Tuesday, October 6, 2009

జ్ఞానయోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)
శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
ఇమం వివస్వతే యోగం
ప్రోక్తవానహమవ్యయమ్|
వివస్వాన్మనవే ప్రాహ
మనురిక్ష్వాకవేऽబ్రవీత్|| 4-1
అ.
ఏవం పరమ్పరాప్రాప్త
మిమం రాజర్షయో విదుః|
స కాలేనేహ మహతా
యోగో నష్టః పరన్తప|| 4-2 ||
శ్రీ భగవానుల వాక్యము.
చంపకమాల.
ఇనునకుఁ జెప్పితిన్ దొలుత , నీమహనీయపు రాజయోగమున్ ;
యినుఁ డెఱిగించె నా మనువు కెంతయు ; నంతట నాతఁడున్ గుమా
రునకు ననుశ్రుతంబుగ నెఱుంగఁగఁ జెప్పిరి ; రాజయోగు లీ
యనునయ మార్గమున్ గనిరి ; యాదటఁ గాల గతిన్ నశించి పో
యినది సుయోగ మిప్పు ; డెఱిగింతును నీవు వినంగ ఫల్గునా ! ౧
శ్రీ భగవానుడు పలికెను:
నాశరహితమగు ఈ నిష్కామకర్మయోగమును ( తద్ద్వారా పొందబడు జ్ఞాననిష్ఠను ) పూర్వము నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు వైవస్వతమనువున కుపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఓ అర్జునా ! పరంపరగా వచ్చిన ఈ నిష్కామకర్మయోగమును రాజర్షులు తెలిసికొనిరి. చాలకాలము గడిచినందున ఆయోగ మిపుడీ లోకమున అదృశ్యమైనది. ( ప్రచారములో లేకున్నది ) .
అనుష్టుప్.
స ఏవాయం మయా తేऽద్య
యోగః ప్రోక్తః పురాతనః|
భక్తోऽసి మే సఖా చేతి
రహస్యం హ్యేతదుత్తమమ్|| 4-3 ||
కందము.
భక్తుఁడవు నాకు నిర తా
సక్తుఁడవౌ సఖుఁడవంచు , స్వచ్ఛంద మనో
యుక్తునిగా నొనరింప , బ్ర
యుక్తంబగు మఱల నీకు నో కౌంతేయా ! ౨
నీవు నాకు భక్తుడుగను , మిత్రుడుగను నున్నావు . కావున ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగమునే యిపుడు తిరిగి నీకు చెప్పితిని . అది మిగుల శ్రేష్ఠమైనదనియు , రహస్యమైనదనియు నెఱుఁగుము .
అర్జున ఉవాచ|
అ.
అపరం భవతో జన్మ
పరం జన్మ వివస్వతః|
కథమేతద్విజానీయాం
త్వమాదౌ ప్రోక్తవానితి|| 4-4 ||
అర్జున వాక్యము.
కందము.
ఇనుఁడుండె సృష్టి మొదలుగ
మనమిఱువుర మొక్కనాటి మనుజులమైనన్ ,
వినె నెప్పు డసంబద్ధము
గననయ్యెను నీదు వాక్కు , కంజదళాక్షా ! ౩
అర్జునుడు పలికెను.
( ఓ కృష్ణా ! ) నీ జన్మము ఇటీవలది . సూర్యుని జన్మము బహుపురాతనమైనది . అట్టిచో నీవు సూర్యున కుపదేశించితివను విషయమును నేనెట్లు గ్రహించగలను ?
శ్రీభగవానువాచ|
అ.
బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున|
తాన్యహం వేద సర్వాణి
న త్వం వేత్థ పరన్తప|| 4-5 ||
అ.
అజోऽపి సన్నవ్యయాత్మా
భూతానామీశ్వరోऽపి సన్|
ప్రకృతిం స్వామధిష్ఠాయ
సమ్భవామ్యాత్మమాయయా|| 4-6 ||
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
ఎన్ని జన్మంబు లిఱువుర మెత్తినామొ
నీ వెఱుంగవు , సర్వంబు నే నెఱుగుదు ,
ప్రకృతి మాయలు నా వశవర్తు లగుట ,
బుట్టినటులఁ గనుపించు నట్టులుందు . ౪
శ్రీ భగవానులు పలికెను.
శత్రువులను తపింపజేయు ఓ అర్జునా ! నీకును నాకును ఇంతవఱ కనేక జన్మలు గడచినవి. వాని నన్నిటిని నే నెఱుఁగుదును . నీ వెఱుఁగవు . నేను పుట్టుక లేనివాడను . నాశరహితస్వరూపము కలవాడను , సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయియున్నప్పటికి స్వకీయమగు ప్రకృతిని వశపఱచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను( అవతరించుచున్నాను ) .
అ.
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్|| 4-7
అ.
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మసంస్థాపనార్థాయ
సమ్భవామి యుగే యుగే|| 4-8 ||
చంపకమాల.
యుగ యుగమందు ధర్మము లయోమయమై నశియింపుచుండ,నా
యుగ యుగమందు ధర్మము యథోచిత రీతిని నుద్ధరింప , బు
ట్టుగఁ గొనుచుందు మాయను నిటుల్ స్వవశంబగు కారణమ్మునన్ ,
జగమున దుష్టులన్ దునిమి , సాధుగణంబుల రక్షసేయగన్. ౫
ఓ అర్జునా ! ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి , అధర్మము వృద్ధియగుచుండునో , అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొందును ( నేను అవతరించుచుందును ) . సాధు , సజ్జనులను రక్షించుటకొఱకును , దుర్మార్గులను వినాశమొనర్చుటకొఱకును , ధర్మమును లెస్సగ స్థాపించుటకొఱకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును.
అ.
జన్మ కర్మ చ మే దివ్య
మేవం యో వేత్తి తత్త్వతః|
త్యక్త్వా దేహం పునర్జన్మ
నైతి మామేతి సోऽర్జున|| 4-9 ||
కందము.
నా దివ్య జన్మ కర్మల
సాదరమున దెలిసికొన్న జనులకు నెపుడున్ ,
యీ దేహముడుగు పిమ్మట
లేదిక జన్మంబు భావలీనమ్మగుటన్. ౬
అర్జునా ! ఎవడీ ప్రకారముగ నాయొక్క దివ్యమైనజన్మమును , కర్మమునుగూర్చి యథార్థముగ తెలిసికొనుచున్నాడో , అట్టివాడు మరణానంతరము మఱల జన్మమునొందక నన్నే పొందుచున్నాడు ( మోక్షము నొందుచున్నాడు ).
అ.
వీతరాగభయక్రోధా
మన్మయా మాముపాశ్రితాః|
బహవో జ్ఞానతపసా
పూతా మద్భావమాగతాః|| 4-10 ||
కందము.
రాగ భయక్రోధమ్ముల
వేగముడిగి , నిర్మలాత్మవేత్తలు నిష్ఠన్
దోగుదురు , జ్ఞాని తపమున
వాగీశుని భావమంది వర లెద రెపుడున్. ౭
అనురాగము , భయము , క్రోధము విడిచినవారును , నాయందే లగ్నమైన చిత్తము కలవారును , నన్నే ఆశ్రయించినవారు నగు అనేకులు ఇట్టి జ్ఞానతపస్సుచే పవిత్రులై నా స్వరూపమును ( మోక్షమును ) బొందియుండిరి .
అ.
యే యథా మాం ప్రపద్యన్తే
తాంస్తథైవ భజామ్యహమ్|
మమ వర్త్మానువర్తన్తే
మనుష్యాః పార్థ ! సర్వశః|| 4-11 ||
తేటగీతి.
ఎవ్వడెయ్యది కోరి ధ్యానించు నన్ను
వానికది యిచ్చెదను , నిక్కువమ్ము పార్థ !
ఎట్టి కోరిక లేక నన్నే స్మరించు
వానికి న్నాకు భేద భావమ్ము లేదు . ౮
ఓ అర్జునా ! ఎవరే ప్రకారముగ నన్ను సేవింతురో , వారి నాప్రకారముగ నేనే ననుగ్రహింతును . మనుజులు సర్వ విధముల నామార్గమునే అనుసరించుచున్నారు .
అ.
కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం
యజన్త ఇహ దేవతాః|
క్షిప్రం హి మానుషే లోకే
సిద్ధిర్భవతి కర్మజా|| 4-12 ||
కందము.
చంచలముగఁ గర్మలు ఫలి
యించును నీకర్మ భూమి , నింద్రాదుల సే
వించి క్రతు లొనర్తురు , ధ్యా
నించిన రూపున ననుగ్రహింతురు వారిన్. ౯
కర్మములయొక్క ఫలప్రాప్తిని అపేక్షించు మానవు లీ ప్రపంచమున దేవతల నారాధించుచున్నారు .ఏలయనగా కర్మఫలసిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగ కలుగుచున్నది .
అ.
చాతుర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం
విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||
ఉత్పలమాల.
నాలుగు వర్ణజాతుల జనంబుల , నేఁ ద్రిగుణైక కర్మలం
బాలులఁ బంపకంబుల భవంబుల నొందగ గూర్తు , గర్మకున్
బాలు పడంగఁ జేసియు , బ్రసన్నుని గాక , దటస్థమై జగ
జ్జాలము గాంచు చుండెద నచంచల నిస్పృహ నిర్వికారినై. ౧౦
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్ణములు సత్త్వాది గుణముల యొక్కయు , ఆ గుణములచే చేయబడు కర్మలయొక్కయు , విభాగము ననుసరించి నాచే సృజింపబడినవి . వారికి నేను కర్తనైనప్పటికిని ( ప్రకృతికి అతీతుడనగుటచే ) వాస్తవముగ నన్ను అకర్తగను , నాశరహితునిగను ( నిర్వికారునిగను ) ఎఱుఁగుము .
అ.
న మాం కర్మాణి లిమ్పన్తి
న మే కర్మఫలే స్పృహా|
ఇతి మాం యోऽభిజానాతి
కర్మభిర్న స బధ్యతే|| 4-14 ||
కందము.
అంటవు ననుఁ గర్మలు ; స్పృహ
కంటవు కర్మఫలంబు లావంతయు , నీ
కంట ననున్ గనువారికి
నంటవు కర్మముల బంధనాళి కిరీటీ ! ౧౧
నన్ను కర్మలంటవు . నాకు కర్మఫలమునం దపేక్షయు లేదు . ఈ ప్రకారముగ నన్నుగూర్చి యెవడు తెలిసికొనునో అతడు కర్మలచే బంధింపబడడు .
అ.
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
పూర్వైరపి ముముక్షుభిః|
కురు కర్మైవ తస్మాత్త్వం
పూర్వైః పూర్వతరం కృతమ్|| 4-15 ||
ఆటవెలది.
మోక్ష కాములయ్యు , మును సనాతన కర్మ
లాచరించిరి జనకాది నృపులు ;
పూర్వపురుష కర్మ నిర్వాహ మొనరింపు
మాధునికులు నిన్నె యనుసరింప. ౧౨
( తాను వాస్తవముగ కర్త కాదు , తనకు కర్మ ఫలమునం దపేక్షయుండరాదు - అని ) ఈ ప్రకారముగ ( భగవంతుని కర్మాచరణము ద్వారా ) తెలిసికొని పూర్వ మెందఱో ముముక్షువులు నిష్కామముగ కర్మల నాచరించియుండిరి . కావున ( ఓ అర్జునా ! ) నీవున్ను పూర్వులచే జేయబడిన అట్టి పురాతనమైన నిష్కామకర్మమునే చేయుము.
అ.
కిం కర్మ కిమకర్మేతి
కవయోऽప్యత్ర మోహితాః|
తత్తే కర్మ ప్రవక్ష్యామి
యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్|| 4-16 ||
కందము.
కర్మ యకర్మల సునిశిత
మర్మము మేధావులకును మది సందియమౌ ;
కర్మల మర్మముఁ జెప్పెద ,
నిర్మల మోక్షమ్ము నంద నీకుఁ గిరీటీ ! ౧౩
కర్మ యెట్టిది , అకర్మ యెట్టిది అను ఈ విషయమును పండితులుకూడ సరిగా తెలిసికొనజాలకున్నారు . దేని నెఱిఁగినచో నీవు సంసారబంధమునుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకిపుడు తెలుపుచున్నాను .
అ.
కర్మణో హ్యపి బోద్ధవ్యం
బోద్ధవ్యం చ వికర్మణః|
అకర్మణశ్చ బోద్ధవ్యం
గహనా కర్మణో గతిః|| 4-17 ||
కందము.
కర్మ , వికర్మ , యకర్మల
మర్మము దుర్జ్ఞేయమగుట , మనసు నిశితమున్
నిర్మమతంగని తెలియుము ,
కర్మ రహస్యమ్ము గహన గతి గాకుండన్.౧౪
శాస్త్రములచే విధింపబడిన కర్మములయొక్కయు , నిషేధింపబడిన వికర్మలయొక్కయు , ఏమియుచేయక నూరకుండుట యను అకర్మముయొక్కయు స్వరూపమును బాగుగా తెలిసికొనవలసియున్నది. ఏలయనగా కర్మముయొక్క వాస్తవతత్త్వము చాల లోతైనది . ( ఎఱుగుట మిగుల కష్టతరము )
అ.
కర్మణ్యకర్మ యః పశ్యే
దకర్మణి చ కర్మ యః|
స బుద్ధిమాన్మనుష్యేషు
స యుక్తః కృత్స్నకర్మకృత్|| 4-18 ||
తేటగీతి.
కర్మలోని యకర్మను గాంచు నెవఁడు ,
మఱి యకర్మలో నిముడు కర్మను నెఱుంగు
నెవఁడు , కర్మ యకర్మల కవలనుండు
చిత్సువరూపుఁడు , కర్మసాక్షియును వాఁడె. ౧౫
ఎవడు కర్మమునందు అకర్మమును , అకర్మమునందు కర్మమును జూచునో అతడు మనుజులలో వివేకవంతుడును , యోగయుక్తుడును , సకల కర్మల నాచరించినవాడును నగుచున్నాడు.
అ.
యస్య సర్వే సమారమ్భాః
కామసఙ్కల్పవర్జితాః|
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం
తమాహుః పణ్డితం బుధాః|| 4-19 ||
తేటగీతి.
ఇట్టి జ్ఞానికి గర్మల చెట్ట లేదు ,
వాని జ్ఞానాగ్ని కాహుతియై నశించుఁ ,
గామ వర్జిత కర్మలనే మునింగి
కర్మ జేసియు నుండు నిష్కర్మి యట్లు. ౧౬
ఎవనియొక్క సమస్తకర్మలు కోరిక , సంకల్పము అనునవి లేకయుండునో జ్ఞానమను అగ్ని చేత దహింపబడిన కర్మలుగల అట్టివానిని పండితుడని విజ్ఞులు పేర్కొందురు.
అ.
త్యక్త్వా కర్మఫలాసఙ్గం
నిత్యతృప్తో నిరాశ్రయః|
కర్మణ్యభిప్రవృత్తోऽపి
నైవ కిఞ్చిత్కరోతి సః|| 4-20
అ.
నిరాశీర్యతచిత్తాత్మా
త్యక్తసర్వపరిగ్రహః|
శారీరం కేవలం కర్మ
కుర్వన్నాప్నోతి కిల్బిషమ్|| 4-21 ||
ఉత్పలమాల.
ఆశలు వీడి , ఈషణములందు విరక్తినిఁ బొందు , వాని కీ
కోశ శరీరమున్ నిలుపుకోసము చేసెడి కర్మ యేదియున్
బాశము కాదు ; పాప పరిపాకములంటవు సుంతయేని , వా
గీశ హృదంతరంగుని జితేంద్రియ ధీర యతీంద్రు నెయ్యడన్. ౧౭
ఎవడు కర్మఫలములం దాసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి గలవాడై దేనిని ఆశ్రయించకయుండునో , అట్టివాడు కర్మములందు ప్రవర్తించినను ఒకింతైనను చేయనివాడే యగును , ఆశ లేనివాడును, ఇంద్రియమనంబులను నిగ్రహించినవాడును , ఏ వస్తువును పరిగ్రహింపని వాడునగు మనుజుడు శరీరమాత్రముచేత ( దేహ ధారణాది )కర్మమును చేసినను పాపము నొందడు.
అ.
యదృచ్ఛాలాభసన్తుష్టో
ద్వన్ద్వాతీతో విమత్సరః|
సమః సిద్ధావసిద్ధౌ చ
కృత్వాపి న నిబధ్యతే|| 4-22 ||
ఉత్పలమాల.
వచ్చినదానఁ దుష్టిఁగను వాఁడును, ద్వంద్వములందుఁ దుల్యుఁడై
హెచ్చును తగ్గు మచ్చరము లేమియుఁ గానకఁ గార్యసిద్ధికిన్
లొచ్చులకున్ సముండయి విలోలత నొందని ధీరచిత్తుఁడే
పొచ్చెము లంట జాలవు స్వభుక్తికి గర్మల నాచరించినన్. ౧౮
అప్రయత్నముగ లభించినదానితో సంతుష్టిని బొందువాడును , సుఖదుఃఖాదిద్వంద్వములను దాటినవాడును , మాత్సర్యము లేనివాడును , ఫలముయొక్క ప్రాప్తాప్రాప్తములందు సమబుద్ధిగలవాడు ( లేక కార్యము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమభావముతో నుండువాడు ) నగు మనుజుడు కర్మము చేసినను బంధింపబడడు.
అ.
గతసఙ్గస్య ముక్తస్య
జ్ఞానావస్థితచేతసః|
యజ్ఞాయాచరతః కర్మ
సమగ్రం ప్రవిలీయతే|| 4-23 ||
కందము.
గత సంగుని స్థితధీరుని
నుతకర్మలు సర్వమున్ జనోద్ధరణంబై
హుతమౌ నిశ్శేషముగ ,
గతానుగత ఫలిత పంక గతి కాకుండన్. ౧౯
దేనియందును సంగము (ఆసక్తి ) లేనివాడును, రాగద్వేషకామక్రోధాది రూపసంసారబంధములనుండి విముక్తుడును, ఆత్మజ్ఞానమందే మనస్సు నిలుకడ కలవాడును, భగవత్ప్రీత్యర్థము ( లేక పరప్రాణిహితార్థము లేక, ధర్మమునిమిత్తము ) కర్మము నాచరించువాడునగు మనుజునియొక్క కర్మ యావత్తు విలీనమైపోవుచున్నది. ( జన్మ, బంధాదులను గలిగింపక నశించుచున్నది. )
అ.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి
ర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్|
బ్రహ్మైవ తేన గన్తవ్యం
బ్రహ్మకర్మసమాధినా|| 4-24 ||
ఉత్పలమాల.
యాగమునందు సృక్సృవము , యాగపశువ్రజ సాధనంబులున్
యాగముఁ జేయు యాజియు , మహత్తరమౌ యజనాగ్నియున్ మహో
ద్యోగ హుతక్రియా నిరతియున్ , సకలమ్మును బ్రహ్మమే సుమా !
యాగఫలంబుఁగూడ విజయా ! యజుఁడంచు నెఱుంగు మియ్యెడన్. ౨౦
యజ్ఞమునందలి హోమసాధనములు , హోమద్రవ్యములు , హోమాగ్ని , హోమము చేయువాడు , హోమము చేయబడినది - అన్నియును బ్రహ్మస్వరూపములే యనెడి ఏకాగ్రభావముతో ఆ యజ్ఞాది కర్మలను జేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.
అ.
దైవమేవాపరే యజ్ఞం
యోగినః పర్యుపాసతే|
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం
యజ్ఞేనైవోపజుహ్వతి|| 4-25 ||
తేటగీతి.
కొందఱింద్రాది దేవత లందు కొఱకు
యజ్ఞముల సేయుదురు సోమయాజు లగుచు ,
బ్రహ్మయం దాత్మ నాత్మను బ్రహ్మము గను
నట్టి బహ్మయజ్ఞమ్ముల నాచరింత్రు. ౨౧
కొందఱు యోగులు దేవతారాధనారూపమైన యజ్ఞమునే అనుష్ఠించుచున్నారు. మఱికొందఱు జీవబ్రహ్మైక్యభావనచే జీవుని పరబ్రహ్మమను అగ్నియందు హోమము చేయుచున్నారు. ( ఆహుతి నొనర్చుచున్నారు. )
అ.
శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే
సంయమాగ్నిషు జుహ్వతి|
శబ్దాదీన్విషయానన్యే
ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి|| 4-26 ||
కందము.
కొందఱు నిగ్రహ యజ్ఞముఁ
గొందఱు విషయేంధనములఁ గొని నిస్పృహతన్
ఇంద్రియ మహాగ్ని వ్రేల్తురు
కొందల పడకుండ యోగ కోవిదులగుచున్. ౨౨
కొందఱు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనెడి అగ్నులందును , మఱికొందఱు శబ్దాదివిషయములను ఇంద్రియము లనెడి అగ్నులందును హోమము చేయుచున్నారు.
అ.
సర్వాణీన్ద్రియకర్మాణి
ప్రాణకర్మాణి చాపరే|
ఆత్మసంయమయోగాగ్నౌ
జుహ్వతి జ్ఞానదీపితే|| 4-27 ||
తేటగీతి.
ప్రాణకర్మ నింద్రియ కర్మముల నెల్ల
జ్ఞానదీప్తుల మిగుల ప్రజ్వల మొనర్చి ,
ఆత్మ సంయమ యోగాగ్ని యందు హుతము
గా నొనర్తురు కొందఱు జ్ఞానవరులు. ౨౩
మఱికొందఱు ఇంద్రి.ములయొక్క వ్యాపారములన్నిటిని , ప్రాణములయొక్క వ్యాపారము లన్నిటిని జ్ఞానముచే ప్రకాశింపజేయబడిన ' మనోనిగ్రహ' యోగ ' మను ( సమాధియోగమను ) అగ్నియందు హోమము చేయుచున్నారు.
అ.
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా
యోగయజ్ఞాస్తథాపరే|
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ
యతయః సంశితవ్రతాః|| 4-28 ||
తేటగీతి.
ద్రవ్యదానంబులను , తపోధర్మ యజ్ఞ
ములను , యమనియ మాసనాదులను , మఱియు
నధ్యయన వేద పారాయణాదికములఁ
దీక్ష్ణమౌ వ్రతకల్ప సద్విధి ధరింత్రు. ౨౪
కొందఱు ద్రవ్యమును దానధర్మాది సద్విషయములందు వినియోగించుటయే యజ్ఞముగ గలవారును , కొందఱు తపస్సే యజ్ఞముగ గలవారును , కొందఱు ( ప్రాణాయామ్యాద్యష్టాంగ ) యోగమే యజ్ఞముగ గలవారునయి యున్నారు. వారందఱున్ను ప్రయత్నశీలురును , దృఢవ్రతములు కలవారునయి యొప్పుచున్నారు.
అ.
అపానే జుహ్వతి ప్రాణం
ప్రాణేऽపానం తథాపరే|
ప్రాణాపానగతీ రుద్ధ్వా
ప్రాణాయామపరాయణాః|| 4-29 ||
తేటగీతి.
ప్రాణమందు నపానమున్ బదిల పఱచి ,
ప్రాణము నపానమున బందిగా నొనర్చి ,
పూరకంబును , రేచకంబుల విరుద్ధ
గతిఁ జరించెదరీ నిష్ఠగాంచు వారు. ౨౫
ప్రాణాయామతత్పరులగు కొందఱు ప్రాణాపానములయొక్క గతులను ( మార్గములను ) నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును , ప్రాణవాయువునందు అపానవాయువును హోమముచేయుచున్నారు. ( పూరక , కుంభక , రేచకముల నొనర్చుచున్నారని భావము ).
అ.
అపరే నియతాహారాః
ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి|
సర్వేऽప్యేతే యజ్ఞవిదో
యజ్ఞక్షపితకల్మషాః|| 4-30 ||
తేటగీతి.
నియతి నాహారముల భుజించియు , నపాన
ప్రాణవాయువు లొండొంటిపై విరుద్ధ
గతిఁ జరింపగఁ జేసి , యాహుతి నొనర్త్రు
విగత కల్మషులందఱు వివిధగతుల. ౨౬
మఱికొందఱు ఆహారవిషయమున కట్టుబాటు గలవారై ప్రాణాదివాయువులను ప్రాణాదివాయువులందే హోమము చేయుచున్నారు .( లేక , ఇంద్రియవ్యాపారములను వశీకృతేంద్రియములందు వ్రేల్చుచున్నారు. ) వీరందఱున్ను యజ్ఞము నెఱిఁగినవారును , యజ్ఞముచే పాపము నశించినవారును అయియున్నారు .
అ.
యజ్ఞశిష్టామృతభుజో
యాన్తి బ్రహ్మ సనాతనమ్|
నాయం లోకోऽస్త్యయజ్ఞస్య
కుతోऽన్యః కురుసత్తమ|| 4-31 ||
తేటగీతి.
యజ్ఞ శిష్టా మృతంబును నారగించు
వాఁడు పరమాత్మనుం బొందువాఁడు సుమ్ము !
యజ్ఞ రహితున కీలోకమైన లేద
టన్న , స్వర్గమ్ము సున్నన్న యబ్బు రమ్మె ?౨౭
కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ( పైన దెల్పిన ) యజ్ఞము లాచరింపగా శేషించిన అమృతరూపమైన అన్నమును భుజించువారు శాశ్వతపరబ్రహ్మమును పొందుదురు . అట్టి యజ్ఞ మొకదానినైనను చేయనివానికి ఇహలోకసుఖము లేదు . అట్టిచో నిక పరలోకసుఖ మెక్కడిది ?
అ.
ఏవం బహువిధా యజ్ఞా
వితతా బ్రహ్మణో ముఖే|
కర్మజాన్విద్ధి తాన్సర్వా
నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే|| 4-32 ||
ఉత్పలమాల .
వేదము నాల్గుమోములను విశ్రుతమయ్యె , మఖంబులెల్ల సృ
ష్ట్యాదిని కర్మలన్ జననమందు నటంచు నెఱింగి జ్ఞాన భా
నూదయమై యకర్మను గనుంగొను కర్మను ; నిట్టివారలే
ఖేదము లేక మోక్షగతికిన్ దగువారలుసుమ్ము ఫల్గునా !౨౮
ఈ ప్రకారముగ అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగ తెలుపబడియున్నవి . అవియన్నియు కర్మములవలన పుట్టినవానినిగ ( కర్మమునకు సంబంధించినవేయని ) నీ వెఱుంగుము . అట్లెఱిఁగిన నీవు విముక్తుడవు కాగలవు .
అ.
శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాత్
జ్జ్ఞానయజ్ఞః పరన్తప|
సర్వం కర్మాఖిలం పార్థ !
జ్ఞానే పరిసమాప్యతే|| 4-33 ||
ఉత్పలమాల.
ద్రవ్య మయంబులౌ యజన రాసులకన్నను , జ్ఞానయజ్ఞమే
దివ్యమటం చెఱుంగుము ; విధిం దలపోసి సమర్పితంబయౌ
హవ్యమె కర్మలన్ పరిసమాప్తము జేయును , జ్ఞానవార్ధిగా
దే ; వ్యయమౌ నదీనదము లెట్లు నశించునొ కర్మ లట్లెయౌ. ౨౯
ఓ అర్జునా ! ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞముకంటె జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది . ఏలయనిని , సమస్తకర్మమున్ను నాశముకానిదగుచు ( ఫలసహితముగ ) జ్ఞానమునందే పర్యవసించుచున్నది. (అంతర్భూతమగుచున్నది ) .
అ.
తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం
జ్ఞానినస్తత్త్వదర్శినః|| 4-34 ||
కందము.
పరిపూర్ణమైన జ్ఞానము
గురువర్యుని నాశ్రయించి గురు తెఱుగవలెన్ ;
పరమ పరివ్రాజకుఁడగు
గురుముఖమునఁ దెలియుమా నిగూఢంబెల్లన్. ౩౦
( ఓ అర్జునా ! )అట్టి జ్ఞానమును నీవు తత్త్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసియు , సమయము చూసి వినయముగ ప్రశ్నించియు , సేవచేసియు , వారివలన తెలిసికొనుము . వారు తప్పక నీ కుపదేశించగలరు .
అ.
యజ్జ్ఞాత్వా న పునర్మోహ
మేవం యాస్యసి పాణ్డవ|
యేన భూతాన్యశేషేణ
ద్రక్ష్యస్యాత్మన్యథో మయి|| 4-35 ||
కందము.
తెలిసికొన మోహమందవు ,
తెలిసెదు నీ యాత్మయందె తివురు జగంబున్ ,
విలసితమై నాయందును
గలదంచునుఁ దెలిసి కొనగఁ గలవు కిరీటీ ! ౩౧
ఓ అర్జునా ! దేనిని తెలిసికొనినచో మరల నిట్టి మోహమును నీవు పొందకుందువో మఱియు దేనిచే సమస్తప్రాణులను నీయందునుగూడ చూడగలవో అట్టి జ్ఞానమును తత్త్వవేత్తలవలన తెలిసికొనుము .
అ.
అపి చేదసి పాపేభ్యః
సర్వేభ్యః పాపకృత్తమః|
సర్వం జ్ఞానప్లవేనైవ
వృజినం సన్తరిష్యసి|| 4-36 ||
కందము.
పాపాతి పాపుడైననుఁ
దాపగు జ్ఞానంపు నావ దాటగఁ గలఁ డీ
పాపపు వారాశి ని కే
ప్రాపునన్ లేడు పాపపతితుండెందున్ . ౩౨
( ఒకవేళ ) పాపాత్ములందఱికంటెను నీవు మిగుల పాపము చేసినవాడవైతివేని , ఆ సమస్త పాపసముద్రమును జ్ఞానమను తెప్ప చేతనే లెస్సగ దాటివేయగలవు .
అ.
యథైధాంసి సమిద్ధోऽగ్ని
ర్భస్మసాత్కురుతేऽర్జున|
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి
భస్మసాత్కురుతే తథా|| 4-37 ||
కందము.
జ్వలనాగ్ని నింధనమ్ములు
విలయమ్మై బూడిదయిన విధి , జ్ఞానాగ్నిన్
నులియై నశించుఁ గర్మలు
ఫలరహితము లగుచు , నిక్కువ మ్మిది పార్థా ! ౩౩.
అర్జునా ! బాగుగ ప్రజ్వలింప జేయబడిన అగ్ని కట్టెల నేప్రకారము బూడిదగా చేయునో ఆ ఫ్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మలను భస్మ మొనర్చివైచు చున్నది .
అ.
న హి జ్ఞానేన సదృశం
పవిత్రమిహ విద్యతే|
తత్స్వయం యోగసంసిద్ధః
కాలేనాత్మని విన్దతి|| 4-38 ||
ఉత్పలమాల.
జ్ఞానముఁ దక్క వేరొకటి కానగరాదు , పవిత్రమైన ప్ర
జ్ఞా నిలయమ్ము , యోగములఁ గాంతురు ధీరులు ; జ్ఞానకర్మయో
గాన యసాధనల్ గనుచు నంతట నామహనీయ తేజమున్ ,
బూనెద రాత్మయందుఁ గడు పుష్కలమై వెలుగందు చుండగన్. ౩౪
ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది ఏదియును లేదు . అట్టి జ్ఞానమును ( కర్మ ) యోగసిద్ధిని బొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగ పొందుచున్నాడు .
అ.
శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం
తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తి
మచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||
ఆటవెలది.
ఇట్లు జ్ఞాన నిష్ఠ , నింద్రియ శిక్షణ ,
గురుని సేవ , శ్రద్ధ గుదురఁ గలుగు
జ్ఞానమొదవ ; మోక్ష శాంతి శీఘ్రమ్మున
నధిగమింపఁ గలుగు నతఁడె పార్థ ! ౩౫
( గురు శాస్త్ర వాక్యములందు ) శ్రద్ధ గలవాడును , ( ఆధ్యాత్మిక సాధనలందు ) తదేకనిష్ఠతో గూడినవాడును , ఇంద్రియములను లెస్సగ జయించినవాడు నగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు . అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు పరమ శాంతిని శీఘ్రముగ బడయగలుగుచున్నాడు .
అ.
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ
సంశయాత్మా వినశ్యతి|
నాయం లోకోऽస్తి న పరో
న సుఖం సంశయాత్మనః|| 4-40 ||
తేటగీతి.
అజ్ఞుఁడై , శ్రద్ధ లేనట్టి యలసుఁడైన
సంశయాత్మకుఁ డెందు నాశమ్ముఁ గనుచు ,
నిందు నందును నెందునుఁ జెందకుండఁ
గుందుచుండును సంసారకూపమందు . ౩౬
జ్ఞానము లేనివాడు , శ్రద్ధారహితుడు , సంశయచిత్తుడు వినాశమునే పొందును . సంశయచిత్తునకు ఇహలోకముగాని , పరలోకముగాని , సౌఖ్యముగాని లేవు .
అ.
యోగసంన్యస్తకర్మాణం
జ్ఞానసఞ్ఛిన్నసంశయమ్|
ఆత్మవన్తం న కర్మాణి
న బధ్నన్తి ధనఞ్జయ|| 4-41 ||
కందము.
పరమాత్మ దర్శితంబగు
నిరుపమ్మగు జ్ఞానమొంది , నీ నా భేదం
బఱయక , సలిపెడి కర్మలు
కురు వేరులతోడఁ బోవుఁ గుంతి కుమారా ! ౩౭
ఓ అర్జునా ! నిష్కామకర్మయోగముచే కర్మఫలములను త్యజించినవాడును , లేక ఈశ్వరార్పణ మొనర్చినవాడును , జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు ఆత్మనిష్ఠుని ( బ్రహ్మజ్ఞానిని ) కర్మములు బంధింపనేరవు .
అ.
తస్మాదజ్ఞానసమ్భూతం
హృత్స్థం జ్ఞానాసినాత్మనః|
ఛిత్త్వైనం సంశయం యోగ
మాతిష్ఠోత్తిష్ఠ భారత|| 4-42 ||
కందము.
కావున నజ్ఞానంబును
లావున జ్ఞానాసి దునిము , లంఘించు మికన్ ;
నీవిక నిర్మల సుమనో
భావమ్మున వేగపడుము భండనమునకున్. ౩౮
ఓ అర్జునా ! కాబట్టి నీయొక్క హృదయమున నున్నదియు , అజ్ఞానము వలన బుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమను ఖడ్గముచే ఛేదించివైచి నిష్కామకర్మయోగము నాచరింపుము. యుద్ధమునకు లెమ్ము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానకర్మసంన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయః|| 4 ||
ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే
అనువదింపబడిన శ్రీగీతామృత తరంగిణి యందు
శ్రీ జ్ఞానయోగము అను చతుర్థ తరంగము
సంపూర్ణం.
శ్రీ కృష్ణపరబ్రహ్మార్పణమస్తు.
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు ,
యోగశాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు జ్ఞానయోగమను నాల్గవ అధ్యాయము సంపూర్ణం. ఓమ్ తత్ సత్.

No comments:

Post a Comment