శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) | గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
---|---|---|
శ్రీభగవానువాచ| అ. మయ్యాసక్తమనాః పార్థ ! యోగం యుఞ్జన్మదాశ్రయః| అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు|| 7-1 | శ్రీభగవానుల వాక్యము. ఉత్పలమాల. నన్ను సతంబు నీ మనమునన్ భజియించెడు నీకు , సందియం బెన్నఁగ లేని చందము , మదీయ విభూతి మహత్త్వ సత్త్వ సం పన్న బలోద్ధితమ్ముల ప్రభావము , నిండు మనంబుతో వినన్ , నన్ను సమగ్రమున్ దెలియు నట్టులఁ జెప్పెద , నాలకింపవే. ౧ | శ్రీ భగవంతుడు చెప్పెను. ఓ అర్జునా ! నాయందాసక్తి గల మనస్సు గలిగి నన్నే ఆశ్రయించి యోగము నాచరించుచు నిస్సందేహముగ సంపూర్ణముగ నన్నెట్లు తెలిసికొనగలవో దానిని ( ఆ పద్ధతిని ) చెప్పెదను వినుము. |
అనుష్టుప్. జ్ఞానం తేऽహం సవిజ్ఞాన మిదం వక్ష్యామ్యశేషతః| యజ్జ్ఞాత్వా నేహ భూయోऽన్యద్ జ్జ్ఞాతవ్యమవశిష్యతే|| 7-2 | కందము. ఇది తెలియ , నిహము నందిక నెది తెలియఁగఁ దగిన జ్ఞాన మేదియుఁ గనరా ; దిది , స్వానుభవ జ్ఞానము విదిత మ్మొనరింతుఁ బార్థ ! విజ్ఞానంబున్. ౨ | దేనిని తెలిసికొనినచో మరల యీ ప్రపంచమున తెలిసికొనదగినది మరియొకటి మిగిలియుండదో అట్టి అనుభవసహితమగు జ్ఞానమును సంపూర్ణముగ నీకు జెప్పెదను. |
అనుష్టుప్. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే| యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః|| 7-3 | ఉత్పలమాల. వేనకు వేల నొక్కఁడు గవేషణసేయఁ బ్రయత్న మూను ; వి జ్ఞానము నొందువారల నొకండగు వేల సమగ్రమైన సు జ్ఞానమునన్ ననున్ దెలియు , సాంద్రమనంబున సత్త్వశుద్ధి సం ధానముఁ జేసి ; వాఁడె , కడుధన్యుఁడగున్ జగమందు నందఱన్. ౩ | అనేకవేలమంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేకమందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగ తెలిసికొనగల్గుచున్నాడు. |
అ. భూమిరాపోऽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ| అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా|| 7-4 | తేటగీతి. పంచభూత మాత్రమ్ము లంచితముగ , మనసు , బుద్ధి , యహంకార మను నెనిమిది ; ప్రకృతి విధములు నామాయ పాండవేయ ! బంధహేతు లివియె , ప్రపంచ మందు ౪ | భూమి , జలము , అగ్ని , వాయువు , ఆకాశము , మనస్సు , బుద్ధి , అహంకారము - అని ఈ ప్రకారముగ ఎనిమిది విధములుగ నా యీ ప్రకృతి ( మాయ ) విభజింపబడినది. |
అ. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్| జీవభూతాం మహాబాహో ! యయేదం ధార్యతే జగత్|| 7-5 | కందము. ఇవి గాక జీవభూతం బవు పరమోత్కృష్టమైన ప్రకృతిఁ దెలియుమా ! భువనము లెల్ల ధరించుచు , నవగతమై భూతచయములందుఁ జరించున్ . ౫ | గొప్పబాహువులుగల ఓ అర్జునా ! ఈ ( అపరా ) ప్రకృతి చాల అల్పమైనది . దీనికంటె వేఱైనదియు , ఈజగత్తునంతను ధరించునదియు , జీవరూపమైనదియు నగు మఱియొక ప్రకృతిని ( పరాప్రకృతిని ) శ్రేష్ఠమైనదిగా నెఱుంగుము . |
అ. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ| అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా|| 7-6 | తేటగీతి. ఈ పరాపర ప్రకృతులే యెల్ల భూత తతి సముద్భవ కారణాంతములగును ; నా యధీనములివి , జగన్నాథుఁడ నయి , ప్రభవ లయముల కారణ ప్రదుఁడ నౌదు. ౬ | ( జడ , చేతనములగు ) సమస్త భూతములున్ను యీ రెండు విధములగు ( పరాపర ) ప్రకృతుల వలననే కలుగునవియని తెలిసికొనుము. ( ఆ రెండు ప్రకృతుల ద్వారా ) నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క ఉత్పత్తికి , వినాశమునకు కారణభూతుడనై యున్నాను. |
అ. మత్తః పరతరం నాన్య త్కిఞ్చిదస్తి ధనఞ్జయ| మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ|| 7-7 | కందము. నా కంటె జగంబుల నిక నే కారణమున్ గనంగ నెఱుఁగవు , పార్థా ! సాకల్యము మణిగణములఁ జే కూర్చెడు సూత్రమౌచు , సృష్ఠి ధరింతున్. ౭ | ఓ అర్జునా ! నాకంటె వేఱుగ మఱియొకటి ఏదియు లేనే లేదు . దారమందు మణులవలె నాయందీ సమస్త ప్రపంచము కూర్చబడినది. |
అ. రసోऽహమప్సు కౌన్తేయ ! ప్రభాస్మి శశిసూర్యయోః| ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు|| 7-8 | తేటగీతి. ఉదకములయందు రసమేనె ; వ్యోమమందు శబ్దమును ; శశి సూర్య భాసములు నేనె ; వేదములయందు ప్రణవమ్మున్ , నీరవరుల పౌరుషమ్మును నేనౌదు పార్థ ! నిజము. ౮ | అర్జునా ! నేను జలమందు రుచియు , చంద్రసూర్యులందు కాంతియు , సమస్తవేదములందు ఓంకారమును , ఆకాశమందు శబ్దమును , మనుజులందు పరాక్రమమును అయియున్నాను. |
అ. పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ| జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు|| 7-9 | తేటగీతి. ధర గుబాళించు దివ్య గంధమ్ము నేనె ; యనలమునుఁ గూర్చు తేజమ్ము నౌదు నేనె ; సర్వజీవస్థితిన్ గూర్చు సత్త్వ మేనె ; తాపసుల యందుఁ దపమునై తనరు దేనె. ౯ | ( మఱియు నేను ) భూమియందు సుగంధమును , అగ్నియందు ప్రకాశమును , సమస్తప్రాణులయందు ప్రాణమును ( లేక ఆయువును ) , తాపసులయందు తపస్సును అయియున్నాను. |
అ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్| బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్|| 7-10 | తేటగీతి. సర్వ భూతమ్ములకును బీజమ్ము నేనె ; బుద్ధిమంతుల బుద్ధి , సంపూర్ణమేనె ; కడు సమర్థుల యందు ప్రాగల్భ్య మేనె ; బలయుతులయందు సద్బలంబ నగు దేనె. ౧౦ | ఓ అర్జునా ! నన్ను సమస్త ప్రాణులయొక్క శాశ్వతమైన బీజముగ నెఱుంగుము . మఱియు , బుద్ధిమంతులయొక్క బుద్ధియు , ధీరులయొక్క ధైర్యమును నేనే అయియున్నాను . |
అ. బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్| ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ|| 7-11 | తేటగీతి. ధర్మ బద్ధమ్ములైన విధాన మొంది , జీవకోటుల మనమందుఁ జెలగుచున్న , యిచ్ఛలెల్లను నేనె యంచెఱుగు మయ్య , భూత తతి యెల్ల సద్వృద్ధిఁ బొందుటకును. ౧౧ | భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! నేను బలవంతునియొక్క ఆశ, అనురాగము లేని బలమును , ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకముకాని కోరికయు అయియున్నాను. |
అ. యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే| మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి|| 7-12 | తేటగీతి. సత్త్వము , రజంబు , తమముల సంచితమగు భావములు పుట్టుచుండు నా వలనె , పార్ఝ ! ఆశ్రయం బొందు నన్ను నే నాశ్రయింప వాని , మచ్చోదితంబు లే గాని పార్థ ! ౧౨ | సత్త్వరజస్తమోగుణములచే గలిగిన పదార్థములు ( లేక స్వభావములు ) ఎవ్వి కలవో అవి నా వలననే కలిగినవని నీ వెఱుంగుము. అయితే నేను వానియందు లేను . అవి నాయందున్నవి . ( నేను వానికి వశుడనుగాను , అవి నాకు వశవర్తులై యున్నవని భావము ). |
అ. త్రిభిర్గుణమయైర్భావై రేభిః సర్వమిదం జగత్| మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్|| 7-13 | చంపకమాల. త్రివిధగుణైక భావసమితింగొని , యుద్భవమైన యీ జగం బవశతనొందు మోహమున ; నవ్యయమైన విభిన్న లక్షణం బెవఁడు మదీయ సత్త్వ మదియేయని సుంత దలంపఁబోడు, ర జ్జువుఁగని సర్పమంచనెడి చొప్పున నెల్లెడలన్ భ్రమించుచున్. ౧౩ | ఈ చెప్పబడిన మూడు విధములగు సత్త్వరజస్తమోగుణములయొక్క వికారములగు స్వభావములచేత ఈ ప్రపంచమంతయు మోహమును ( అవివేకమును ) బొందింపబడినదై , ఆ గుణముకంటె వేఱై ( అతీతుడనై ) నాశరహితుడనైనట్టి నన్ను తెలిసికొనజాలకున్నది . |
అ. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా| మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే|| 7-14 | కందము. మామకమౌ నీ మాయను నే మనుజుఁడు దాట లే డి కే గతినై నన్ ; ధీమంతుఁ డగుచు నన్నే స్తోమమ్మునఁ గాంచు వాఁడె తొలగునుమాయన్. ౧౪ | ఏలయనగా , దైవసంబంధమైనదియు ( అలౌకిక సామర్థ్యముకలదియు ) , త్రిగుణాత్మకమైనదియునగు ఈ నాయొక్క మాయ ( ప్రకృతి ) దాటుటకు కష్టసాధ్యమైనది . ( అయినను ) ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారీమాయను దాటివేయగలరు . |
అ. న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః| మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః|| 7-15 | తేటగీతి. నీచ కృత్యమ్ములే సదా యాచరించి , యసుర భావమ్మునందు నరాధముండు , నన్ను గననేఱఁ డెన్ని జన్మములనైన , నపహృత జ్ఞాని యగుచు మాయను మునుంగు. ౧౫ | పాపము చేయువారును , మూఢులును , మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారును , రాక్షస స్వభావమును ( అసుర గుణములను ) ఆశ్రయించువారునగు మనుజాధములు నన్ను బొందుటలేదు ( ఆశ్రయించుట లేదు ) . |
అ. చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోऽర్జున ! | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ|| 7-16 | తేటగీతి. నలు విధంబుల భక్తులు నను భజింత్రు సుకృతములుఁ జేసి , యార్తిని సృక్కువార , లర్థి జనులు , జిజ్ఞాసుల య్యతి మునీంద్రు ; లందుఁ బ్రియతముండగు నాకు నయ్యతివరుండె. ౧౬ | భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఆపత్తునందున్నవాడు , ( భగవంతుని ) తెలిసికొనగోరువాడు , ధనము ( సంపత్తు ) నభిలషించువాడు , ( ఆత్మ ) జ్ఞానముకలవాడు , అను నీ నాలుగువిధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు ( భజించుచున్నారు ) . |
అ. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే| ప్రియో హి జ్ఞానినోऽత్యర్థ మహం స చ మమ ప్రియః|| 7-17 | తేటగీతి. జ్ఞానికి న్నాకు భేద మే మేని లేదు , స్వీయ రూపమ్మునందు నన్నే యెఱింగి , నన్నె భజియించి , నా పొందె యున్నతి గతి యని తలంచును ; భక్తులం దధికుఁ డతఁడు. ౧౭ | వారి ( నలుగురి ) లో నిత్యము పరమాత్మతో గూడియుండు వాడును , ఒక్క పరమాత్మయందే భక్తి గలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు . అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనవాడను ; అతడున్ను నాకు మిగుల ఇష్టుడే . |
అ. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్| ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్|| 7-18 అ. బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే| వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః|| 7-19 | చంపకమాల. తనువులనేక మెత్తి , సుకృతంబు లొనర్చి , క్రమక్రమంబుగాఁ గనెడు వివేకమున్ బడసి , జ్ఞాని యగున్ ; నను వాసుదేవుగాఁ గనుచు సమస్త మే నె యని గాంచుఁ జరాచరమౌ జగంబు నె ల్లను గడుధన్యుఁ డాతఁడె తలంప , మహాత్ముఁడు దుర్లభుండె యౌ. ౧౮ | వీరందఱున్ను ( పైన దెలిపిన నలుగురు భక్తులు ) మంచివారే . కాని అందు జ్ఞానియో సాక్షాత్ నేనేయని నా అభిప్రాయము . ఏలయనగా అతడు నాయందే చిత్తమును స్థిరముగ నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగ నిశ్చయించి ఆశ్రయించుకొనియున్నాడు .అనేక జన్మలయొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే ( భగవంతుడే ) యను సద్బుద్ధిగల్గి నన్ను పొందుచున్నాడు - అట్టి మహాత్ముడు లోకములో చాల అరుదు . |
అ. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేऽన్యదేవతాః| తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా|| 7-20 | తేటగీతి. అనుగతంబైన పూర్వవాసనల బలిమిఁ గాంచి , కామితంబుల నొందగా వ్రతంబు లన్య దేవతారాధన మాచరింతు , రపహృత జ్ఞానులై కొంద ఱల్పమతులు. ౧౯ | ( కొందఱు ) తమయొక్క ప్రకృతి ( జన్మాంతరసంస్కారము ) చే ప్రేరేపింపబడినవారై విషయాదులందలి కోరికలచే వివేకమును గోల్పోయి , దేవతారాధనాసంబంధమైన ఆ యా నియమముల నవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు . |
అ. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి| తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్|| 7-21 | ఉత్పలమాల. ఎట్టి స్వరూప దేవతల నెవ్విధిఁ గొల్తురొ , యట్టి శ్రద్ధ తో బుట్టుక లిత్తు ; నెట్టి తనువు ల్గన నెంచి భజింతు రట్లుఁ జే పట్టిన దేవతాళిడు నెపంబున ; మామకమైన మాయ లో గుట్టు నెఱుంగుమా ! ప్రకృతి కోటి గణంబులు దేవతల్ జుమా ! ౨౦ | ఏయే భక్తుడు ఏయే ( దేవతా ) రూపమును శ్రద్ధతో పూజింపదలంచుచున్నాడో , దానిదానికి తగిన శ్రద్ధనే వానివానికి నేను స్థిరముగ గలుగ జేయుచున్నాను . |
అ. స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధనమీహతే| లభతే చ తతః కామా న్మయైవ విహితాన్హి తాన్|| 7-22 అ. అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్| దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి|| 7-23 అ. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః| పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్|| 7-24 | చంపకమాల. క్షణికములౌ ఫలంబులకుఁ గాంక్షవహించి , నికృష్ట దేవతల్ దనువుల నాశ్రయింతురు ; తలంపరు అవ్యయుఁ డంచు నన్ను , నీ కనులకు వ్యక్తి రూపమునఁ గాంచఁ దలంతురు బుద్ధి హీనతన్ ; ననుఁగన నేర రింద్రియ మనంబుల ; జ్ఞానుల కే లభించెదన్. ౨౧ | అతడు ( పైన తెలుపబడిన కామ్యభక్తుడు ) అట్టి శ్రద్ధతోగూడుకొనినవాడై ఆ యా దేవతలయొక్క ఆరాధనను గావించుచున్నాడు . మఱియు నాచే విధింపబడిన ఆ యా యిష్టఫలములను ఆ యా దేవతలద్వారా పొందుచున్నాడు . అల్పబుద్ధి కలిగినవారియొక్క ఆ ఫలము నాశవంతమై యున్నది . ( ఏలయనగా ) దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు . నా భక్తులు ( నన్ను పూజించువారు ) నన్నే పొందుచున్నారు . నాశరహితమైనట్టియు , సర్వోత్తమమైనట్టియు , నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడనగు ( ప్రపంచాతీతుడనగు ) నన్ను పాంచభౌతికదేహమును పొందినవానినిగా తలంచుచున్నారు . |
అ. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః| మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్|| 7-25 | తేటగీతి. యోగ మాయావృతుండనై యోగివరుల కే లభించెదఁ గాని నేనించు కైన ప్రాణి కోటులకున్ గాన రాను , పార్థ ! అవ్యయుండ నజుండ నంచఱయ లేరు. ౨౨ | యోగమాయచే బాగుగా కప్పబడియుండుటచే నేను అందఱికిని కనుపించువాడనుగాను .అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేనివానినిగను , నాశరహితునిగను ఎఱుఁగరు ! |
అ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున| భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన|| 7-26 | తేటగీతి. భూతవర్త మాన భవితముల ప్రపత్తి నెల్ల నెఱిగిన నన్నొక , యించు కైనఁ దెలియఁ జాలక నున్నారు , తెలివి మాలి మోహ కలనమ్మునను , మానవులు కిరీటి ! ౨౩ | ఓ అర్జునా ! నేను భూతభవిష్యద్వర్తమానమందలి ప్రాణులందఱిని ఎఱుఁగుదును . నన్ను మాత్ర మెవడును ఎఱుఁగడు . |
అ. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత| సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ! || 7-27 అ. యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్| తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః|| 7-28 | తేటగీతి. సర్వభూతమ్ములకుఁ బూర్వసంచితమగు మూఢ భావమ్ము పుష్కలంబుగఁ జనించి , ద్వేష రాగమ్ము లందుద్భవించు ద్వంద్వ ములకు , మోహితులై పుట్టుకలు ధరింత్రు. ౨౪ | శత్రువులను తపింపజేయు ఓ అర్జునా ! సమస్త ప్రాణులును పుట్టుకతోడనే రాగద్వేషజనితమగు సుఖదుఃఖాది ద్వంద్వరూపమైన వ్యామోహము వలన మిక్కిలి అజ్ఞానమును బొందుచున్నవి .పుణ్యకార్యతత్పరులగు ఏజనులయొక్క పాపము నశించిపోయినదో , అట్టివారు ( సుఖదుఃఖాది ) ద్వంద్వరూపమగు అజ్ఞానమునుండి విడువబడినవారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు . |
అ. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే| తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలమ్|| 7-29 | కందము. పుట్టుకఁ జావుల నెఱుఁగని గుట్టుఁ దెలిసికొన్న వాఁడు కోవిదుఁడై , నా జట్టున మెలగి సదా జగ జెట్టి యగుచు సర్వకర్మ సిద్ధి నెఱుంగున్. ౨౫ | ఎవరు వార్ధక్యమును , మరణమును ( సంసారదుఃఖమును ) పోగొట్టుకొనుట కొఱకు నన్నాశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో , వారు సమస్త ప్రత్యగాత్మ స్వరూపమున్ను , సకల కర్మమున్ను ఆ బ్రహ్మమే యని తెలిసికొందురు . |
అ. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః| ప్రయాణకాలేऽపి చ మాం తే విదుర్యుక్తచేతసః|| 7-30 | తేటగీతి. సాధి భూతాధి నాథుని , సాధియజ్ఞ యుతునిగా నన్ను దెలిసిన యతఁడె పార్థ ! మరణ కాలమ్మునం గూడ మఱువ కుండ , న న్నెఱుంగుచు ధ్యానించు చున్నవాఁడు. ౨౬ | అదిభూత , అధిదైవ , అధియజ్ఞములతో గూడియున్న నన్నెవరు తెలిసికొందురో వారు దేహవియోగకాలమందును ( దైవమందు ) నిలుకడ గల మనస్సుగలవారై ( మనోనిగ్రహముగలవారై ) నన్నెఱుఁగగలరు . |
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః|| 7 || | ఓం తత్ సత్ ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి చే అనువదింపబడిన శ్రీ గీతామృత తరంగిణియందు శ్రీ జ్ఞాన విజ్ఞాన యోగమను సప్తమ తరంగము సంపూర్ణం. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. | ఓమ్ ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విజ్ఞానయోగమను ఏడవ అధ్యాయము సంపూర్ణం. ఓమ్ తత్ సత్. |
Monday, October 19, 2009
జ్ఞానవిజ్ఞాన యోగము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment