల వేదాంతముల ప్రవర్తకుఁడ నేనె . ౧౫
నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందున్నవాడను ; నావలననే ( జీవునకు ) జ్ఞాపకశక్తి , జ్ఞానము ( తెలివి ) , మఱపు కలుగుచున్నవి . వేదము లన్నిటి చేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను . మఱియు వేదము నెఱిఁగినవాడనుగూడ నేనే అయియున్నాను .

అ.
ద్వావిమౌ పురుషౌ లోకే
క్షరశ్చాక్షర ఏవ చ|
క్షరః సర్వాణి భూతాని
కూటస్థోऽక్షర ఉచ్యతే|| 15-16

తేటగీతి .

పురుషు లిరువురు , క్షరుఁడు నక్షరుఁడు ననగ
క్షరము భూతముల్ , దేహి యక్షరుఁడు , పార్థ !
అల పరాపర ప్రకృతి ద్వయము , కిరీటి !
యీ ద్వయంబగు పురుషుల నెఱిగి కొనుము . ౧౬
ప్రపంచమునందు క్షరుడనియు , అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు . అందు సమస్త ప్రాణులయొక్క దేహములు ( ఉపాధులు ) క్షరుడనియు , కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచున్నారు .

అ.
ఉత్తమః పురుషస్త్వన్యః
పరమాత్మేత్యుధాహృతః|
యో లోకత్రయమావిశ్య
బిభర్త్యవ్యయ ఈశ్వరః|| 15-17

తేటగీతి .

ప్రకృతి పురుషులకు నతీతుఁ డొకఁడు కలఁడు ,
అతఁడె ముల్లోకముల భర్త యవ్యయుండు ;
నుత్తమోత్తముఁ డా పురుషోత్తముండు ,
వేద వేదాంతములయందు వినుతిగాంచు . ౧౭
ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచచున్నాడో , అట్టి నాశరహితుడును , జగన్నియామకుడును , ( పైన దెల్పిన క్షరా క్షరులిద్దఱికంటెను ) వేఱైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు .


అ.
యస్మాత్క్షరమతీతోऽహ
మక్షరాదపి చోత్తమః|
అతోऽస్మి లోకే వేదే చ
ప్రథితః పురుషోత్తమః|| 15-18

తందము .
క్షరునకుఁ బరమై , యల య

క్షరున కతీతుండ నయిన కతమున నన్నున్
స్థిరచిత్త భక్తి యుక్తులు
పురుషోత్తముఁడని నుతింత్రు ముల్లోకములన్ . ౧౮
నేను క్షర స్వరూపునికంటె మించినవాడను , అక్షర స్వరూపుని ( జీవుని ) కంటె శ్రేష్ఠుడను అయి యున్నందువలన ప్రపంచమునందును , వేదమునందును ' పురుషోత్తము ' డని ప్రసిద్ధి కెక్కియున్నాను .

అ.
యో మామేవమసమ్మూఢో

జానాతి పురుషోత్తమమ్|
స సర్వవిద్భజతి మాం
సర్వభావేన భారత|| 15-19

చంపకమాల .
స్తుతు లొనరించి , నన్ను పురుషోత్తముఁ డంచు నెఱింగి కొన్న యా
యతులిత భక్తుఁడే గనెడు నన్నిట నన్ను చరాచరంబు , లే
వితమగు మోహముం గనక ; విశ్వమయున్ సకలాత్మకుండ భూ

తతతి స్వరూపుఁడౌ నను సతంబు భజించుచు నుండు , భారతా ! ౧౯
ఓ అర్జునా ! ఎవడు అజ్ఞానము లేనివాడై , ఈ ప్రకారముగ నన్ను పురుషోత్తమునిగా నెఱుఁగుచున్నాడో , అతడు సమస్తమును దెలిసినవాడగుచు పూర్తి మనస్సుతో ( సర్వవిధముల ) నన్ను భజించుచున్నాడు .

అ.
ఇతి గుహ్యతమం శాస్త్ర
మిదముక్తం మయానఘ|

ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్
కృతకృత్యశ్చ భారత ! || 15-20

కందము .
అతి గుహ్యంబగు శాస్త్రపు
విత మెల్లనుఁ బల్కితిని ; వివేకముఁ గనుచున్ ,
మతిమంతుఁడై యెఱింగిన ,

కృత కృత్యుఁడు వాఁడె పో కిరీటి ! జగమునన్ . ౨౦
పాపరహితుడవగు ఓ అర్జునా ! ఈ ప్రకారముగ అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పితిని . దీనిని చక్కగా తెలిసికొనినవాడు జ్ఞానవంతుడును , కృతకృత్యుడును కాగలడు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
పురుషోత్తమయోగో నామ పఞ్చదశోऽధ్యాయః|| 15 ||

ఓం తత్ సత్ .ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రిచే
యనువదింపబడినశ్రీ గీతామృత తరంగిణి యందు శ్రీ పురుషోత్తమ
ప్రాప్తి యోగ నామ పంచాదశ తరంగము సంపూర్ణము .
శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మ విద్యయు , యోగ శాస్త్రమును ,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు పురుషోత్తమ ప్రాప్తియోగమను పదునైదవ అధ్యాయము సంపూర్ణం. ఓమ్ తత్ సత్ .

Monday, November 23, 2009

గుణత్రయవిభాగ యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
పరం భూయః ప్రవక్ష్యామి
జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యజ్జ్ఞాత్వా మునయః సర్వే
పరాం సిద్ధిమితో గతాః|| 14-1

శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి .
మునులు , సంయమీంద్రులు మోక్షమును గమించి ,
రెట్టి సుజ్ఞానమును బొంది , రట్టి నిరుప
మాన ముత్తమ జ్ఞాన విధాన మెల్లఁ ,
దిరిగి చెప్పెద నీకుఁ , గుంతీ కుమార ! ౧
శ్రీ భగవంతుడు చెప్పెను .
( ఓ అర్జునా ! ) దేనిని తెలిసికొని మునులందఱును ఈ సంసారబంధమునుండి ( విడివడి ) సర్వోత్తమమగు మోక్షసిద్ధిని బడసిరో అట్టి - పరమాత్మవిషయికమైనదియు , జ్ఞానములలోకెల్ల నుత్తమమైనదియు నగు జ్ఞానమును మఱల చెప్పుచున్నాను .

అనుష్టుప్.
ఇదం జ్ఞానముపాశ్రిత్య
మమ సాధర్మ్యమాగతాః|
సర్గేऽపి నోపజాయన్తే

ప్రలయే న వ్యథన్తి చ|| 14-2

కందము .
సలలితమగు నా జ్ఞానం
బలవడి మద్భావమంది యలరి రనేకుల్ ;
గలుగవు పుట్టుక చావులు
ప్రళయంబులనైన చ్యుతిని వడయరు వారల్ . ౨
ఈ జ్ఞానము నాశ్రయించి జనులు నాతో నైక్యము నొందినవారై ( నా స్వరూపమును బడసి ) సృష్టికాలమున జన్మింపరు . ప్రళయకాలమున నశింపరు ( జనన మరణ రహితులై పునరావృత్తి లేక యుందురని భావము ) .

అనుష్టుప్.
మమ యోనిర్మహద్ బ్రహ్మ
తస్మిన్గర్భం దధామ్యహమ్|
సమ్భవః సర్వభూతానాం
తతో భవతి భారత|| 14-3

ఆటవెలది .
అపరప్రకృతి యోని యజుని బీజము గాగ
నునిచి , సృష్టి గర్భ మొనరఁ జేసి ,
సర్వభూత తతుల సంభవింపగఁ జేతు ,
మామకీనమైన మాయచేత . ౩
అర్జునా ! గొప్పదైన మూలప్రకృతి ( మాయ ) నాయొక్క సర్వభూతోత్పత్తి స్థానము . అద్దానియందు నేను గర్భకారణమైన చైతన్యరూపమగు బీజము నుంచుచున్నాను .

అ.
సర్వయోనిషు కౌన్తేయ !
మూర్తయః సమ్భవన్తి యాః|
తాసాం బ్రహ్మ మహద్యోని
రహం బీజప్రదః పితా|| 14-4

ఆటవెలది .
అపరప్రకృతి యోని నల బ్రహ్మదేవుండు
వృద్ధియౌ పరాప్రకృతి , కిరీటి !
ఈ జగమున సృష్టి బీజ ప్రదాతను ,
పితను నేనె భూత తతుల కెల్ల . ౪
అర్జునా ! ( దేవమనుష్యాది ) సమస్తజాతులందును ఏ శరీరము లుద్భవించుచున్నవో వానికి మూలప్రకృతి ( మాయ ) యే మాతృస్థానము ( తల్లి ) , నేను బీజ ముంచునట్టి తండ్రిని .

అ.
సత్త్వం రజస్తమ ఇతి
గుణాః ప్రకృతిసమ్భవాః|
నిబధ్నన్తి మహాబాహో !
దేహే దేహినమవ్యయమ్|| 14-5

తేటగీతి .
సత్త్వము రజస్తమంబులు , సంభవంబు
నందుచుండును ప్రకృతి మాయను , గిరీటి !
అవ్యయంబగు దేహి సుఖానుబంధ
మొందు చుండును దేహంబులందు నెపుడు . ౫
గొప్ప భుజములుగల ఓ అర్జునా ! ప్రకృతివలనబుట్టిన సత్త్వరజస్తమోగుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమునందు ( లేక దేహమునకు ) బంధించివైచుచున్నవి .

అ.
తత్ర సత్త్వం నిర్మలత్వా
త్ప్రకాశకమనామయమ్|
సుఖసఙ్గేన బధ్నాతి
జ్ఞానసఙ్గేన చానఘ|| 14-6


కందము.
నిరుపద్రవ , నిర్మల , భా
సుర సత్త్వ గుణాళి దేహి , సుఖ సంగమునన్
నిరుపమ సుజ్ఞానమునన్
దిరముగ బందీకృతుండు , దేహము నందున్ . ౬
పాపరహితుడవగు ఓ అర్జునా ! ఆ సత్త్వాది గణములలో సత్త్వగుణము నిర్మలమైనదగుటవలన ప్రకాశమును గలుగజేయునదియు . ఉపద్రవములేనిదియు , ( అగుచు ) ( ఇంద్రియ ) సుఖమునందలి ఆసక్తి చేతను , ( వృత్తి ) జ్ఞానమునందలి ఆసక్తి చేతను జీవుని బంధించుచున్నది .

రజో రాగాత్మకం విద్ధి
తృష్ణాసఙ్గసముద్భవమ్|
తన్నిబధ్నాతి కౌన్తేయ
కర్మసఙ్గేన దేహినమ్|| 14-7

కందము .

రాగాత్మికము రజోగుణ
మాగక , తృష్ణా వివృద్ధమగుచున్ , కార్యో
ద్వేగమున దేహముల క
ర్మాగారల దేహి కర్మ రజ్జుల నుండున్ . ౭<
ఓ అర్జునా ! రజోగుణము దృశ్యవిషయములయెడల ప్రీతినిగలుగజేయునదియు , తృష్ణను ( కోరికను ) , ఆసక్తిని గలుగజేయునదియు ( అని ) యెఱుఁగుము . అయ్యది కర్మములందలి ఆసక్తి చేత ( కర్మ సంబంధము చేత ) ఆత్మను ( జీవుని ) లెస్సగ బంధించివేయుచున్నది .


అ.
తమస్త్వజ్ఞానజం విద్ధి
మోహనం సర్వదేహినామ్|
ప్రమాదాలస్యనిద్రాభి
స్తన్నిబధ్నాతి భారత|| 14-8

కందము .
తమసం బజ్ఞానజమగు ,

దమము ప్రమాదంబు నిద్ర తన్మయమును మో
హముల బిగించును దేహిన్ ,
దమో గుణములివ్వి బంధన మ్మొనరింపన్ . ౮
ఓ అర్జునా ! తమోగుణము అజ్ఞానమువలన కలుగునదియు , సమస్త ప్రాణులకును మోహమును ( అవివేకమును ) గలుగ జేయునదియునని యెఱుఁగుము . అయ్యది మఱపు ( పరాకు ) , సోమరితనము , నిద్ర , మొదలగువానిచే జీవుని లెస్సగ బంధించివేయుచున్నది .

అ.

సత్త్వం సుఖే సఞ్జయతి
రజః కర్మణి భారత ! |
జ్ఞానమావృత్య తు తమః
ప్రమాదే సఞ్జయత్యుత|| 14-9

తేటగీతి .
సత్త్వగుణము సుఖంబునే సంతరించు ;

నల రజోగుణ మెపుడు కర్మలనె ద్రిప్పు ;
తామస గుణము కడు ప్రమాదమును గూర్చి ,
జ్ఞాన మెల్లనుఁ గప్పు నిశ్చయము , పార్థ ! ౯
ఓ అర్జునా ! సత్త్వగుణము సుఖమునందును , రజోగుణము కర్మమునందును , తమోగుణము జ్ఞానమును ( వివేకమును ) కప్పివైచి ప్రమాదము ( పొరపాటు ) నందును జీవుని చేర్చుచున్నవి ( కలుపు చున్నవి ) , ఆశ్చర్యము 1


అ.
రజస్తమశ్చాభిభూయ
సత్త్వం భవతి భారత ! |
రజః సత్త్వం తమశ్చైవ
తమః సత్త్వం రజస్తథా|| 14-10

తేటగీతి .

సత్త్వము రజస్తమంబులన్ సడల నడచు ;
రజము సత్త్వతమముల నీరవముఁ జేయు ;
దమము సత్త్వరజముల నింధన మొనర్చుఁ ;
ద్రిగుణములు పరస్పర శత్రులగుచు నుండు . ౧౦
ఓ అర్జునా ! సత్త్వగుణము ( బలము కలిగియుండునపుడు ) రజోగుణ తమోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును . అట్లే రజోగుణము సత్త్వగుణ తమోగుణములను - తమోగుణము సత్త్వగుణ రజోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును .

అ.
సర్వద్వారేషు దేహేऽస్మి
న్ప్రకాశ ఉపజాయతే|
జ్ఞానం యదా తదా విద్యా
ద్వివృద్ధం సత్త్వమిత్యుత|| 14-11


కందము.
సకలేంద్రియముల దేజము
వికసిల్లి విభాసమొంది , విజ్ఞానముతో
ప్రకటిత మగునప్పుడు స
త్త్వ కళోన్నతిఁ గాగ నెఱుఁగ దగుఁ , గౌంతేయా ! ౧౧
ఎప్పుడీ శరీరమునందు శ్రోత్రాది ఇంద్రియద్వారము లన్నిటియందును ప్రకాశరూపమగు ( బుద్ధివృత్తిరూపమగు ) జ్ఞానము కలుగుచున్నదో , అప్పుడు సత్త్వగుణము బాగుగ వృద్ధినొందియున్నదని తెలిసికొనవలెను .

అ.
లోభః ప్రవృత్తిరారమ్భః
కర్మణామశమః స్పృహా|
రజస్యేతాని జాయన్తే
వివృద్ధే భరతర్షభ ! || 14-12


కందము.
పరధన హరణాసక్తియు ,
నిరత వ్యవహార కర్మ నిరతిఁ గనుటయున్ ,
దురిత మనము , విషయేచ్ఛయు
నురవందు రజోగుణమ్ము లో కౌంతేయా ! ౧౨
భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! రజోగుణ మభివృద్ధి నొందునపుడు మనుజునియందు లోభత్వము , కార్యములందు ప్రవృత్తి , ( కామ్య , నిషిద్ధ ) కర్మములను ప్రారంభించుట , మనశ్శాంతి లేకుండుట , ( లేక ఇంద్రియనిగ్రహము లేకుండుట ) ఆశ అను నివి పుట్టుచుండును .

అ.
అప్రకాశోऽప్రవృత్తిశ్చ
ప్రమాదో మోహ ఏవ చ|
తమస్యేతాని జాయన్తే
వివృద్ధే కురునన్దన|| 14-13


కందము .
అవివేక , మూఢ భావ
మ్మవకార్యము , మంద బుద్ధి , అలసత్వము , బు
ట్టువ గనుచు తమోగుణమున ,
వివృతములై మోహమునఁ దపింపగ జేయున్ . ౧౩
కురువంశీయుడవగు ఓ అర్జునా ! తమోగుణము అభివృద్ధి నొందినదగుచుండగా మనుజునియందు అవివేకము ( బుద్ధిమాంద్యము ) , సోమరితనము , అజాగ్రత , అజ్ఞానము , మూఢత్వము, ( లేక , విపరీత జ్ఞానము ) అను నివి కలుగుచున్నవి .

అ.
యదా సత్త్వే ప్రవృద్ధే తు
ప్రలయం యాతి దేహభృత్|
తదోత్తమవిదాం లోకా
నమలాన్ప్రతిపద్యతే|| 14-14

తేటగీతి .

సత్త్వగుణుఁ డౌచు మరణింప తత్త్వ వేత్త
లొందు నిర్మల లోకమ్ము నందువాఁడు ;
అల రజోగుణుల్ కర్మలం దలము కొని గ
తించ , మానవుడౌచు , జనించు మఱల . ౧౪
ఎప్పుడైతే జీవుడు సత్త్వగుణ మభివృద్ధిని బొందినదగుచుండగా మరణించునో , అప్పు డతడు ఉత్తమజ్ఞానముగలవారియొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును .


అ.
రజసి ప్రలయం గత్వా
కర్మసఙ్గిషు జాయతే|
తథా ప్రలీనస్తమసి
మూఢయోనిషు జాయతే|| 14-15

తేటగీతి .
తామస గుణ ప్రధానుఁడై తనువుఁ దొరగ ,

మూఢ యోనులలో జన్మముల మునుంగు ,
హేయ సూకర పశ్వాది హీన యోనిఁ
బుట్టుకలుఁ గాంచి నిరతమ్ముఁ గొట్టు కొంద్రు . ౧౫
రజోగుణము అభివృద్ధినొందియుండగా మరణించువాడు కర్మాసక్తులగు వారియందు జన్మించుచున్నాడు . అట్లే తమోగుణ మభివృద్ధినొందియుండగా మరణించువాడు పామరుల గర్భములందు , లేక పశుపక్ష్యాది హీనజాతులందు పుట్టుచున్నాడు .

అ.
కర్మణః సుకృతస్యాహుః

సాత్త్వికం నిర్మలం ఫలమ్|
రజసస్తు ఫలం దుఃఖ
మజ్ఞానం తమసః ఫలమ్|| 14-16

ఆటవెలది .
సత్త్వ గుణము లిచ్చు స్వచ్ఛ జీవనమును ,
రాజసమ్ము దుఃఖ భాజనమ్ము ,
తామస గుణమిచ్చుఁ దన్మయం బజ్ఞాన

మూఢభావ మాది మోహజడము . ౧౬
సాత్త్వికమైన కర్మమునకు ( లేక పుణ్యకార్యములకు ) సత్త్వగుణసంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు , రజోగుణసంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు , తమోగుణసంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు ( పెద్దలు ) చెప్పుదురు .

అ.
సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం
రజసో లోభ ఏవ చ|
ప్రమాదమోహౌ తమసో

భవతోऽజ్ఞానమేవ చ|| 14-17

తేటగీతి .
సత్త్వమున జనియించును జ్ఞాన సంపదల , ర
జో గుణమ్మున లోభ మెచ్చుగ జనించు ;
తామస గుణంబులం బ్రమాదమును , మోహ
మజ్ఞతలు పుట్టుచుండు , పృథా తనూజ ! ౧7
సత్త్వగుణమువలన జ్ఞానము , రజోగుణము వలన లోభము , తమోగుణము వలన అజాగ్రత (మఱపు ) , భ్రమ , అజ్ఞానము కలుగుచున్నవి .

అ.
ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా
మధ్యే తిష్ఠన్తి రాజసాః|
జఘన్యగుణవృత్తిస్థా
అధో గచ్ఛన్తి తామసాః|| 14-18

ఆటవెలది .
సత్త్వశీలుఁ డైన స్వర్గ లోకముఁ గాంచు ;
రాజసుఁడు మనుష్య బీజమందు ;
తామసుండు పుట్టుఁ దన్ను తా నెఱుఁగని ,
హీనయోనులం దనేక గతుల . ౧౮
సత్త్వగుణము గలవారు ( మరణానంతరము ) ఊర్ధ్వలోకముల కేగుచున్నారు . రజోగుణము గలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు . నీచగుణ ప్రవృత్తిగల తమోగుణయుతులు ( పాతాళాది ) అధోలోకములకు ( లేక , పశ్వాదిజన్మములకు ) జనుచున్నారు .

అ.
నాన్యం గుణేభ్యః కర్తారం
యదా ద్రష్టానుపశ్యతి|
గుణేభ్యశ్చ పరం వేత్తి
మద్భావం సోऽధిగచ్ఛతి|| 14-19

తేటగీతి .
గుణ వికారమ్ము ప్రకృతి లక్షణ మటంచు
గుణములే కర్తలంచు బాగుగా నెఱింగి ;
గుణపరంబగు తత్త్వంబు గుఱుతెఱుంగు
నా మహాత్ముఁడు మద్భావ మందగలడు . ౧౯
ఎప్పుడు వివేకవంతుడు ( సత్త్వాది ) గుణములకంటె నితరమును కర్తగానెంచడో , మఱియు తన్ను గుణములకంటె వేఱగువానినిగ దెలిసికొనుచున్నాడో , అపు డాతడు నా స్వరూపమును ( మోక్షమును ) పొందుచున్నాడు .

అ.
గుణానేతానతీత్య త్రీన్
దేహీ దేహసముద్భవాన్|
జన్మమృత్యుజరాదుఃఖై
ర్విముక్తోऽమృతమశ్నుతే|| 14-20

తేటగీతి .
త్రిగుణముల వికారముల నతిక్రమించి ,
త్రిగుణ సంగుఁడు కాకుండు ధీయుతుండు
తనువునందుండి ముక్తుఁడై , తనరుచుండు ,
జన్మమృత్యు జరాదుఃఖ సరణిఁ గనఁడు . ౨0
జీవుడు దేహోత్పత్తికి కారణభూతములగు ఈ మూడు గుణములను దాటి ( దాటినచో ) పుట్టుక , చావు , ముసలితనము , దుఃఖములు - అనువానిచేత లెస్సగ విడువబడినవాడై , మోక్షమును ( మరణరహిత ఆత్మస్థితిని ) బొందుచున్నాడు .

అర్జున ఉవాచ
|అ.
కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతా
నతీతో భవతి ప్రభో ! |
కిమాచారః కథం చైతాం
స్త్రీన్గుణానతివర్తతే|| 14-21

అర్జును వాక్యము .
తేటగీతి .
ఈ గుణాతీతు నెట్టుల నెఱుఁగ వలయు ,
గుణముల నతిక్రమించు నిర్గుణ గరిష్టుఁ ,
డా గుణాతీతు నాచార మాది సకల
చిహ్నములు నాకు దయచేసి , చెప్పుమయ్య  ! ౨౧
అర్జును డడిగెను .
ప్రభువగు ఓ కృష్ణా ! ఈ మూడు గుణములను దాటినవా డెట్టి లక్షణములతో గూడియుండును ? ఎట్టి ప్రవర్తన కలిగియుండును ? మఱియు ఈ మూడు గుణములను నాత డేప్రకారము దాటివేయగల్గును ?

శ్రీభగవానువాచ|
అ.

ప్రకాశం చ ప్రవృత్తిం చ
మోహమేవ చ పాణ్డవ ! |
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని
న నివృత్తాని కాఙ్క్షతి|| 14-22
అ.
ఉదాసీనవదాసీనో
గుణైర్యో న విచాల్యతే|
గుణా వర్తన్త ఇత్యేవ

యోऽవతిష్ఠతి నేఙ్గతే|| 14-23
అ.
సమదుఃఖసుఖః స్వస్థః
సమలోష్టాశ్మకాఞ్చనః|
తుల్యప్రియాప్రియో ధీర
స్తుల్యనిన్దాత్మసంస్తుతిః|| 14-24
అ.
మానాపమానయోస్తుల్య
స్తుల్యో మిత్రారిపక్షయోః|

సర్వారమ్భపరిత్యాగీ
గుణాతీతః స ఉచ్యతే|| 14-25

శ్రీ భగవానుల వాక్యము .

కందము .
త్రిగుణాత్మకమగు కర్మల
తగులము ద్వేషింపఁ బోడు , తరలిన దానన్

వగవఁడు , కాంక్షింపఁడు , క
ర్మ గతికిఁ జలియింపకుండు , మహితాత్ముండై . ౨౨

చంపకమాల .
గుణముల తీవ్రతన్ మదిని గూర్పక సుంతఁ జలింపకుండెడున్ ,
గుణములె యీవికారముల గోడుఁ దగుల్కొనె నంచుఁ జిత్తమం
దనయము నెంచి నిశ్చలత నందును ద్వంద్వములందు నెందునన్
మనము వికారమందక , విమత్సర చిత్తత నుండు ఫల్గుణా ! ౨౩


ఉత్పలమాల .
తుల్యము దుఃఖమున్ , సుఖము , తుల్యము మన్ను సువర్ణమున్ , శిలల్ ;
తుల్య మనిష్ట మిష్టములు , దుల్యము దూషణ భూషణమ్ములున్ ;
తుల్యము మిత్రులన్ రిపుల , తుల్యమనం బవమాన మాన్యతన్ ;
తుల్యుఁడు సర్వకర్మల విలోలుడు గాఁడు గుణోత్తరుండిటుల్ . ౨౪
ఓ అర్జునా ! ఎవడు తనకు సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును ( సుఖమును ) గాని , రజోగుణసంబంధమగు కార్యప్రవృత్తినిగాని , తమోగుణ సంబంధ మగు మోహమును ( నింద్రాతంద్రతలను ) గాని ద్వేషింపడో , అవి తొలగిపోయినచో వానిని అపేక్షింపడో , తటస్థునివలె ఉన్నవాడై గుణముల చేత ( గుణకార్యములగు సుఖాదులచేత ) చలింపడో , గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొనియుండునో , ( ఏ పరిస్థితులయందును ) చలింపక నిశ్చలముగ నుండునో , మఱియు ఎవడు సుఖదుఃఖములందు సమభావము గలవాడును , ఆత్మయందే స్థిరముగనున్నవాడును , మట్టిగడ్డ , ఱాయి , బంగారము - వీనియందు సమబుద్ధిగలవాడును , ఇష్టానిష్టములందు సమభావము గల్గియుండువాడును , ధైర్యవంతుడును , సమస్త కార్యములందును కర్తృత్వబుద్ధిని వదలువాడును , ( లేక కామ్యకర్మల నన్నిటిని విడచువాడును , లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠయందుండువాడును ) అయియుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును .

అ.
మాం చ యోऽవ్యభిచారేణ
భక్తియోగేన సేవతే|
స గుణాన్సమతీత్యైతాన్
బ్రహ్మభూయాయ కల్పతే|| 14-26


చంపకమాల .
నను సతతంబు భక్తిని ననన్యముగా భజియించు భక్తుఁడే
గుణము లతిక్రమింపఁ గలుగున్ , సమభావ సమన్వితుండగున్ ,
ననుఁగన నర్హుఁ డౌ నతఁడె ; నా ప్రతిబింబ స్వరూప తేజుఁ , డ
య్యనఘుఁడె , బ్రహ్మభావ మలరారి విముక్తిని గాంచు ఫల్గునా ! ౨౫
ఎవడు నన్నే అచంచలమైన భక్తియోగముచేత సేవించుచున్నాడో , అత డీ గుణములన్నిటిని లెస్సగా దాటివైచి బ్రహ్మముగానగుటకు ( జీవన్ముక్తుడగుట కొఱకు ) సమర్థు డగు చున్నాడు .

అ.
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహ
మమృతస్యావ్యయస్య చ|
శాశ్వతస్య చ ధర్మస్య
సుఖస్యైకాన్తికస్య చ|| 14-27


కందము .
అమృత , మ్మవ్యయ , శాశ్వత
మమల మ్మానంద రూపమగు నమర జ్యో
తి , మదీయ కళాన్విత భా
గముఁ గాదె , కిరీటి ! ప్రత్యగాత్మౌ నాకున్ . ౨౬
ఏలయనగా , నేను నాశరహితమును , నిర్వికారమును , శాశ్వతధర్మస్వరూపమును , ( దుఃఖమిశ్రితము కాని ) నిరతిశయ ( అచంచల ) ఆనందస్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయమును ( అనగా బ్రహ్మముయొక్క స్వరూపమును ) అయియున్నాను .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః|| 14 ||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రిచే అనువదింపబడిన

శ్రీ గీతామృత తరంగిణి యందలి శ్రీ గుణత్రయ. విభాగయోగ మను
చతుర్దశ తరంగము సంపూర్ణము .
శ్రీ కృష్ణబ్రహ్మార్పణమస్తు .
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును ,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు గుణత్రయవిభాగయోగమను పదునాల్గవ అధ్యాయము సంపూర్ణము. ఓమ్ తత్ సత్.

Tuesday, November 17, 2009

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)
అనుష్టుప్ .
అర్జున ఉవాచ|
ప్రకృతిం పురుషం చైవ
క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ|
ఏతద్వేదితుమిచ్ఛామి
జ్ఞానం జ్ఞేయం చ కేశవ|| 13-1
అర్జునుడు చెప్పెను . ఓ కృష్ణా ! ప్రకృతిని , పురుషుని క్షేత్రమును , క్షేత్రజ్ఞుని , జ్ఞానమును , జ్ఞేయమును వీనినన్నిటినిగూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను .
శ్రీభగవానువాచ|
అనుష్టుప్ .
ఇదం శరీరం కౌన్తేయ !
క్షేత్రమిత్యభిధీయతే|
ఏతద్యో వేత్తి తం ప్రాహుః
క్షేత్రజ్ఞ ఇతి తద్విదః|| 13-2
కందము.
క్షేత్రమన శరీరంబగు ,
క్షేత్ర విధుల్ తెలియు వాఁడు క్షేత్రజ్ఞుండౌ ;
క్షేత్ర క్షేత్రజ్ఞ విధుల
సూత్రముల వచింతు రిటుల సూరివరేణ్యుల్ . ౨
శ్రీ భగవానుడు చెప్పెను . కుంతీపుత్రుడవగు ఓ అర్జునా ! ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది . దానిని తెలిసికొనువాడు క్షేత్రజ్ఞుడని క్షేత్ర క్షేత్రజ్ఞుల నెఱిగినవారు చెప్పుదురు .
అ.
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
సర్వక్షేత్రేషు భారత|
క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం
యత్తజ్జ్ఞానం మతం మమ|| 13-3
కందము.
క్షేత్రమ్ములను వసించెడు
క్షేత్రజ్ఞుఁడ నేనటంచు స్థిరత నెఱుఁగుమా ;
క్షేత్ర క్షేత్రజ్ఞ విధుల
సూత్రముల నెఱిగి కొనుట సుజ్ఞానంబౌ . ౩
అర్జునా ! సమస్త క్షేత్రములందును ( శరీరములందును ) నన్ను క్షేత్రజ్ఞునిగగూడ నెఱుఁగుము . క్షేత్ర క్షేత్రజ్ఞులనిగూర్చిన జ్ఞానమేదికలదో , అదియే వాస్తవమగు జ్ఞానమని నా అభిప్రాయము .
అ.
తత్క్షేత్రం యచ్చ యాదృక్చ
యద్వికారి యతశ్చ యత్|
స చ యో యత్ప్రభావశ్చ
తత్సమాసేన మే శృణు|| 13-4
కందము.
శారీర ధర్మములను , వి
కారమ్ముల విధము జన్మ కారకరీతుల్ ,
శారీరధారి విభవం
బారూఢముగాగఁ బలికె దాద్యంతమ్మున్ . ౪
ఆ క్షేత్రమేదియో , ఎటువంటిదో , ఎట్టి వికారములు కలదో , దేనినుండి యేరీతిగ నుత్పన్నమైనదో , ఆ క్షేత్రజ్ఞుడును ఎవడో , ఎట్టి ప్రభావము కలవాడో ఆ విషయములన్నింటిని సంక్షేపముగ నావలన వినుము .
అ.
ఋషిభిర్బహుధా గీతం
ఛన్దోభిర్వివిధైః పృథక్|
బ్రహ్మసూత్రపదైశ్చైవ
హేతుమద్భిర్వినిశ్చితైః|| 13-5
కందము.
వేదశ్రుతులను , స్మృతులను ,
నాదట నాబ్రహ్మ సూత్రమందున దేవ
ర్ష్యాదులును , సహేతుక మను
వాదములుగ , ఛందమందు వలికిరి దీనిన్ . ౫
( ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానము ) ఋషులచే అనేక ప్రకారములుగా నానా విధములైన వేదములద్వారా వేఱు వేఱుగా ప్రతిపాదించబడినది మఱియు హేతువులతో ( యుక్తులతో ) గూడి బాగుగా నిశ్చయింపబడినట్టి బ్రహ్మసూత్రవాక్యములచేత గూడ నయ్యది చెప్పబడియున్నది .
అ.
మహాభూతాన్యహంకారో
బుద్ధిరవ్యక్తమేవ చ|
ఇన్ద్రియాణి దశైకం చ
పఞ్చ చేన్ద్రియగోచరాః|| 13-6
అ.
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం
సంఘాతశ్చేతనా ధృతిః|
ఏతత్క్షేత్రం సమాసేన
సవికారముదాహృతమ్|| 13-7
తేటగీతి.
అష్టవిధి ప్రకృతియు , నింద్రియములు పది , మ
నమును , నిచ్చయు , ద్వేషదుఃఖములు , సుఖము ,
దేహ సంహతి , చైతన్య , ధృతి , వికార
ములు , సముద్భవమౌ క్షేత్రములు కిరీటి  !
పంచమహా భూతములు , అహంకారము , బుద్ధి , మూలప్రకృతి , పదునొకండు ఇంద్రియములు ( దశేంద్రియములు +మనస్సు ) , ఐదు ఇంద్రియ. విషయములు ( శబ్ద స్పర్శాదులు ) , కోరిక , ద్వేషము , సుఖము , దుఃఖము , దేహేంద్రియాదుల సముదాయము , తెలివి ( వృత్తి జ్ఞానము ) , ధైర్యము , అను వీని సముదాయమై , వికార సహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది .
అ.
అమానిత్వమదమ్భిత్వ
మహింసా క్షాన్తిరార్జవమ్|
ఆచార్యోపాసనం శౌచం
స్థైర్యమాత్మవినిగ్రహః|| 13-8
అ.
ఇన్ద్రియార్థేషు వైరాగ్య
మనహంకార ఏవ చ|
జన్మమృత్యుజరావ్యాధి
దుఃఖదోషానుదర్శనమ్|| 13-9
అ.
అసక్తిరనభిష్వఙ్గః
పుత్రదారగృహాదిషు|
నిత్యం చ సమచిత్తత్వ
మిష్టానిష్టోపపత్తిషు|| 13-10
అ.
మయి చానన్యయోగేన
భక్తిరవ్యభిచారిణీ|
వివిక్తదేశసేవిత్వ
మరతిర్జనసంసది|| 13-11
అ.
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం
తత్త్వజ్ఞానార్థదర్శనమ్|
ఏతజ్జ్ఞానమితి ప్రోక్త
మజ్ఞానం యదతోऽన్యథా|| 13-12
తేటగీతి.
తన్ను దా నుతింపక యుంట , తన ప్రగల్భ
మును వచింపకనుంట, నెందును నహింస ,
కుటిలమును లేక యుంటయు , గురుని సేవ ,
యొరు లొనర్చు కీడుల నోర్చికొనుట . ౭
తేటగీతి.
స్థైర్య , మాత్మ వినిగ్రహ , శౌచ నియతి ,
ఇంద్రియ సుఖమ్ముల విరక్తి నెసగుటయు , న
హంకరణము సడల్చుట య్యఘము , మృత్యు
జననముల్ , జరావ్యాధి దోషముల నెల్ల . ౮
తేటగీతి.
నెఱిగి కొంట , విషయముల నేవగింపు ,
దార పుత్ర గృహాదుల దాసజనుల
పామరప్రీతి లేకుంట , సామరస్య
మొంది యుంట నిష్టానిష్టములకు నెపుడు , ౯
తేటగీతి.
ననె యనన్య భక్తి జలింపక నను భజించు
తీవ్రత , శుచి స్థలావాస దీక్ష , జన స
మూహమునఁ జరింప నేవఁ బొందుటయును ,
నాత్మనెఱిగెడి జ్ఞానమం దమరియుంట , ౧౦
తేటగీతి.
ఊర్ధ్వ గతి సమాలోచన మొందు చుంట ;
నీ నియమ విధానము లెల్ల జ్ఞానమగును ;
దానను విరుద్ధ గతుల వ్ధాన మెల్ల ,
తామసంబగు నజ్ఞాన తమస మగును . ౧౧
తన్ను తాను పొగడుకొనకుండుట , డంబము లేకుండుట , మనోవాక్కాయములచే పరప్రాణులను బాధింపకుండుట , ఓర్పుగలిగియుండుట , ఋజుత్వము ( శుద్ధి ) గలిగియుండుట ( సన్మార్గమున , మోక్షమార్గమున ) స్థిరముగా నిలబడుట , మనస్సును బాగుగ నిగ్రహించుట , ఇంద్రియవిషయములను శబ్దస్పర్శాదులందు విరక్తి గలిగి యుండుట , అహంకారము లేకుండుట , పుట్టుక , చావు , ముసలితనము , రోగము - అను వానివలన కలుగు దుఃఖమును , దోషమును , మాటిమాటికి స్మరించుట , కొడుకులు ( సంతానము ) , భార్య , యిల్లు మున్నగువానియందు ఆశక్తి లేకుండుట మఱియు వానియందు తగులము లేకుండుట ( వారికి కలుగు సుఖదుఃఖములు తనకే కలిగినట్లు అభిమానింపకుండుట ) , ఇష్టానిష్టములు ( శుభాశుభములు ) సంప్రాప్తించినపుడెల్లపుడును సమబుద్ధి గలిగియుండుట ,నాయందు ( భగవంతునియందు ) అనన్యమైన ( నిశ్చల ) భక్తి గలిగియుండుట , ఏకాంతప్రదేశమును ( ప్రతిబంధమును లేనిచోటును ) ఆశ్రయించుట , జనసమూహమునందు ప్రీతిలేకుండుట , అధ్యాత్మజ్ఞానము ( ఆత్మనిష్ఠ ) నిరంతరము గలిగియుండుట , తత్వజ్ఞానముయొక్క గొప్పప్రయోజనమును తెలిసికొనుట అను నిదియంతయు జ్ఞానమని చెప్పబడును . దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానము ( అని తెలియునది ) .
అ.
జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి
యజ్జ్ఞాత్వామృతమశ్నుతే|
అనాదిమత్పరం బ్రహ్మం
న సత్తన్నాసదుచ్యతే|| 13-13
కందము.
ఎది తెలియు పిదప నమృతమొ ,
యది తెలిపెద విను , కిరీటి ! ఆద్యంతము లే
నిది , సదసత్తుల కెడమగు
నదియె , పరబ్రహ్మమనుదు , రదె జ్ఞేయమ్మౌ . ౧౨
ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపమో , దేనిని తెలిసికొని మనుజుడు అమృతస్వరూపమగు మోక్షమును పొందుచున్నాడో అద్దానిని బాగుగ చెప్పబోవుచున్నాను . అదిలేనట్టి పరబ్రహ్మమనబడు అయ్యది సత్తనిగాని ( ఉన్నదని గాని ) అసత్తని గాని ( లేదని గాని ) చెప్పబడదు .
అ.
సర్వతః పాణిపాదం
తత్సర్వతోऽక్షిశిరోముఖమ్|
సర్వతః శ్రుతిమల్లోకే
సర్వమావృత్య తిష్ఠతి|| 13-14
కందము.
సర్వత్ర పాణిపాదము ,
సర్వత్ర శిరోముఖమ్ము , చక్షులు , మఱియున్
సర్వత్ర కర్ణ యుగళము ,
సర్వత్రను నిండి యుండు జగముల లోనన్ . ౧౩
అది ( ఆ బ్రహ్మము , ఆత్మ ) అంతటను చేతులు , కాళ్ళు గలదియు , అంతటను కన్నులు , తలలు , ముఖములు గలదియు , అంతటను చెవులు గలదియు నయి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి ( వ్యాపించుకొని ) యున్నది .
అ.
సర్వేన్ద్రియగుణాభాసం
సర్వేన్ద్రియవివర్జితమ్|
అసక్తం సర్వభృచ్చైవ
నిర్గుణం గుణభోక్తృ చ|| 13-15
అ.
బహిరన్తశ్చ భూతానా
మచరం చరమేవ చ|
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం
దూరస్థం చాన్తికే చ తత్|| 13-16
అ.
అవిభక్తం చ భూతేషు
విభక్తమివ చ స్థితమ్|
భూతభర్తృ చ తజ్జ్ఞేయం
గ్రసిష్ణు ప్రభవిష్ణు చ|| 13-17
అ.
జ్యోతిషామపి తజ్జ్యోతి
స్తమసః పరముచ్యతే|
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం
హృది సర్వస్య విష్ఠితమ్|| 13-18
ఆట వెలది .
ఇంద్రియములు లేక నింద్రియ గుణములఁ
గానుపింపఁ గలుగు గాజురీతి ;
నిర్వికారి యయ్యు , నుర్వినిం ధరియించు
నిర్గుణమయి , సాక్షి నియతి నుండు . ౧౪
చంపకమాల.
వెలుపల , లోప లెల్లెడల వెల్గు చరాచర భూతకోటులన్ ,
అలుసున కల్ప సూక్ష్మమయి , యంతటనిండు జగంబు లెల్లెడన్ ,
దెలియకనుండు గొందఱకు , దివ్య విభాసము కొందఱున్ గనన్ ,
గలుగుదు రంతికమ్మున నె గద్దగు దూరమగు న్నెఱుంగమిన్ . ౧౫
ఉత్పలమాల .
భిన్నముఁ గాక నుండియు విభిన్న గతిం గనుపించుచుండు , సృ
ష్టి న్నెఱపున్ , లయం బొనరఁ జేసి , గ్రసించును , భూతకోటులన్ ,
గ్రన్నన సంతరిం , చిటు లఖండ మహత్తరమైన సత్త్వ సం
పన్నిలయమ్ము బ్రహ్మమని , ఫల్గున ! దీని నెఱుంగు మియ్యెడన్ . ౧౬
కందము.
రవి తేజమునకు తేజం
బవు నా తేజంబు , తమము నంటక యుండున్ ;
వివృత జ్ఞానము , జ్ఞేయం ,
బవలన్ ఫలితంబు కూడ నదియె కిరీటీ ! ౧౭
( జ్ఞేయస్వరూపమగు ) ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియములయొక్క గుణములను ప్రకాశింపజేయునదియు , సమస్తేంద్రియములు లేనిదియు , దేనిని అంటనిదియు , సమస్తమును భరించునదియు , ( సత్త్వరజస్తమో ) గుణరహితమైనదియు , గుణముల ననుభవించునదియు , ప్రాణులయొక్క వెలుపలను , లోపలను ఉండునదియు , కదలనిదియు , కదలునదియు , అతిసూక్ష్మమై యుండుటవలన ( అజ్ఞానులకు ) తెలియఁబడనిదియు , దూరముగనుండునదియు , దగ్గరగా కూడ నుండునదియు , విభజింపబడనిదియైనను , ప్రాణులందు విభజింపబడినదానివలె నున్నదియు , ప్రాణులను సృష్టించునదియు , పోషించునదియు , లయింప జేయునదియు అని తెలిసికొనదగినది . మఱియు నది ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకు గూడ ప్రకాశము నిచ్చునదియు , తమస్సు ( అజ్ఞానము ) కంటె వేఱైనదియు ( లేక అతీతమైనదియు ) జ్ఞానస్వరూపమైనదియు ( చిన్మయ రూపమును ) , తెలియదగినదియు , ( అమానిత్వాది ) జ్ఞానగుణములచే బొందదగినదియు , సమస్త ప్రాణులయొక్క హృదయమునందు విశేషించి యున్నదియు నని చెప్పబడుచున్నది .
అ.
ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసతః|
మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే|| 13-19
తేటగీతి.
ప్రాణి కోటుల పృదయాంతరముల వెలుగు
నది , పరబ్రహ్మమని తెలియంగ వినుము ;
క్షేత్రమును , జ్ఞానమును ,జ్ఞేయసూత్రములను
తెలిసి కొనువాఁడు మద్భావ కలిమిఁ జెలఁగు. ౧౮
ఈ ప్రకారము క్షేత్రము , అట్లే జ్ఞానము , జ్ఞేయముకూడ సంక్షేపముగ చెప్పబడినవి . నా భక్తుడు ( నా యందు భక్తిగలవాడు ) వీనినెఱింగి నాస్వరూపమును ( మోక్షమును భగవద్వైక్యమును ) బొందుట కర్హుడగుచున్నాడు .
అ.
ప్రకృతిం పురుషం చైవ
విద్ధ్యనాదీ ఉభావపి|
వికారాంశ్చ గుణాంశ్చైవ
విద్ధి ప్రకృతిసమ్భవాన్|| 13-20
తేటగీతి.
అల ప్రకృతి , పురుషు లనాదులౌ , కిరీటి !
ఈ పరాపరప్రకృతి మదీయ మాయ
గా నెఱుగుము ; గుణములు వికారములును
మాయనె జనించునని యెంచుమా కిరీటి ! ౧9
( ఓ అర్జునా ! ) ప్రకృతిని , పురుషుని ఉభయులను ఆదిలేనివారినిగ నెఱుఁగుము . ( మనోబుద్ధీంద్రియాదుల ) వికారములను , ( సత్త్వరజోస్తమో ) గుణములను ప్రకృతివలన గలిగినవిగా నెఱుఁగుము .
అ.
కార్యకారణకర్తృత్వే
హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం
భోక్తృత్వే హేతురుచ్యతే|| 13-21
తేటగీతి.
కార్య కరణ కర్తృత్వంబు , కాయనియతి ,
సుఖము , దుఃఖము ననుభవించునది దేహి ;
ప్రకృతిని సముద్భవంబులౌ వికృతిలివ్వి ;
ఆత్మ విర్వికారము , ఫల్గునా ! నిజమ్ము . ౨౦
కార్యకారణములను గలుగజేయుటయందు ప్రకృతి హేతువనియు , సుఖదుఃఖముల ననుభవించుటయందు పురుషుడే హేతువనియు చెప్పబడుచున్నది .
అ.
పురుషః ప్రకృతిస్థో హి
భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|
కారణం గుణసఙ్గోऽస్య
సదసద్యోనిజన్మసు|| 13-22
కందము.
ప్రకృతి కధీనమ్మగు , నీ
వికృతుల పురుషుండె యనుభవించుచు , గుణక
ర్మ కృతమున జన్మ లొందును ,
స్వకీయ గుణకర్మ ఫలిత సదసద్యోనిన్ . ౨౧
ప్రకృతియందున్నవాడై పురుషుడు ( జీవుడు ) ప్రకృతివలన బుట్టిన ( సుఖదుఃఖాది ) గుణములను అనుభవించుచున్నాడు . ఆయా గుణములతోడి కూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్టజన్మము లెత్తుటయందు హేతువై యున్నది .
అ.
ఉపద్రష్టానుమన్తా చ
భర్తా భోక్తా మహేశ్వరః|
పరమాత్మేతి చాప్యుక్తో
దేహేऽస్మిన్పురుషః పరః|| 13-23
కందము.
పురుషునకుఁ బరంబగు , నా
పరమాత్మ తటస్థుడౌచుఁ బరికించు , మహే
శ్వరుఁ డతఁడె , భర్త , భోక్తయుఁ ;
బరమ రహస్యమ్ముఁ దెలియఁ బలికితి పార్థా ! ౨౨
పురుషుడు ( ఆత్మ ) ఈ శరీరమందున్నప్పటికి శరీరముకంటె వేఱైనవాడును , సాక్షిభూతుడును , అనుమతించువాడును , భరించువాడును , అనుభవించువాడును , పరమేశ్వరుడును ( గొప్ప ప్రభువు , నియామకుడును ) , పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు .
అ.
య ఏవం వేత్తి పురుషం
ప్రకృతిం చ గుణైః సహ|
సర్వథా వర్తమానోऽపి
న స భూయోऽభిజాయతే|| 13-24
తేటగీతి.
ప్రకృతి పురుషుల గుణవికారముల నెల్ల ,
బాగుగ నెఱింగి వర్తించు యోగి వరుఁడు ;
కర్మఁ జేసియు ఫల మందకయె మెలంగు ,
గిట్టినంతనె , తిరిగికఁ బుట్టకుండు . ౨౩
ఎవడీ ప్రకారముగ పురుషుని ( ఆత్మను ) , గుణములతో గూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో , అతఁ డేవిధముగ నున్నప్పటికిని మఱల జన్మింపడు .
అ.
ధ్యానేనాత్మని పశ్యన్తి
కేచిదాత్మానమాత్మనా|
అన్యే సాఙ్ఖ్యేన యోగేన
కర్మయోగేన చాపరే|| 13-25
తేటగీతి.
ధ్యాన యోగమ్మునైనను , జ్ఞాన యోగ
కర్మ యోగమ్మునైన , నీ మర్మమెల్ల
నెఱిఁగి కొందురు మద్భక్తు , లీ తెఱఁగుల
నాత్మ తత్త్వమ్ము సర్వమ్ము నంద గలరు . ౨౪
ఆత్మను ( ప్రత్యగాత్మను లేక పరమాత్మను ) కొందఱు శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగముద్వారా తనయందు గాంచుచున్నారు ( సాక్షాత్కరించుకొనుచున్నారు ) . అట్లే మఱికొందఱు సాంఖ్యయోగము చేతను , ఇంక కొందఱు కర్మయోగము చేతను చూచుచున్నారు ( అనుభూతమొనర్చుకొనుచున్నారు ) .
అ.
అన్యే త్వేవమజానన్తః
శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|
తేऽపి చాతితరన్త్యేవ
మృత్యుం శ్రుతిపరాయణాః|| 13-26
కందము.
తెర వెఱుఁగని వారలు స
ద్గురునిన్ సేవించి , తెలిసి కొనఁదగు దానిన్ ;
గుఱు తెఱిగి , యుపాసించిన ,
మరణము లే నట్టి మనికి మననౌ , తుదకున్ . ౨౫
మఱికొందఱైతే ఈ ప్రకారముగ ( ధ్యానసాంఖ్యకర్మయోగము వలన ) తెలిసికొనజాలని వారై ఇతరులవలన ( ఆ పరమాత్మను గూర్చి ) విని ఉపాసించుచున్నారు ( అనుష్ఠించుచున్నారు ) . శ్రవణతత్పరులగు వారున్ను మృత్యువును ( మృత్యురూపమగు ఈ సంసారమును ) తప్పక దాటుదురు .
అ.
యావత్సఞ్జాయతే కిఞ్చి
త్సత్త్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగా
త్తద్విద్ధి భరతర్షభ|| 13-27
తేటగీతి.
ప్రకృతి పురుష సంయోగమే ప్రభవ కార
ణమ్మగు సమస్త భూత సంతతుల కెల్ల ;
నీ పరస్పర సంయోగ మే కిరీటి !
సృష్టికిని మూల కారణం , బెఱుఁగు మయ్య ! ౨౬
భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఈ ప్రపంచమున స్థావరజంగమాత్మకమగు పదార్థమేది ఉన్నదో , అదియంతయు క్షేత్ర క్షేత్రజ్ఞుల కూడికవలననే కలుగుచున్నదని యెఱుఁగుము .
అ.
సమం సర్వేషు భూతేషు
తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం
యః పశ్యతి స పశ్యతి|| 13-28
తేటగీతి.
అనయ మీ భూతములు నశించినను , సర్వ
భూత సంస్థితు నన్ను సనాతనుండ ,
నవ్యయును గాగ సమదృష్టి నఱయు నతఁడె ,
పండితుండు సమ్యగ్దర్శనుండు , వాఁడె . ౨౭
సమస్త ప్రాణులందును సమముగ నున్నట్టి పరమాత్మను , ఆయా ప్రాణుల దేహాదులు నశించినను నశించినవానినిగ ఎవడు చూచుచున్నాడో , ( తెలిసికొనుచున్నాడో ) ఆతడే నిజముగ చూచువాడగును ( విజ్ఞుడని భావము ) .
అ.
సమం పశ్యన్హి సర్వత్ర
సమవస్థితమీశ్వరమ్|
న హినస్త్యాత్మనాత్మానం
తతో యాతి పరాం గతిమ్|| 13-29
చంపకమాల .
ప్రకృతి చరాచరంబులఁ బరాత్పరు నన్నిటఁ జూడగల్గు , వా
నికె కనుపించు సర్వధరణీ తల , మాతడు నొక్కడంచు , ఘా
తుక మొనరింప నేర , డిక దుర్నయ కార్యముఁ జేయఁ డాత్మ , వం
చకుఁ డెటులౌను ; స్వీయ మని సర్వము నెంచు మహాత్ముఁ డెందులన్ . ౨౮
ఏలయనగా - సమస్తప్రాణులందును లెస్సగ వెలయుచున్నట్టి పరమాత్మను సమముగ వ్యాపించియున్నట్లు జూచుచు మనుజుడు తన ఆత్మను తాను హింసించికొనడు . కావున సర్వోత్తమగతిని ( మోక్షమును ) బొందుచున్నాడు .
అ.
ప్రకృత్యైవ చ కర్మాణి
క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాత్మాన
మకర్తారం స పశ్యతి|| 13-30
చంపకమాల.
కర్మలనాచరించునది , కాయమటంచు దలంచి , నిత్యమున్
గర్మఫలమ్ము భుక్తిగొను కాయ మహంకృతులంచు నెంచి , యీ
నిర్మమకార మాత్మ కడు నిష్క్రియ నిర్గుణ నిర్వికారమౌ
మర్మ మెఱుంగఁ జాలిన సమమ్ముగఁ జూచునతండె , ఫల్గునా ! ౨౯
ఎవడు కర్మములను ప్రకృతిచేతనే సర్వవిధముల చేయబడుచున్నట్లుగను , అట్లే కర్తకానివానిగను చూచుచున్నాడో ( తెలిసికొనుచున్నాడో ) ఆతడే నిజముగ చూచుచున్నవాడగును .
అ.
యదా భూతపృథగ్భావ
మేకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం
బ్రహ్మ సమ్పద్యతే తదా|| 13-31
చంపకమాల .
ఎవఁడు సమస్త భూతముల నెల్లెడలన్ దనరూపమున్ గనున్
వివిధములైన రూపముల విస్తృతమౌ పరమాత్మఁ జూచు , బ్ర
హ్మవిదుఁడు బ్రహ్మభావమలరారి విముక్తిని గాంచి , యాతఁడే
యవగతమై స్వరూపమున నంతయు నేకగతిన్ గనుంగొనున్ . ౩౦
ఎప్పుడు వేఱ్వేఱుగనున్న ఈ భూతప్రపంచమంతను ఒక్కదానియందు ( పరమాత్మయందు ) ఉన్నదానిగను , మఱియు దానినుండియే విస్తరించుచున్నదానినిగను వీక్షించునో , అపుడు ( మనుజుడు ) ూ్రహ్మమును పొందుచున్నాడు . ( లేక బ్రహ్మముగనే అగుచున్నాడు ) .
అ.
అనాదిత్వాన్నిర్గుణత్వా
త్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోऽపి కౌన్తేయ !
న కరోతి న లిప్యతే|| 13-32
తేటగీతి .
నిర్వికారుండు నిర్గుణ నియతిఁ గనుచు ,
నవ్యయుండగు నా పరమాత్మ భూత
తతి శరీరముల్ సతతమ్ముఁ గనుచు
కర్మ స్పృహలేక ఫలితమ్ముఁ గనక యుండు . ౩౧
ఓ అర్జునా ! ఆదిలేనివాడు ( కారణరహితుడు ) అగుటచేతను ( త్రి ) గుణరహితుడగుట వలనను , ఈ పరమాత్మ శరీరమందున్నప్పటికిని ఏమియు చెయకయు , దేనిచేతను అంటబడకయు నున్నాడు .
అ.
యథా సర్వగతం సౌక్ష్మ్యా
దాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే
తథాత్మా నోపలిప్యతే|| 13-33
కందము .
ఆకాశమెల్ల యెడలను
నే కరణిని వ్యాప్త మొంది , యిసుమంతయుఁ దా
దాకక , నంటక నుండెడు ;
నా కరణినె యాత్మ దేహ మంటక నుండున్ . ౩౨
సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుటవలన ఏప్రకారముగ ( ధూళిమున్నగువానిచే ) అంటబడదో , ఆప్రకారమే శరీరమందంతటను ( లేక ; సకలశరీరములందును ) వెలయుచున్న పరమాత్మ ( శరీర గుణదోషములచే ) అంటబడక యున్నాడు .
అ.
యథా ప్రకాశయత్యేకః
కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం
ప్రకాశయతి భారత|| 13-34
కందము .
రవి యొక్కఁ డెటుల జగముల్
బ్రవిమల తేజమ్ము నెఱపి , భాసిలఁ జేయున్ ;
దవులకయె యాత్మ దేహము
ల , విభాసిలఁ జేయుఁ బుష్కలముగఁ , గిరీటీ ! ౩౩
ఓ అర్జునా ! సూర్యు డొక్కడే ఈ సమస్త లోకమును ఎట్లు ప్రకాశింప జేయుచున్నాడో , అట్లే పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింప జేయుచున్నాడు .
అ.
క్షేత్రక్షేత్రజ్ఞయోరేవ
మన్తరం జ్ఞానచక్షుషా|
భూతప్రకృతిమోక్షం చ
యే విదుర్యాన్తి తే పరమ్|| 13-35
తేటగీతి .
అల పరాపర ప్రకృతి రహస్యములను
భూత తతులఁ యవిద్య విముక్తి నెల్ల ,
జ్ఞాన చక్షులఁ దెలిసికోగల మహాత్ము ,
లంతటను బ్రహ్మభావమ్ము నందగలరు . ౩౪
ఎవరు జ్ఞానదృష్టిచేత ఈ ప్రకారముగ క్షేత్ర క్షేత్రజ్ఞులయొక్క భేదమును , భూతములకు సంబంధించియుండు ( లేక , కారణమైన ) ప్రకృతి ( అవిద్య ) నుండి విముక్తిని కలుగజేయు ఉపాయమును తెలిసికొందురో వారు పరమాత్మపదమును ( మోక్షమును ) బొందుదురు .
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః|| 13 ||
ఓం తత్ సత్
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి
శ్రీ క్షేజ్ఞ క్షేత్రజ్ఞ విభాగ యోగము అను త్రయోదశతరంగము
సంపూర్ణం . శ్రీ కృష్ణపరబ్రహ్మార్పణమస్తు .
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమను పదుమూడవ అధ్యాయము సంపూర్ణము.

Wednesday, November 11, 2009

భక్తి యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

అనుష్టుప్.
అర్జున ఉవాచ|
ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే|
యే చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః|| 12-1

అర్జును వాక్యము.
తేటగీతి.
సగుణు , నీశ్వరు నిన్ను విశ్వస్వరూపు ,
భక్తి నిరతినిఁ గొలిచెడు వారు , మఱియు
నక్షర బ్రహ్మ భావమ్ము నలరు వారు ,
లిరు తెఱగులందు నధికు లెవ్వరు , ముకుంద ! ౧
అర్జునుడు చెప్పెను.
ఈ ప్రకారముగ ఎల్లప్పుడు నీ యందే మనస్సును నెలకొల్పినవారై ఏ భక్తులు నిన్నుపాసించుచున్నారో , మఱియు ఎవరు ఇంద్రియగోచరముగాని అక్షరపరబ్రహ్మను ధ్యానించుచున్నారో , ఆ యిరుతెగలవారిలో యోగమును బాగుగ నెఱిగినవారెవరు ?

శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః
తే మే యుక్తతమా మతాః|| 12-2

శ్రీ భగవానుల వాక్యము.
చంపకమాల.
సతతము నన్నె కీర్తనల శ్రద్ధ భజించి , నమస్కరించి , భూ
త తతి మదీయ రూపమని తథ్యము తద్ధిత మాచరించు సు
వ్రతమున విశ్వరూపము నుపాసన చేయు మహాత్ముఁ డెన్న , నా
మతమున నుత్తముండనుచు , మాన్యుఁ డటంచుఁ దలంతు నర్జునా ! ౨
శ్రీ భగవంతుడు చెప్పెను.
నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై ( తదేకనిష్ఠులై ) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై యెవరు నన్ను పాసించుచున్నారో వారే ఉత్తమయోగులని నా అభిప్రాయము.

అ.
యే త్వక్షరమనిర్దేశ్య
మవ్యక్తం పర్యుపాసతే|
సర్వత్రగమచిన్త్యఞ్చ
కూటస్థమచలన్ధ్రువమ్|| 12-3
అ.
సన్నియమ్యేన్ద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః|
తే ప్రాప్నువన్తి మామేవ
సర్వభూతహితే రతాః|| 12-4

కందము.
సమబుద్ధి ద్వంద్వముల యం
దమరి . జితేంద్రియత నంది , యచల మ్మవ్య
క్త మనిర్వచనీయ బ్ర
హ్మము నక్షరు నను భజింపనగు నన్నొందన్ . ౩
తేటగీతి .
సర్వభూత హితంబునే సలుపువాఁడు ,
నిర్వికారుండు సర్వత్ర నిండి యుండు
నక్షరుండగు బ్రహ్మమే నంచుఁ గొలుచు
సంయమివరుండు నన్నొందు , సవ్యసాచి ! ౪
ఎవరు ఇంద్రియములనన్నిటిని బాగుగ నిగ్రహించి ( స్వాధీనపఱచుకొని ) ఎల్లెడల సమభావముగలవారై , సమస్తప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తిగలవారై , ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిదియు , ఇంద్రియములకు గోచరము కానిదియు , చింతింపనలవి కానిదియు , నిర్వికారమైనదియు , చలింపనిదియు , నిత్యమైనదియు , అంతటను వ్యాపించియున్నదియునగు అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో , వారు నన్ను పొందుచున్నారు .

అ.
క్లేశోऽధికతరస్తేషా
మవ్యక్తాసక్తచేతసామ్||
అవ్యక్తా హి గతిర్దుఃఖం
దేహవద్భిరవాప్యతే|| 12-5

తేటగీతి.
నిర్గుణోపాస నిరతి యెంతేని దుఃఖ
దాయకమ్మగుఁ గద దేహ ధారులకును ,
నింద్రియ మనమ్ము బుద్ధిపై కెగయు జ్ఞాన
మార్గము గృహస్థులకుఁగడు దుర్గమమ్ము . ౫
అవ్యక్త ( నిర్గుణ ) పరబ్రహ్మమునం దాసక్తిగల మనస్సు గలవారికి ( బ్రహ్మమందు ) నిష్ఠను బొందుటలో సగుణోపాసకుల కంటె ప్రయాస చాల అధికముగ నుండును . ఏలయనిన , నిర్గుణోపాసనామార్గము దేహాభిమానము గలవారిచేత అతికష్టముగా పొందబడుచున్నది .

అ.
యే తు సర్వాణి కర్మాణి
మయి సంన్యస్య మత్పరః|
అనన్యేనైవ యోగేన
మాం ధ్యాయన్త ఉపాసతే|| 12-6
అ.
తేషామహం సముద్ధర్తా
మృత్యుసంసారసాగరాత్|
భవామి నచిరాత్పార్థ !
మయ్యావేశితచేతసామ్|| 12-7

ఉత్పలమాల .
నాకయి సర్వకర్మల ననారత మాచరణం బొనర్చుచున్ ,
నాకె ఫలంబు లర్పిత మొనర్చి , చరాచర భూతకోటి నా
యాకృతులంచు , విశ్వమయు నంచు దలంచి , భజించువానినిన్ .
వే కరుణించి కాచెదను , మృత్యు భవాబ్ధిఁ దరింపఁ జేయుచున్ . ౬
కందము .
నాయందె మనము నుంచుము ,
నాయందే బుద్ధి నిలు , పనారతమును నీ
చేయుపనుల ననుఁ జూడుమ ,
ఆయువుఁ దొలగంగ నన్నె యందెదు పార్ధా ! ౭
ఓ అర్జునా ! ఎవరు సమస్తకర్మలను నాయందు సమర్పించి , నన్నే పరమగతిగ దలంచినవారై , అనన్యచిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో , నాయందు చిత్తమును జేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రమునుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను .

అ.
మయ్యేవ మన ఆధత్స్వ
మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః|| 12-8

కందము.
నిరతిశయమ్ముగ నెప్పుడు
స్ధిర చిత్తము కుదురు టెటులొ తెలియనిచో , నా
సురుచిర మభ్యాస గతిన్
నెరప , సుయోగమ్ము నొంద నేర్తువు తుదకున్ . ౮
నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము . నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము . పిమ్మట నాయందే నివసింతువు . సందేహము లేదు .

అ.
అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనఞ్జయ|| 12-9

ఆట వెలది .
ఆచరించుటకును నభ్యాసయోగమ్ము
నలవి కాదటన్న , నదియు వలదు ;
సకల కర్మములను సలుపు నా ప్రీతికై ,
అవల సిద్ధి నొంద నవును పార్థ ! ౯
ఓ అర్జునా ! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగనిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తఱి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము . ( అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైన సాధింపుమని భావము ) .

అ.
అభ్యాసేऽప్యసమర్థోऽసి
మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి
కుర్వన్సిద్ధిమవాప్స్యసి|| 12-10

ఆట వెలది .
అదియు నాచరింప నలవి కాదందువా ,
కర్మయోగ సరణిఁ గాంచుమయ్య ;
సర్వ కర్మ ఫలము , నిర్వాహ ధాతనౌ
నాకె ఫలము లర్పణమ్ముఁ జేసి . ౧౦
ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీ వసమర్థుడవై తివేని నా సంబంధమైన కర్మలఁ జేయుటయం దాసక్తిగలవాడవు కమ్ము . అట్లు నాకొఱకు కర్మలను జేయుచున్ననుగూడ నీవు మోక్షసిద్ధిని బడయగలవు .

అ.
అథైతదప్యశక్తోऽసి
కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం
తతః కురు యతాత్మవాన్|| 12-11
అ.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్
జ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ! |
ధ్యానాత్కర్మఫలత్యాగ
స్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్|| 12-12

తేటగీతి.
జ్ఞాన మభ్యాస యోగమ్ము కంటె మెఱుగు ;
ధ్యాన యోగమ్ము శ్రేయమ్ము జ్ఞానమునకు ;
కర్మల ఫలమ్ము త్యజియింప ఘనతమమ్ము ;
త్యాగియౌవాఁడె శాంతినిఁ దోగుచుండు . ౧౧
ఇక నన్ను గూర్చిన యోగము నవలంబించినవాడవై దీనినిగూడ నాచరించుటకు శక్తుడవు కానిచో అటుపిమ్మట నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మములయొక్క ఫలములను త్యజించివేయుము. ( వివేకముతో గూడని ) అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదికదా ! ( శాస్త్రజన్య ) జ్ఞానముకంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది . ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగనుండు మనస్థితి ) కంటె కర్మఫలమును విడచుట ( ప్రవృత్తియందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది . అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగ ( చిత్త ) శాంతి లభించుచున్నది .

అ.
అద్వేష్టా సర్వభూతానాం
మైత్రః కరుణ ఏవ చ|
నిర్మమో నిరహఙ్కారః
సమదుఃఖసుఖః క్షమీ|| 12-13
అ.
సన్తుష్టః సతతం యోగీ
యతాత్మా దృఢనిశ్చయః|
మయ్యర్పితమనోబుద్ధి
ర్యో మద్భక్తః స మే ప్రియః|| 12-14

ఉత్పలమాల .
భూతచయమ్ము లన్నిట , ప్రపూర్ణ దయార్ద్ర హృదంతరమ్మునన్ ,
బ్రీతి యొనర్చు వాఁడును , లభించిన దానన దుష్టి నొందుచున్ ,
గాతర హంకృతుల్ విడిచి , కష్టసుఖమ్ముల , ద్వంద్వ భావముల్ ,
శీతువు చేత , నాతపముచేఁ జలియింపని వాఁడె ప్రీతుడౌ . ౧౨
చంపకమాల .
సతతముఁ దుష్టిఁ జెంది , నను సంస్మరణం బొనరింపగన్ దృఢ
వ్రత విజితేంద్రియుండయి , ధృవమ్మగు బుద్ధి మనోగతమ్ము ల
ర్పిత మొనరించి , నిశ్చలతఁ బ్రీతి భజించెడు సంయమీంద్రుఁ , డ
య్యతియె మదీయ భక్త గణమందుఁ గడింది ప్రియుండు ఫల్గునా ! ౧౩
సమస్త ప్రాణులయెడల ద్వేషము లేనివాడును , మైత్రి , కరుమ గలవాడును , అహంకారమమకారములు లేనివాడును , సుఖదుఃఖములందు సమభావముగలవాడును , ఓర్పుగలవాడును , ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును , యోగయుక్తుడును , మనస్సును స్వాధీనపఱచుకొనినవాడును , దృఢమైన నిశ్చయము గలవాడును , నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును , నాయందు భక్తిగలవాడును , ఎవడు కలడో , అతడు నాకు ఇష్టుడు .

అ.
యస్మాన్నోద్విజతే లోకో
లోకాన్నోద్విజతే చ యః|
హర్షామర్షభయోద్వేగై
ర్ముక్తో యః స చ మే ప్రియః|| 12-15

ఉత్పలమాల .
లోకులకున్ భయమ్మెవఁడు లోఁ గొనకుండునొ , లోకులెవ్వరున్
వ్యాకుల మొంద రెవ్వని సమక్ష పరోక్షములందునన్ , భయో
ద్రేక మసూయ తోసము మదిన్ దలపోసి చలింపకుండునో ,
నాకుఁ బ్రియుండతండగు ధనంజయ ! భక్తగణంబు లందఱన్ . ౧౪
ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమునుబొందదో , లోకమువలన ఎవడు భయమును బొందడో , ఎవడు సంతోషము , క్రోధము , భయము , మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు .

అ.
అనపేక్షః శుచిర్దక్ష
ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ
యో మద్భక్తః స మే ప్రియః|| 12-16

చంపకమాల .
ఎవఁడు జితేంద్రియుండు , విషయేచ్ఛల నిస్పృహ భావమందునో ,
యెవఁడు శుచివ్రతా నిరతుఁ డెవ్వఁడు కార్యకలాప దక్షుఁడో ,
యెవఁడు తటస్థ మాత్ర పరి దృశ్యుఁడు మిత్రరిపు వ్రతంబుల ,
న్నెవఁడు ఫలాఫలమ్ములఁ ద్యజించునొ , వాఁడె ప్రియుండు ఫల్గునా ! ౧౫
కోరికలు లేనివాడును , బాహ్యాభ్యంతరశుద్ధి గలవాడును , కార్య సమర్థుడును , ( సమయస్ఫూర్తిగలవాడును ) తటస్థుడును , దిగులు ( దుఃఖము ) లేనివాడును , సమస్తకార్యములందు కర్తృత్వమును వదలినవాడును , ( లేక సమస్త కామ్యకర్మలను శాస్త్రనిషిద్ధ కర్మలను త్యజించినవాడును ) నాయందు భక్తి గలవాడును , ఎవడు కలడో , అతడు నాకు ఇష్టుడు .

అ.
యో న హృష్యతి న ద్వేష్టి
న శోచతి న కాఙ్క్షతి|
శుభాశుభపరిత్యాగీ
భక్తిమాన్యః స మే ప్రియః|| 12-17

కందము.
శోకింపఁడు , కాంక్షింపఁడు ,
లేకున్నను రాకయున్న లేశమ్మైనన్ ,
జేకూర సంతసింపఁడు ,
నేకాకృతిఁ జూచు , శుభ శుభేతరమందున్ . ౧౬
ఎవడు సంతోషింపడో , ద్వేషింపడో , శోకమును బొందడో , ఎవడు శుభాశుభములను వదలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు .

అ.
సమః శత్రౌ చ మిత్రే చ
తథా మానాపమానయోః|
శీతోష్ణసుఖదుఃఖేషు
సమః సఙ్గవివర్జితః|| 12-18
అ.
తుల్యనిన్దాస్తుతిర్మౌనీ
సన్తుష్టో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతి
ర్భక్తిమాన్మే ప్రియో నరః|| 12-19

కందము .
సమముగ మిత్రుల , శత్రుల
సమముగ మానావమాన సరణిన్ , శీతో
ష్ణము , సుఖ దుఃఖమ్ములఁ దు
ల్య మనం బూనెడు , విషయ పరాఙ్ముఁఖు డగుచున్ . ౧౭
కందము.
నిందా స్తుతులకుఁ దుల్యం
బంది , నిరావాసియై , ఫలాప్తికిఁ దృప్తిం
జెందడు , మౌని వరుఁడె , నా
డెందమునకు ప్రీతియౌ కడింది కిరీటీ ! ౧౮
శత్రువునందును , మిత్రునియందును , మానావమానములందును , శీతోష్ణ సుఖదుఃఖములందును , సమముగా నుండువాడును , దేనియందును సంగము ( ఆసక్తి , మనస్సంబంధము ) లేనివాడును , నిందాస్తుతులందు సమముగా నుండువాడును , మౌనముతో నుండువాడును , ( లేక మననశీలుడును ) , దేనిచేతనైనను ( దొరికిన దానితో ) తృప్తిని బొందువాడును , నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును ( లేక గృహాదులం దాసక్తి లేనివాడును ) , నిశ్చయమగు బుద్ధిగలవాడును , భక్తితో గూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు .

అ.
యే తు ధర్మ్యామృతమిదం
యథోక్తం పర్యుపాసతే|
శ్రద్దధానా మత్పరమా
భక్తాస్తేऽతీవ మే ప్రియాః|| 12-20

కందము .
ఎవ్వరు నన్నీవిధమున ,
మువ్వేళల శ్రద్ధతోడ ముమ్మర భక్తిన్ ,
నివ్వటిలఁ గొల్చువారలె ,
కవ్వడి ! ప్రియతములు భక్త గణముల నాకున్ . ౧౯
ఎవరైతే శ్రద్ధావంతులై , నన్నే పరమగతిగ నమ్మి ( నాయందాసక్తి గలవారై ) ఈ అమృతరూపమగు ( మోక్ష సాధనమైన ) ధర్మమును ( ఇప్పుడు ) చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః|| 12 ||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందు
ష్రీ భక్తి యోగమను ద్వాదశ తరంగము
సంపూర్ణము .
శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు .
ఇది ఉపనిషత్ప్రతిపాదకమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును ,
శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు భక్తియోగమను పండ్రెండవ అధ్యాయము సంపూర్ణం . ఓమ్ తత్ సత్ .

Sunday, November 8, 2009

విశ్వరూప సందర్శన యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

అర్జున ఉవాచ|
అనుష్టుప్.
మదనుగ్రహాయ పరమం
గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్|
యత్త్వయోక్తం వచస్తేన
మోహోऽయం విగతో మమ|| 11-1

అర్జును వాక్యము.
కందము.
నీ కరుణ వలన గోప్యము
సాకల్యము గాఁగ వింటి , సందియ మెదియున్
లేకుండ , వివేకముఁ గని ,
చీకటి దుర్మోహమిపుడు చెదరె , ముకుందా ! ౧
అర్జునుడు చెప్పెను.
( శ్రీకృష్ణమూర్తీ ! ) నన్ననుగ్రహించుటకొఱకై , సర్వోత్తమమై , రహస్యమై , అధ్యాత్మమను పేరుగలదై నట్టి ఏ వాక్యమును ( బోధను ) నీవు చెప్పితివో , దానిచే నా అజ్ఞానము పూర్తిగ తొలగిపోయినది .

అనుష్టుప్.
భవాప్యయౌ హి భూతానాం
శ్రుతౌ విస్తరశో మయా|
త్వత్తః కమలపత్రాక్ష !
మాహాత్మ్యమపి చావ్యయమ్|| 11-2

కందము.
భూతోత్పత్తి లయంబుల
రీతులు వినఁగలిగె , కృష్ణ ! కృపఁజూపుచు , నీ
ఖ్యాతి మహోన్నతిఁ దెలియ వి
భూతి వినం జెప్పినావు ; పుష్కలము హరీ ! ౨
ఏలయనగా కమలనేత్రుడవగు ఓ కృష్ణా ! నీవలన ప్రాణులయొక్క ఉత్పత్తి వినాశములగూర్చి , నీయొక్క మహాత్మ్యమును ( మహిమను ) గూర్చి సవిస్తరముగ వింటిని.

అ.
ఏవమేతద్యథాత్థ త్వ
మాత్మానం పరమేశ్వర|
ద్రష్టుమిచ్ఛామి తే రూప
మైశ్వరం పురుషోత్తమ|| 11-3

కందము.
తేజ స్వరూపమును న
వ్యాజకృపన్ దెలుప , నది యదార్థమటంచున్
బూజింతు , నీ స్వరూపము
నేఁ జూడఁగ మనసు వుట్టె , నీరజనేత్రా ! ౩
ఓ పరమేశ్వరా నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు సరియేయని నేను విశ్వసించుచున్నాను. ఓ పురుషోత్తమా ! నీ యొక్క ఈశ్వరసంబంధమైన విశ్వరూపమును నేనిపుడు చూడదలంచుచున్నాను.

అ.
మన్యసే యది తచ్ఛక్యం
మయా ద్రష్టుమితి ప్రభో|
యోగేశ్వర తతో మే త్వం
దర్శయాత్మానమవ్యయమ్|| 11-4

తేటగీతి.
అవ్యయంబగు నీరూప మఱయనాకు
శక్యమని తలంతువ యేని , సారసాక్ష !
చూపు మియ్యెడ నీ దివ్యరూప మెల్ల ,
నఱసి ముదమంద , యోగీశ్వరా ! ముకుంద ! ౪
ప్రభూ ! ఆ నీ స్వరూపమును జూచుటకు నాకు సాధ్యమగునని నీవు తలంతువేని , ఓ యోగీశ్వరా ! నాశరహితమైన ఆ నీ (విశ్వ ) రూపమును ఇక నాకు జూపుము.

శ్రీభగవానువాచ|
అ.
పశ్య మే పార్థ ! రూపాణి
శతశోऽథ సహస్రశః|
నానావిధాని దివ్యాని
నానావర్ణాకృతీని చ|| 11-5

శ్రీ భగవానుల వాక్యము.
కందము.
వందల కొలదులు , మఱి పది
వందల కొలదులు గలట్టి వర్ణంబులతో
చందము లనేక సంఖ్యను
గందువె , నాయందు నిందుఁగల రూపంబుల్ . ౫
శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు.
ఓ అర్జునా ! అనేక విధములుగనున్నవియు , అలౌకికములై నవియు , వివిధ వర్ణములు ఆకారములు కలవియు , అసంఖ్యాకములుగ వర్తించునవియునగు నాయొక్క రూపములను గాంచుము .

అ.
పశ్యాదిత్యాన్వసూన్రుద్రా
నశ్వినౌ మరుతస్తథా|
బహూన్యదృష్టపూర్వాణి
పశ్యాశ్చర్యాణి భారత|| 11-6

కందము.
ఆదిత్యుల , వసురుద్రుల ,
నాది భిషగ్వరుల , మారుతాళినిఁ గనుమా !
నా దివ్య రూపముం గన
రా దేరికి , బహు విచిత్ర రాసి , కిరీటీ ! ౬
ఓ అర్జునా 1 సూర్యులను, వసువులను , రుద్రులను , అశ్వినీ దేవతలను , మరుత్తులను చూడుము . అట్లే ఇదివఱ కెన్నడును నీవు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచుము.

అ.
ఇహైకస్థం జగత్కృత్స్నం
పశ్యాద్య సచరాచరమ్|
మమ దేహే గుడాకేశ
యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి|| 11-7

కందము.
ప్రకృతి చరాచర జగతిని ,
నకలంకము వివిధమౌ పదార్థచయము , మా
మక దేహంబున నొకయెడఁ
బ్రకటితమౌఁ జూడుమా ! పరంతప ! యిచటన్ . ౭
ఓ అర్జునా ! ఈ సమస్త చరాచర ప్రపంచమును , ఇంకను దేనిదేనిని జూడదలంచుచున్నావో దానిని ఈ నాశరీరమందు ( అవయవమువలె ) ఒకచోటనున్న దానినిగా ఇపుడు చూడుము.

అ.
న తు మాం శక్యసే ద్రష్టు
మనేనైవ స్వచక్షుషా|
దివ్యం దదామి తే చక్షుః
పశ్య మే యోగమైశ్వరమ్|| 11-8

ఉత్పలమాల.
ప్రాకృత చక్షులన్ గనఁగరాదు కిరీటి ! మదీయమైన ది
వ్యాకృతిఁ జూడగా ; ముదము నందెద వన్నచొ , దివ్య చక్షులన్
నే కృపనిత్తు నీకు , మహనీయపు యోగ మహత్త్వమెల్ల , నా
నాకృతి విశ్వరూపము గనంబడఁ జేతు , నదృష్టపూర్వమున్ . ౮
ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును గాంచజాలవు . కావున దివ్యదృష్టిని ( జ్ఞాన నేత్రమును ) నీకు ప్రసాదించుచున్నాను. దానిచే ఈశ్వరసంబంధమైన నా యోగమహిమను జూడుము.

సఞ్జయ ఉవాచ|
అ.
ఏవముక్త్వా తతో రాజన్
మహాయోగేశ్వరో హరిః|
దర్శయామాస పార్థాయ !
పరమం రూపమైశ్వరమ్|| 11-9

సంజయుని వాక్యము.
ఆటవెలది.
అటుల యోగీశ్వరుండు శ్రీహరి వచించి ,
పార్థుఁ గృపఁ జూచి , దివ్య స్వరూప
దర్శన మొసంగెఁ గురురాజ ! ధన్యుడతఁడు ,
వ్యాస భగవానుఁ గృపఁ గొంత నఱయగంటి ! ౯
సంజయుడు చెప్పెను.
ఓ ధృతరాష్ట్రమహారాజా ! మహాయోగేశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగ వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వరసంబంధమగు ( విశ్వ ) రూపమును అర్జునునకు జూపెను.

అ.
అనేకవక్త్రనయన
మనేకాద్భుతదర్శనమ్|
అనేకదివ్యాభరణం
దివ్యానేకోద్యతాయుధమ్|| 11-10
అ.
దివ్యమాల్యామ్బరధరం
దివ్యగన్ధానులేపనమ్|
సర్వాశ్చర్యమయం దేవ
మనన్తం విశ్వతోముఖమ్|| 11-11

ఉత్పలమాల.
వేనకు వేలు నేత్రములు , వేలు ముఖంబులు నద్భుతంబు , నా
నా నవచిత్రములు , నాయుధ పంక్తులు , దివ్యభూషలున్ ,
సూన వితాన మాల్యములు , శోభిత దివ్య నవాంబరంబులున్ ,
మేని సుగంధ లేపన సమృద్ధములున్ , స్వవికాసతేజముల్ . ౧౦
కందము.
వింతలకుఁ దావలంబై ,
యంతునుఁ బొంతేమి లే , కనంతమ్మై , యా
శాంతముల నధిగమించె , న
నంతుడు శ్రీహరియె తానెయై యెల్లెడలన్ . ౧౧
( అత్తఱి ) పెక్కుముఖములు , నేత్రములు గలదియు , అనేకములగు అద్భుత విషయములను జూపునదియు , దివ్యములైన పెక్కు ఆభరణములతో గూడినదియు , ఎత్తబడియున్న అనేక దివ్యాయుధములు గలదియు , దివ్యములైన పుష్పమాలికలను వస్త్రములను ధరించినదియు , దివ్యమగు గంధపూతతో గూడియున్నదియు , అనేక ఆశ్చర్యములతో నిండియున్నదియు , ప్రకాశమాన మైనదియు , అంతము లేనిదియు , ఎల్లెడల ముఖములు గలదియు నగు తన విశ్వరూపమును భగవాను డర్జునునకు జూపెను.

అ.
దివి సూర్యసహస్రస్య
భవేద్యుగపదుత్థితా|
యది భాః సదృశీ సా స్యా
ద్భాసస్తస్య మహాత్మనః|| 11-12

కందము.
రవి కోటి యొక్క పరి దివి
గవసి , ప్రభాసింపఁ గల యఖండ ద్యుతి , యా
దవు దవుల సరి సమానం
బవునని చెప్పంగవచ్చు , నా తేజముతోన్ .౧౨
ఆకాశమందు వేలకొలది సూర్యులయొక్క కాంతి ఒక్కసారి బయలుదేరినచో ఎంత కాంతి యుండునో అది ఆ మహాత్మునియొక్క కాంతికి బోలియున్నది.

అ.
తత్రైకస్థం జగత్కృత్స్నం
ప్రవిభక్తమనేకధా|
అపశ్యద్దేవదేవస్య
శరీరే పాణ్డవస్తదా|| 11-13

తేటగీతి.
అపుడు పార్థుఁడు చూచె , నా హరి శరీర
మందుఁ బలు విధంబులు భిన్నమౌ చరా చ
ర ప్రకరముల నొక చోట , రాశియౌచుఁ
గృష్ణభగవానునందు నేకీకృతముగ . ౧౩
అప్పు డర్జునుడు నానా విధములుగ విభజింపబడియున్న సమస్తజగత్తును దేవదేవుడగు శ్రీకృష్ణభగవానునియోక్క శరీరమున ( అవయవమువలె ) ఒక్కచోట నున్నదానినిగ చూచెను.

అ.
తతః స విస్మయావిష్టో
హృష్టరోమా ధనఞ్జయః|
ప్రణమ్య శిరసా దేవం
కృతాఞ్జలిరభాషత|| 11-14

కందము.
కలితోన్నత రూపముఁ గని ,
పులకాంకిత దేహుఁడై , ప్రమోదంబున దో
సిలియొగ్గి , శిరము వంచియుఁ ,
బలికె నరుఁడు హరినిఁ గూర్చి బహుభావములన్ . ౧౪
అటుపిమ్మట ఆ యర్జునుడు ఆశ్చర్యముతో గూడినవాడును , గగుర్పాటు కలవాడును అయి విశ్వరూపమును ధరించిన భగవానునకు శిరస్సుచే నమస్కరించి చేతులు జోడించుకొని ( ఈ ప్రకారముగ ) పలికెను.

అర్జున ఉవాచ|
ఉపజాతి.
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|
బ్రహ్మాణమీశం కమలాసనస్థ-
మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్|| 11-15

అర్జును వాక్యము.
ఉత్పలమాల.
దేవ మహానుభావ ! భవదీయ శరీరమునందుఁ గంటి , నే
దేవతలన్ , సమస్త జగతీతల భూత చయమ్ములన్ , అహి
ప్రావృత సంకులమ్ము , పృథులాబ్జమునం దల బ్రహ్మదేవునిన్ ,
ఏవొ , మరేవొ , లెక్కకుగ మించిన వన్నియు కానుపించెడున్ . ౧౫
దేవా ! నీ శరీరమందు సమస్త దేవతలను , అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను , కమలాసనుడైన సృష్టికర్త యగు బ్రహ్మదేవుని , సమస్త ఋషులను , దివ్యములగు సర్పములను చూచుచున్నాను.

ఉపజాతి.
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప|| 11-16

ఉత్పలమాల.
లెక్కకుమించు బాహువులు , లెక్కకు నందకనుండు నేత్రముల్
పెక్కు మహోదరంబులును , లెక్కిడరాని ముఖంబులుండి , యే
దిక్కులఁ జూడ నీవయి , తుదిన్ మొదలున్ గనరాకయున్న , నీ
యక్కజమైన రూపము మహాద్భుత దృశ్య , మనంత మయ్యెడున్. ౧౬
ప్రపంచమునకు అధిపతి యైనవాడా ! జగద్రూపుడా ! నిన్ను సర్వత్ర అనేక హస్తములు , ఉదరములు , ముఖములు , నేత్రములు గలవానినిగను అనంతరూపునిగను నేను చూచుచున్నాను . మఱియు నీయొక్క మొదలుగాని , మధ్యముగాని , తుదనుగాని నేను గాంచలేకున్నాను .

ఉపజాతి.
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్|
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్|| 11-17

చంపకమాల.
గదలు, కిరీటచక్రములు , కౌస్తుభదివ్య విభూషణ ద్యుతుల్ ,
గదసి మహానలార్క రుచిర ప్రతిభాసము లా దిగంతముల్ ,
చదల కనంతమై చెదరె , శక్యముఁగా దెఱుగంగ నిన్ను బె
ట్టిదము త్వదీయ రూప మెవఁడేనియుఁ గానగ దుర్ని రీక్ష్యమౌ . ౧౭
నిన్ను ఎల్లెడలను కిరీటము గలవానినిగను , గదను ధరించినవానినిగను , చక్రమును బూనినవానినిగను , కాంతిపుంజముగను , అంతటను ప్రకాశించువానినిగను , జ్వలించు అగ్ని , సూర్యులవంటి కాంతిగలవానినిగను , అపరిఛిన్నునిగను , ( పరిమితి లేనివానినిగను ) చూచుచున్నాను .

ఉపేంద్రవజ్ర.
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే|| 11-18

సీసము.
వేదితవ్యంబీవె , వేదాంతమును నీవె ;
       పరమపురుషుఁడీవె , బ్రహ్మ వీవె ;
అఖిల జగంబుల కాధారమును నీవె ;
       అక్షరుండవ్యయుం డగుదు వీవె ;
దుష్టశిక్షణఁ జేసి , శిష్టరక్షణఁ జేయు
       శాశ్వత ధర్మ రక్షకుఁడ వీవె ;
నాశన రహిత సనాతనుండవు నీవె ;
       పరమ దివ్య పురాణ పురుషుఁ డీవె ;
తేటగీతి.
నిన్నుఁ దెలుపఁగ మాటలు నేరవెవ్వి ;
నీవు పరమాత్మ వంచని నేఁ దలంతు ;
పరమ పురుష ! పరంధామ ! పతిత పావ
నా ! పరేశ ! దివ్య ప్రభావా 1 పరాత్మ ! ౧౮
నీవు తెలియదగిన సర్వోత్తమ అక్షరపరబ్రహ్మవు . నీవీజగత్తునకంతటికి గొప్ప ఆధారభూతుడవు . నీవు నాశరహితుడవు . శాశ్వతములగు ధర్మములను కాపాడువాడవు . నీవు పురాణపురుషుడవు - అని నా అభిప్రాయము .

ఉపజాతి.
అనాదిమధ్యాన్తమనన్తవీర్య-
మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్|
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్|| 11-19

ఉత్పలమాల.
ఈవె యనాది మధ్యలయుఁ డీవె , యనంత పరాక్రముండవౌ
దీవె , యనంత బాహుఁడవు నీవె , హుతాశన వక్త్ర దీప్తుఁడౌ
దీవె , శశి ప్రభాకర సదృగ్ద్వయ భూరి కళాప్రపూర్ణుఁడౌ
దీవె , స్వతేజమున్ భువి తపింపగఁ జేయుటఁ గంటి శ్రీహరీ ! ౧౯
ఆదిమధ్యాన్తరహితునిగను , అపరిమిత సామర్ధ్యముగలవానినిగను , అనేక హస్తములుగలవానినిగను , చంద్రసూర్యులు నేత్రములుగ గలవానినిగను , ప్రజ్వలించు అగ్నిహోత్రునివంటి ముఖముగలవానినిగను , స్వకీయ తేజస్సుచే ఈ ప్రపంచమును తపింప జేయుచున్నవానినిగను నిన్ను చూచుచున్నాను .

ఇంద్రవజ్ర.
ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్|| 11-20

ఉత్పలమాల.
ఆకసమున్ , జగంబును , దిగంతములన్నియు నొక్కరుండ వీ
యాకృతితో గ్రసించిన భయంకర మద్భుతమైన దృశ్యముల్
వీకడగించి , భీతి గొలిపెన్ , నినుఁ జూడగ దుర్నిరీక్ష్యమౌ ,
లోకములెల్ల బెగ్గిలి విలోలతగా వివశమ్ములై హరీ ! ౨౦
ఓ మహాత్మా ! భూమ్యాకాశములయొక్క ఈమధ్యప్రదేశమంతయును దిక్కులన్నియును నీయొక్కనిచేతనే వ్యాపింపబడియున్నవిగదా . మఱియు భయంకరమైనదియు , ఆశ్చర్యకరమైనదియు నగు నీ యీ రూపమును జూచి ముల్లోకములున్ను మిగుల భీతిని బొందియున్నవి .

ఉపజాతి.
అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణన్తి|
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసఙ్ఘాః
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః|| 11-21

చంపకమాల.
సురలు త్వదీయ దేహమును జొచ్చుచుఁ గొందఱు భీతి బొందుచున్ ,
గరములు మోడ్చి ప్రస్తుతు లొనర్తురు ; సిద్ధులు నా మహర్షులున్
వరుసను స్వస్తిఁ జెప్పెదరు , వర్ణన సేయుచు నీ విభూతి వి
స్తరణ విశేష సంపదల , సన్నుతిఁ జేయుచుఁ బుష్కలంబుగాన్ . ౨౧
ఈ దేవతాసమూహములు నీయందు ప్రవేశించుచున్నవి ( మఱి ) కొందఱు భీతిల్లి చేతులు జోడించుకొని ( నిన్ను ) స్తుతించుచున్నారు . మహర్షులయొక్కయు , సిద్ధులయొక్కయు సమూహములు ( లోకమునకు ) క్షేమమగుగాక ! యని పలికి సంపూర్ణములగు స్తోత్రములచేత నిన్ను పొగడుచున్నారు .

ఇంద్రవజ్ర.
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేऽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|
గన్ధర్వయక్షాసురసిద్ధసఙ్ఘా
వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే|| 11-22

తేటగీతి.
వసువు , లాదిత్య , విశ్వదేవతలు , రుద్రు ,
లసుర , గంధర్వ , సాధ్యు , లాయక్ష , సిద్ధు ,
లశ్వినీ దేవతలు , పిత , లనిల గణము
లందఱును విస్మితమున నిన్ గందురు హరి ! ౨౨
రుద్రులును , సూర్యులును , వసువులును , సాధ్యులును , విశ్వేదేవతలును , అశ్వినీ దేవతలును , గంధర్వులయొక్కయు , యక్షులయొక్కయు , అసురుల యొక్కయు , సిద్ధులయొక్కయు సంఘములును , వీరందఱును ఆశ్చర్య చకితులై నిన్ను చూచుచున్నారు .

ఉపజాతి.
రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్|
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్|| 11-23

కందము.
నానా ముఖములు , చక్షులు ,
నానా బాహూరు పాద నానోదరమై ,
నానా దంష్ట్రా కరాళ
మౌ , నీరూపమ్ము కడు భయానక మయ్యెన్ . ౨౩
గొప్ప భుజములుగల ఓకృష్ణా ! అనేక ముఖములు . నేత్రములు గలిగినట్టియు అనేకములగు హస్తములు , తొడలు , పాదములు , గలిగినట్టియు , పెక్కు కడుపులు గల్గియున్నట్టియు , అనేకములైన కోఱలచే భయంకరమైనట్టియు , నీయొక్క గొప్పరూపమును జూచి జనులందఱును మిగుల భయపడుచున్నారు . నేనున్ను అట్లే భయపడుచున్నాను .

ఉపజాతి.
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో|| 11-24

కందము.
భీకరము , భయానక , మీ
యాకృతి భువనములకున్ భయాస్పద మగుచున్ ,
వ్యాకులము నొందఁ దొడఁగెను ,
నాకును నొడ లడఁచుచున్ వణంకె , ముకుందా ! ౨౪
ఓ విష్ణుమూర్తీ ! ఆకాశమును తాకుచున్నవాడవును , ప్రకాశించుచున్నవాడవును , పెక్కు రంగులు గలవాడవును , తెఱవబడిన నోరులు గలవాడవును , జ్వలించుచున్న విశాలములైన నేత్రములు గలవాడవునునగు నిన్ను జూచి మిగుల భీతిల్లిన మనస్సు గలవాడనై ధైర్యమును , శాన్తిని నేను పొందజాలకున్నాను .

ఉపజాతి.
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని|
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస|| 11-25

తేటగీతి.
నభము స్పృశియించు వ్యాత్తాననంబు తోడ ,
ప్రజ్వలితమైన దీర్ఘ నేత్రములతోడ ,
వర్ణము లనేకమైన రూపమునుఁ గాంచి ,
ధృతి శమమ్ములుఁ గోలుపోయితి ముకుంద ! ౨౫
కోరలచే భయంకరము లైనవియు , ప్రళయాగ్నినిబోలినవియునగు నీముఖములను జూచి , నేను దిగ్భ్రమజెందియున్నాను . సుఖమునుగూడపొందకయేయున్నాను . కావున ఓ దేవదేవా ! జగదాశ్రయా ! ప్రసన్నుడవగుము ( నన్ననుగ్రహింపుము ) .

ఉపజాతి.
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసఙ్ఘైః|
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః|| 11-26
ఇంద్రవజ్ర.
వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని|
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః|| 11-27

ఉత్పలమాల.
అనిశితమ్ములైన వికృతాకృత దంష్ట్ర పరీతకాల దా
వానల దీప్తమౌ ముఖచయమ్ములఁ జూచి , భయమ్ముఁ దోచి , నా
మేను వడంకుచున్నయది ; మేకొనలేను సుఖంబు నింతయున్ ,
భూనభముల్ దిగంతములఁ బొల్పు కనంబడకున్నదో , హరీ ! ౨౬
మత్తేభము.
అదె కౌరవ్యులు , భీష్ముడున్ , గురుఁడు , నంగాధీశుఁ డా , సూతుఁడ
ల్లదె , సర్వాంగ బలంబులన్ గలుగు యోధాగ్రేసరుల్ దత్తరం
బొదవన్ , గొందఱు నీ ముఖంబులను నోహో మాయగా జొచ్చి చ
చ్చెద ; రాదంతములన్ దగుల్కొనుచుఁ , దచ్ఛీర్షములుం జూర్ణ మై . ౨౭
ఈ ధృతరాష్ట్రుని కొమారులందఱును , భీష్ముడును , ద్రోణుడును , కర్ణుడును , వారి సేనయందలి సమస్త రాజసమూహములును , అట్లే మనసేనయందలి సైనిక ప్రముఖులును , నిన్ను త్వరితముగ జేరుచున్నవారై కోరలచే భయంకరములుగ నున్నట్టి నీ నోళ్ళయందు ప్రవేశించుచున్నాను . ( వారిలో ) కొందఱు నీ పండ్లసందులయందు చిక్కుకొనినవారై పొడుముచేయబడిన శిరస్సులతో కనుపించుచున్నారు.

ఉపెంద్రవజ్ర.
యథా నదీనాం బహవోऽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి|
తథా తవామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి|| 11-28
ఉపేంద్రవజ్ర.
యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా
విశన్తి నాశాయ సమృద్ధవేగాః|
తథైవ నాశాయ విశన్తి లోకాస్-
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః|| 11-29

ఉత్పలమాల.
వేగ మహార్భటుల్ సెలగ , వేనకువేలు నదీ నదమ్ములున్
సాగరమందు డిందెడి వెసన్ , జ్వలితానల కీలలన్ మహో
ద్వేగ పతంగ రాశుల గతిన్ భవదీయ ముఖాగ్నులం బడం
గాఁ గమకింతు రెల్లరును , నాశన మందగ సర్వ వీరులున్ .౨౮
ఏ ప్రకారము అనేక నదీప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందుప్రవేశించుచున్నవో , ఆప్రకారమే ఈమనుష్యలోకమందలి వీరులు ( రాజులు ) లెస్సగ జ్వలించుచున్న నీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు . ఏప్రకారము మిడతలు వినాశము కొఱకు మిక్కిలి వేగముతో గూడినవై బాగుగ మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే జనులున్ను మిగులవేగముతో గూడినవారై నాశము కొఱకు నీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు .

ఇంద్రవజ్ర.
లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్-
లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః|
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో|| 11-30

తేటగీతి.
జ్వలిత వదనాగ్ని కీలల జగము నెల్ల
నింపి , దిక్కుల నాకి , గ్రసింపుచుంటి ,
అనల కాంతిచ్ఛటల్ జగం బాక్రమించి ,
పరితపింపఁగఁ జేసెడుఁ బరమపురుష ! ౨౯
ఓ విష్ణుమూర్తీ ! మండుచున్న నీయొక్క నోళ్ళచే జనులందఱిని అంతటను మ్రింగుచున్న వాడవై ఆస్వాదించుచున్నావు . నీ యొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సులచేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింప జేయుచున్నవి .

ఉపజాతి.
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోऽస్తు తే దేవవర ప్రసీద|
విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్|| 11-31

తేటగీతి.
ఓ మహాప్రభూ ! దేవ మహోగ్రరూప !
నీ యుదంతమ్ము , సర్వంబు , నెఱుఁగఁ దలతుఁ
గృపఁ దలంచి , చెప్పుమ , నమస్కృతులు నీకు ;
నీ వెవండవు ? ఎట్టిది నీ ప్రవృత్తి ? ౩౦
దేవోత్తమా ! భయంకరాకారముగల నీ వెవడవో నాకు చెప్పుము . ఏలయనగా - నీ ప్రవృత్తిని ఎఱుంగకున్నాను . కనుక ఆదిపురుషుడవగు నిన్నుగూర్చి తెలిసికొన గోరుచున్నాను . నీకు నమస్కారము . నన్ననుగ్రహింపుము .

శ్రీభగవానువాచ|
ఉపజాతి.
కాలోऽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|
ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే
యేऽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః|| 11-32

శ్రీ భగవానుల వాక్యము.
ఉత్పలమాల.
కాలుఁడ నేను , లోకములఁ గాల్చి , హరింప దలంతు , నేడు ప్రా
ల్మాలిరి ; శత్రువీరులు సమాప్తము నేటికి , సుంతయైన నీ
కేలుఁ గదల్చకుండ , పరికించిన సందియమిందు లేదు , నే
నీ లయకృత్యము , న్నెఱపు టెంతయు నిశ్చయ మిద్ది యర్జునా ! ౩౧
శ్రీ భగవంతుడు చెప్పెను .
( నేను ) లోకసంహారకుడనై విజృంభించిన కాలుడను అయియున్నాను . ప్రాణులను సంహరించు నిమిత్త మీ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను . ప్రతిపక్షసైన్యమునందుగల వీరులు నీవు లేకపోయినను ( యుద్ధము చేయకున్నను ) జీవించియుండరు ( మృతినొందక తప్పరు ) .

ఉపజాతి.
తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్|
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్|| 11-33

ఉత్పలమాల.
కావున లెమ్మికన్ , రిపులఁ గాలనుఁ గ్రుమ్మి , యశమ్ము రాజ్య ల
క్ష్మీ విభవమ్ముఁ దోగుచు , సుఖింపుము ; వీరుల , శత్రులన్ , గత
గ్రీవులఁ గాగ మున్నె యొనరించితి , సందియ మొందఁ బోకుమా !
నీవు నిమిత్త మాత్రమయి నిల్చి , రణం బొనరింపు , మర్జునా ! ౩౨
కాబట్టి నీవు లెమ్ము . శత్రువులను జయించి కీర్తిని బడయుము . పరిపూర్ణమగు ( నిష్కళంకమగు ) రాజ్యము ననుభవింపుము . వీరందఱును ఇదివరకే నా చేతనే చంపబడిరి . కావున ఓ అర్జునా ! నీవు నిమిత్తమాత్రముగ నుండుము .

ఉపజాతి.
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్|
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్|| 11-34

ఉత్పలమాల.
ద్రోణుడు , భీష్మకర్ణులు , విరోధి జయద్రథు , లాది శత్రు సే
నా నివహమ్ములన్ గలుగు నాయకు లెల్లరు ; పూర్వమే గత
ప్రాణులు నాకతంబున , పరంతప ! భీతిల నేల , నీవనిన్
బూనుము , సవ్యసాచి ! జయముం గొనలెమ్ము , నిమిత్తమాత్రమై . ౩౩
నాచేత ( ఇదివఱకే ) చంపబడిన ద్రోణాచార్యుని , భీష్మాచార్యుని , జయద్రథుని , కర్ణుని అట్లే ఇతర యుద్ధవీరులనుగూడ నీవు చంపుము . భయపడకుము . యుద్ధముచేయుము . శత్రువులను గెలువగలవు .

.సఞ్జయ ఉవాచ|
విపరీతపూర్వ.
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ|
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య|| 11-35

సంజయు వాక్యము.
తేటగీతి.
కేశవుని పల్కు లాలించి , క్రీడి మిగులఁ
గంపితుండయి , డగ్గదికంబుఁ దోప ,
ప్రణతు లొనరించి , భీతిని వణకుచుండి,
పలికె నిట్టుల హరికి , నంజలి ఘటించి. ౩౪
సంజయుడు చెప్పెను.
అర్జునుడు శ్రీ కృష్ణమూర్తియొక్క ఈ వాక్యములను విని వణకుచున్నవాడై చేతులు జోడించుకొని శ్రీకృష్ణునకు నమస్కరించి మిగుల భయపడినవాడగుచు వినమ్రుడై గద్గద స్వరముతో నిట్లు పలికెను .

అర్జున ఉవాచ|
ఉపజాతి.
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ|
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసఙ్ఘాః|| 11-36

అర్జును వాక్యము.
తేటగీతి.
ఓ హృషీ కేశ ! భువి ముదమొందె నేడు ;
ప్రీతి నొందెడు నీ కీర్తి విభవమునకు ;
రక్కసులు పాఱి రేదిక్కొ పిక్కబలిమి ,
ప్రణతు లొనరింతు , రా సిద్ధగణము లెల్ల . ౩౫
అర్జునుడు చెప్పెను.
ఓ శ్రీకృష్ణా నీయొక్క నామము నుచ్చరించుట చేతను , మాహాత్మ్యమును లెస్సగ కొనియాడుట చేతను లోకము మిగుల సంతోషించుచున్నది . మిక్కిలి ప్రీతిఁ బొందుచున్నది .( నిన్ను జూచి ) రాక్షసులు భయపడినవారై దిగంతములకు పరుగిడుచున్నారు .సిద్ధుల సమూహములన్నియు నీకు నమస్కరించుచున్నవి .ఇవి యన్నియు నీ మహిమకు తగియే యున్నవి .

విపరీతపూర్వ.
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే|
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్|| 11-37

తేటగీతి.
ఆది దేవుండ వీవె బ్రహ్మాదులకును ,
నెవరు నీకంటెఁ బూజార్హు లవుదురయ్య !
సత్త సత్తగు నీ ప్రపంచమున కవధి
యౌ , యనంతుఁడ వీవె , మహానుభావ ! ౩౬
మహాత్మా ! అనంతరూపా ! దేవదేవా ! జగదాశ్రయా ! సత్ , అసత్తులకు ( స్థూలసూక్ష్మజగత్తుల రెండింటికిని ) పరమైనట్టి అక్షర ( నాశరహిత ) పరబ్రహ్మవు నీవే అయియున్నావు . బ్రహ్మదేవునకుకూడ ఆదికారణుడవును , కనుకనే సర్వోత్కృష్టుడవును నగు నీకేల సమస్కరింపకుందురు ? ( వారి నమస్కారములకు నీవు తగుదువు అని భావము ) .

ఉపజాతి.
త్వమాదిదేవః పురుషః పురాణస్-
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప|| 11-38

తేటగీతి.
ఆది దేవుండవు , ననంతుఁ డౌదు వీవె ;
జగతికి నిధానమీవె విశ్వమయుఁ డీవె ;
తెలియఁ దగు వాఁడ వీవె , యా తెలివి నీవె ,
అక్షరుండవు నీవె , యనంత రూప ! ౩౭
అనంతరూపుడవగు ఓ కృష్ణా ! నీవు ఆదిదేవుడవును , సనాతన పురుషుడవును , ఈ ప్రపంచమునకు శ్రేష్ఠమైన ఆధారమున్ను , సమస్తమును తెలిసికొనినవాడవును , తెలియఁదగినవాడవును , సర్వోత్తమస్థానమును అయియున్నావు . నీచేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడి యున్నది .

విపరీతపూర్వ.
వాయుర్యమోऽగ్నిర్వరుణః శశాఙ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ|
నమో నమస్తేऽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోऽపి నమో నమస్తే|| 11-39

తేటగీతి.
అనిలుఁ , డనలుఁడు , వరుణ , కశ్యప , శశాంక
బ్రహ్మమొదలు సమస్త దేవతల పితవు ;
శతసహస్రమ్ములగు నమస్కృతు లొనర్తు ,
మఱల , మఱల నొనర్తు , ముమ్మరముగాను . ౩౮
వాయువును , యముడును , అగ్నియు , వరణుడును , చంద్రుడును , బ్రహ్మదేవుడును , బ్రహ్మదేవునకు తండ్రియును నీవే అయియున్నావు . నీ కనేకవేల నమస్కారములు . మఱల మఱల నీకు నమస్కారము !

ఉపజాతి.
నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోऽస్తు తే సర్వత ఏవ సర్వ|
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోऽసి సర్వః|| 11-40

ఉత్పలమాల.
వందన మాచరించెదను ప్రాఙ్ముఖ పృష్ఠ ముఖంబులందు , నెం
దెందుల దిక్కులన్ గలుగు నెల్ల ముఖంబుల , సర్వతో ముఖం
బెందును నీవె , విశ్వమయుఁడీవె , యనంత పరాక్రమా ! జగ
ద్వందిత యాచరించెదను , వందలు వేలగు వందనమ్ములన్ . ౩౯
సర్వరూపుడవగు ఓ కృష్ణా ! ఎదుటను , వెనుకను నీకు నమస్కారము . మఱియు అన్నివైపులను నీకు నమస్కారమగు గాక ! అపరిమిత సామర్థ్యము , పరాక్రమము గలవాడవగు నీవు సమస్తమును లెస్సగ వ్యాపించియున్నావు . కనుకనే సర్వ స్వరూపుడవై యున్నావు .

ఉపజాతి.
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి|
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేన వాపి|| 11-41
ఉపజాతి.
యచ్చావహాసార్థమసత్కృతోऽసి
విహారశయ్యాసనభోజనేషు|
ఏకోऽథవాప్యచ్యుత తత్సమక్షం
తత్క్షామయే త్వామహమప్రమేయమ్|| 11-42

ఉత్పలమాల.
నిన్ను సముండవంచు మది నేనిటు " యాదవ ! కృష్ణ ! " యంచు ని
న్నెన్ని యయుక్తులన్ పలికి , యే నపహాస్యము లెన్నొ చేసితిన్
నిన్ను సమగ్రమున్ దెలియ నేరక , నీ చనువుం దలంచుచున్ ,
మన్నన సేతువే , నను ప్రమాదములన్ క్షమియించి , శ్రీహరీ ! ౪౦
ఉత్పలమాల.
ఆటలఁ , బాటలన్ , గుడుచు నప్పుడు , శయ్యలఁ జేరునప్పుడున్ ,
దోటలలో , విహారములఁ దోగినయప్పుడు నెల్లవేళలన్ ,
నోటికి వచ్చినట్లనుచు , నొవ్వఁగ నాడితి , మేల మాడి నా
నోటి కొలంది , సైతువె , ననుం గరుణించి , క్షమింతువే , హరీ ! ౪౧
నాశరహితుడవగు ఓ కృష్ణా ! నీయొక్క ఈ మహిమను తెలియక పొరపాటునగాని , చనువువలనగాని , సఖుడవని తలంచి " ఓ కృష్ణా , ఓ యాదవా , ఓ సఖా " యని అలక్ష్యముగ నిన్నుగూర్చి నేనేది చెప్పితినో మఱియు విహారము సల్పునపుడుగాని , పరుండునపుడుగాని , కూర్చుండునపుడుగాని , భుజించునపుడుగాని , ఒక్కడవుగ నున్నపుడుగాని , లేక ఇతరులయెదుటగాని పరిహాసము కొఱకు ఏ అవమానమును గావించితినో ఆ యపరాధము లన్నిటిని అప్రమేయుఁడవగు నీవు క్షమింప వేడుచున్నాను .

ఉపజాతి.
పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్|
న త్వత్సమోऽస్త్యభ్యధికః కుతోऽన్యో
లోకత్రయేऽప్యప్రతిమప్రభావ|| 11-43

తేటగీతి.
లోకములకెల్లఁ బితవు , ముల్లోక పూజి
తుండవు , జగద్గురుండ వౌదువు ; సముం డె
వండు లేడన్న , నధికుఁ డెవ్వాఁడు నీకు ?
నప్రమేయాఢ్య ! అప్రతిమ ప్రభావ ! ౪౨
సాటిలేని ప్రభావముగల ఓ కృష్ణమూర్తీ ! నీవు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునకంతకును తంఢ్రివి అయియున్నావు . మఱియు నీవు పూజ్యుడవును , సర్వశ్రేష్ఠుడవగు గురువును అయి వెలయుచున్నావు . ముల్లోకములందును నీతో సమానమైనవాడు లేడు . ఇంక నిన్ను మించినవాడు మఱియొక డెట్లుండగలడు ?

విపరీతపూర్వ.
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్|
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్|| 11-44

తేటగీతి.
సుతుని పిత యట్లు , సఖుని స్నేహితుని పగిది ,
ప్రియుఁడు ప్రియురాలి నెట్టులఁ బ్రేమ జూపు ,
నీవు నట్టులె నన్ను మన్నింపు , కృపను ;
ప్రణుతిఁ గావించెదను , నీకుఁ బరమ పురుష ! ౪౩
అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగముగ బడవైచి నమస్కరించి , ఈశ్వరుడవును , స్తుతింపదగినవాడవునగు నిన్ను అనుగ్రహింప వేడుచున్నాను . దేవా ! కుమారుని ( అపరాధమును ) తండ్రివలెను , స్నేహితుని ( అపరాధమును ) స్నేహితుడువలెను , ప్రియురాలి ( అపరాధమును ) ప్రియుడువలెను ( నాయొక్క అపరాధమును ) నీవు క్షమింపుము .

ఉపేంద్రవజ్ర.
అదృష్టపూర్వం హృషితోऽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే|
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస|| 11-45

ఉత్పలమాల.
మున్నెపుడేనిఁ గానని , యపూర్వ మహత్తరమైన దృశ్యమీ
మిన్నులు మన్ను లేకమయి మించిన రూపముఁ ; జూడ లేనికన్ ,
గ్రన్నన దొంటి రూపుఁ గనగా గరుణింపవె , దేవ దేవ ! యా
పన్న శరణ్య ! సౌమ్యతఁ , గృపారతిఁ జూపి యనుగ్రహింపవే ? ౪౪
ఇదివరకెన్నడును జూడనట్టి ఈ విశ్వరూపమును జూచి ఆనందమును బొందితిని . కాని భయముచే నా యొక్క మనస్సు మిగుల వ్యథ నొందుచున్నది . కావున దేవా ! ఆ మునుపటి ( సౌమ్య ) రూపమునే నాకు జూపుము . దేవ దేవా ! జగదాధారా ! అనుగ్రహింపుము !

ఉపజాతి.
కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే|| 11-46

చంపకమాల.
గదలుఁ గిరీట చక్రములు , కౌస్తుభ రత్న రవి ప్రభాస సం
పదలు , మయూరపింఛమును , మంజులమౌ చిరునవ్వు లొప్పగన్
యదుకుల భూషణుండవగు నా వసుదేవ సుతాకృతిన్ మదిన్
గుదురు వడంగఁ జూపి , కడుఘోరపు రూపు పసంహరింపవే ! ౪౫
( ఓ కృష్ణమూర్తీ ) నేను నిన్ను మునుపటివలెనే కిరీటము , గద , చక్రము చేత ధరించినవానినిగ జూడదలచుచున్నాను . అనేక హస్తములుగలవాడా ! జగద్రూపా ! నాలుగు భుజములుగల ఆ పూర్వరూపమునే మఱల ధరింపుము .

శ్రీభగవానువాచ|
ఉపజాతి.
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్|
తేజోమయం విశ్వమనన్తమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్|| 11-47
ఉపజాతి.
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్-
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః|
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర|| 11-48

శ్రీ భగవానుల వాక్యము.
ఉత్పలమాల.
నీపయి ప్రేమఁ జూపి , మహనీయ మహత్తర విశ్వరూప మేఁ
జూపితిఁ గాని , మున్నెవ్వరుఁ జూడఁగ లేదు కిరీటి ! వేద వి
ద్యా పరిపూర్ణులై , క్రతు శతంబులుఁ జేసిన వారలున్ , దపో
ద్దీపితులైన వారలు , నుదీర్ణ మనస్క వదాన్యు లై ననున్. ౪౬
శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు .
అర్జునా ! ప్రకాశముచే పరిపూర్ణమైనదియు , జగద్రూపమైనదియు , అంతము లేనిదియు , మొదటిదియు , నీవుతప్ప ఇతరునిచే నిదివఱ కెన్నడును జూడబడనిదియు నగు ఏ యీ సర్వోత్తమమైన విశ్వరూపము గలదో , అయ్యది ప్రసన్నుడనగు నాచే స్వకీయ యోగశక్తివలన నీకు జూపబడినది . కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా  ! ఈనా విశ్వరూపమును నీవుతప్ప మఱియొక రెవరును ఈ మనుష్యలోకమున చూచియుండలేదు ( నా యనుగ్రహముచే నీవు చూడగల్గితివి ) . మఱియు వేదాధ్యయన , యజ్ఞాధ్యయనములచే గాని , దానములచేగాని , ( అగ్ని హోత్రాది , శ్రౌతస్మార్తాది ) క్రియలచేగాని , ఘోర తపస్సులచేగాని , ఇట్టి ( విశ్వరూపుడనగు ) నన్ను చూచుటకు శక్యముకాదు .

ఉపజాతి.
మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్|
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య|| 11-49

కందము.
ఈ విశ్వరూప ముడిపితి ,
నీ వికను భయమ్ము వీడు , మెప్పటి యటులన్
నా వాసుదేవ రూప మి
దే వీక్షింపుము ముదంబు దీపింప , సఖా ! ౪౭
ఇటువంటి భయంకరమైన నా ( విశ్వ ) రూపమునుజూచి నీవు భయమునుగాని , చిత్తవికలత్వమునుగాని , పొందకుము . నీవు నిర్భయుడవును , ప్రసన్నచిత్తుడవును అయి నా పూర్వరూపమునే , మఱల బాగుగ జూడుము .

సఞ్జయ ఉవాచ|
ఉపజాతి.
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః|
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా|| 11-50

సంజయు వాక్యము.
ఆట వెలది.
వాసు దేవుఁ డిటుల వలికి , యర్జును భీతి
డించి , మిగుల ననునయించెఁ గృపను ,
శ్యామలాంగుఁ డగుచు , సౌమ్య రూపముఁ దాల్చె , ,
మందహాస రుచులు చిందు లొంద . ౪౮
సంజయుడు చెప్పెను .
( ఓ ధృతరాష్ట్రమహారాజా ! ) ఈ ప్రకారముగ శ్రీకృష్ణు డర్జునునకు జెప్పి ఆ ప్రకారమే తన ( పూర్వపు ) రూపమును మఱల జూపెను . మహాత్ముడగు ఆ శ్రీకృష్ణమూర్తి మఱల తన సౌమ్యరూపమును వహించి , భయపడియున్న అర్జునుని ఓదార్చెను .

అ.
అర్జున ఉవాచ|
దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం జనార్దన|
ఇదానీమస్మి సంవృత్తః
సచేతాః ప్రకృతిం గతః|| 11-51

అర్జును వాక్యము.
తేటగీతి.
జనులఁ జేరితి మఱల , సౌజన్యమైన
నీ స్వరూపమ్ముఁ గాంచి నే నిపుడు , కృష్ణ !
నిర్మల మనంబుఁ గాంచి , ధీనిశిత మొదవి
నే నెవండనొ తెలిసితి , దీన బంధు ! ౪౯
అర్జునుడు చెప్పెను .
ఓ కృష్ణా ! నీయొక్క ప్రశాంతమైన ఈ మనుష్యరూపమునుజూచి యిపుడు నా మనస్సు కుదుటపడినది . మఱియు నేను స్వస్థతను బొందితిని .

శ్రీభగవానువాచ|
అ.
సుదుర్దర్శమిదం రూపం
దృష్టవానసి యన్మమ|
దేవా అప్యస్య రూపస్య
నిత్యం దర్శనకాఙ్క్షిణః|| 11-52

శ్రీ భగవానుల వాక్యము.
కందము.
నా దివ్య విశ్వరూపము
సాదింపఁ దలంచి , మునులు , సంయములున్ , దే
వాదులు దీక్ష వహించెద ;
రీ దర్శన భాగ్యమబ్బె నీ కొకరున కే ! ౫౦
శ్రీ భగవానుడు చెప్పెను .
నాయొక్క ఏ రూపమును నీవిపుడు చూచితివో అది మహాదుర్లభమైనది . దేవతలుకూడ నిత్యము నద్దానిని దర్శనము చేయ గోరుచుందురు .

అ.
నాహం వేదైర్న తపసా
న దానేన న చేజ్యయా|
శక్య ఏవంవిధో ద్రష్టుం
దృష్టవానసి మాం యథా|| 11-53

ఉత్పలమాల.
వేదములన్నియున్ నెమరువేసిన , నుగ్రతపంబుఁ జేసినన్ ,
భూధన ధేనుకాంచన సమూహము దానము చేసినన్ , శ్రుతి
ప్రోదిత యజ్ఞకర్మల విభూతి కడుంగడు నందియున్న , న
న్నీ దృశ విశ్వరూప మెవఁడేని కనుంగొన లేడు , ఫల్గునా ! ౫౧
నన్ను ఏ రీతిగ నీవు చూచితివో , అటువంటి రూపముగల నేను వేదములచే ( వేదాధ్యయన పరులచే ) గాని , తపస్సుచేగాని , దానముచేగాని , యజ్ఞముచేగాని చూచుటకు శక్యుడనుగాను .

అ.
భక్త్యా త్వనన్యయా శక్య
అహమేవంవిధోऽర్జున|
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన
ప్రవేష్టుం చ పరన్తప|| 11-54

కందము.
ఏకాంత భక్తి యుతుఁడై ,
యే కాలమునందు నన్భజించిన వాఁడే ,
చేకొను నన్నీ విధమున
సాకల్యముగాగఁ దెలియఁ జాలి , కిరీటీ ! ౫౨
శత్రువులను తపింపజేయువాడా ! ఓ అర్జునా ! ఈ విధమగు రూపముగల నేను అనన్యభక్తిచేత మాత్రమే యథార్థముగ తెలిసికొనుటకును , చూచుటకును , ప్రవేశించుటకును , సాధ్యమైనవాడ నగుచున్నాను .

అ.
మత్కర్మకృన్మత్పరమో
మద్భక్తః సఙ్గవర్జితః|
నిర్వైరః సర్వభూతేషు
యః స మామేతి పాణ్డవ|| 11-55

ఉత్పలమాల.
నాకుఁ బ్రియంబుఁ గూర్చెడి మనంబునఁ గర్మల నాచరించి , యే
కై క మనోత్సుకంబున నఖండముగా భజియించి , సర్వ భూ
తాకృతు లేనె యంచని ప్రియం బొనరించి , నిజాంగనా సుతా
నీక విరాగియై సుగతి నే ననువానికి , నే లభించెదన్ . ౫౩
అర్జునా ! ఎవడు నా కొఱకే కర్మల జేయునో [ లేక నా సంబంధమైన ( దైవసంబంధమైన ) కార్యములనే చేయునో ] , నన్నే పరమప్రాప్యముగ నమ్మియుండునో , నాయందే భక్తిగల్గియుండునో , సమస్త దృశ్యపదార్థములందును సంగమును ( ఆసక్తిని , మమత్వమును ) విడిచివేయునో , సమస్తప్రాణులందును ద్వేషము లేకయుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విశ్వరూపదర్శనయోగో నామైకాదశోऽధ్యాయః|| 11 ||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రిచే అనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందు
శ్రీ విశ్వరూప సందర్శన యోగమను ఏకాదశ తరంగము
సంపూర్ణం. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.
ఇది ఉపనిష్ప్రతిపాదకమును , బ్రహ్మనిద్యయు , యోగశాస్త్రమును ,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విశ్వరూపసందర్శన యోగమను పదునొకండవ అధ్యాయము. ఓమ్ తత్ సత్