Thursday, October 29, 2009

శ్రీ విభూతి యోగము

శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)
శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
భూయ ఏవ మహాబాహో !
శృణు మే పరమం వచః|
యత్తేऽహం ప్రీయమాణాయ
వక్ష్యామి హితకామ్యయా|| 10-1
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
నా పలుకుల నాలించి , సంతసము నొందు
నీకుఁ జెప్పెద మఱల , దానినె కిరీటి !
నీ హితంబునుఁ గోరుచు , నే వచింతు
సావధానుండవై విను , సవ్యసాచి ! ౧
గొప్ప భుజములుగల ఓ అర్జునా ! ( నా మాటలు విని ) సంతసించుచున్న నీకు హితమును కలుగజేయు నుద్దేశముతో మఱల ఏ శ్రేష్ఠమగు వాక్యమును నేను చెప్పబోవు చున్నానో , దానిని వినుము .
అ.
న మే విదుః సురగణాః
ప్రభవం న మహర్షయః|
అహమాదిర్హి దేవానాం
మహర్షీణాం చ సర్వశః|| 10-2
తేటగీతి.
నాదు శక్తి యుత్పత్తి బ్రహ్మాదులకును
నల మహర్షుల కేనియుఁ దెలియరాదు ,
సర్వదేవులు భృగ్వాది సంయములకు ;
నాది దేవుండ మూలమంతటికి నేనె . ౨
నా యొక్క ఉత్పత్తిని ( అవతార రహస్యమును , లేక , ప్రభావమును ) దేవగణము లెఱుఁగవు . మహర్షులున్ను ఎఱుఁగరు . ( ఏలయనిన ) నేను ఆ దేవతలకును , మహర్షులకును సర్వవిధముల మొదటివాడను ( కారణభూతుడను ) గదా !
అ.
యో మామజమనాదిం చ
వేత్తి లోకమహేశ్వరమ్|
అసమ్మూఢః స మర్త్యేషు
సర్వపాపైః ప్రముచ్యతే|| 10-3
చంపకమాల.
ఎవఁడు సనాతనుం డజుఁడ నే నెయటంచుఁ దలంచుచుండునో ,
యెవఁడు జగత్ప్రభుండనని యెంచి ననున్ భజియించుచుండునో ,
తవులడు పాపకర్మల పథంబుల నెప్డు ; విముక్తుఁ డైన బ్ర
హ్మవిదుఁ డతండె జుమ్ము ; పరమార్థము దీని వినంగఁ జెప్పితిన్ . ౩
ఎవడు నన్ను పుట్టుకలేనివానిగను , అనాదిరూపునిగను , సమస్తలోకములకు నియామకునిగను తెలుసుకొనుచున్నాడో , అతడు అజ్ఞానము లేనివాడై సర్వపాపములనుండి లెస్సగ విడువబడుచున్నాడు .
అ.
బుద్ధిర్జ్ఞానమసమ్మోహః
క్షమా సత్యం దమః శమః|
సుఖం దుఃఖం భవోऽభావో
భయం చాభయమేవ చ|| 10-4
అ.
అహింసా సమతా తుష్టి
స్తపో దానం యశోऽయశః|
భవన్తి భావా భూతానాం
మత్త ఏవ పృథగ్విధాః|| 10-5
తేటగీతి.
బుద్ధి , జ్ఞానము , సమ్మోహములును మఱియు
శమ , దమ , క్షమాదులును , సత్యమును , సుఖము ,
దుఃఖమునుఁ , జావు , పుట్టుకల్ , దురితభయము ,
నభయము , నహింస , సమచిత్త మలరుటయును . ౪
తేటగీతి.
తుష్టిఁ గనుచుండుటయు , తపో నిష్ఠ నుంట ,
యీవి , కీర్తి , యకీర్తియు , జీవులకును
వివిధ భావోద్భవంబులు విశ్రుతముగ
నా వలనె కల్గు పార్థ ! యనారతంబు. ౫
బుద్ధి , జ్ఞానము , మోహరాహిత్యము , ఓర్పు , సత్యము , బాహ్యేంద్రియ నిగ్రహము , అంతరింద్రియ నిగ్రహము , సుఖము , దుఃఖము , పుట్టుక ( ఉత్పత్తి ) , నాశము , భయము , భయములేకుండుట , అహింస , సమత్వము , సంతుష్టి , తపస్సు , దానము , కీర్తి , అపకీర్తి , ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానావిధములగు గుణములు నా వలననే కలుగుచున్నవి .
అ.
మహర్షయః సప్త పూర్వే
చత్వారో మనవస్తథా|
మద్భావా మానసా జాతా
యేషాం లోక ఇమాః ప్రజాః|| 10-6
కందము.
నలువురు మనువులు సప్త
ర్షులు మద్భావమ్మునన్ ప్రచోదితులై భూ
స్థలిఁ గల ప్రజల సృజించిరి ,
కలిగిరి మద్భావ కలన కలిమిని పార్థా ! ౬
లోకమునం దీ ప్రజలు యెవరియొక్క సంతతియై యున్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులున్ను , సనకాదులైన నలుగురు దేవర్షులున్ను , మనువులు పదునలుగురున్ను , నా యొక్క భావము ( దైవ భావము ) గలవారై నా యొక్క మనస్సంకల్పము వలననే పుట్టిరి .
అ.
ఏతాం విభూతిం యోగం చ
మమ యో వేత్తి తత్త్వతః|
సోऽవికమ్పేన యోగేన
యుజ్యతే నాత్ర సంశయః|| 10-7
కందము.
స్థితిలయముల సృష్టి జగ
త్పతినౌ నావలనె జగము వర్తిలు నంచున్ ,
మతి నెంచు బుధులు నన్నే
స్తుతియించి , భజించుచుంద్రు , శుద్ధమనమునన్. ౭
నా యొక్క విభూతిని ( ఐశ్వర్యమును , విస్తారమును ) , యోగమును ( అలౌకిక శక్తిని ) , ఎవడు యథార్థముగ తెలిసికొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు . ఇవ్విషయమున సందేహము లేదు .
అ.
అహం సర్వస్య ప్రభవో
మత్తః సర్వం ప్రవర్తతే|
ఇతి మత్వా భజన్తే మాం
బుధా భావసమన్వితాః|| 10-8
అ.
మచ్చిత్తా మద్గతప్రాణా
బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం
తుష్యన్తి చ రమన్తి చ|| 10-9
ఉత్పలమాల.
నాయెడఁ జిత్తమున్ నిలిపి , నాకయి కర్మల నాచరించు , నా
ధీయుతులైన వారలు నుతింత్రు పరస్పర బోధనా రతిన్ ,
వాయికొలంది వే విధుల బ్రస్తుతిఁ జేయుచు , సంతసింపుచున్
రేయిఁబవల్ నిరంతరము క్రీడలొనర్తురు , నన్ దలంచుచున్ . ౮
' నేను సమస్తజగత్తునకుఉత్పత్తికారణమైనవాడను , నా వలననే ఈ సమస్తము నడచుచున్నది ' అని వివేకవంతులు తెలిసికొని పరిపూర్ణ భక్తిభావముతో గూడినవారై నన్ను భజించుచున్నారు . ( వారు ) నా యందు మనస్సుగలవారును , నన్ను బొందిన ప్రాణములు ( ఇంద్రియములు ) కలవారును , ( లేక నా యెడల ప్రాణము నర్పించిన వారును ) అయి నన్నుగూర్చి పరస్పరము బోధించుకొనుచు , ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడును సంతృప్తిని , ఆనందమును బొందుచున్నారు .
అ.
తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకమ్|
దదామి బుద్ధియోగం తం
యేన మాముపయాన్తి తే|| 10-10
అ.
తేషామేవానుకమ్పార్థ
మహమజ్ఞానజం తమః|
నాశయామ్యాత్మభావస్థో
జ్ఞానదీపేన భాస్వతా|| 10-11
ఉత్పలమాల.
జ్ఞాన సముద్భవంబగును నాకృపచే సుగుణాళికిన్ , ననున్
బూని తరింపగాఁ గలుగు బుద్ధి విశేషములెల్ల నిచ్చెదన్ ;
నేను వసింతు వారి కమనీయ సుహృత్కమలంబులందుఁ , జే
నూనెద జ్ఞానదీపిక మహోత్కట దుస్థితిఁ బాఱద్రోలగన్. ౯
ఎల్లప్పుడు నాయందు మనస్సుగలవారై , ప్రీతితో నన్ను భజించునట్టివారికి -- దేనిచో వారు నన్ను పొందగలరో -- అట్టి జ్ఞానయోగమును ( ఆత్మానాత్మ వివేచనాశక్తిని ) ప్రసాదించుచున్నాను . వారలకు ( అట్టి భక్తులకు ) దయజూపుట కొఱకు నేనే వారి యంతః కరణమునందు నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపముచేత , అజ్ఞానజన్యమగు అందకారమును నశింపజేయుచున్నాను .
అర్జున ఉవాచ|
అ.
పరం బ్రహ్మ పరంధామ
పవిత్రం పరమం భవాన్|
పురుషం శాశ్వతం దివ్య
మాదిదేవమజం విభుమ్|| 10-12
అ.
ఆహుస్త్వామృషయః సర్వే
దేవర్షిర్నారదస్తథా|
అసితో దేవలో వ్యాసః
స్వయం చైవ బ్రవీషి మే|| 10-13
అర్జును వాక్యము.
కందము.
పర మోత్కృష్టంబగు గతి ,
పరమాత్మయు , దివ్యధాముఁ బరమపురుషు గా ,
నిరుపమ శాశ్వతుఁ , డజుఁడని ,
యెఱిగించిరి నిన్ను మునులు , ఋషులు ముకుందా ! ౧౦
తేటగీతి.
ఆది దేవుండ వీవని , యజుఁడ వనియు ,
విభుఁడవంచు , మహత్తర విశ్వరూపుఁ
డనుచుఁ , జెప్పిరి మును నారదాది ఋషులు ,
అసితుఁడును , దేవలుండును , వ్యాసకవియు . ౧౧
అర్జునుడు చెప్పెను. నీవు పరబ్రహ్మమవు , పరంధాముడవు ( పరమపదమవు లేక గొప్ప తేజస్స్వరూపుడవు ) , పరమపావనుడవు . నిన్ను నిత్యునిగను , ప్రకాశరూపునిగను , పరమ పురుషునిగను , ఆదిదేవునిగను , జన్మరహితునిగను , సర్వవ్యాపకునిగను , ఋషులందఱున్ను , దేవర్షి యగు నారదుడున్ను , అసితుడున్ను , దేవలుడున్ను , వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు . స్వయముగ నీవున్ను ఆ ప్రకారమే ( నిన్ను గూర్చి ) నాకు చెప్పుచున్నావు .
అ.
సర్వమేతదృతం మన్యే
యన్మాం వదసి కేశవ|
న హి తే భగవన్వ్యక్తిం
విదుర్దేవా న దానవాః|| 10-14
తేటగీతి.
నీవుఁ గూడను నటు వచియింతు , విపుడు
చెప్పినది సత్యమని విశ్వసింతు నేను ;
దివ్యమగు నీ ప్రభావమ్ముఁ దెలియలేరు ,
దేవదానవులైనను , దేవ దేవ ! ౧౨
ఓ కృష్ణా 1 దేనిని నీవు నాకు చెప్పుచున్నావో అదియంతయు సత్యమని నేను తలంచుచున్నాను . ఓ భగవంతుడా ! నీయొక్క ( నిజ ) స్వరూపమును దేవతలుగాని , అసురులుగాని ఎఱుంగజాలరు కదా !
అ.
స్వయమేవాత్మనాత్మానం
వేత్థ త్వం పురుషోత్తమ|
భూతభావన భూతేశ !
దేవదేవ జగత్పతే|| 10-15
తేటగీతి.
దేవ దేవ ! జగత్పతే ! నీ విభూతి
భువనముల యందెటుల్ వ్యాప్తిఁ బొందు చుండు ;
నీ వెఱుంగఁగ వలయుఁ గా , కేరికైన
వశముఁ గాదు ; నీవే చెప్పవలయు గృష్ణ ! ౧౩
ఓ పురుషశ్రేష్ఠుడా , సమస్తప్రాణులను సృష్టించువాడా , సకల జీవులకు నియామకుడగువాడా , దేవతలకును దేవుడైనవాడా , జగన్నాథుడా , నిన్ను నీవే యెఱుఁగుదువు ( నీ స్వరూప మితరులకు దుర్గ్రాహ్యమని భావము ) .
వక్తుమర్హస్యశేషేణ
దివ్యా హ్యాత్మవిభూతయః|
యాభిర్విభూతిభిర్లోకా
నిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి|| 10-16
అ.
కథం విద్యామహం యోగిం
స్త్వాం సదా పరిచిన్తయన్|
కేషు కేషు చ భావేషు
చిన్త్యోऽసి భగవన్మయా|| 10-17
అ.
విస్తరేణాత్మనో యోగం
విభూతిం చ జనార్దన|
భూయః కథయ తృప్తిర్హి
శృణ్వతో నాస్తి మేऽమృతమ్|| 10-18
ఉత్పలమాల.
నీ విభవ ప్రభావమును నే నెఱుగంగ ; వచింపు సర్వమున్
నీ వెటులే పదార్థముల నెక్కుడుగాఁ గనుపించుచుందు , వే
భావనతో భజింపగ నుపాస్యుఁడవో , విపులీకరింపు ; నా
నా విధి విన్ననుం దనివి నందదు , నీ యమృతంపు సూక్తులన్ . ౧౪
కావున ఏ విభూతులచే ( మాహాత్మ్య విస్తారములచే ) నీ వీ లోకములన్నింటిని వ్యాపించియున్నావో అట్టి దివ్యములగు నీ విభూతులను సంపూర్ణముగ చెప్పుటకు నీవే తగుదువు . యోగేశ్వరా ! నే నెల్లప్పుడును ఏ ప్రకారముగ ధ్యానించుచు నిన్ను తెలిసికొనగలను ? భగవంతుడా ! ఏయే వస్తువులందు నిన్ను నేను ధ్యానింపవలెను ? ఓ కృష్ణా ! నీ యొక్క యోగమహిమను , జగల్లీలావిభూతులను , ( ధ్యానింపదగిన వస్తువులను ) సవిస్తరముగ తెలియజేయుము . ఏలయనగా నీ యొక్క అమృత వాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుట లేదు . ఇంకను వినవలయునని కుతూహలము కలుగుచున్నది .
శ్రీభగవానువాచ|
అ.
హన్త తే కథయిష్యామి
దివ్యా హ్యాత్మవిభూతయః|
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ !
నాస్త్యన్తో విస్తరస్య మే|| 10-19
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
అటులె కౌంతేయ ! చెప్పెద నాలకింపు
మా ! విభూతుల ప్రాముఖ్యమైన వాని ;
సకలమునుఁ జెప్ప సావకాశమ్ము లేదు ,
సాంతమున్ లేదు సర్వమ్ము సంస్మరింప . ౧౫
శ్రీ భగవానుడు చెప్పెను. కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఇప్పుడు దివ్యములైన నాయొక్క విభూతులను ( ప్రాధాన్యత ననుసరించి ముఖ్యములైన వానిని ) నీకు చెప్పెదను . ఏలయనగా - నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు .
అ.
అహమాత్మా గుడాకేశ !
సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ
భూతానామన్త ఏవ చ|| 10-20
తేటగీతి.
ప్రాణికోటుల హృదయ నివాసి నగుచు ,
నధివసింతు గుడాకేశ ! యనిశమేనె ;
కర్త , సంరక్షకుఁడను , సంహర్తనగుచు ,
నన్నిటను నాది మధ్యాంతమగుదు , నేనె . ౧౬
ఓ అర్జునా ! సమస్త ప్రాణులయొక్క హృదయమునందున్న ప్రత్యగాత్మను నేనే అయియున్నాను .మఱియు ప్రాణులయొక్క ఆదిమధ్యాంతములున్ను( సృష్టిస్థితిలయములున్ను ) నేనే అయియున్నాను.
అ.
ఆదిత్యానామహం విష్ణు
ర్జ్యోతిషాం రవిరంశుమాన్|
మరీచిర్మరుతామస్మి
నక్షత్రాణామహం శశీ|| 10-21
తేటగీతి.
ద్వాదశాదిత్యులను విష్ణువౌదు నేనె ,
తేజములయందు రవి నేనె , దివిని వెలుఁగు
తారలందు శశాంకునై తనరు దేనె ,
యల మరీచి మరుత్తుల నగుదు నేనె . ౧౭
నేను ఆదిత్యులలో విష్ణువనువాడను , ప్రకాశింపజేయువానిలో కిరణములు గల సూర్యుడను. మరుత్తులను దేవతలలో మరీచియనువాడను , నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను .
అ.
వేదానాం సామవేదోऽస్మి
దేవానామస్మి వాసవః|
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా|| 10-22
తేటగీతి.
వేదముల సామవేదంబు నౌదు నేనె ,
సర్వ దేవతలందు వాసవుఁడ నేనె ;
యింద్రియ వితానమున మనసేనె పార్థ !
భూతచయముల నేనౌదు , చేతనమ్ము ! ౧౮
నేను వేదములలో సామవేదమును , దేవతలలో ఇంద్రుడను , ఇంద్రియములలో మనస్సును , ప్రాణులలో చైతన్యమున్ను ( తెలివి ) అయియున్నాను .
అ.
రుద్రాణాం శఙ్కరశ్చాస్మి
విత్తేశో యక్షరక్షసామ్|
వసూనాం పావకశ్చాస్మి
మేరుః శిఖరిణామహమ్|| 10-23
అ.
పురోధసాం చ ముఖ్యం మాం
విద్ధి పార్థ ! బృహస్పతిమ్|
సేనానీనామహం స్కన్దః
సరసామస్మి సాగరః|| 10-24
తేటగీతి.
రుద్రగణముల నే శంకరుండ పార్థ !
యక్షరాక్షసులం దలకాధిపతిని ;
అష్ట వసువుల పావకుం డగుదు నేనె ;
శిఖరములయందు నే మేరు శిఖర మగుదు . ౧౯
తేటగీతి.
వరపురోహితులన్ బృహస్పతిని నేనె ;
నేనె స్కందుండ వాహినీ నేతలందు ;
నప్పులందున సాగరుండగుదు నంచు ,
దెలిసి కొను మీవు మదినిఁ గుంతీ తనూజ ! ౨౦
నేను రుద్రులలో శంకరుడనువాడను , యక్షులలోను , రాక్షసులలోను కుబేరుడను , వసువులలో అగ్నియు, పర్వతములలో మేరువును అయియున్నాను . ఓ అర్జునా ! పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతిగా నన్నెఱుఁగుము. మఱియు నేను సేనాపతులలో కుమారస్వామియు , సరస్సులలో సముద్రమును అయియున్నాను .
అ.
మహర్షీణాం భృగురహం
గిరామస్మ్యేకమక్షరమ్|
యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి
స్థావరాణాం హిమాలయః|| 10-25
తేటగీతి.
మహిత ఋషులందు నే భృగు నౌదు పార్థ !
అక్షరంబుల నోం కార మౌదు నేను
యజ్ఞముల నేను జపయజ్ఞమని తెలియుము
అచలములలోన హిమవంతు నౌదు సుమ్ము ! ౨౧
నేను మహర్షులలో భృగుమహర్షిని , వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమమను ( ఓంకారమును ) , యజ్ఞములలో జపయజ్ఞమును , స్థిరపదార్థములలో హిమాలయపర్వతమును అయియున్నాను .
అ.
అశ్వత్థః సర్వవృక్షాణాం
దేవర్షీణాం చ నారదః|
గన్ధర్వాణాం చిత్రరథః
సిద్ధానాం కపిలో మునిః|| 10-26
తేటగీతి.
భూజములయందు నశ్వథ్థ భూజమగుదు ;
ప్రథిత దేవర్షులందు నారదుఁడ నేనె ;
రామ గంధర్వులన్ జిత్రరథుఁడ నేనె ;
సిద్ధమునులఁ గపిలుఁడన్ ప్రసిద్ధి నేనె . ౨౨
నేను చెట్లన్నిటియందును రావిచెట్టును , దేవర్షులలో నారదుడను , గంధర్వులలో చిత్రరథుడను , సిద్ధులలో కపిలమునీంద్రుడను అయియున్నాను .
అ.
ఉచ్చైఃశ్రవసమశ్వానాం
విద్ధి మామమృతోద్భవమ్|
ఐరావతం గజేన్ద్రాణాం
నరాణాం చ నరాధిపమ్|| 10-27
తేటగీతి.
అమృత మథనంబునం దది యవతరించె
అశ్వములను నుచ్చైశ్రవ మగుదు నేనె ;
గజములందు నైరావత గజము నేనె ;
నరులను నరేశ్వరుండ శంతను ప్రపౌత్ర ! ౨౩
గుఱ్ఱములలో అమృతముతోపాటు పుట్టిన ఉచ్చైశ్రవమను గుఱ్ఱమునుగను , గొప్ప యేనుగులలో ఐరావతమను గొప్ప యేనుగునుగను , మనుష్యులలో రాజునుగను నన్ను తెలిసికొనుము .
అ.
ఆయుధానామహం వజ్రం
ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః
సర్పాణామస్మి వాసుకిః|| 10-28
తేటగీతి.
ఆయుధముల వజ్రాయుధ మగుదు నేనె ;
ధేనులన్ గామధేనువు నేనె పార్థ !
సృష్టి మూలంబు కందర్పుఁ డేనె విజయ !
సర్పములయందు వాసుకిన్ సవ్యసాచి ! ౨౪
నేను ఆయుధములలో వజ్రాయుధమును , పాడియావులలో కామధేనువును , ప్రజల ( ధర్మబద్ధమగు ) యుత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను , సర్పములలో వాసుకియు అయియున్నాను .
అ.
అనన్తశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి
యమః సంయమతామహమ్|| 10-29
తేటగీతి.
నాగములయందు నేనె యనంతు నగుదు ;
సలిల దేవుల వరుణుఁడన్ దెలియుమయ్య ;
పితరులను నర్యముండని పిలువఁబడుదు ;
నిగ్రహంబున జముఁడన నేనె పార్థ ! ౨౫
నేను నాగులలో అనంతుడను , జలదేవతలలో వరుణుడను , పితృదేవతలలో అర్యమయు , నియమించువారిలో యముడను అయియున్నాను .
అ.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోऽహం
వైనతేయశ్చ పక్షిణామ్|| 10-30
తేటగీతి.
అతుల ప్రహ్లాదుఁడన్ దితి సుతులలోన ;
నాయువు గణించు వారల నౌదుఁ గాలు ;
మృగ గణంబుల సింహేంద్ర మేనె పార్థ !
పక్షులన్ గరుత్మంతునై పరగు దేనె . ౨౬
నేను అసురులలో ప్రహ్లాదుడను , లెక్కపెట్టువారిలో కాలమును , మృగములలో మృగరాజగు సింహమును , పక్షులలో గరుత్మంతుడను అయియున్నాను .
అ.
పవనః పవతామస్మి
రామః శస్త్రభృతామహమ్|
ఝషాణాం మకరశ్చాస్మి
స్రోతసామస్మి జాహ్నవీ|| 10-31
తేటగీతి.
పావన మొనర్చు వారలఁ బవను నేనె ;
శస్త్రధరులందు శ్రీరామచంద్రు నేనె ;
జంతువుల మకరంబు నంచెంతురు నను ;
నదులయందు నే జాహ్నవీ నదిని పార్థ ! ౨౭
నేను పవిత్ర మొనర్చువానిలో ( లేక వేగవంతులలో ) వాయువును , ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను , చేపలలో మొసలిని , నదులలో గంగానదిని అయియున్నాను .
అ.
సర్గాణామాదిరన్తశ్చ
మధ్యం చైవాహమర్జున|
అధ్యాత్మవిద్యా విద్యానాం
వాదః ప్రవదతామహమ్|| 10-32
తేటగీతి.
ఆది మధ్యాంతములు సృష్టియందు నేనె ;
విద్యలన్నిట నే బ్రహ్మ విద్య నగుదు ;
విషయ నిర్ణయమం దుద్భవించు వాద
కలన మెల్లను నే , నంచుఁ దెలియుమయ్య ! ౨౮
ఓ అర్జునా ! సృష్టులయొక్క ఆదిమధ్యాంతములు ( ఉత్పత్తి , స్థితి , లయములు ) నేనే అయియున్నాను . మఱియు విద్యలలో అధ్యాత్మవిద్యయు , వాదించువారిలో ( రాగద్వేషరహితముగ , తత్త్వనిశ్చయము కొఱకు చేయబడు ) వాదమును నేనై యున్నాను .
అ.
అక్షరాణామకారోऽస్మి
ద్వన్ద్వః సామాసికస్య చ|
అహమేవాక్షయః కాలో
ధాతాహం విశ్వతోముఖః|| 10-33
తేటగీతి.
అల ' అ ' కారంబు నే వర్ణములను పార్థ !
ద్వంద్వమౌదు సమాసంబులందు నేను ;
అక్షయంబగు కాలంబు నగుదు నేను ;
చేతనంబులకున్ సర్వధాత నేనె . ౨౯
నేను అక్షరములలో ' అ ' కారమును , సమాసములలో ద్వంద్వ సమాసమును అయియున్నాను . మఱియు నాశము లేని కాలమును ( కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడను ) , సర్వత్ర ముఖములుగల కర్మఫలప్రదాతయును , ( లేక విరాట్స్వరూపుడగు బ్రహ్మదేవుడను ) నేనే అయియున్నాను .
అ.
మృత్యుః సర్వహరశ్చాహ
ముద్భవశ్చ భవిష్యతామ్|
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం
స్మృతిర్మేధా ధృతిః క్షమా|| 10-34
తేటగీతి.
జీవకోటుల మృత్యువై చెలఁగు దేనె ;
భవితముల కెల్ల హేతువు నగుదు నేనె ;
స్త్రీజనంబుల యందుఁ గీర్తి యును ధృతియు
శ్రీ , స్మృతియు , వాక్కు మేధలై చెలఁగు దేనె . ౩౦
సమస్తమును సంహరించునట్టి మృత్యువును , ఇకముందు ఉత్పత్తి కాగల సమస్తముయొక్క పుట్టుకయు నేనే అయియున్నాను . మఱియు స్త్రీలలోగల కీర్తి , సంపద , వాక్కు , స్మృతిజ్ఞానము , ధారణాశక్తిగల బుద్ధి , ధైర్యము , ఓర్పు , అను ఈ ఏడుగుణములున్ను నేనే అయియున్నాను .
అ.
బృహత్సామ తథా సామ్నాం
గాయత్రీ ఛన్దసామహమ్|
మాసానాం మార్గశీర్షోऽహ
మృతూనాం కుసుమాకరః|| 10-35
తేటగీతి.
సామముల యందు నే బృహత్సామ మౌదు ;
ఛందముల యందు గాయత్రి ఛంద మేనె ;
మాసముల యందు మృగశిర మాస మేను ;
ఋతువులందు వసంత మేనే కిరీటి ! ౩౧
సామవేదగానములలో బృహత్సామమును , ఛందస్సులలో గాయత్రియు , మాసములలో మార్గశిరమాసమును , ఋతువులలో వసంతఋతువును నేనై యున్నాను .
అ.
ద్యూతం ఛలయతామస్మి
తేజస్తేజస్వినామహమ్|
జయోऽస్మి వ్యవసాయోऽస్మి
సత్త్వం సత్త్వవతామహమ్|| 10-36
తేటగీతి.
జూదరులయందు జూదంబు నౌదు నేనె ;
తేజమూర్తులయం దుండు తేజ మేనె ;
జయము నందెడి వారల జయము నేనె ;
బలుల బలమౌదు నే కృషీవలుల కృషియు . ౩౨
వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను . మఱియు నేను తేజోవంతులయొక్క తేజస్సును ( ప్రభావము ) , ( జయించువారలయొక్క ) జయమును , ( ప్రయత్నశీలురయొక్క ) ప్రయత్నమును , ( సాత్త్వికులయొక్క ) సత్త్వగుణమును అయియున్నాను .
అ.
వృష్ణీనాం వాసుదేవోऽస్మి
పాణ్డవానాం ధనఞ్జయః|
మునీనామప్యహం వ్యాసః
కవీనాముశనా కవిః|| 10-37
తేటగీతి.
యాదవుల వాసుదేవుండ నౌదు నేనె ;
పాండు నందనుల ధనంజయుండ నేనె ;
మునుల వ్యాసుండ నేనౌదు వినుము పార్థ !
కవులలో నుశనాకవి నవుదు పార్థ ! ౩౩
నేను వృష్ణివంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను ( శ్రీకృష్ణుడను ) , పాండవులలో అర్జునుడను , మునులలో వేదవ్యాస మునీంద్రుడను , కవులలో శుక్రాచార్యుడను అయియున్నాను .
అ.
దణ్డో దమయతామస్మి
నీతిరస్మి జిగీషతామ్|
మౌనం చైవాస్మి గుహ్యానాం
జ్ఞానం జ్ఞానవతామహమ్|| 10-38
తేటగీతి.
నర పతు లొనర్చు దమన దండంబు నేనె ;
యల జిగీషుల నీతియు నగుదు నేనె ;
గోప్యములయందు మౌన నిగూఢ మేనె ;
జ్ఞానవంతుల జ్ఞానంబు నేనె పార్థ ! ౩౪
నేను దండించువారియొక్క దండనమును ( శిక్షయు ) , జయింప నిచ్చగలవారియొక్క ( జయోపాయమగు ) నీతియు , అయియున్నాను . మఱియు రహస్యములలో మౌనమును , జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై యున్నాను .
అ.
యచ్చాపి సర్వభూతానాం
బీజం తదహమర్జున ! |
న తదస్తి వినా యత్స్యా
న్మయా భూతం చరాచరమ్|| 10-39
తేటగీతి.
ఈ జగత్తునకున్ సర్వబీజమేనె ;
నేను లేని పదార్థ మెందైన లేదు ;
నా విభూతికి యవధి యంతములు లేవు ;
కౢప్తముగఁ జెప్పితిని నీకుఁ గొంత గొంత . ౩౫
ఓ అర్జునా ! సమస్త ప్రాణికోట్లకు ఏదిమూలకారణమైయున్నదో అదియు నేనే అయియున్నాను . ( వెయ్యేల ) స్థావరజంగమాత్మకమైన వస్తువేదియు నన్ను వినాగా లేనేలేదు ( నాకంటె వేఱుగ లేదు ) .
అ.
నాన్తోऽస్తి మమ దివ్యానాం
విభూతీనాం పరన్తప|
ఏష తూద్దేశతః ప్రోక్తో
విభూతేర్విస్తరో మయా|| 10-40
అ.
యద్యద్విభూతిమత్సత్త్వం
శ్రీమదూర్జితమేవ వా|
తత్తదేవావగచ్ఛ త్వం
మమ తేజోంऽశసమ్భవమ్|| 10-41
కందము.
ఎచ్చట శ్రీయు , విభూతియు ,
ముచ్చట నుత్సాహ గరిమ , మురిపెము గ నెదో
యచ్చట మదీయ తేజము
హెచ్చుగఁ గానంగఁ గలుగు దీవు కిరీటీ ! ౩౬
ఓ అర్జునా ! నా యొక్క దివ్యములైన విభూతులకు అంతము లేదు . అయినను కొన్నిటిని సంక్షేపముగ నిట వివరించి చెప్పితిని . ( ఈ ప్రపంచమున ) ఐశ్వర్యయుక్త మైనదియు , కాంతివంతమైనదియు ( నిర్మలమైనదియు ) , ఉత్సాహముతో గూడినదియు ( శక్తివంతమైనదియు ) నగు వస్తువు లేక ప్రాణి ఏది యేది కలదో అది యది నా తేజస్సుయొక్క అంశమువలన కలిగినదానినిగనే నీ వెఱుఁగుము .
అ.
అథవా బహునైతేన
కిం జ్ఞాతేన తవార్జున|
విష్టభ్యాహమిదం కృత్స్న
మేకాంశేన స్థితో జగత్|| 10-42
కందము.
అకలంక విభూతినిఁ గనఁ
దికమకపడి వినఁగ నేలఁ , ద్రిదివంబులు నే
సకల చరాచర జగములు
నొకకళచే సంగ్రహించి యుంటిఁ గిరీటీ ! ౩౭
అర్జునా ! లేక విస్తారమైన ఈ ( విభూతి ) జ్ఞానముచే నీ కేమి ప్రయోజనము ? నేనీ జగత్తునంతను ఒక్క అంశముచేతనే వ్యాపించియున్నాను ( అని తెలిసికొనుము ) .
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విభూతియోగో నామ దశమోऽధ్యాయః|| 10 ||
ఓం తత్ సత్
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి చే యనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి శ్రీ విభూతి యోగము అను దశమ తరంగము
సంపూర్ణం. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణ మస్తు.
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మనిద్యయు , యోగ శాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విభూతి యోగమను పదియవ అధ్యాయము సంపూర్ణము. ఓమ్ తత్ సత్

4 comments:

  1. నాకు కనిపించిన కొన్ని అచ్చుతప్పులు:

    పద్యం 1: నా పలుకు లాలించి - నా పలుకుల నాలించి
    పద్యం 4: బుద్ధి , జ్ఞాన , సమ్మోహములును - బుద్ధి జ్ఞానము సమ్మోహములును
    పద్యం 6: తేటగీతి - కందం
    పద్యం 7: తేటగీతి - కందం
    పద్యం 17: ద్వాదశాదిత్యులందు విష్ణువౌదు నేనె - ద్వాదశాదిత్యులన్ విష్ణువౌదు నేనె
    పద్యం 19: యక్షరాక్షసులం దలకాపతిని - ?
    పద్యం 21: మహిత ఋషులందు నే భృగు నౌదు పార్థ ! - యతి కుదిరినట్టు లేదు?
    పద్యం 28: ఆది మధ్యంతములు - ఆది మధ్యాంతములు
    పద్యం 30: భవితముల కెల్ల హేతువు నగుదు నేనె - యతి కుదిరినట్టు లేదు?
    పద్యం 35: నా భూతికి - నా విభూతికి

    త.క - "ఌ" కి "ఉ"తో యతి పాత కవులు కూడా కొందరు వేసారు. అంచేత అది తప్పేమీ కాదు :-)

    ReplyDelete
  2. అచ్చు తప్పులను మా దృష్టికి తీసుకొని వచ్చినందులకు ధన్యవాదములు. దీనినిబట్టి మీరు ఎంత శ్రద్ధతో ఈ బ్లాగును అనుసరిస్తూ ఉన్నారో అవగతమయి చాలా సంతోషం కలిగింది.
    పద్యం 1 : గ్రంధంలో నా పలుకు లాలించి -అనే ఉన్నది. కాని మీ సూచన మరింత అందాన్ని కలిగిస్తుంది . కాబట్టి మీరు చెప్పిన విధంగా మార్పు చేసాను.
    పద్యం 4: బుద్ధి , జ్ఞాన , సమ్మోహములును పూడిపెద్దివారు మాట మాటకు మధ్యను అన్నింటికీ కామాలు వుంచారు .అందుచేత వాటిని అలానే వదలివేసాను. జ్ఞాన అనేపదం జ్ఞానము అనే అర్థాన్ని ఇస్తుంది కదా ! అందుచేత మార్చలేదు .
    పద్యం 6 , 7 : సరిచేసాను
    పద్యం 17, 19 28 : తప్పులు ( నా టైపాటులు ) సవరించాను..
    పద్యం 35 : గ్రంథంలో భూతికి అని మాత్రమే ఉంది . విభూతి అనేది ఇంకా బాగున్నది . కాబట్టి మార్చాను.
    మరొక్కసారి మీకు నా ధన్యవాదాలు.

    ReplyDelete
  3. నరసింహగారు,

    నేనెత్తిచూపినవన్నీ ఛందః, వ్యాకరణ భంగాలు. వాటికి నేను ఊహించిన దిద్దుబాట్లు. పద్యం 1, 4, 35 నేను సూచించిన చోట్ల గణాలు సరిపోవడం లేదు. పుస్తకంలోనే అలా ఉందంటే అక్కడే అచ్చుతప్పులు పడి ఉంటాయి!
    వీలు చిక్కినప్పుడల్లా చదువుతున్నాను. చదివినప్పుడు ఇలాంటివేమైనా కనిపిస్తే చెప్తాను.

    ReplyDelete
  4. పుస్తకంలో కూడా అచ్చుతప్పుల పట్టిక ఇవ్వబడింది. అవి కూడా సరిచూచిన తర్వాత
    కూడా ఇంకా కొన్ని తప్పులు మిగిలి ఉన్నట్టున్నాయి. సరిచేస్తున్నందులకు
    ధన్యవాదాలు.

    ReplyDelete